గెలిచి పోతున్నామని యుద్ధానికి ముందే విర్రవీగితే వెన్ను విరిగే అవకాశాలే ఎక్కువని చిన్నప్పుడు కుందేలు తాబేలు కథ చెప్పింది. కాన్ఫిడెన్స్ కుందేలు కునుకు తీస్తే… తప్పుల తాబేలు గెలిచిపోయేందుకు ఎంతో సమయం పట్టక పోవచ్చు కొన్నిసార్లు ! దెబ్బ మీద దెబ్బ పడుతోంది జనానికి – ఆగ్రహం పెరిగిపోతోంది, ఇక అయిపోయినట్టే అంటూ ఎవడి తీర్మానం వాడు చేసుకుంటూ గత నెల్లాళ్లుగా చెలరేగిపోవడం కనిపిస్తోంది. అవతలవాడు పడుతున్నప్పుడు మనం లేస్తున్నట్టే కదా అంటారేమో ! కాదు. తేడా ఉంది. వాడు పడటం ఆగినా – ఆగేందుకు ప్రయత్నం చేసినా లెక్క వేరే ఉంటుందన్న ఈక్వేషన్ ఇక్కడ మిస్ కాకూడదు. ఆల్రెడీ మొదలైన దిద్దుబాట్లు, పాలాభిషేకాలు, పోటా పోటీ సభలు చెబుతున్న సంగతి ఇదే !
అమరావతి సభ సక్సెస్ తర్వాత టీడీపీ అనుకూల మీడియాలో, వర్గాల్లో యమ ఉత్సాహం వచ్చేసింది. అమరావతికి అనుకూలంగా జనం అంతా ఉన్నారు. రాయలసీమ కూడా జై కొట్టేసింది అమరావతికి అనుకుంటున్నారు. పట్టాభి లాంటి వాళ్లు అయితే మరో అడుగు ముందుకేసి – రింగు రోడ్డును అడ్డుకుంది ఈ ప్రభుత్వం – అమరావతిని ఆపినట్టే ఆపుతున్నారు. ఆ రోడ్డు వస్తే 4 లక్షల ఎకరాల ప్రాంతం అభివృద్ధి అవుతుంది అంటున్నాడు. అంటే రాజధాని విషయంలో చేసిన తప్పుడు సూత్రీకరణే ఇక్కడ కూడా చేస్తున్నట్టు లెక్క. ఓ ప్రాంతం మాత్రమే బాగుపడుతోంది, ఓ కులం మాత్రమే బాగుపడుతోంది అని కదా అమరావతి మీద ముద్ర వేసింది. మళ్లీ ఇప్పుడు భూమి, బాగుపడటం, అమరావతిని అడ్డుకోవడం లాంటి చింతకాయ్ కబుర్లు దేనికి ? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇలాగే ఉంటుంది. కేంద్రం డబ్బులు ఇస్తా అంటోంది. తీసుకోవడానికి ఏంటి నొప్పి – మీరు ఏమైనా కొత్తగా కట్టారా ? తెచ్చారా ? పెట్టారా ? లేదే ! ఉన్న రోడ్లకి గతుకులే పూడ్చడం లేదు. కేంద్రం రింగురోడ్డు ఇస్తానంటే ఎందుకు తీసుకురారు ? అంటే సరిపోవును. అంటే వాళ్లు ఇస్తానంటే వీళ్లు తీసుకోవడం లేదన్నమాట అనే విషయం కమ్యూనికేట్ అవుతుంది. ఆ పని మాని ఓవర్ గా రియాక్ట్ అవ్వడం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎఫెక్టే ! అందుకే ఇంతలా చెప్పడం.
ఇక సభలు, సమావేశాలు – పాలాభిషేకాల సంగతికి వద్దాం. అమరావతి సభ సక్సెస్ అయ్యింది – సీమలో కూడా అమరావతికి సానుకూల స్పందన వచ్చింది అనే ముద్ర పడగానే అటు వైపు నుంచి ప్లానింగ్ మొదలైంది. సీమ నుంచి కొందరు ఎదురు సభ పెట్టారు. మూడు రాజధానులు, వికేంద్రీకరణ అనేవి చెపప్పాలన్నది ఆ సభ టార్గెట్. ఎంత వరకూ చెప్పారు ఆ మాట, ఆ సభకి వచ్చిన వాళ్లు కూడా అమరావతికి జై కొట్టారు – అనేవన్నీ టీడీపీ అనుకూల మీడియా చూపించుకునే విషయాలు. ఇక్కడ ఆ చర్చ అవసరం లేదు. అంటే పాయింటు ఏంటంటే – ఇవతల గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు అవతల పక్క నుంచి రియాక్షన్ ఉంటుంది. కరెక్షన్ ఉంటుంది. దిద్దుబాటు ఉంటుంది. మద్యం ధరల సంగతే చూడండి. రేటు తగ్గింది అనగానే- పాలాభిషేకాలు జరిగాయ్. ఆ, అవన్నీ చేయించుకుంటారు. అభిషేకాలు చేస్తే పెద్ద విషయమా, జనం ఎంత కోపంగా ఉన్నారో తెలుసా అంటారేమో ! కొంత వరకూ కరెక్టే. ఏ విషయం అయినా మనం చెప్పడాన్ని బట్టీ ఉంటుంది. సపోజ్ మోడీ పెట్రో రేట్లు 50 రూపాయలు పెంచి – 10 రూపాయలు తగ్గించే సరికి హమ్మయ్యా అనుకోవడం లేదు మనం. గుండెల మీద చేయివేసుకొని చెప్పండి. నిజం. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అదో సైకలాజికల్ ఫీలింగ్. రాజకీయం ఎప్పుడూ ఇలాంటి సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చుట్టూనే నడుస్తుంది. అందుకే పాలాభిషేకాలను తక్కువ చేయకండి.
జనం మానసిక పరిస్థితిని, ఆలోచనను ప్రభావితం చేసే స్థాయిలో రాజకీయం చేసే విషయంలో టీడీపీ ఎప్పుడూ వెనకబడే ఉంటుంది. గత ఎన్నికల సమయంలో – అజెండా ఏంటి అని విషయాన్ని గుర్తించడంలో టీడీపీ తడబడింది. ఆలస్యం అయ్యింది. పోలింగ్ ఏప్రిల్ లో ఉంటే, జనవరి వరకూ తేరుకోలేదు చంద్రబాబు. పసుపు కుంకుమ లాంటివి ప్రకటించినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఎందుకంటే సమయం చాలా తక్కువ. మూడు నాలుగు నెలలు అంటే బొత్తిగా సరిపోదు. అదే రెండేళ్లు రెండున్నరేళ్లు ఉంటే మాత్రం చాలా వరకూ స్కోప్ దొరకొచ్చు. పాత కంతలు మూత పెట్టుకోవచ్చు. గతాన్ని జ్ఞాపకాల్లోకి నెట్టేయొచ్చు. మరుపు అనేది మావన సహజం. రాజకీయాలకి అదే ఆయుధం. తొలి లాక్ డౌన్ సమయంలో వలస కూలీల వెత గుండెలు పిండేసింది. కానీ బీహార్ తో పాటు మిగతా రాష్ట్రాల్లో అది అజెండా కాకుండా బీజేపీ హ్యాండిల్ చేయగల్గింది. 24లో జరిగే ఎన్నికల్లో ఇదే ఇష్యూను బట్టీ ఓట్లు వేస్తారని చెప్పలేం. ఎందుకంటే అది పాతబడిపోతుంది. కొత్త అజెండాలు తోసుకొస్తాయ్. స్వర్ణ దేవాలయంలో ఆగంతకుల అలజడి తర్వాత అకాలీదళ్ కి కాస్త కదలిక వచ్చినట్టే ఉంటుంది కొన్నిసార్లు రాజకీయం.
టీడీపీకి ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటుంది. ప్రత్యర్థి ఆర్గనైజింగ్ ఎబిలిటీని టీడీపీ అంచనా వేయలేదు. కరోనా సమయంలో జీతాల్లో కోత పెడితే – ఉద్యోగులకి అన్యాయం అని టీడీపీ అనుకూల మీడియా రాసింది. మాకేం పర్వాలేదు. మేమే మా జీతాల్లో కొంత సంతోషంగా కోత పెట్టుకోమని చెప్పాం అని హైకోర్టుకే చెప్పాయ్ ఉద్యోగ సంఘాలు. అదీ లెక్క. మద్యం రేట్లు తగ్గించి అమ్ముకోండి ఇక అని చెబితే – మద్యపాన నిషేధ సాధన సమితి చప్పట్లు కొట్టి స్వాగతిస్తుంది. అదీ అలా ఉండాలి ఇంపాక్ట్. చంద్రు లాంటి వాళ్లు మాట్లాడ్డం మొదలు ప్రతీ విషయం వెనకా ఎంతో వర్కవుట్ ఉంటుంది. అంతెందుకు, శూన్యం లోంచి ఊడి పడిన పింక్ డైమండ్ రాజకీయాన్ని ఎంత అతలాకుతలం చేసిందో చూశాం కదా. తప్పో ఒప్పో తర్వాత. ఇక్కడ మాట్లాడుతున్నది అర్గనైజింగ్ ఎబిలిటీ, మైండ్ అండ్ పర్సెప్షన్ మేనేజ్మంట్ గురించి మాత్రమే. టీడీపీ వైపు ఇప్పటి వరకూ ఇలాంటి సక్సెస్ లేదు. ఒక్క లక్ష కోట్ల ఆరోపణల విషయంలో మాత్రమే టీడీపీ విజయవంతం అయ్యింది. బహుశా దాని పర్యవసానాలే ఇప్పుడు కనిపిస్తున్నాయ్. అది వేరే సంగతి.
ప్రత్యర్థి వంద చేతులతో యుద్ధం చేయగలడు. అబద్ధాన్ని నిబద్ధంగా చెప్పి నిజాన్ని ఓడించగలడు. ప్రచారాలతో ప్రజల ఆలోచనల్ని మెలిపెట్టగలడు. పోలవరాలు, అమరావతులు లాంటి రాష్ట్ర అజెండాలతో నాకేం ఒరుగుతుంది, నాకు నెలకి ఎంత పంచుతాడో లెక్కేసుకుంటా అని ఆశపడే జనాలున్న చోట రెండేళ్ల సమయంలో ఏమైనా జరగొచ్చు. ఇది ఎదుటివాడి బలాన్ని ఎక్కువగా ఊహించడం కాదు. ఏపీ మైండ్ సెట్ ను అర్థం చేసుకోవడం !