37 C
Vijayawada
Friday, April 12, 2024
Homeరాజ నీతిఏపీ రాజకీయాల్లో సుజనా కింగ్ మేకర్ అవుతారా ?

ఏపీ రాజకీయాల్లో సుజనా కింగ్ మేకర్ అవుతారా ?

ఏపీ బీజేపీ నాయకత్వానికి అమిత్ షా తిరుపతిలో రేవు పెట్టి ఉతికి ఆరేశారు అనే వార్త పత్రికల్లో వచ్చాక పబ్లిక్ రియాక్షన్ చూడాలి ! ఏపీలో బీజేపీకి బలం లేకపోయి ఉండొచ్చు కానీ ప్రజల్లో ఆ పార్టీ మీద ఆగ్రహం మాత్రం కుప్పలు తెప్పలుగా ఉంది అని ఆ కామెంట్లు చూస్తే ఇంకోసారి అర్థం అయిపోతుంది. చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేసి బీజేపీని అలా నెగెటివ్ చేశాడు అని అనుకొని సరిపెట్టుకోలేం. బీజేపీ స్వయంకృతాలు చాలానే ఉన్నాయ్. ఏపీకి ఏమీ చేయకపోవడం, చేసినా చెప్పుకోలేకపోవడం, వైసీపీకి వంత పాడటం, పింక్ డైమండ్ లాంటి పిట్టకథలకు చిడతలు వాయించడం ఇలా చాలా పురాణం ఉంది. పైగా వంద సానుకూలమైన పనులు చేసినా పాజిటివ్ రాదేమో కానీ జీవీఎల్, దేవధర్ లాంటి వాళ్లు ఒక్క మాట మాట్లాడితే చాలు ఎక్కడలేని నెగెటివిటీ ఆ పార్టీకి వచ్చేస్తుంది. మరి ఇలాంటి పార్టీకి ఇప్పుడు రిపేర్లు సాధ్యమా ? సుజనా ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా ? అమిత్ షా అంత వీర ఉతుకుడు ఉతకడానికి ముందు గంట సేపు సుజనా చౌదరితో సమావేశం కావడాన్ని బిట్వీన్ ద లైన్స్ లో చూద్దాం. అప్పటికే ఉన్న ఫీడ్ బ్యాక్ పైనే షా… సుజనాతో మాట్లాడారన్నది మౌన సాక్షుల మాట. పైపెచ్చు పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లని మనం సీఎంలను చేస్తున్నాం, పార్టీ గౌరవిస్తోంది, ప్రాధాన్యం ఇస్తోంది అని అమిత్ షా అదే వేదిక మీద అనడం ఇక్కడ ఇంపార్టెంట్. ఇంతకీ సుజనా కింగ్ మేకర్ అవుతారా ? కాగలరా ?

ఏపీలో లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి ? పాదయాత్రలు చేయాలా ? కొట్లాటలకి నాయకత్వం వహించాలా ? నేనే విక్టిమ్ ను అని ముద్ర వేయించుకొని, పోరాడుతున్నాను అనే ప్రచారం సాగించి, మైలేజ్ పొందాలా ? ఇవన్నీ యూజ్డ్ టెక్నిక్స్. పైగా ఏపీ ఇప్పుడు గాయపడింది. డీలా పడుంది. అప్పుల ఊబిలో, బతుకుల గతుకుల్లో ఉంది. ఇలాంటప్పుడు ఒడ్డున పడేసే నాథుడు అనే ముద్ర ఉంటే సరిపోతుంది. అలాంటి నాథుడు అవ్వాలీ అంటే ఆలోచన ఉన్నవాడై ఉండాలి. ఏపీ సమస్యలకి పరిష్కారాలు తెలిసిన వాడై ఉండాలి. సమస్యలు తీర్చి, చేతల్లో చూపించే వాడైతే సరిపోతుంది. ప్రాంతాలూ కులాలూ భావజాలాలూ అన్నీ ఆ తర్వాతే ! ఓ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రబలంగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేక రాజకీయ భావజాలం నుంచి వచ్చి… మేధావులు, చదువుకున్నవాళ్లు, మధ్య తరగతి ఎగువ మధ్యతరగతిని ప్రభావితం చేసే నాయకత్వం ఉంటే సరిపోతుంది. అంటే బీహార్ లో జేడీయూ లా !

జేడీయూలా అని ఎందుకు అనడం అంటే, ఎంపీగా వరసగా ఢిల్లీ వెళ్లి కేంద్రంలో పట్టున్న నాయకుడిగా నితీశ్ కి పేరు. పెద్ద మాస్ లీడర్ కానేకాదు. మాటకారితనం కన్నా చేతల్లో చూపించే నైజం ఎక్కువ. ఆలోచనాపరుడుగా పేరు. నిజాయితీ ఉన్నోడుగా ముద్ర. అందుకే ఊరమాస్ లాలూని అంత క్లినికల్ గా ఫేస్ చేస్తున్నాడు నితీశ్. ఏపీలో ఆల్రెడీ చంద్రబాబు ఉన్నాడు కదా అనే చర్చ ఇక్కడ రావొచ్చు. బాబు పనితనాన్ని లెక్కగట్టే ప్రయత్నం ఇప్పుడొద్దు కానీ, జనం మైండ్ సెట్ కి అర్థం అయ్యే ఈక్వేషన్ ఎలాంటిదో చూద్దాం. తెలిసిపోద్ది. చంద్రబాబును ఆల్రెడీ విభజిత ఏపీ చూసేసింది. ఐదేళ్ల తర్వాత మరో ఐదేళ్లలో దాదాపు మూడేళ్లు ఇప్పుడు కావొస్తున్నాయ్. బాబు చేసిన వ్యూహాలు తెలుసు. బాబు మిగిల్చిన రాజధాని, పోలవరం లాంటివి ఇప్పటికీ ఏపీకి సవాళ్లే ! వాటిని పరిష్కరించడం, సాధించడం మాటలు కాదు. ఢిల్లీ నుంచి పని చేయించుకునే నైపుణ్యం, ఒడుపు కావాలి. అన్నిటికీ మించి అక్కడ సంబంధాలూ, సానుకూల దృక్పథం ఉన్న నాయకుడికి ఏపీలో అవకాశం ఎందుకు ఉండకూడదు ? ఇదే పాయింట్.

ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కేంద్రంలో బేజేపీని కాదని కొత్త రంగులు ఊహించుకునే రోజులు ఇప్పటికైతే లేవు. మరో రెండేళ్లలో మార్పు రాకపోనూవచ్చు. మెజారిటీ తగ్గినా మళ్లీ అతి పెద్ద పార్టీ కమలమే అయితే పరిస్థితి ఏంటి ? నల్లచొక్కాల దీక్షలు కళ్ల ముందు కదులుతుండగా అదే బీజేపీతో పనులు సాధించుకోవడం సాధ్యమా ? ఆలోచించాల్సిన పాయింటే ! ఇదే సుజనా చౌదరికి తొలి అడ్వాంటేజ్ అయినా కావొచ్చు. ఇక ఏపీకి ప్రధాన సవాళ్లు అని చెబుతున్నవి, ఏపీని ఆర్థికంగా నిలబెట్టి భవిష్యత్ వైపు నడిపించే ఇరుసులు అంటున్నవీ కొన్ని ఉన్నాయ్. రాజధాని, పెట్రో కారిడార్, పోలవరం, విశాఖ ఉక్కు ఇలా… ఆ లిస్టు పెద్దదే. వీటన్నిటిపైనా ఓ రోడ్ మ్యాప్ తో వచ్చి జనాన్ని మెప్పించడం ఇప్పుడు గేమ్ ఛేంజర్ కావొచ్చు ఏపీ రాజకీయాల్లో ! కొట్టుడు, తిట్టుడు, ఎవరు ఎవరికి పుట్టారనే జుగుప్సాకర వాగుడుతో ఏపీ రాజకీయం రోతెక్కిపోతోంది. ఇలాంటి సమయంలో ఆలోచనలతో, పని తీరుతో అన్నటికీ మించి రిజల్టు చూపిస్తూ వచ్చేవాడే మొనగాడు. కేంద్రంలో మరో రెండేళ్లు ఇవే సమీకరణలు ఉంటాయ్. ఇదే హోం మంత్రి, ఇదే ప్రభుత్వం నడుస్తుంది. ఇలాంటప్పుడు అడుగు ముందుకేసి ఏపీకి అనుకూలమైన విధానాలతోపాటు నిధుల దిశగా కూడా అడుగులు వేయగల్గితే సుజనా అవకాశాలు అపారం అవుతాయ్.

అంటే ఏపీలో బీజేపీ గెలిచేస్తుందనో, తలకిందులయ్యే రిజల్టు వస్తుందనో వన్ సైడెడ్ గా ఊహించక్కర్లేదు. బీజేపీ చుట్టూ నడిచే రాజకీయం సాధ్యమే అని చెప్పడం వాస్తవదూరం కాదు. అందుకే సుజనా కింగ్ అనో కింగ్ మేకర్ అనో అంటున్నది అందుకే ! జేడీయూతో పోల్చి చెప్పడానికి కారణమూ అదే ! మరోమాట. ఎవరి స్థాయి ఏంటో తెలియడానికి కొన్ని చెప్పితీరాలి. అమిత్ షాతో మాట్లాడేప్పుడు, కారణం ఏదైనా చాలా మందికి కాన్ఫిడెన్స్ తక్కువ. కఠినంగా ఉంటాడనో లేదంటే సాయం అడిగే పరిస్థితుల్లో ఉన్నామనో ఒంగి ఒంగి మాట్లాడ్డమే కనిపిస్తుంది చాలాసార్లు. అలాంటిది అమిత్ భాయ్, ఏ సహీ హై, ఏ సహీ నహీ హై అని సాధికారికంగా చెప్పగల్గిన ఏకైక తెలుగు నాయకుడు సుజనా ఒక్కడే. యు కెన్ చెక్ ఇట్. ఇదొక్కటి చాలదూ సుజనా రంగంలోకి దిగితే పరిస్థితులు మారే అవకాశాలు ఉండొచ్చు, ఉంటాయ్ అని చెప్పడానికి ! బీజేపీలో తిరుపతి తుఫాన్ తర్వాత ఇలాంటి చర్చే నడుస్తోంది ఏపీ రాజకీయాల్లో ! నవంబర్, డిసెంబర్ అంటేనే మూడొంతుల ఏపీకి తుఫాన్లు వచ్చే సీజన్, అలాగే ఉంటుంది అంటారా, చూద్దాం !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments