ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త పొలిటికల్ డ్రామా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తోంది. మొన్నటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి.. ఉన్నట్టుండి వైసీపీని టార్గెట్ చేస్తూనే, లవ్ జిహాద్, మతమార్పిడుల అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారు..? ఏపీని “ఆమెన్ ప్రదేశ్” అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి..? పైకి వైసీపీని విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఈ విమర్శలు తిరగేసి వైసీపీకే లాభం చేకూర్చబోతున్నాయా..? అవుననే సమాధానం వినపడుతోంది.
విజయసాయిరెడ్డి త్వరలోనే సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీ పెట్టకముందే ఆయన ఎంచుకున్న పొలిటికల్ లైన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాకినాడ లవ్ జిహాద్ కేసును అడ్డం పెట్టుకుని ఆయన హిందూ సెంటిమెంట్‌ను విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకుల అంతర్గత అంచనా ప్రకారం.. విజయసాయిరెడ్డి వైసీపీని టార్గెట్ చేయడం అనేది కేవలం జనాలను నమ్మించడానికి ఆడుతున్న ఒక మైండ్ గేమ్ మాత్రమే. అసలు టార్గెట్ వైసీపీ కాదు.. కూటమికి ఉన్న బలమైన హిందూ ఓట్లను కొల్లగొట్టడమే అని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
అసలు ఈ ఈక్వేషన్ ఎలా వర్కవుట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ హిందూ ఓటర్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపు బలంగా ఉన్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టి.. తాను కూడా కరడుగట్టిన హిందూత్వ లైన్ తీసుకుంటే, కూటమి వైపు ఉన్న హిందూ ఓట్లలో కొంత శాతాన్ని ఆయన తన వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఓట్లు చీలిపోవడం అనేది ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఆ విధంగా కూటమికి పడాల్సిన సాంప్రదాయ హిందూ ఓట్లు గనుక విజయసాయిరెడ్డి చీల్చగలిగితే.. అది ఆటోమేటిక్‌గా వైసీపీకి అయాచిత లాభాన్ని చేకూరుస్తుంది.
ఇక్కడే వైసీపీ అసలు స్కెచ్ దాగి ఉంది. రాష్ట్రంలో ఉన్న మైనారిటీ ఓట్లు మరియు కూటమిపై అసంతృప్తిగా ఉన్న హిందూ వ్యతిరేక ఓట్లు ఎలాగూ చంద్రబాబుకు గానీ, పవన్ కళ్యాణ్‌కు గానీ పడవు అనేది వైసీపీ గట్టి నమ్మకం. ఆ ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపీకే పడతాయి. కానీ, కూటమిని ఓడించాలంటే కేవలం ఆ ఓట్లు సరిపోవు.. కూటమి ఓట్లను కూడా చీల్చాలి. అందుకే విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త డ్రామా ఎత్తుకుని, పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం డైరెక్షన్‌లోనే పని చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా.. బయటపడకుండా లోపాయికారీగా ఇద్దరూ కలిసి ఈ గేమ్ ఆడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో విమర్శలు వస్తున్నాయి.







