ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నమొన్నటివరకు ఫైర్ బ్రాండ్‌గా, పవర్ఫుల్ వాయిస్‌గా నిలిచిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఖరిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాల విమర్శలపై తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ, నిత్యం మీడియా ముందు యాక్టివ్‌గా ఉండే ఈ సీనియర్ నేత.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా సైలెంట్ అయిపోయారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో గట్టిగా నడుస్తోంది.
ఒకప్పుడు ఎలాంటి కేసులకైనా, ఆరోపణలకైనా వెనకాడకుండా ధీటుగా సమాధానం చెప్పిన అంబటిలో.. ఇప్పుడు ఏదో తెలియని ఆందోళన లేదా భయం మొదలైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి గత కొద్ది రోజులుగా అంబటి రాంబాబు మీడియా ముందుకు రావడం చాలా వరకు తగ్గించేశారు. గతంలో రోజుకు కనీసం ఒకటి లేదా రెండు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఆయన.. ఇప్పుడు పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలపై తప్ప సాధారణ విషయాల్లో పెద్దగా స్పందించడం లేదు.
అయితే, మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తూ వరుస కేసులు పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోందంటూ ఆయన మీడియా ముందు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే పాత విషయాలను తవ్వి తీస్తూ, తనపై తప్పుడు కేసులు మోపాలని చూస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఒకప్పుడు కెమెరా కనిపిస్తే చాలు పంచ్ డైలాగులతో దూసుకుపోయే అంబటి రాంబాబు.. ఇప్పుడు ఇలా ఆచితూచి మాట్లాడటం, కేసులు పెడుతున్నారంటూ గగ్గోలు పెట్టడం ఆయన అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రభుత్వం వైపు నుంచి రాబోయే చట్టపరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రెండవది, ఇటీవల రాష్ట్రంలో పలువురు వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు మరియు నేతలపై నమోదవుతున్న ఐటి యాక్ట్ మరియు పరువు నష్టం కేసులు. ప్రభుత్వం చాలా సీరియస్‌గా లీగల్ ప్రొసీడింగ్స్‌తో ముందుకు వెళ్తుండటంతో, అనవసరమైన వ్యాఖ్యలు చేసి లేనిపోని చిక్కుల్లో పడటం ఎందుకనే భావన కూడా ఆయనలో ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో ఎన్నో పొలిటికల్ ఒడిదుడుకులను చూసిన ఈ సీనియర్ నేత, ఈ తాజా రాజకీయ సవాలును ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







