35 C
Vijayawada
Friday, April 26, 2024
Homeరాజ నీతిఉద్యోగుల ఆందోళనతో లాభపడేది ఎవరు ?

ఉద్యోగుల ఆందోళనతో లాభపడేది ఎవరు ?

ఇంతింత జీతాలు తీసుకుంటూ ఏంటీ గోల, రాష్ట్రం డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే వీళ్లొచ్చి జీతాలు పెంచాలి, పెంచింది సరిపోవడం లేదు అని గొడవేంటి ? అని ఇప్పుడు కూడా ఎవరైనా అసహన పడుతున్నారు అంటే వాళ్లు పాయింటు క్యాచ్ చేయలేదు అని అర్థం. ఇక్కడ పాయింటు ఉద్యోగుల జీతాలు కాదు. ఇక్కడ పాయింటు జీతాలు పెంచడం పెంచకపోవడం కాదు. అంతకు మించి. ఎవరైనా తమకు చేస్తానన్న సాయం చేయడం లేదు ఎందుకని అడిగితే, ఎవరైనా – ఏ వర్గం అయినా తమకు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదూ అని నిలదీస్తే రాజ్యం ఎంత కర్కశంగా, నికృష్టంగా ఎదురు దాడి చేస్తోంది అనేదే ఇక్కడ పాయింటు. ఇక్కడ ఉద్యోగుల్ని జీతగాళ్లుగా చూడకూడదు. మేనిఫెస్టోలో పెట్టిన హామీల అమలు కోసం డిమాండు చేస్తున్న ఏపీ పౌరులుగా మాత్రమే చూడాలి. అది వాళ్ల హక్కు. హక్కును కాలరాచే అవకాశం లేని వ్యవస్థే ప్రజాస్వామ్యం అంటుంది అంబేద్కర్ రాజ్యాంగం.

రోడ్డు మీద బాగా ట్రాఫిక్ పెరిగిపోయింది. మరీ ఇరుకైపోయింది. మా డ్రైవర్ చాలా బాగా నడపాలి బండి అనుకున్నాడు. కానీ వల్ల కావడం లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కొందరి గద్దుతాడు. గుద్దించుకోండి. మీరు పెద్దగా పట్టించుకోకండి. మీ మీద అత్యంత ప్రేమ ఉంది మా డ్రైవర్ కి. కానీ తప్పడం లేదు. ఆయన వాలకం, తోలకం అంతే. అయినా ఇప్పటి వరకూ బాగానే తిరిగారుగా రోడ్డు మీద. వంద మంది తిరుగుతున్నప్పుడు అందులో ఓ పది మందికి దెబ్బ తగిలితే తప్పేంటి అని – డ్రైవర్ గురించి క్లీనర్లు వాదిస్తారు. ఈ మాత్రం గుద్దేకాడికి, అంతోటి కబుర్లు ఎందుకు చెప్పడం ? అందరినీ క్షేమంగా ఇల్లు చేరుస్తాం, అందులోనూ గంటకి వంద కిలోమీటర్లు స్పీడు  తగ్గకుండా నడుపుతాం, నా డ్రైవింగ్ 30 ఏళ్లు గుర్తు పెట్టుకుంటారు అనడం దేనికి ? మూడేళ్లు తిరిగే లోపే మాకొద్దీ డ్రైవర్ అని బెంబేలెత్తిపోయేట్టు చేయడం దేనికి ? అయినా ఇలా అడ్డొచ్చిన ఒక్కొక్కరినీ గుద్దుకుంటూ పోతే ఇక రోడ్డు మీద తిరిగేందుకు మిగలరు ఎవరూ ! అదే అసలు భయం ఇప్పుడు. అయినా వీళ్లు బండికి అడ్డం వెళ్లడం లేదు. బండే అడ్డంగా వీళ్ల మీదకి వచ్చింది. అలాంటప్పుడు బాధితులు అనాలి వాళ్లని. సానుభూతితో సమర్థించాలి. లేదంటే అదే బండి మిగతా వాళ్ల మీదకి వచ్చినప్పుడు చెప్పుకోడానికి తోడు కూడా దొరకదు – ఇది ఉద్యోగి ఆత్మఘోష.

ఉద్యోగులు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఇంతలా చర్చనీయం అయిన దాఖలా లేదు ఏ రాష్ట్రంలోనూ ! పైగా ఉత్తి పుణ్యానికి కక్ష కడతారని, పని చేయాలీ అంటాడనే చంద్రబాబు అంటే వాళ్లకి ఇష్టం ఉండదని పేరు ఇన్నాళ్లూ ! నిజానికి చంద్రబాబు కూడా వాళ్లని రాంగ్ హ్యాండ్లింగ్ చేసేవాడు. చాలా మంది సామాన్య జనానికి అర్థం కాని పాయింటు ఇది. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దిగువన ఉండే జూనియర్ ఇంజనీర్ స్థాయి ఉద్యోగిని లైన్ లోకి తీసుకొని ఎడాపెడా వాయిస్తాడు. అవతల పక్క సీఎం అనగానే – వాడు సగం బిక్కచచ్చిపోతాడు. సమాధానం చెప్పలేడు. పైగా ఏం యాక్షన్ తీసుకుంటాడో అనే భయం ఉంటుంది. ఇదంతా టెలీ కాన్ఫరెన్సులో ఉదయం పూట జరుగుతుంది. ఆ కాల్ రికార్డింగు మీడియాలో, సోషల్ మీడియాలో తిరిగి తిరిగి సాయంత్రానికి ఉద్యోగుల్లో భయం పెంచుతుంది. వ్యతిరేకత తెచ్చి పెడుతుంది. నిజానికి చంద్రబాబు కోణం వేరు. తాను తెగ కష్టపడుతున్నానని, ప్రతీ విషయం తనకి తెలుసు అని సగటు మనిషి అనుకోవాలి అని అలా హ్యాండిల్ చేస్తాడు. ఇందులో నేరుగా ఉద్యోగులకి నిజానికి నష్టం లేదు. మానసిక ఫీలింగ్, కాస్తో కూస్తో ఒత్తిడి తప్ప. చంద్రబాబుకే నష్టం. ఎందుకంటే ఉద్యోగులు వ్యతిరేకం అవుతారు. పక్క రాష్ట్రం కన్నా ఒక్క పర్సంటు ఎక్కువ ఫిట్ మెంట్ ఇచ్చినా, అది కూడా అడక్కుండానే ఇచ్చినా కూడా నచ్చనంత వ్యతిరేకం అవుతారు.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు జరుగుతున్నది మానసికం కాదు. ఆర్థికం, అధికారికం. ఉద్యోగులు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేది ఉద్యోగ ప్రయోజనాల్ని. నిజం ఇది. తమ జీవితానికి, కుటుంబానికి భరోసా ఉంటుందని, అందుకే వాటి తర్వాతే ఏవైనా అనుకుంటారు. అలాంటివి ఇప్పుడు గాల్లో దీపం అయిపోయాయ్. పైపెచ్చు వాళ్లకి లక్షల్లో జీతాలు సరిపోవడం లేదట అనే ప్రచారం. ఎదురుదాడి. మన దీపమే కదా అని ముద్దు పెడితే మూతి కాలింది అనేది సామెత. ఉద్యోగులకి అలాగే కాలింది. పిలిచి ఫిట్మెంట్ ఇచ్చిన రోజుల్ని చూసిన కళ్లతోనే పింఛన్ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందేమో – 70 ఏళ్లు దాటిన వాళ్లు, అనే చిత్రవిచిత్రమైన వార్తల్ని చూసే రోజులు వచ్చి పడ్డాయ్. ఇది భంగపాటు. ఏదో అనుకుంటే ఇంకేదో అయిన పరిస్థితి. ఇలా అయిన మొదటి వర్గం కాదు ఉద్యోగులు. అప్పటికే చాలా మందికి తగిలింది ఎదురు దెబ్బ. వాళ్లంతా అసంఘటితంగా ఉంటారు. రాష్ట్రమంతా చెల్లాచెదురుగా ఉంటారు. కానీ రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగా ఓ ఫ్రేమ్ వర్క్ లో సంఘటితంగా ఉంటారు ఉద్యోగులు. సర్వీసు రూల్స్ బలంగా, స్పష్టంగా ఉంటాయ్. అయినా అలాంటి వాళ్ల విషయంలో కూడా ఇలా హ్యాండిల్ చేస్తారని ఊహించని విషయం ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది. అవును, ఇలాగే ఉంటుంది – మా డ్రైవింగ్ ఇంతే అంటున్న తీరు చూశాక నిర్ఘాంతపోవడం ఉద్యోగుల వంతు అయిపోయింది. ఇక్కడ సమస్య ఉద్యోగులది కావొచ్చు. కానీ అనుభవం మాత్రం రాష్ట్రం మొత్తానిది. అదీ అసలు పాయింటు.

ఇక ఉద్యోగుల్ని ఎవరు రెచ్చగొడుతున్నారు అనేది ఇంకో ఇంపార్టెంట్ టాపిక్. ఉద్యోగుల ఆందోళనలతో ఎవరు లాభపడతారు ? ఏపీకి నష్టం ఉంటుందా ? అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ఉద్యోగులు ఆశ పెడితే ఆశ పడే మాట వాస్తవమే. సీపీఎస్ రద్దు చేస్తామని, అదిగో అల్లంత పొడుగున మేళ్లు చేస్తామని అంటే ఆశ పడి ఉండొచ్చు. అంతేగానీ రెచ్చగొడితే రెచ్చిపోతారనడం మాత్రం పుకారే. ఎందుకంటే ఉద్యోగులకి రాజకీయాల కన్నా జీతాలు ముఖ్యం. బతుకులు ముఖ్యం. వాటి తర్వాతే వాళ్ల డ్యూటీలు కూడా. ఇందులో తప్పు పట్టాల్సిన పని ఏమీ లేదు. తప్పు పట్టడం అంటూ జరిగితే రాజ్యాంగాన్ని తప్పు పట్టాలి ముందు. అక్కడ చేసిన ఏర్పాటు అలాంటిది మరి. అలాంటి ఉద్యోగులు ఎవరి మీదనో ప్రేమ చేతనో, లేదంటే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయో ఇంకెవరినో ఇబ్బంది పెడతారు అని ప్రచారం చేయడం మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్లే ప్రభుత్వాలకి కళ్లు ముక్కు చెవులు. వినాల్సింది, చూడాల్సింది, అన్నీ చేయాల్సిందీ వాళ్లే. అలాంటి వాళ్ల అభిప్రాయాలు కూడా పట్టించుకోకుండా కర్రు కాల్చి వాత పెట్టి, చెర్నాకోల్ పట్టి పని చేయించగల్గుతాం అనుకుంటే ఇక మీ ఇష్టం. ఆ కాన్ఫిడెన్సుకి జోహార్లు.

ఇక ఎవరు లాభపడతారు అనే చర్చ విషయానికి వద్దాం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా చంద్రబాబు నాయుడే లాభపడతారు ఈ ఉద్యోగుల ఆందోళనలతో ! ఎందుకంటే తమకి ఎవరు ఎంత సాయం చేశారో, తమను ఎవరు ఎలా చూశారో ఉద్యోగులు తేల్చుకోగలరు. ఆ విచక్షణ వాళ్లకి ఉంది. తిప్పికొడితే రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీలు. అలాంటప్పుడు ఈ పార్టీని కాదనుకుంటే ఇక మిగిలింది ఆ పార్టీనే. అంటే చంద్రబాబు లాభపడేది ఉద్యోగులు తనని ప్రేమించడం వల్ల కాదు. ఎదుటివాడు ఉద్యోగుల్ని రాచి రంపాన పెట్టడం వల్ల. చించుకున్నా పెంచేది లేదు అని తేల్చి చెప్పడం వల్ల. నిజానికి చంద్రబాబు తన జీవిత కాలంలో ఇలాంటి మైలేజీని, ఇమేజీనీ తెచ్చుకోలేకపోయేవాడేమో ! ఎందుకంటే తన పని తీరే తనకి శత్రువు. ఉద్యోగులకి తాను చేయాల్సిన దానికన్నా ఎక్కువగానే చేసి, వాళ్లతో కూడా ఎక్కువగా పని చేయించాలని తాపత్రయ పడి నెగెటివ్ గా మిగిలిపోయేవాడు. కానీ, మేం ఇంతే, ఇలాగే చేస్తాం అని తెగేసి చెప్పేవారి కంటే తమ కోసం ఎంతో చేసి – తమని కూడా కొంత పని చేయమని అడిగే చంద్రబాబు మీద ఇక పెద్దగా హేట్రెడ్ పెట్టుకోడానికి ఉద్యోగులు సిద్ధపడకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఈజ్ ఫార్ మోర్ బెటర్ దెన్ నథింగ్ అని వాళ్లకి అనుభవపూర్వకంగా అర్థం అవుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments