దగ్గుబాటి వెంకటేశ్వర్రావు భుజం మీద చంద్రబాబు చేయి వేసిన ఫోటో తెగ ట్రెండ్ అయిపోతోంది. అదేం, టీడీపీ ఆఫీసుకు వచ్చి దగ్గుబాటి మాట్లాడతున్నది కాదు. లేదంటే, చంద్రబాబు దగ్గుబాటి ఇంటికెళ్లి కుశల పరామర్శ చేసింది అంతకన్నా కాదు. అయినా ఎందుకింత బజ్ వచ్చింది ? ప్రస్తుత రాజకీయాన్ని, పురందేశ్వరి ఢిల్లీ స్థాయిలో చేస్తున్న ఆలోచనను, రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితిని కలిపి చూస్తే ఓ కొత్త కోణం తప్పక కనిపిస్తది. అదే అసలు విషయం. అవునా ! పాతికేళ్ల తర్వాత కొత్త కూడికలు కనిపిస్తాయా ?
తోడల్లుళ్లు కలిసి ఓ ఫోటోలో కనిపించడం పెద్ద విషయం కాదు. రాజకీయంగా కలిసినా కూడా అదేం పెద్ద సంగతి కాదు. అసలు అలా కలవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది అనేదే అసలు పాయింట్. 2019 ఎన్నికలకు దాదాపు మూడేళ్ల ముందు కల్యాణ్ రామ్ ఆధ్వర్యంలో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో హితేశ్ రాజకీయ ఆరంగేట్రంపై చర్చ సాగింది. టీడీపీ తరపున పోటీ చేస్తే బావుంటుంది అని కొందరు అంటే, ఇంకొందరు ప్రయత్నం కూడా చేశారని చెబుతారు. కానీ అలాంటివి ఏం ఫలించలేదు. చంద్రబాబో లేదంటే చుట్టుపక్కల కీలకంగా ఉన్న తర్వాత జనరేషనో చలించలేదు. పైగా మూడ్ కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉందీ అని దగ్గుబాటి అందరికంటే ముందే స్మెల్ చేసినట్టు చాలా మందికి తెలుసు. ఎన్టీఆర్ బయోగ్రఫీ వచ్చీ రాగానే ఆయన చేసిన కామెంట్ సన్నిహితులకి ఇప్పటికీ గుర్తుంది. సినిమా బావున్నా ఆడటం లేదు అంటే పబ్లిక్ మూడ్ మరోలా ఉంది. అర్థం చేసుకోండి – అని కుటుంబ సభ్యులతోనే ఆయన అన్నట్టు వినికిడి. అలాంటిది ఇప్పుడు సీన్ పూర్తి భిన్నంగా ఉంది. అఖండ సినిమా పెద్దగా పబ్లిసిటీ చేయకుండానే అఖండ విజయం సాధించేసింది. ఇది జనం కోణం అనుకుంటే, కుటుంబం ఆలోచనలు, అందులోనూ పురందేశ్వరి ఎత్తుగడలు ఇంకా ఇంట్రెస్టింగ్.
ఏపీలో జనం ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. కాకపోతే అరాచకమే పతాకస్థాయికి వెళ్లిపోతోంది ఉన్నకొద్దీ ! అతనేమో మరీ సెన్సిటివ్. ఎదుర్కోవాలంటే దన్ను కావాలి. అది బీజేపీ ఇవ్వగల్గితే ఇద్దరికీ లాభం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అవసరం కూడా – అనేది ఇటీవల పురందేశ్వరి చేసిన సూత్రీకరణ. పార్టీ నాయకుల సమావేశం జరుగుతున్న సమయంలో సన్నిహిత నేతల దగ్గర ఆమె ఇంచు మించు ఇదే తరహాలో మాట్లాడినట్టు చెబుతారు. పైగా పురందేశ్వరి ఇప్పుడు బీజేపీలో ఢిల్లీ స్థాయి పదవిలో ఉన్నారు. ఆమె కుటుంబం కూడా గెలుపు చూసి పదేళ్లు దాటేసింది. 2014 ఎన్నికిల్లో రాజంపేటలో ఆమె ఓటమి, మొన్న ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో బరిలో దిగి దగ్గుబాటి ఓటమి మాత్రమే లేటెస్ట్ ఫలితాలు. ఇది వ్యక్తిగతం. ఇలాంటి పరిస్థితి మారాలన్నా కూడా పొత్తు ఎత్తుగడ మార్చాల్సిన అవసరం ఉంది. అంటే, రాజకీయం మారేందుకు అయినా, వ్యక్తిగతంగా రాత మారేందుకు అయినా ఇదే దారి. ఆమె పార్టీకే కాదు ఆమెకు కూడా ఇది అవసరం. ఆమె ఒక పార్టీ – భర్త ఓ పార్టీ అనే విమర్శలకి కూడా ముగింపు పలికేందుకు ఓ క్లియర్ కట్ నిర్ణయం అవసరమే కదా !
వచ్చే ఎన్నికల్లో తనయుడు హితేశ్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయ్. ఎక్కడి నుంచి ఎలా అనేది ఇంకా తెలియదు కానీ ఆమెతో పాటు తనయుడు కూడా పోటీలో ఉండొచ్చునేమో ! ఆ సమయానికి పరిస్థితి ఇంకా ప్రతిపక్షానికి అనుకూలం అయ్యే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయ్. ఇలాంటి సమయంలో దగ్గుబాటి వర్గం వైపు నుంచి సానుకూల సంకేతాలు ఉండటం సహజం. ఇక టీడీపీ వైపు నుంచి కూడా చాలా విషయాల్లో దిద్దుబాటుకి దిగుతున్నారు చంద్రబాబు. కోవర్టుల్ని ఏరివేస్తాం అనడంతోపాటు దూరమైన వర్గాల్ని దగ్గర చేసుకునే పని కూడా సాగుతోంది. ఇదిగో ఇదే వరసలో ఓ సమీకరణ జరిగినా జరగొచ్చు. అంటే కుటుంబ రీయూనియన్ గా చూడలేం ఈ పరిణామాన్ని పూర్తిగా. రాజకీయ పునరేకీకరణ అని మాత్రం అనుకోవచ్చు. విన్ విన్ సిచ్యుయేషన్ వచ్చేప్పుడు చేరో వన్ వన్ అడుగూ తగ్గినా పర్వాలేదు అని రెండు వైపులా అనుకోకుండా ఎలా ఉంటారు. సహజమే !
తండ్రికి వెన్నుపోటు పొడిచాం అని నామీద నిందారోపణలు చేశారు అంటూ బాలయ్య నిన్నమొన్న కన్నీరు పెట్టిన ప్రోమోలు తిరుగుతున్నాయ్. ఇది కాకతాళీయమే అయినా – అలాంటి చారిత్రక పరిస్థితుల వెనక వాస్తవాలు ఈ తరానికి కూడా అర్థమయ్యేలా చెప్పి – మరోసారి అలాంటి ముతక ఎత్తుగడల్ని ప్రత్యర్థులు వేయకుండా చేసేందుకు కూడా ఈ రీఅలైన్మెంట్ దారితీయొచ్చు. వన్స్ ఫర్ ఆల్, చాలా రిపేర్లు చేయాలి అని చంద్రబాబు తలుచుకుంటున్న సందర్భంలో పునరేకీకరణ అంటూ జరిగితే రాజకీయంగానే కాదు ఎమోషనల్ కూడా చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరికే అవకాశం ఉంటుంది. అందుకే – చంద్రబాబు చెయ్యి వేస్తే అది రాంగైపోదులేరా అని సాంగ్ అందుకున్నా అందుకో వచ్చునేమో ! వెయిట్ అండ్ సీ.