అమాంతం 45 రూపాయలు పెంచిన పెట్రో రేట్లలో ఐదు పది రూపాయలు తగ్గించగానే పండగ గిఫ్ట్ అంటూ కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇండియాలోనే కనిపిస్తుందేమో ! తగ్గించడం పండగ స్పెషల్ అయితే మరి ఇన్నాళ్లూ గీకి గీకి పెంచుకుంటూ పోవడం జనం బతుకులతో ఆటలు ఆడుకోవడమే కదా ! మరి ఆ కోణం జనం అర్థం చేసుకుంటే ఇక రేటు తగ్గిందన్న సంబరం ఎందుకు ఉంటుంది ? దేశం రగిలిపోతోంది అని తెలిసినా కూడా పెట్రో రేట్లు పెంచుకుంటూ ఎందుకు పోతోంది కేంద్రం ? ఈ రేట్లను అడ్డం పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో గేమ్ ఆడాలని అనుకుంటోందా ? అసలు వ్యూహమేంటి ?
పెట్రో రేట్లను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు, రాష్ట్రాలు ఒప్పుకుంటే మేం సిద్ధం అంటుంది కేంద్రం. మళ్లీ ఇంకోసారి, పెట్రో బాండ్లు విడుదల చేసి మన్మోహన్ ప్రభుత్వం లక్షా 80 వేల కోట్లు ఖజానాకు కన్నం పెట్టిందని… అది పూడ్చేందుకు రేట్లు పెంచక తప్పడం లేదని వాదిస్తుంది. తీరా లెక్క తీస్తే గత ఆరేడేళ్లలో రేట్లు పెంచి చేసిన వసూళ్లు 15 లక్షల కోట్లకుపైగా ఉంటాయన్నది అంచనా. మరి మన్మోహన్ ప్రభుత్వ బాండ్ల సొమ్ము పోగా మిగతాదంతా ఏమైపోతున్నట్టు ? దానికీ పువ్వు మార్కు సమాధానం ఉంటుంది. నాలుగు రూపాయలు పెట్రో రేట్లు పెరిగితే గించుకుంటుంది మన దేశం, జవాన్లకు నాణ్యమైన భోజనం పెడుతున్నది ఆ సొమ్ముతోనే, కరోనా వాక్సిన్ ఉచితంగా వేస్తున్నది ఆ సొమ్ముతోనే అంటూ వాట్సాప్ యూనివర్సిటీలో ప్రతిపాదించే అమోఘమైన సిద్ధాంతాలకైతే కొదవే లేదు. అసలు పెట్రో రేట్ల మీద మాత్రమే మోడీ ప్రభుత్వం ఎందుకు ఆధారపడుతోంది అన్నది అసలు పాయింట్. కొందరు బీజేపీ నాయకులే ఓపెన్ గా చెబుతున్నారు. పెట్రో రేట్లపై వచ్చే పన్నులు తప్ప మరే ఇతర ఆదాయం కేంద్రానికి లేదూ అని ! అంటే దేశంలో ఉత్పాదక రంగం పూర్తిగా పడుకుంది. కొత్తగా వచ్చిన ఇండస్ట్రీ లేదు, ఇన్వెస్టుమెంట్ లేదు. భారీ స్థాయిలో జరుగుతన్న ఫైనాన్షియల్ యాక్టివిటీ లేనే లేదు. ఇలాంటప్పుడు ఆదాయం ఎలా వస్తుంది ? మరి ఇలాంటప్పుడు సమర్థమైన విధానాలు అవలంభించాలా ? లేదంటే, జనం రక్తం తాగేసే రేంజులో పెట్రో రేట్లు పెంచాలా ? ప్రభుత్వాలు ఏది ఎంచుకోవాలి ? పైగా ఇలాంటి నాయకులే రాష్ట్రాల్ని బ్లేమ్ చేస్తారు, అరవై రూపాయలు పన్నులుగా వసూలు చేస్తుంటే లీటరుపైన, అందులో సగం వాటా రాష్ట్రాలే బాదేస్తున్నాయి. రాష్ట్రాలు వదులుకోవచ్చుగా ఆ మొత్తాన్ని అంటారు వాళ్లు. జీఎస్టీ వచ్చాక, రాష్ట్రాల బతుకు కేంద్రం గుప్పిట్లోకి పోయింది చాలా వరకూ. అలాంటప్పుడు ఎలా వదులుతాయ్ రాష్ట్రాలు మాత్రం ! ఇదే అసలు ఫ్లాష్ పాయింట్.
పెట్రో రేట్లు, బంగారం, ఇంకో ఒకట్రెండు కమొడిటీలు మాత్రమే ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేవు. వాటిని చేర్చడంపై రాష్ట్రాల సమ్మతి కావాలని కేంద్రం నాన్చుతూ వస్తోంది. ఒక వేళ జీఎస్టీ పరిధిలో చేర్చి, అత్యధికంగా పన్ను వసూలు చేసినా కనీసం లీటరు పెట్రోలు 70 రపాయలకు రావొచ్చన్నది ఆశ. అది అవునా కాదో తర్వాత సంగతి. ముందు ఈ జీఎస్టీకి రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదన్న లాజిక్కు దగ్గరే కేంద్రం లబ్దిపొందాలి అని చూస్తోంది రాజకీయంగా ! అంటే నెపం రాష్ట్రాల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవాలి అనేది ప్రయత్నం. లేదూ.. అలా వీలు కాలేదో, ఎన్నికల ముందు రేటు తగ్గించి ఓ పాజిటివ్ వాతావరణం సృష్టించి ఎన్నికలకు వెళ్లొచ్చు అనే ఆలోచన కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అంటే తొమ్మిదేళ్లు వాతలు పెట్టి… ఆఖర్లో పూతలు పూసి, బర్నాల్ రాస్తే సరిపోతుందా ? ఇండియా మీద బీజేపీకి ఉన్న నమ్మకం బహుశా అలాంటిది మరి !
అందుకే కేంద్ర మంత్రులు కూడా పండగ గిఫ్టు అంటే ఐదు పది రూపాయలు తగ్గించడమే అని చెబుతున్నారు ఓపెన్ గా ! ఎలాంటి సంశయం లేదు వాళ్లకి. పెట్రో రేట్లు పెరగడం అంటే… బండిలో ఫ్యూయెల్ కొట్టిస్తున్నప్పుడు బిల్లు పెరగడం మాత్రమే కాదు, రవాణా ఛార్జీలు పెరగడం, నిత్యావసరాల ధరలు పెరగడం, పరిశ్రమల నిర్వహణా ఖర్చు పెరగడం… ఇలా చాలానే ఉంటుంది లిస్టు. అంటే జనజీవితమే కాస్ట్లీ అయిపోవడంలో పెట్రో ధరలే కీలకం. ఆర్థిక వ్యవస్థ గందరగోళం కావడానికి కూడా కారణం ఇదే. నిర్మలా సీతారామ్ బీఏ చదువుతున్నప్పుడు – ఎకనామిక్సులో ఇలాంటి చాప్టరు ఒకటి ఉందో లేదో తెలియదు. ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఆమే ఎలైట్ ఎకానమిస్టు కాబట్టి ఆమెకు ఈ విషయం తట్టడం చాలా ముఖ్యం. తట్టినా పట్టించుకోకుండా జనం మైండ్ సెట్ మీద నమ్మకంతో ఇలా మూడు రూపాయలు ఐదు రూపాయలూ తగ్గిస్తున్నామని చెప్పి 50, 60 రూపాయలు పెంచుకుంటూ పోతే చేసేదేం లేదు.
పెట్రో రేట్లు పెంచి బుర్రలేని నిర్ణయాలు విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వం దిగిపోవాలి అంటూ ఎడ్ల బండి మీద ఢిల్లీ వీధుల్లో తిరిగిన వాజపేయి లాంటి నాయకుడు మళ్లీ రావాలి. ఆ ప్రభుత్వం కన్నా… ఈ ఎడ్లు మెరుగ్గా ముందుకు తీసుకువెళతాయేమో దేశాన్ని అంటూ ఆలోచన రేకెత్తించే వాజపేయి లాంటి నాయకుడు ఇప్పుడు కావాలి. ఆదాయం రావాలంటే పెట్రో రేట్లు మాత్రమే దిక్కు, పెద్ద నోట్లు రద్దు చేస్తే అవినీతి అంతం అవుతుంది అనుకునే ఎకానమిస్టుల ఏలుబడి బహుశా అప్పుడు కానీ కూలబడదేమో !