నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు అందుకోడానికి మూడవ తరం సిద్ధమవుతోంది. 1982లో నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది. జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించింది. ఎన్టీఆర్ హయాంలో, ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఢిల్లీలో కీలకపాత్ర నిర్వహించింది. 1984 నుంచి 89 వరకు తెలుగుదేశం లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా వుంది. ఎన్టీరామారావు తరువాత రెండవ తరం నేతగా చంద్రబాబునాయుడు పార్టీని విజయవంతంగా నడిపించారు. ఎన్టీఆర్ పార్టీలో తిరుగుబాట్లు ఎదుర్కొంటే చంద్రబాబు రాజకీయంగా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కీలక దశలో వున్నప్పుడు, పార్టీ భవిష్యత్తు మీద సందేహాలు నెలకొన్నప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెంచారు. ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చారు. జగన్ లాంటి క్రూర మనస్తత్వం, ప్రతీకార మనస్తత్వం వున్న ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. బిజెపి, జనసేనతో పొత్తు పెట్టుకుని జగన్మోహనరెడ్డికి ఘోరమైన ఓటమిచ్చారు. తెలుగుదేశం నేతగా 30 ఏళ్లు, ముఖ్యమంత్రిగా దాదాపు 16 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఇంకో మూడేళ్ల పదవీకాలం వుంది. ఏపీ చరిత్రలో అభివృద్ధిని కొలమానంగా తీసుకుంటే చంద్రబాబు పదవీకాలంలో చేసినంత అభివ్రుద్ధి ఏ ముఖ్యమంత్రి చెయ్యలేదు అని చెప్పడంలో ఎలాంటి మొహమాటాల్లేవు. ఆ విధంగా ఎన్టీఆర్ తరువాత ఆయనంత ఎగ్రెసివ్ కాకపోయినా, ఆయనంత ఆకర్షణీయత లేకపోయినా, కష్టపడే తత్వంతో రెండో తరం నేతగా చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
2014లో రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో తెరవెనుక పార్టీ కోసం పనిచేసిన లోకేష్, ఆ తరువాత ఎమ్మెల్సీ, మంత్రి పదవి చేపట్టారు. ఎమ్మెల్సీగా రాజకీయరంగ ప్రవేశం చెయ్యడం మీద విమర్శలొచ్చాయి. మహానేతలకు వారసుడిగా రంగప్రవేశం చేయబోతున్న నేత దొడ్డిదారిన చట్టసభకు వెళ్లడమేంటన్న విమర్శలు స్వపక్షం నుంచి కూడా వచ్చాయి. అయితే మంత్రిగా లోకేష్ మంచి పని తీరు కనబరిచారు. పంచాయతీరాజ్ మంత్రిగా 25 వేల కిలోమీటర్లకు పైగా సిమెంటు రోడ్లు వేయించారు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా తన శాఖకు కేంద్ర నిధులు రాబట్టుకున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రే స్వయంగా ప్రకటించారు. ఇదే సమయంలో లోకేష్ ను వైసిపి సోషల్మీడియా అనేక రకాలుగా ట్రోలింగ్స్ చేసింది. బాడీషేమింగ్ చేసింది. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ ఓడిపోయారు. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. అప్పటివరకు ట్రోల్స్ కు గురైన లోకేష్ ఆ తరువాత తనేంటో ప్రూవ్ చేసుకోవడం మొదలుపెట్టారు. చెప్పాలంటే విపక్షంలో వున్నప్పుడే రాణింపు మొదలైంది. క్యాడర్ నమ్మకాన్ని చూరగొన్నాడు. బాడీ షేమింగ్ చేసినవాళ్లు నోరెళ్లబెట్టేలాగా బాడీషేపింగ్ చేసుకున్నారు. దానికోసం బాగా కష్టపడ్డారు. యువగళం పాదయాత్ర మొదలయ్యాక లోకేష్ ఎంత స్టబ్బర్న్ లీడరో అందరికీ అర్ధమైంది. కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళతాడు, ప్రత్యర్థుల లెక్క తేల్చే విషయంలో తండ్రిలాగా వెనుకాడడు అన్న పేరు వచ్చింది. దీంతో వైసిపిలోని కొందరు ప్రముఖ నేతలు ఎన్నికలకు ముందే లోకేష్ తో రాజీకొచ్చారు. ఎన్నికల సమయానికి ప్రభావశీలమైన నాయకుడిగా ఎదిగారు. ఆ ఎన్నికల్లో తను సూచించినవాళ్లకు టిక్కెట్లు, మంత్రిపదవులు దక్కడంతోనే పార్టీలో ఆయన కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారని, తన టీమ్ ని తయారు చేసుకుంటున్నారని రాజకీయపరిశీలకులు అంచనా వేశారు. తొలిసారి ఓడిపోయిన మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాక.. మంత్రిగా కీలకమైన విద్యాశాఖను తీసుకున్నారు. ఆ శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టారు. దానితో పాటు తనకిష్టమైన ఐటి శాఖను కూడా తీసుకున్నారు. కార్నెగీ మిలన్ యూనివర్శిటీలో బిఎస్సీ, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంబియే చేసిన లోకేష్ విద్యాశాఖను ఏరికోరి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పేరెంట్ టీచర్ మీట్లు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖలో మంచి మార్పులు తేవాలన్న లక్ష్యంతో వున్నారు. అయితే ఆయన లక్ష్యాన్ని ఆయన శాఖలో అధికారులు అందుకోవడం లేదు. దీని మీద ఉపాధ్యాయవర్గాల్లో, ఉన్నతవిద్యాశాఖవర్గాల్లో అసంత్రుప్తి వుంది. ఐటి మంత్రిగా ఎలాంటి విమర్శలు లేవు.
జగన్ అయిదేళ్లపాలనలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో దెబ్బతిన్న ఏపీ ఇమేజ్ ని పునరుద్ధరించేందుకు గత 18 నెలలుగా అందరితో సంప్రదింపులు జరుపుతూ, ఏపీకి గణనీయంగా పెట్టుబడులు తేవడంలో సక్సెస్ అయ్యారు. 2025 సంవత్సరంలో వివిధ రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులు పరిశీలిస్తే, 25 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయంటే మామూలు విషయం కాదు. అదీ జగన్ దుంపనాశనం చేసి, దేశీయంగా అంతర్జాతీయంగా చెడ్డపేరు తెచ్చిన తరువాత ఇంత పెట్టుబడులు తెచ్చారంటే అది చంద్రబాబునాయుడుకున్న గుడ్ విల్. లోకేష్ శ్రమ అని చెప్పాలి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, కీలకమైన మలుపుగా చెప్పాలి. టిసిఎస్, కాగ్నిజెంట్, అసెంచర్ లాంటి కంపెనీలు భారీ క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి. అర్సెలార్ మిట్టల్ భారీ స్టీల్ ప్లాంట్, కస్టమైజ్డ్ పోర్టు నిర్మించబోతోంది. ఈ కంపెనీ ఏపీకి రావడం వెనుక లోకేష్ ప్రయత్నం వుందని స్వయంగా చంద్రబాబే చెప్పారు. అలాగే ప్రజల సమస్యలు, ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యలు తన ద్రుష్టికి వస్తే, తన శాఖ కాకపోయినా స్పందిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకునే విధంగా సంబంధిత మంత్రులతో మాట్లాడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూనే, ఇంకో వైపు పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో ముందుంటున్నారు. కార్యకర్తలే కాదు, కష్టంలో వున్నవాళ్లు ఎవరైనా సోషల్మీడియాలో తనను ట్యాగ్ చేసి సమస్య తెలియచేస్తే వెంటనే స్పందిస్తున్నారు. క్యాడర్ కూడా బాబు కంటే లోకేష్ నే ఎక్కువగా నమ్ముతుందంటే దానిక్కారణం ఆయనలోని అగ్రెసివ్ నెస్. అది తాత ఎన్టీరామారావు నుంచి వచ్చిన లక్షణం అనుకోవాలి. ఎన్టీఆర్ నాయకుల కంటే కార్యకర్తలకే ప్రయారిటీ ఇచ్చేవారు. ఎన్టీఆర్ లో వున్న మొండితనం, చంద్రబాబులో కష్టపడేతత్వం రెండూ లోకష్ కు అబ్బాయి అని చెప్పాలి. టిడిపి కష్టకాలంలో వున్నప్పుడు రెచ్చిపోయిన వైసిపి ప్రత్యర్థుల మీద ఈ మాత్రపు చర్యలున్నాయంటే అది లోకేష్ పట్టుదల వల్లే అన్న అభిప్రాయం కార్యకర్తల్లో వుంది. అయితే ఈ విషయంలో ఇంకా గట్టిగా , ఇంకా కొందరి మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడావుంది. అది జరగడం లేదన్న అసంత్రుప్తి వుంది.
మొత్తమ్మీద పార్టీ వ్యవహారాల్లో దాదాపుగా లోకేష్ పట్టు పెరిగింది. భావి పార్టీ నాయకుడిగా పగ్గాలు తీసుకునేందుకు ఆయన సన్నద్ధమైనట్టే కనిపిస్తోంది. లోకేష్ లో చెప్పాల్సిన ఇంకో ప్రత్యేకత ఏంటంటే, చంద్రబాబు లాగా మొహమాటం వుండదు. చెప్పాలనుకున్నది డైరక్ట్ గా చెప్తారు. తప్పు చేస్తే పిలిచి వాయిస్తాడన్న భయం పార్టీ నేతలకువుంది. అలాగే అందరితో మంచి పిఆర్ కూడా మెయిన్టెయిన్ చేస్తారు. పార్టీలో,ప్రభుత్వంలో పట్టు సాధించడంతో పాటు, ఢిల్లీలో జాతీయ స్థాయి నేతలతో కూడా సత్సంబంధాలు మెయింటెయిన్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోకేష్ ని రెండు మూడు దఫాలు పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. అమిత్ షా లాంటి సీనియర్లతో టచ్ లో వున్నారు. బిహార్లో ఎన్డీఎ తరపున ఎన్నికలప్రచారం నిర్వహించారు. తమిళనాడులో అన్నామలై తరపున ప్రచారం చేశారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వుండటం వల్ల జాతీయ మీడియా ప్రశంసలు కూడా అందుకున్నారు. లోకేష్ గురించి చెప్పేటప్పుడు జాతీయ మీడియా ప్రతినిధులు ఏపీకి, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తరువాత ఒక సమర్థుడైన, ప్రోగ్రెసివ్ థాట్ వున్న లీడర్ దొరికాడని చెప్తుంటారు. తెలుగుదేశం పార్టీలోనే కాదు, ఎన్డీఏ కూటమిలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక బలమైన నేతగా లోకేష్ ప్రొజెక్ట్ అవుతున్నారు. అయితే ఆయన మార్చుకోవాల్సిన విషయాలు కూడా వున్నాయి. పార్టీ మీద ఎక్కువ సమయం స్పెండ్ చెయ్యాలి. ఈ విషయంలో కార్యకర్తల్లో అసంత్రుప్తి వుంది. చంద్రబాబు, లోకష్ ఇద్దరూ పెట్టుబడులు, ప్రభుత్వం, పాలన అంటూ బిజీ అయిపోయి పార్టీకి సమయం కేటాయించడం లేదన్న భావనలో వున్నారు. ఇది దీర్ఘకాలంలో నష్టం చేస్తుంది. నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వాళ్లని కంట్రోల్ చెయ్యాలంటే లోకేష్ వల్లే సాధ్యమవుతుందన్న అభిప్రాయం వుంది.
గ్రౌండ్లో వస్తున్నమార్పులు, ఎమ్మెల్యేల తీరు, ప్రజల్లో వుండే అసంత్రుప్తులను తెలుసుకోవాలి. దాని కోసం నెలకోమారు ఒక జిల్లాలో పర్యటించాలి. కార్యకర్తలతో మాట్లాడాలి. అప్పుడే పల్స్ తెలుస్తుంది. ఎవర్నీ కలవకపోతే పల్స్ తెలియదు. తరచుగా కలిసేవాళ్లు, చుట్టూ వుండేవాళ్లు అంతా బాగుందనే చెప్తారు. కాలిపోయేటప్పుడు కూడా బాగుందనే చెప్తారు. కాబట్టి కోటరీల మాటలను విశ్వసించాల్సిన అవసరం లేదు. కొంత మంది వివాదాస్పద ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఆయన కోటరీగా చెప్పుకుంటున్నారు. దాని వల్ల బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. సీనియర్ నేతలను దూరం పెడతారన్న విమర్శ వుంది. సీనియర్లలో పార్టీకి లాయల్ గా వున్నవాళ్లని గుర్తించాలి. వాళ్లకు కూడా అవకాశాలివ్వాలి. పార్టీకి లగేజిగా మారిన సీనియర్లను వదిలేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ పార్టీకి బలంగా వున్నవాళ్లని ఎంకరేజ్ చెయ్యాల్సిందే. అలాగే మీడియా సమావేశాల్లో మరీ ఎగ్రెసివ్ గా మాట్లాడ్డం వల్ల ఎరోగెంట్ అనే ముద్ర పడే అవకాశం వుంది. కేటీఆర్ మీద, ఎక్కువ మంది బిఆర్ఎస్ నేతల మీద ఇలాంటి అభిప్రాయం వుండేది. దాని వల్ల వాళ్లకు నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఇవ్వాళ 43 సంవత్సరాలు నిండి 44వ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. చంద్రబాబు 45 సంవత్సరాల 4 నెలలకు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. లోకేష్ కు ఆ వయసు వచ్చే సరికి 2029 ఎన్నికలకు సిద్ధమవ్వాల్సి వుంటుంది. ఆ ఎన్నికల్లో లోకేష్ పాత్ర మరింత కీలకంగా వుంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే దానికి తగ్గట్టుగా తనను తాను కరెక్ట్ చేసుకుంటూ, మంచి టీమ్ ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోతే సక్సెస్ చేతిలోకి వస్తుంది.







