మద్యం కేసులో ఐటి ఎంట్రీ.. జగన్ విషయంలో బిజెపి రూటు మారిందా?

0
51

ఏపీ లిక్కర్ స్కామ్ లో విచారణ కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగన్మోహనరెడ్డే అని, సీఎంగా వున్న జగన్ కు తెలియకుండా లిక్కర్ పాలసీలు మార్చడం, పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడడం జరగదన్న విమర్శలున్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ జగన్ దాకా పోలేదు. ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, ధనుంజయరెడ్డి, రాజ్ కసిరెడ్డి, క్రిష్ణమోహనరెడ్డి లాంటి వాళ్ల అరెస్టులతో ఆగిపోయింది. కేంద్రం ఒత్తిడి వల్లే జగన్మోహనరెడ్డి దాకా వెళ్లలేదన్న విమర్శలు, ప్రచారం కూడా వుంది. డిస్టిలరీకి 3,700 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారని, డిస్టిలరీల నుంచి భారీగా ముడుపులందుకున్నారని సిట్ విచారణలో తేల్చారు.

ఆ తరువాత మద్యం రవాణా టెండర్లలో అవకతవకలు జరిగాయన్న దిశగా విచారణ జరిపారు. రవాణా టెండర్లలో సాధారణంగా కిలోమీటరుకు 13 రూపాయలు బదులు అత్యధికంగా 35 రూపాయలకు ఖరారు చెయ్యడం, ఆ టెండర్లను, సబ్ కాంట్రాక్టులని అస్మదీయ సంస్థలకు కట్టబెట్టడం వెలుగులోకి వచ్చింది. 195 కోట్లమేర ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారని నిర్ధారించారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ జరిగినట్టు గుర్తించి రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, వైసిపి నేత కారుమూరి సునీల్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని అరెస్టు చేసింది. ఇప్పుడు తాజాగా ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ రంగ ప్రవేశం చేసింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ముని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించిన వ్యవహారం మీద ఐటి అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

హవాలా మార్గంలో మళ్లించిన సొమ్ముతో కొనుగోలు చేసిన స్థిరాస్తులు, బినామీల పేర్ల మీద పెట్టిన ఆస్తుల గురించి ఎంక్వయిరీ చేస్తున్నారు. జగన్ హయాంలో మద్యంసరఫరా చేసిన డిస్టిలరీలు, రవాణా కాంట్రాక్టర్ల ఖాతాలు, దీనితో ప్రమేయం వున్నవాళ్ల కుటుంబసభ్యుల ఆర్ధిక వ్యవహారాలను ఐటి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఐటి అధికారులు ఈకేసు విచారిస్తున్న ఈడీ అధికారులు, సిట్ అధికారులతో హైదరాబాద్ లో సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలు, మనీ ట్రయల్ కు సంబంధించిన సమాచారాన్నివీళ్ల దగ్గర్నుంచి సేకరించారు. ఏయే ఖాతాల ద్వారా, కంపెనీల ద్వారా నిధులు మళ్లించారు? ఎవరికి చేరాయన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

యాక్టువల్ గా సిట్ విచారణ జగన్ వరకు పోకుండా ఆగిపోయినప్పుడే జనానికి ఈ విషయం మీద ఒక అవగాహన వచ్చింది. జగన్ జోలికి వెళ్లడం బిజెపికిష్టం లేదని, వాళ్ల ఒత్తిడితోనే మిథున్ రెడ్డితో ఆపేశారని మెజారిటీ జనం నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన వార్తలకు స్పందించడం మానేశారు. అలాంటి సమయంలో ఈడీ రంగ ప్రవేశం చెయ్యడం, దర్యాప్తు వేగవంతం చేసి వైసిపి నేతలు కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ ని అరెస్టు చెయ్యడంతో ఈ కేసులో ఏదో జరగబోతోందన్న వూహాగానాలు మొదలయ్యాయి. వైసిపిలో కలవరం మొదలయింది. ఇప్పుడు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా రంగప్రవేశం చెయ్యడంతో ఈ కేసు విషయంలో కేంద్రం కూడా సీరియస్ గా వుందా? జగన్ విషయంలో బిజెపి వైఖరి మారిందాఅన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అదే నిజమైతే జగన్మోహనెడ్డికి ఇబ్బందులు తప్పవు. ఈడీ, ఐటి డిపార్ట్మెంట్లు ముమ్మర దర్యాప్తు ఎక్కడికి దారితీస్తుందో, ఇంకెంతమంది రాజకీయనాయకుల పేర్లు బయటకొస్తాయో అన్న చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.