ఈ రోజంతా ఇక్కడ తిరిగి వెళ్లేటప్పుడు మనకి కావాల్సినవి నిక్షేపంగా సంచిలో వేసుకుపోవచ్చు అని మహారాజు అన్నారు – అని గురువుగారు పరమానందయ్య శిష్యులకి చెప్పారు. బయలుదేరేప్పటికి బాగా రాత్రయ్యింది. తీరా బండి బయల్దేరుతుండగా భగ్గుమని మంటలు అంటుకున్నాయ్. ఆ ప్రాంతం అంతా గందరగోళం. ఏం జరిగింది అని ఆరా తీస్తే తెలిసిందేంటంటే, ఏదైనా సంచిలో వేసుకోవచ్చు అన్నారు కదా. అందుకే ఓ శిష్యుడు అక్కడ వెలుగుతున్న కాగడా తీసి సంచిలో వేసుకున్నాడు. అదీ సంగతి. రేటు తగ్గిస్తే జనం మెచ్చుకుంటారు అనేది గురువు మాట లాంటిది. అలాగని కొరివి పెట్టుకోలేం కదా ! అర్థం చేసుకోవాల్సిన పాయింటు ఇదే.
వర్మని రాంగ్ గోపాల్ వర్మ అని ట్రోల్ చేస్తారు కొందరు. ఏదైనా అడ్డంగా మాట్లాడతాడూ అని. కానీ ఇప్పుడు సినిమా టిక్కెట్ల విషయంలో మాత్రం రాంగ్ కాదు, బూమరాంగ్ గోపాల్ వర్మలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే, నిన్న మొన్నటి వరకూ చెట్టపట్టాల్ వేసుకున్న పార్టీతోనే ఇప్పుడు సున్నం పెట్టుకొని సిరీస్ ఆఫ్ ట్వీట్స్ పెడుతూ ఫైట్ చేస్తున్నాడు. 2019 ఎన్నికల ముందు బహుముఖ వ్యూహంలో భాగంగా, వీలైనంత ఎక్కువ మందిని వాడేయాలి అనే స్ట్రాటజీలో వర్మ కూడా ఓ భాగం. ఎన్టీఆర్ ఆత్మ కథ అంటూ సినిమా తీయడం, అందులో తండ్రీ కొడుకుల కేరెక్టర్లు పెట్టడం, ఆ సినిమా ఫైనాన్స్ అంతా ఓ పొలిటికల్ పార్టీనే చేయడం, ఆ పార్టీ నేతలతో ఓ హోటల్లో సమావేశం అయిన వీడియాలో మీడియాలో రావడం అన్నీ అందులో భాగమే. అంత అటాచ్ మెంట్ ఉన్న వర్మ ఇప్పుడు సడెన్ గా రివర్స్ గేర్ వేయడానికి కారణం ఏంటి ? ఉంది. ట్రెండ్ అంటారు దీన్ని సినిమా వాళ్లు. వర్మ టచ్ చేసే కాన్ టెంపరరీ పాయింట్లలో కామన్ ఫార్ములా ఈ ట్రెండే. ఏది ట్రెండ్ అయితే అది పట్టుకోవడమే వర్మ స్టైల్. సినిమా టిక్కెట్ల విషయంలో మాట్లాడేందుకు టాలీవుడ్ లో ఎవరికీ థైర్యం సరిపోని సమయంలో నేరుగా రంగంలోకి దిగి సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తున్నాడు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ జనంలో బాగా పాపులర్ అయ్యింది. ట్రెండింగ్ ఆల్రెడీ.
My answers to the A P government’s honourable cinematography minister @perni_nani gaarus questions https://t.co/xwPXvOiuQ4
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
నిజానికి ఓ రాష్ట్ర ప్రభుత్వ స్థాయితో పోల్చి చూస్తే సినిమా అనేది ఓ చిన్న వ్యాపారం. అందులోనూ రీజినల్ సినిమాలో ఏడాది మొత్తం తిప్పికొట్టినా సగటున గట్టిగా వెయ్యి, పదిహేను వందల కోట్ల వ్యాపారం కూడా జరగదు. అంటే ఆ వ్యాపారం మీద వచ్చే పది పదిహేను పర్సెంట్ టాక్స్ రెవిన్యూ కూడా పెద్ద ఎక్కువేం కాదు. ఇంకోమాటలో చెప్పాలంటే, సినిమా వ్యాపారం చిన్న కరెంటు బల్బు లాంటిది. పట్టుకుంటే పిడికెడు ఉంటుంది. ఎఫెక్ట్ మాత్రం కనుచూపు మేరలో ఉంటుంది. అలాంటిదాన్ని పట్టుకోవడం కన్నా ఎక్కడ ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకుంటే వెలుగొస్తుంది. అలా వెలిగేదాన్ని తెచ్చి నెత్తిన కొట్టుకుంటే ఏమొస్తుంది ? ఏం రాకపోగా, పెంకులు ఒళ్లంతా దిగుతాయ్. రేట్లు తగ్గించడం వల్ల జనానికి పెద్దగా ఒరిగేది ఏం ఉండదు. సినిమా టిక్కెట్ కొనడం కోసం ఆస్తులు తాకట్టు పెట్టినవాళ్లు ఎవరూ లేరు ఇప్పటి వరకూ ఏపీలో ! సినిమా చూడలేక అప్పుల పాలైన వాళ్లూ కనిపించరు. అలాంటప్పుడు టిక్కెట్ రేటు తగ్గించడం ఎంత గొప్ప మేలు అవుతుంది ? తగ్గించడం వల్ల సినిమాలకు ఆదాయం తగ్గి, పన్నుగా ప్రభుత్వానికి వచ్చే వాటా కూడా తగ్గుతుందే తప్ప అంతకు మించి ఇందులో మరో ఇంపాక్ట్ ఏం కనిపించదు ఎంత వెదికినా ! ఇప్పుడు అసలు పాయింట్ కూడా ఇదే. వర్మ అడుగుతున్నది ఇదే మాట.
జనం ఆల్రెడీ నిప్పుల మీద నడుస్తున్నప్పుడు వీలైతే వాటిని ఆర్పాలి. మరిన్ని నిప్పులు కాళ్ల కింద పడకుండా, మండకుండా చూడాలి. అంతే కానీ నిప్పుల మీద నడిచి కష్టపడుతున్నారు కాబట్టి, జనానికి ఉపశమనం ఇవ్వడం కోసం పైన ఫ్యాన్ తిప్పుతాం అనకూడదు. ఆ లాజిక్ అతకదు. అసలే కాలి కాలి ఉన్నవాళ్లకి చిర్రెత్తుకొస్తుంది. వర్మ ఇదే మాట అడుగుతున్నాడు. రోజూ తినే పప్పు ఉప్పురేట్లన్నీ అలా పెరిగిపోతుంటే చూస్తూరుకొని, నెలకో రెండు నెలలకో చూసే సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించడం ఎక్కడ ఎకనామిక్స్ అని అడుగుతున్నది అందుకే. విపక్షాలు కాదు, వాళ్లని సపోర్టు చేసే మీడియా కాదు, జనం అంత కన్నా కాదు. ప్రతీ విషయంలోనూ ఏది లాభమో లెక్క చూసే వర్మ కూడా రంగంలోకి దిగాడు అంటే అర్థం ఒక్కటే – ఆ పార్టీకి ఇంతకాలం సమర్థించిన వాళ్ల లిస్టులోంచి మరో పేరు తగ్గింది. వ్యతిరేకుల జాబితాలో మరో పేరు యాడ్ అయ్యిందన్నమాట. బహుశా చాలా మసాలా దొరికేసినట్టు ఉంది వర్మకి. ఇదే ఊపులో రాజ-కాజ-ఐటమ్ రాజ లాంటి సినిమా ఏదైనా ప్రకటిస్తాడేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ లో ఇలాంటివి ఏం వచ్చినా జనం నెత్తిన పెట్టుకొని హిట్ చేసేట్టు ఉంది పరిస్థితి. ఆ సంగతి వర్మకి ఇంకా బాగా అర్థం అవుతుంది. బహుశా అలాంటి ఆలోచనతోనే ఇలా రంగంలోకి దిగాడేమో కూడా ! తొందర్లో తనే ప్రకటిస్తాడేమో చూద్దాం.
ఇక ఈ పంచాయతీ ఎందుకు పుట్టిందో చూద్దాం. సినిమా అనేది పాపులర్ సబ్జెక్ట్. పైగా సినిమా వాళ్లంటే ఎంత ఆకర్షణ ఉంటుందో, వాళ్ల సంపాదన మీద, జీవితాల మీద చాలా మందికి అంతే కడుపు మంట కూడా ఉంటుంది. జెలసీ. తేరగా కోట్లకి కోట్లు కొట్టేస్తున్నారనుకుంటారు కొందరు. ఇప్పుడు ఇదే సైకాలజీ మీద బేస్ అయ్యి నడుస్తున్న గేమ్ ఇది. సినిమా టిక్కెట్లు రేట్లు తగ్గిస్తే పేదలకి లాభం. ఏం వాళ్లు తీసుకునే పారితోషికం తగ్గించుకోవచ్చు కదా అంటూ రివర్స్ ఫిటింగ్ వాదనలు అందుకే. కాకపోతే వాస్తవం వేరు. సినిమా అనేది బ్రాండ్, అప్పీరియెన్స్ , పాపులారిటీ, పర్సనాలిటీ అన్నీ కలిస్తే నడిచే షో. దొంగ ఇసక వ్యాపారం చేయడం ఎంత కష్టమో, పచ్చి లిక్కర్ పిచ్చి పిచ్చిగా అమ్మడం ఎంత కష్టమో – అంతకంటే ఎక్కువ కష్టం ఈ సినిమాలో ఉంటుంది. ఎందుకంటే ఇది స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీ. వాళ్లకి అంత టాలెంట్ లేదు, అంత అక్కర్లేదు అనుకున్నప్పుడు పారితోషికం ఇచ్చేవాళ్లే తగ్గిస్తారు. అలా తగ్గించడం లేదు అంటే ఆక్షేపించే హక్కు ఎవరికీ లేదు అని అర్థం. ఆ సంగతి తెలియక కాదు. మిగతా విషయాలన్నీ పక్కకు పోయి, అందరూ సినిమాల గురించే మాట్లాడుకోవాలని – తాము మాత్రం పేదలకి మేలు చేసేందుకు రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంటే కొందరి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రజారంజకులుగా వెలగాలన్నది ఎత్తుగడ.