31 C
Vijayawada
Friday, April 26, 2024
Homeనీతి ప్రత్యేకంరాయలసీమకో ప్రేమలేఖ

రాయలసీమకో ప్రేమలేఖ

ప్రత్యర్థిని కొట్టడానికి పిడికిలి బిగించడం పెద్ద విషయమేమీ కాదు. క్రూరత్వం. మనల్ని నమ్ముకున్నవాణ్ని ఆదుకునేందుకు ఐదు వేళ్లూ తెరిచి పట్టెడన్నం పెడతాం చూడూ… అదీ వీరత్వం. తెల్లారి లేస్తే మనం పళ్లు కూడా తోముకోకముందే వీరుడూ శూరుడూ అంటూ ఒకణ్ని పొగిడి పొగిడి మోస్తాం చూడూ… వాడిలోని వీరత్వం ఇదిగో ఇలాంటప్పుడే బయటపడుతుంది. మెట్టమీద ఉండే రాజంపేట ప్రాంతం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాక ఓ మాట చెప్పాలనిపిస్తోంది. ఈ మూడు జిల్లాల్లో కట్టలు తెగి వదర ముంచెత్తినా, లక్షల మంది నిలువ నీడ పోగొట్టుకొని అల్లాడుతున్నా లేవని కొన్ని నోళ్లు, అమరావతి బిల్లుపై కొత్త పిల్లిమొగ్గలు స్టార్టయ్యాక లేవడం మొదలైంది. అందుకే సీమతో కొన్ని సంగతులు పంచుకోవాలనిపిస్తోంది.

 

హైదరాబాద్ నుంచి కడప మీదగా తిరుపతి పోయేటప్పుడు రాజంపేట తగులుతుంది. చాలామంది చూసే ఉంటారు. ఎప్పుడో రెండు నెలలు వర్షాలు పడితే. ఈశాన్య రుతుపవనాలు వస్తేనే పారే నది చెయ్యేరు. వంతెనలు కట్టలు దాటుతున్నప్పుడు కనిపిస్తది. ఆ రెండు నెలలే కాదు ఏడాది పొడుగునా పచ్చదనం పరుచుకొని, పంట తోటలతో పనస చెట్లతో పసందుగా కనిపించే ప్రాంతం రాజంపేట. నేలలో సారం ఎక్కువ. అందుకే హార్టీకల్చర్ కి రాజంపేట అంటే అంత మక్కువ. అలాంటి ప్రాంతం కకావికలం అయిపోయింది. నీటిపారుదల ప్రాజెక్టులే కొట్టుకుపోయాయ్. కట్టతెగిన అన్నమయ్య దెబ్బకి డజన్లకొద్దీ ఊళ్లు భోరుమంటున్నాయ్. సహాయ కార్యక్రమాల సంగతి దేవుడెరుగు, నందలూరు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు గల్లంతుపై ఇప్పటి వరకూ వివరం పూర్తిగా తెలిసినవాళ్లు ఒక్క బాధితులు మాత్రమే. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకొని స్పందించే మనం మన రాజంపేట, కడప వరదల్లో వాస్తవాలు మాత్రం తెలుసుకోలేకపోయాం. అయినా బాధలేదు. సాయం చేద్దామని ఎవరైనా పిలుపు ఇచ్చారో లేదో వినపడలేదు. కానీ అమరావతి విషయంలో ప్రభుత్వం మార్చిన వ్యూహం మాత్రం చాలా మందిని కదిలించింది ఎందుకో ! మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం, మళ్లీ సమగ్రమైన ఆలోచనతో వస్తాం అనగానే సీమలో కొందరు అదే పనిగా సిద్ధం అయిపోయారు. మా సీమకు అన్యాయం జరిగితే ఊరుకోం, అన్నీ కోస్తాలోనే పెడతారా అంటూ తాటాకు చప్పట్లు మొదలుపెట్టేశారు. అరే సామీ, నిండా మునిగితే నిన్ను తాడేసి లాగినోడు లేడు. నీ వరదలో నువ్వు కొట్టుకుపోతుంటివి ఓ పక్కన, ఇప్పుడు సీమకి అన్యాయం గురించి మాట్లాడతా !

 

 

పాత లెక్కలు, మరీ లోతులకీ పోవద్దు కానీ విడిపోయిన గత ఏడున్నరేళ్లలో ముఖ్యమంత్రులు ఎవరు ? ఏ ప్రాంతం వాళ్లు ? ఇప్పుడున్న ముఖ్యమంత్రిది ఏ జిల్లా ? ఇప్పుడు విల్లాడుతున్నవి ఏ జిల్లాలు ? మన నాయకుడు ఉండగా మనం ఒడ్డున పడలేదు కానీ మన ప్రాంతానికి రాజధాని వస్తే ఉద్ధరిస్తదా ? అదెట్టా ? అసలు రాజధాని అంటే ఏంటి ? ఓ పరిపాలనా కేంద్రం. గుండె శరీరానికి రక్తం పంపు చేసినట్టు… పరిపాలన మొత్తం రాష్ట్రానికి అందించే కేంద్రం. అది ఎక్కడో ఓ చోట ఉండి తీరుతుంది. ప్రతీ జిల్లాలోనూ, ప్రతీ ప్రాంతంలోనూ రాజధాని ఉండటం ఎలా సాధ్యం ? గుండె ఎక్కడో మెడ కింద ఉంది నాకు అన్యాయం జరుగుతోంది అని రెండు కాళ్లూ గొవడకి దిగుతాయా ? మాకూ గుండెకీ దూరం ఎక్కువైంది అని చేతులు పని చేయడం ఆపుతాయా ? రాజధాని కూడా అంతే. మన బుర్రలకి తట్టక కాదు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవాలి కాబట్టి ఇలాంటివి మాట్లాడతాం. ఇదే రాజధాని ఉన్నా… అభివృద్ది లేదు అన్యాయం జరుగుతోంది అని, హైద్రాబాద్ గుంజుకొని… 13 జిల్లాల్నీ తీరని దెబ్బ తీశాడు కేసీఆర్. ఇప్పుడు అదే రాజధాని పేరుతో మరో దెబ్బ ఇంకోవైపు నుంచి కొట్టుకోడానికి సిద్ధపడాలా ? అంతేలే, రాజధాని అంటే ఓ రాజకీయ ఆయుధం కూడా, ప్రాంతాల కంటి మీద కునుకు లేకుండా చేసే ఆయుధం అని ఇప్పుడు ఇంకోసారి తెలుస్తోంది మనకి. ఇలాంటి సమయంలో వాస్తవాలు వదిలేసి, కష్టం వచ్చిపడినా మాట్లాడని వాళ్లు రాజధాని మీద కామెంట్లు చేయడం అంటే ఇదంతా పేమెంట్ల బ్యాచేనా ? ఏమో ఏమి లెక్కచ్చాదో, ఎంత లెక్క వచ్చాదో వాళ్లకే తెలియాలి. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నా విడిపోయిన తర్వాత అయినా, మరీ ముఖ్యంగా గత 35 ఏళ్లలో చక్రం తిప్పుతున్నది మన జిల్లాలే ! హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏలింది మనమే. ఇప్పుడు అమరావతి ఉంచాలా దించాలా అనేది డిసైడ్ చేస్తున్నదీ మనమే. మన జెండా ఇంతలా ఎగిరింది కదా, మన జిల్లా బతుకు బాగుపడిందా ? ఎప్పుడైనా కడప నుంచి వలసలు ఆగినాయా ? గల్ఫ్ దేశాలను నమ్ముకునే బతుకులు మారినాయా ? కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ వచ్చిందా ? ఎక్కడైనా కొత్తగా సాగుభూమి మొలిచిందా జలయజ్ఞాలతో ? గత 35 ఏళ్లలో బతికిన వాళ్లు… ఇదిగో మేం చూసిన అతి పెద్ద మార్పు ఇదీ అని చెప్పండి చూద్దాం !

 

అంటే ఏంటి అర్థం ? మనం ఎప్పుడూ కష్టాలు, రాయలసీమ కరువు కథలు, గల్ఫ్ వెతలు అంటూ ఏడుపుల్ని సాహిత్యంతో కలిపి ఆస్వాదిస్తూ ఉండాల. కొందరేమో కుర్చీలెక్కి ఊరేగాల. వాళ్లకి అవసరం అయినప్పుడు మన ప్రాంతానికి అన్యాయం అంటూ మనమే గుండెలు బాదుకొని అరచాల. అంతేనా ? 89 శాతం మంది జనాభాపై 11 శాతం మంది పట్టుబిగించడానికి కారణమే ఇది. ఆ 11 శాతంలోనూ అందరినీ అనడానికి లేనేలేదు. అందులోనూ మరీ ముఖ్యంగా పిడికెడంత మంది ఉంటారు. కొన్నే కొన్ని కుటుంబాలు ఉంటాయ్. వాళ్ల సంతోషం కోసం మిగతా జనాభా మొత్తుకోవాల. వాళ్లని నెత్తికెత్తుకోవాల. వరదలలొస్తే కొట్టుకుపోవాల. పోతాపోతా పక్క ప్రాంతం మీద బురద జల్లిపోవాల. ఇదేనా నీతి మనం నేర్చుకున్నది ?

 

రాష్ట్రం విడిపోయాక రెవిన్యూ లోుటు మిగిలింది ఏపీకి అని గుండెలు బాదుకున్నాం కదా, ఆ మిగిలిన లోటు ఏ జిల్లాలదీ ? సీమ జిల్లాలు నాలుగింటినీ మినహాయిస్తే ఏపీకి ఏమైనా రెవిన్యూ లోటు ఉంటదా ? అహ, తులసి రెడ్డి లాంటి తెలివైన వాళ్లని అఢిగి చూద్దాం. చెబుతారు. గత ఏడేళ్లలో రాష్ట్రంలో వచ్చిన అతి పెద్ద ప్రైవేటు పెట్టుబడి కియా. 5 వేల కోట్లకిపైనే. పెట్టింది ఎక్కడ ? ఎలక్ట్రానిక్స్ మేనిఫేక్చరింగ్ హబ్… మొబైల్ ఫోన్లు గట్రా తయారు చేసే క్లస్టర్ చంద్రబాబు ఎక్కడ పెట్టాడు ? సత్యవేడు ఎక్కడుంది ? మన చేజేతులా మనం ఆర్పేసుకున్నాం కానీ ప్రపంచంలో అతి పెద్ద సోలార్ హబ్ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసింది ఎక్కడ ? కర్నూలు ఏ ప్రాంతంలో ఉంది ? స్టీలు ప్లాంటు కట్టేందుకు రిపోర్టు రెడీ చేసి రంగంలోకి దిగిన కడప ఏ ఏరియా ? ఇంత డెన్సిటీ ఆఫ్ డెవలప్ మెంట్ మిగతా 9 జిల్లాల్లో ఎక్కడైనా జరిగిందా ? చెక్ చేద్దాం.

 

సీమ దెబ్బతో నష్టపోయిన ప్రాంతం కోస్తా ముందు నుంచి. ఇది ప్రజలకు సంబంధం లేదు. నాయకత్వానికి అందులోనూ ఆ 11 శాతంలో కొన్ని కుటుంబాలకి సంబంధించినది మాత్రమే. బెజవాడ రాజధానిగా రావాలీ అంటే వద్దని కర్నూలు తరలించి గందరగోళం చేసి.. ఆనక, హైదరాబాద్ కి వదిలేసిందీ వాళ్లే. క్రిష్ణా నీటి వాటాలకి గండి కొట్టి డెల్టాను ఎండ కడుతున్నదీ వాళ్లే, రాజధాని అంటూ అరచేతికి బెల్లంముక్క రాచి… మోచేతి వరకూ నాకిస్తున్నదీ వాళ్లే. గత 30 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ధి ప్రాజెక్టూ రానిదీ, రాష్ట్రం విడిపోయాక కూడా గత ఏడేళ్లూ పరగడపుతో అలా ఎదురు చూస్తున్నదీ కోస్తా జిల్లాలే మరీ ముఖ్యంగా క్రిష్ణా, గుంటూరు, ప్రకాశాలే. ఆఖరుగా ఒక్క మాట. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర భావుకత, బతుకుతీపి అయితే కోస్తాంధ్ర ఆలోచన. రాయల సీమ గుండె ధైర్యం. అలాంటి గుండెధైర్యం కొందరి చేతుల్లో చిక్కి విలవిల్లాడకూడదు అనే ఇంతలా చెప్పడం. అయినా ఇవన్నీ వదిలేసి మాకే అన్యాయం జరుగుతోంది అన్నామూ అంటే… ఇప్పుడున్న కాకలో అయితే మీ దారి మీరు చూసుకోండి అని కోస్తా జిల్లాలు ఓ దండం పెడితే సరిపోతుంది. గుండు కొట్టించుకోవాలి అనిపించినప్పుడు తప్ప, ఇక మనవైపు చూసే పనే పడదు. అంతవరకూ తెచ్చుకోకపోతేనే మంచిది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments