నేషనల్ హైవే మీద రెండు లారీలు వెళుతున్నాయ్. ఒక దాన్ని దాటించేందుకు మరొకటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. వాడూ ముందుకు పోడు. వీడూ వెనక్కి తగ్గను అన్నట్టే ఉంటాడు. చూడ్డానికి ఇది పోటా పోటీలా కనిపించవచ్చు. కానీ వెనకున్న వాహనానికి దారి దొరక్కపోవడం, మందుకు వెళ్లేందుకు మార్గం కనిపించక పోవడం అనే కోణం కూడా ఇందులో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు ఈ వెనకబడ్డ వాహనంలాగే ఉంది. మరి ముందు రెండు లారీలూ ఒకరిని ఒకరు దాటుకునేందుకు వెళుతున్నారో, కూడబలుక్కొని అలా రోడ్డును బ్లాక్ చేసి నింపాదిగా నడుపుతున్నారో అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. ఇలాంటప్పుడు వెనకున్న వాహనం ముందుకు రావాలంటే ఏం చేయాలి ? రేవంత్ స్టీరింగ్ పట్టుకుంటే దూకుడే అనుకున్నవాళ్లంతా ఇప్పుడు ఏ మూడ్ లో ఉన్నారు ?
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతీ సారీ రాష్ట్రంలో కాంగ్రెస్ జూలు విదిల్చింది. గత పాతికేళ్ల వాస్తవం ఇది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మీద ఢిల్లీ ఊపు గట్టిగా పని చేసింది. అలాంటిది ఇప్పుడు ఢిల్లీలో ఊపు కాదు కదా కనీసం కదలిక కూడా కనిపించడం లేదు. అలాంటప్పుడు రాష్ట్రాల్లో లేచి నిలబడాలంటే బలమైన నాయకత్వం, ఎనలేని దూకుడు, అవకాశాల్ని వాటంగా పట్టేసే నేర్పు ఉండాలి. ఛత్తీస్ గఢ్ లాంటి చోట్ల కనిపించింది ఇదే. అలాంటి మెరుపు పక్కనున్న తెలంగాణలో కూడా కనిపిస్తుందేమో అనే ఆశ రేవంత్ రాకతో కలిగింది కొందరిలో ! టీఆర్ఎస్ కు ఆల్టర్ నేటివ్ రావాలన్న కోరిక కొందరిది అయితే, రేవంత్ మీద అభిమానం ఇంకొందరికి. రేవంత్ పగ్గాలు అందుకున్న కొత్తలో అంతా ఉత్సాహం, ఉత్సవం కనిపించాయ్. హుజురాబాద్ ఎన్నిక తర్వాత బొమ్మ తిరగబడింది. ఒకటి కాదు రెండు మూడు దెబ్బలు అమాంతం పడ్డాయ్. మరి రేవంత్ అర్థం చేకోవడంలో వెనక పడ్డాడా ? లేదంటే కేసీఆర్ కెపాసిటీ ఇంత పని చేస్తోందో చూద్దాం.
హుజారాబాద్ ఎన్నిక కాంగ్రెస్ కి మూడు నాలుగు కోణాల్లో దెబ్బ కొట్టింది. మొదటిది కౌశిక్ రెడ్డి జంప్. గత ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపిన కౌశిక్ ఉన్నడు, మనకేంటి అనుకున్న కాంగ్రెస్ కి కేసీఆర్ విసిరిన సవాల్ మైండ్ బ్లాంక్ చేసింది. డేగొచ్చి పిల్లనెత్తుకుపోతే, నేల మీద చూస్తుండిపోయిన కోడిలా కనిపించింది కాంగ్రెస్. అంటే నీ దగ్గర అభ్యర్థి ఉన్నా గేమ్ నేను ఆడగలను బిడ్డో అని చూపించాడు కేసీఆర్. ఆ తర్వాత ఈటెల వైపు మొగ్గి, ఆ గెలుపులో తన హస్తం కూడా వేసింది కాంగ్రెస్. ఓట్లు చీలకుండా వ్యూహం. సరే. ఆ తర్వాత ఈటెల రైజ్ చూస్తాం అనుకుంటే అలా జరగలేదు. రైస్ గైమ్ తెచ్చాడు కేసీఆర్. అదే వరి. కేంద్రం మీద బహుశా పదో సారో పన్నెండోసారో యుద్ధం ప్రకటించి – బీజేపీని తట్టి లేపి హడావుడి అంతా అటు వైపు మళ్లించేశాడు. ఇది రెండు. ఇక ఇదే అదునుగా కాంగ్రెస్ లో పెన్నులకి పని పెట్టి, లేఖలు రాయడం మొదలైంది. అసలు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎలా దూకుడు పెంచాలన్న పగ్గాలు కేసీఆర్ దొరకబుచ్చుకునే సరికి కాంగ్రెస్ ఇక ఆ లెక్క ఫాలో కాక తప్పలేదు. అంటే తనకి బలం అనుకున్న విషయాల్ని వదిలేసి ప్రత్యర్థి మిగిల్చిన దారిలో నడవడం మొదలైంది అక్కడే. గత రెండు ఉప ఎన్నికల్లో అభ్యర్థుల చలవతో గెలిచిన బీజేపీకి ఇప్పుడు ఫోకస్ లో ఉండటం అన్నది నిజానికి బోనస్. ఇక్కడ సవాల్ విసిరి, ఢిల్లీ వెళ్లి అక్కడ పెద్దలు అందరినీ కేసీఆర్ కలిసి రావడం కళ్ల ముందే కనిపిస్తున్నా – ఆ విషయాన్ని జనానికి కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోవడం కాంగ్రెస్ మైనస్. రాజకీయంగా ఆలోచిస్తే ఇది వాస్తవం. అలా ఢిల్లీలో కలవడం వెనక లెక్కేంటి అనేది తర్వాత చూద్దాం.
బంతి టీఆర్ఎస్ – బీజేపీ మధ్యనే ఉండిపోతే మరి కాంగ్రెస్ ఆడేదెప్పుడు ? గెలిచేదెప్పుడు ? ఆట మనది అనుకున్నప్పుడు ఆడిందే ఆటగా సాగుతుంది. అలా కాదు, ప్రత్యర్థిదే పైచేయి అవుతోంది అనుకున్నప్పుడు ఆట రూల్స్ మార్చాలి ముందు. ప్రత్యర్థి ఎత్తు నుంచి ఎటాక్ చేస్తున్నప్పుడు నేలకి దించాలి. నేల మీద బలంగా పాతుకున్నప్పుడు గాల్లోకి మార్చాలి. ఇదే రేవంత్ చేయలేకపోతున్నాడు ఇప్పుటి వరకూ. వరి అయిపోతోంది. జనవరి వచ్చేసింది. గట్టిగా మరో 12 నెలలు మాత్రమే ఉన్నాయ్ చేతిలో. ఆ తర్వాత అంతా హడావుడే ఉంటుంది. ఇలాంటప్పుడు స్పష్టమైన అజెండాతో ప్రస్తుత గందరగోళాన్ని చీల్చుకుంటూ రావడం ఎలా అన్నది ఆలోచించాలి. ఎంత సేపూ ధర్నాలూ, అరెస్టులేనా ? అసలు తెలంగాణలో జరగాల్సింది ఏమిటి ? జరుగుతున్నదేంటి ? జనంలో గూడు కట్టుకున్న అభిప్రాయాలేంటి ? ఫ్లైఓవర్ ఓపెనింగులే కనిపిస్తున్నాయ్ మరి తెలంగాణ భూముల్లో పాగా వేస్తున్నదెవరు ? ఆంధ్రా దోపిడీ పేరు చెప్పి జెండా పాతిన పార్టీ హయాంలో పెత్తనం చెలాయిస్తున్నదెవరు ? లాంటి పాయింట్లు పట్టుకోవడం, పవర్ పాయింట్ లాంటి ప్రజంటేషన్ అందుకోవడం లాంటివి రేవంత్ ఎందుకు చేయడో అర్థం కాదు. దగ్గర నుంచి చూసేవాళ్లు చెబుతున్నట్టు, సొంత అజెండా, పర్సనల్ టార్గెట్ గా గానీ వెళుతున్నాడా ?
కాంగ్రెస్ లో సహజంగా ఉంటే వ్యతిరేకత, తోటి నాయకులు కలిసి రాకపోవడం కూడా ఓ కారణం కావొచ్చు. రారు. అలా రారు కాబట్టే ఆ పార్టీని కాంగ్రెస్ అంటారు. అది ఓపెన్ సీక్రెట్. అలాంటప్పుడు నీకంటూ వెంట ఉండే సొంత బలగాన్ని తయారు చేసుకోవాలి. నీ మీద సొంత పార్టీలో వినిపించే వ్యతిరేక గొంతులకి సమాధానం వాళ్లతో చెప్పించాలి. నువ్ జనాన్ని మెప్పించాలి. ఫోకస్ నీ మీద ఉండేలా చూసుకోవాలి. గుమ్మం దాటకముందే హౌస్ అరెస్టుల దగ్గరే ఆగిపోతే ఇక కదిలేది ఎప్పుడు ? రాజకీయం రగిలేదెప్పుడు ? మీడియా మద్దతు లేకపోవడం, మీడియా అధినేతల్లో తన వైపు ఉంటారు అనుకున్న వాళ్లు నిఖార్సైన పొద్దు తిరుగుడు పువ్వులే అని తెలిసినా ఆల్టర్ నేటివ్ ఆలోచన చేయకపోవడం, లేదంటే చేయలేకపోవడం, మండల – గ్రామస్థాయిల వరకూ కనెక్ట్ అయ్యే వ్యవస్థను, సోషల్ ఫ్లాట్ ఫామ్ మీద నిర్మించుకోక పోవడం, అన్నటికీ మించి అందరికన్నా నాకే ఎక్కువ తెలుసు అనే అభిప్రాయంలో ఉండిపోవడం లాంటి కారణాలు వెదికిన కొద్దీ కనిపిస్తుంటాయ్ అంటారు దగ్గరి వాళ్లు. మరి వీటన్నిటినీ దాటి అడుగు వేసేదెప్పుడో చూడాలి.
అలా ఏం లేదు, జనంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. ఎన్నికలు వచ్చినప్పుడు బయటపడుతుంది. బేజేపీ – టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న గేమ్ ఇది అని తెలుసు వాళ్లకి అని కొందరు సర్దిచెప్పుకోవడం కనిపిస్తోంది. పాయింటే. జనానికి ఏం తెలుసు, ఎంత అర్థమైంది అనే దానికన్నా – ఎలా చెప్పి మెప్పిస్తున్నాం, ఏం చెప్పి ఒప్పించాం అన్నదే పాయింటు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కి బొటాబొటిగా ఉంది పరిస్థితి అనుకున్న సమయంలో కేసీఆర్ గేర్ మార్చింది, గేమ్ గెలిచింది ఇలాగే ! ఎక్కడో ఉన్న చంద్రబాబును చూపించి ఇక్కడ ఫలితం మార్చేశాడు. ఎంత మంది పోటీలో ఉన్నా, పోటీదార్లను నెట్టుకుంటూ, దాటుకుంటూ ముందుకు రావడమే ఛాంపియన్ లక్షణం.
చివరిగా ఒక్క మాట. మొన్నీమధ్య తిరుమలలో చూసిన యదార్థం ఇది. నేను రేవంత్ ని మించిన లీడర్ ను, తెలంగాణకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకునే ఓ నాయకుడు కుటుంబ సమేతంగా కొండ మీద ఉన్నాడు. దుకాణాలు తిరుగుతున్నాడు. అదే వరసలో షాపు దగ్గర టీ తాగుతున్నాడు. గన్ మెన్, హడావుడి అంతా ఉంది. వెహికిల్ హంగామా చూస్తే అర్థం అవుతోంది. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. నేను చూస్తున్నంత సేపూ కనీసం ఒక్కడు కూడా పలకరించిన పాపాన పోలేదు – అని ఓ మిత్రుడి అబ్జర్వేషన్. అదే రేవంత్ అయ్యుంటే జనం గుమిగూడి కోలాహలం అయిపోయేది అన్నాడు. మరి అలాంటి వాళ్లు కూడా తనకి స్పీడు బ్రేకర్లు పెట్టే పరిస్థితి ఉందంటే అది వాళ్ల బలమో, లేదంటే తన బలహీనతల ప్రభావమో రేవంత్ తేల్చుకోవాలె !