30 C
Vijayawada
Thursday, April 25, 2024
Homeనీతి ప్రత్యేకంఊ అందామా ? ఉ ఊ అందామా ?

ఊ అందామా ? ఉ ఊ అందామా ?

ఆంధ్రులు దవడలు తప్ప మెదడు లేని జాతి అని ఈ మధ్య ఢిల్లీలో ఓ పెద్దాయన కామెంట్ చేశాడు. కొన్నాళ్లు దగ్గరగా చూస్తూనే అంత అర్థమైతే, మరి ఇక్కడే పుట్టి ఇక్కడే తగ్గి ఇక్కడే మగ్గిపోయే మనకెంత తెలియాలి మన గురించి ! మెదడు ఉంటే ఆలోచిస్తారు. అదే దవడలు మాత్రమే ఉంటే తినడానికి, తిట్టడానికి మాత్రమే పరిమితం అయిపోతారు అని దానర్థం. కొన్ని ఫిర్యాదులు, అభ్యంతరాలు, వాదనలు చూశాక ఇలాగే అనిపిస్తుంటుంది. చుట్టూ ఉన్న అన్ని సమస్యలూ పరిష్కరించేశారో, లేదంటే అసలు ఇది తప్ప మరో సమస్యే లేదు అనుకున్నారో కానీ ఈ మద్య కొందరు మగాళ్లు మొనగాళ్లుగా ముద్ర వేసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఐటమ్ సాంగుల్లో మనోభావాలు వెదుక్కునే పనిలో పడ్డారు.

అసలు హక్కులు ఎవరికి ఉంటాయ్ ? ఎవరికి ఉండాలి ? బాధించేవాడు ఎవడు ? బాధపడేదెవరు ? రాజ్యాంగంలో ఏం రాశారో తెలియకపోయినా ఎవడి డిక్షనరీ వాడికి ఉంటోంది ఈ మధ్య. ఆఫ్టర్ ఆల్ డెమొక్రసీ సార్, ఈ మాత్రం స్వేచ్ఛను పీల్చుకోపోతే ఊపిరి ఎలా ఆడుతుంది – అంటారు ఇలాంటి వాళ్లు. కరెక్టే. కానీ హక్కులు పోరాటం బాధితులు చేయాలి. సపోజ్, కప్పలు కాపాడండీ అఢగొచ్చు. అంతే కానీ పాములు హక్కుల పోరాటం చేయడం ప్రకృతి విరుద్ధం. అన్ని పాములూ అలాంటివి కాదు, కొన్ని కీటకాల్ని, పురుగుల్ని కూడా తింటున్నాయ్. అన్ని కప్పల్నే తినడం లేదు కదా అని వాదించకూడదు. ఇలాంటి లాజిక్కులు చెబుతున్నప్పుడు వాళ్ల తెలివి – వాళ్లకి ముచ్చటగా అనిపించవచ్చేమో, కానీ వినేవాళ్లకే వెగటుగా ఉంటుంది.

తేలు అన్నాక కుడుతుంది. పాము అన్నాక కరుస్తుంది. సుబ్బారావు కొడతాడు – అని రాస్తుంది రంగనాయకమ్మ కలం. సుబ్బారావులందరూ కొడతారని ఆమె ఉద్దేశం కాదు. సుబ్బారావులు కోర్టులకెక్కాల్సిన పని లేదు. ఆమె చెప్పింది కేవలం నైజం గురించి. అప్పుడంటే ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి, సినిమాల మీద చిందులేస్తే పబ్లిసిటీ రాదు కాబట్టి, రచయితల్ని బయటకు లాగినా ఎవ్వడూ ఇంటర్వ్యూలు తీసుకోరు కాబట్టి బహుశా ఆ పని ఎవరూ చేసి ఉండరు. నా సామిరంగా ఇప్పుడైతేనా. చెలరేగిపోదురు చాలా మంది. మన అభిప్రాయాలు, మన అభిరుచులతో వ్యాపారం చేసే సోషల్ మీడియం వచ్చేశాక ప్రతీదీ వ్యాపార వస్తువే అయిపోయింది. ప్రతీ దానికీ హిడెన్ వేల్యూ వచ్చి యాడ్ అయిపోయింది. వీటివల్ల వినోదం ఎంత వస్తోందో, కొత్త ప్రపంచానికి ఎన్ని తలుపులు తెరుచుకుంటున్నాయో అంతకంటే ఎక్కువ అడ్డగోలు కిటికీలు కూడా ఓపెన్ అవుతున్నాయ్. పబ్లిసిటీ పాకులాట జారుడుమెట్ల మీద జాతర చేస్తోంది. మనోభావాల ముసుగులో !

ఇక సమంత సంగతి. జీవితం పెట్టిన పరీక్షను ఆమె డిస్టింక్షన్ లో పాస్ అయ్యి ఎదురు నిలిచి గెలిచింది ఈ మధ్యే ! అందరూ చుట్టూ చేరి రాళ్లు వేస్తున్నా తట్టుకొని నిలబడే వాడు జీసస్ అయినా అయ్యుండాలి. జీవితం విలువ తెలిసిన వాళ్లైనా అయ్యుండాలి. అలాంటి వాళ్లు అరుదుగా ఉంటారు. మనం నిలబెట్టకపోయినా పర్వాలేదు. పనిగట్టుకొని పడకొట్టాలని చూడకపోతే చాలు. ఎప్పుడో ఎనిమిది తొమ్మిదేళ్ల నాడు ఇదే సమంత ఓ ట్వీట్ చేస్తే పెద్ద దుమారం రేగింది. బీచ్ లో హీరో పాద ముద్రల వెంట హీరోయిన్ పాకడమా – ఇది అహంకార భావజాలంలా అనిపిస్తోంది. నేను అయితే సమర్థించను అని ఆమె ఎంతో ధైర్యంగా రాసింది అప్పట్లో. ఆశ్చర్యపోయారు అందరూ. మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలో ఇంత తెగింపా అని ! ఎస్. అమె అభిప్రాయం అది. ఇంతకు ముందు అనుకున్నామే బాధితులు… బాధలకు వ్యతిరేకంగా పోరాడొచ్చు. బాధించేవాళ్లు కాదు అని. ఇదే. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఇష్యూ. ఆమె చెప్పొచ్చు. చెప్పింది.

సరిగ్గా ఇప్పుడు కూడా అదే డైరెక్టర్. ఇంకో సినిమా. సమంతకు అవకాశం వచ్చింది. పైగా జీవితంలో ఆమె ఇప్పుడు నిలిచిన సంఘర్షణల చౌరాస్తాలో ఇలాంటి పాటకు కాలు కదపడం అంటే నిజానికి మేల్ డామినేషన్ మీద ఓ విసురు విసరడమే ! బహుశా అందుకే ఒప్పుకొని ఉంటుంది కూడా. బుద్ధుల్ని భలే ఎండ గట్టిందే అని ఐడెంటిఫై అయ్యి కొందరు కనెక్ట్ అయితే – ఇంకొందరు హిట్ చేయడానికి మాత్రం ఇలాంటి ఆలోచనే ఎంతో కొంత కారణం. పాద ముద్రల గొడవను ఇప్పటి పాటనూ, మ్యాచ్ చేసి చూస్తే సమంత పరోక్షంగా ఓ మెసేజ్ ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చునేమో కూడా. మగ ఆధిపత్యం మీద ఆమె తన అభిప్రాయాన్ని కళాత్మకంగా, అదే మగాళ్లు ఎగబడి చూసే విధంగా చెప్తోంది అనుకోవాలేమో ! అసలు విషయం అర్థం చేసుకోకుండా మధ్యలో ఈ మనోభావాలూ మట్టిగడ్డలూ ఏంటి బాస్. ఇంత చెప్పాక ఊ … అందామా… ఉఊ అందామా… ఇక మన ఇష్టం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments