ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థను అంబానీయో, అదానీయో కొంటే దేశాన్ని దొబ్బేశారు, దెబ్బేశారు అని తిడతారు జనం. అదే ప్రభత్వ రంగ సంస్థను టాటా కొంటే దేశాన్ని నిలబెట్టారు, కాపాడారు అని కితాబులిస్తారు. దటీజ్ టాటా. క్రెడిబిలిటీ అంటే, విశ్వాసం అంటే అదీ ! ఎయిరిండియా టాటా చేతికి వెళుతోంది అనగానే పుట్టింటికి చేరుతున్నట్టు లెక్క, దేశం పరువు నిలబడుతుంది అనడంలో ఉద్దేశం అదే. అలాంటి టాటా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ? టాటాకి దగ్గరగా ఉండేవాళ్లు ఎవరు ? టాటా ఆసక్తులు ఎలా ఉంటాయని చూస్తే ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. నాయుడు చెప్పింది టాటా చేస్తారు – అంటూ గ్రూప్ మొత్తం మాట్లాడుతోంది. ఎందుకో తెలుసా ?
తరం తరం నిరంతరం అంటారే అలాగ, టాటాలలో తరం మారినా నిబద్ధత విషయంలో వాళ్ల ప్రయారిటీ మాత్రం మారలేదు. ఎంత్రప్రెన్యూర్ షిప్ లో అయినా, భవిష్యత్ ని అంచనా వేయడంలో అయినా, యువతను ఎంకరేజ్ చేయడంలో అయినా టాటాస్ ఓ బెంచ్ మార్క్. రతన్ టాటా రీసెంట్ గా 84వ ఏట అడుగు పెట్టారు. పెద్దగా హడావుడి లేదు. పార్టీయింగ్, ఉత్సవాలూ ఆయనకి నచ్చవ్. కారవాన్ లో పాట మోగుతోంది. నిండా పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రాడు సరదాగా హమ్ చేస్తూ కేక్ తినిపించాడు రతన్ కి. కేక్ అంటే అది కూడా కప్ కేక్. పెద్దది కాదు. ఇంతకీ ఎవరా కుర్రాడు – అని ఆరా తీస్తే తెలిసింది. అతని పేరు శంతను నాయుడు. టాటాలో తరతరాలుగా ఉద్యోగాలు చేస్తున్న కుటుంబం నుంచి వచ్చాడు. ఇతను ఐదో జనరేషన్. ఇంజనీరింగ్ ప్లస్ ఎంబీయే గ్రాడ్యుయేట్. పారిశ్రామిక రంగంలో అపారమైన ఆసక్తి ఉన్నోడు. అవకాశాల్ని పసిగట్టే ఒడుపు గలోడు. రేపటి మీద స్పష్టమైన ఆలోచనలు చెప్తాడు. అందుకే రతన్ కి నచ్చాడు.
శంతను నాయుడిది పుదుకుట్టై. అప్పటి మద్రాస్ రాష్ట్రంలో తెలుగు మూలాలున్న కుటుంబం. మావాడు ఎంబీయే చేస్తున్నాడు అని – తండ్రి తీసుకొచ్చి రతన్ కి పరిచయం చేశాడు ఐదేళ్ల నాడు. రతన్ ఓ పావుగంట సేపు అతనితో మాట్లాడారు. స్టార్టప్స్ మీద తనకి ఇంట్రెస్ట్ ఉందని, మీ లాంటి వాళ్లు సపోర్టు చేస్తే దేశంలో అద్భుతాలు జరుగుతాయని అతను చెప్పాడు రతన్ కి. నచ్చి ఉద్యోగంలోకి రమ్మన్నాడు. టాటా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలో కీలక బాధ్యతలిచ్చారు. ఇప్పటికే నాలుగేళ్లు దాటింది. వచ్చిన ప్రతీ అవకాశాన్నీ అతను అంది పుచ్చుకోవడం చూసి రతన్ కూడా ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. తన సొంత డబ్బుల్ని అతను చెప్పిన స్టార్టప్పుల్లో ఇన్వెస్ట్ చేయడం అలవాటు అయ్యింది. ఆ రిటర్నులు చూసి ఆశ్చర్యపోయారు. ఇలాంటి కుర్రాళ్లే ఈ దేశ ఫ్యూచర్ అంటూ అతనితో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు టాటా.
కొందరి ముద్ర ఇలాగే ఉంటుంది. పని చేసినంత కాలం సంస్థ కోసం, సిబ్బంది కోసం, భవిష్యత్ కోసం ప్రాణం పెడతారు. బాధ్యతల నుంచి విరమించుకున్నా – లక్ష్యం వదులుకోరు. దేశాన్ని గొప్పగా చూడాలని, మరింత మందికి చేరువ కావాలని, వ్యవస్థను నిర్మించాలని తపన పడతారు. పునాదులు వేసే వాళ్లకి సలహాలు ఇస్తారు. నిర్మించే వాడికి ఇటుకలు అందిస్తారు. కదలకుండా పడి ఉన్నవాడికి కూడా, కలలు కను సాకారం చేసుకో అని స్ఫూర్తిని ఇస్తారు. అందుకే ఈ దేశం టాటాలో ఓ నమ్మకాన్ని చూస్తుంది. టాటాలంటేనే భరోసా అని నమ్ముతుంది. వాళ్లు ఉన్న రంగం ఏదైనా దేశంలో ఉజ్వలంగా ఉండటాన్ని ఆస్వాదిస్తుంది. అయినా, ఏదైనా సాధించడం అంటే సంపాదించడం కాదు. కూడబెట్టడం, ఫోర్బ్స్ లిస్టులోకెక్కడం అంతకన్నా కాదు. నిర్మించడం, నిర్మించే నైపుణ్యాన్ని అందించడం, రేపటిని నిలబెట్టే పిల్లర్లకు అండగా నిలవడం. అందుకే శంతను లాంటి మిల్లీనియల్స్ లో కొత్త ఉదయాన్ని చూడటం రతన్ టాటాకు సాధ్యమైంది.