28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిమత మార్పిడులపై బీజేపీ గురి పెడుతుందా ?

మత మార్పిడులపై బీజేపీ గురి పెడుతుందా ?

ఏపీలో సూది మొనంత జాగా కోసం బీజేపీ బాగా ప్రయత్నం చేస్తోంది. రంగంలోకి ఇంకా పూర్తిగా దిగలేదు కానీ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టుగా ఉంది. అమరావతి యాత్రకి సపోర్టుతో మొదలైన ప్రయాణం ముందు ముందు స్పీడు పెరుగుతుంది అంటున్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి నాడు జరిగే మేథో మథనంలో కొన్ని కొత్త, కీలక విషయాలు ప్రస్తావనకి వస్తాయ్ అంటున్నారు. ఇది ఢిల్లీ ప్లానింగో, లేదంటే సుజనా లాంటి నాయకులు లీడ్ తీసుకుని వేస్తున్న ఎత్తుగడో తెలియదు కానీ పార్టీ అజెండా ఖరారు అవుతోందనే టాక్ ఇంటర్నల్ గా వినిపిస్తోంది. ఏంటి, బీజేపీ ఏయే విషయాలు మాట్లాడబోతోంది ? కొత్తగా ఏం చెబుతుంది ?

బీజేపీ చెప్పడం అంటే ఈ మధ్య సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి వాళ్లు మాట్లాడ్డమే. పెద్దగా ఇంట్రెస్ట్ లేని యవ్వారం అయిపోయింది అందుకే. ఇప్పుడు పంథా మారుతోంది. ఏపీ ఇష్యూస్ ఢిల్లీ దృష్టి పెడుతోంది అని చెప్పేందుకు ఒకటి కాదు రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయ్. అన్నమయ్య డ్యాం కట్ట కొట్టుకుపోయిన విషయం మీద మంత్రి షెకావత్ పార్లమెంటులో మాట్లాడిన తర్వాత దేశం మొత్తానికి తెలిసింది. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగా లేదని, ఆదుకోకపోతే ఏమైపోతామో తెలియడం లేదు అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నీ విడిచి చెప్పడానికి కూడా కారణం ఓ రకంగా బీజేపీనే. ఎందుకంటే ఏపీలో ఆర్థికం లెక్క తప్పిందని నిర్మలా సీతారామన్ అప్పటికే ప్రకటించేశారు. ఏపీలో కీలకంగా చక్రం తిప్పే నాయకుల ఇన్ పుట్స్ ఆల్రెడీ ఉన్నాయ్. అన్నిటికీ మించి అమిత్ షా వచ్చి – వైసీపీ మన మిత్ర పక్షం కాదు, మీరు జనం సమస్యల మీద ఎందుకు పోరాటం చేయడం లేదు అని మూడూ పెట్టి మూతులు తుడిచాక ఇక బీజేపీలో ఉన్న వైసీపీ అఫిలియేటెడ్ నేతలకి కూడా కళ్లు అంటుకున్నాయ్. ఇప్పుడు ఇక గేర్ మారాల్సిన టైమ్ వచ్చింది అంటున్నారు.

ఏపీలో మత మార్పిడుల వ్యవహారంపై దృష్టి పెడితే ఎలా ఉంటుంది అని సంఘ్ లో కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. ఓ పార్టీ మతం చుట్టూ రాజకీయం చేయడం, బైబిల్ పట్టుకొని ప్రచారాలు సాగించడం, చర్చి ఫాదర్లకు ప్రోత్సాహకాలు అందించడం లాంటి విషయాలపై ఇప్పటికే ఆ పార్టీ అభ్యంతరం చెప్పింది. పైగా జనంలో కూడా ఈ విషయం బాగా నాటుకుంది అని బీజేపీతోపాటు విపక్షాలు నమ్ముతున్నాయ్. ఇంకొందరు ఆలోచనాపరులు అయితే మతం మారిన వారికి కుల రిజర్వేషన్లు అనుభవించే హక్కు ఎక్కడిది అని అడుగుతున్నారు. ఇదీ అసలు ట్రిగ్గర్ పాయింట్. గత ఎన్నికల ముందు చంద్రబాబుపై కొందరు ఒత్తిడి తెచ్చారు. మతం మారితే కుల రిజర్వేషన్లు వర్తించవు అనేలా చట్టబద్ధమైన ఏర్పాటు చేయండి, చర్యలు తీసుకోండి అని కోరారు. చంద్రబాబు ధైర్యం చేయలేదు. ఇప్పుడు బీజేపీ ఈ పాయింట్ పట్టుకుంటుందా అనే చర్చ రేగుతోంది. ఎందుకంటే మేథోమథనం జరిగేది సరిగ్గా డిసెంబర్ 25న. ఆ రోజు అటల్ బిహారీ వాజ్ పేయి పుట్టిన రోజు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొన్ని తేడాలతో ఇలాంటి చట్టాలు, బిల్లులూ వచ్చాయ్. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో ఆల్రెడీ చట్టాలు ఉన్నాయ్. కర్ణాటకలో రీసెంట్ గా చర్చ రగులుతోంది. బలవంతపు మత మార్పుడుల నిరోధక చట్టం అని చెబుతున్నారు దాన్ని. కానీ అందులో ఉన్న అంశాల మీద దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కర్ణాటకలో అయితే శ్రీరామ్ సేన, భజరంగ్ దళ్ లాంటి వాళ్ల ప్రమేయంతో కొన్ని క్లాజులు పెట్టారు అనేది కొందరి అభ్యంతరం. బీజేపీ వాళ్లు ఎప్పుడూ ఆరోపించే లవ్ జీహాద్ లాంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది యూపీ, ఎంపీల్లో ఉన్న చట్టాలపై అబ్జెక్షన్. అంటే స్థానిక పరిస్థితుల్ని బట్టీ బీజేపీ పావులు కదుపుతోంది. అందుకే ఏపీలో ఇలాంటి ప్రస్తావన ఏదైనా నిజంగా వస్తుందా అనే లెక్కలు వినిపిస్తున్నాయ్.

ఏపీ కోసం పని చేయడం, ఏపీ కోసం ప్రాజెక్టులు, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు తేవడం, ప్రో – ఏపీ మైండ్ సెట్ తో ఉన్నాం అని చెప్పడం ఓ ఎత్తు. రంగంలోకి దిగడం, జనంలోనే ఉంటూ అజెండా సెట్ చేయడం మరో ఎత్తు. సేవ్ ఏపీ అనే మూమెంట్ కూడా మొదలు పెడతాం అని ఢిల్లీ వేదికగా సుజనా చౌదరి ఇప్పటికే ప్రకటించారు. ఏపీలో ఉన్న మేధావులు, ఆలోచనాపరులు, కుల వర్గాలకి అతీతంగా ఒక్క చోటకి తేవడం, ఏపీ భవిష్యత్ పై అందరినీ కలుపుకొని పోవడం ఆ వేదిక ఉద్దేశం అని చెబుతున్నారు సుజన. అవసరం అయితే పోలవరం లాంటి విషయాలపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతా అని ఉండవల్లి లాంటి నాయకులు ప్రకటించారు ఇప్పటికే. హర్షకుమార్ లాంటి వాళ్లు ప్రజా సంబంధ విషయాలపై సూటిగా రియాక్ట్ అవుతున్నారు చాలాసార్లు. ఇలాంటి వాళ్లంతా ఏకమై ఆలోచనలు రాజేస్తే పరిస్థితి మరో ఉంటుందనేది అంచనా. బాధితులు ఎక్కువగా ఉన్న చోట ఆలోచనలు ఏకమైతే రాజకీయాలు అనూహ్యంగా మారొచ్చు అనేది కొందరి అభిప్రాయం. ఇలాంటి సమయంలో బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది, ఏం చేస్తుంది అనేది చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments