28 C
Vijayawada
Sunday, September 6, 2026
Homeతెలంగాణరేవంత్ రెడ్డి ‘పవర్’ చూసి దారికొచ్చిన అసమ్మతి.. నార్కట్‌పల్లిలో కోమటిరెడ్డి మర్యాదల వెనుక అసలు కథ..!

రేవంత్ రెడ్డి ‘పవర్’ చూసి దారికొచ్చిన అసమ్మతి.. నార్కట్‌పల్లిలో కోమటిరెడ్డి మర్యాదల వెనుక అసలు కథ..!

తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఏంటో తాజాగా జరిగిన కొన్ని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్నటి దాకా రేవంత్ రెడ్డిని కుదురుకోనివ్వకుండా లోపాయికారీగా స్కెచ్‌లు వేసిన అసమ్మతి నేతలు.. ఇప్పుడు ఒక్కొక్కరుగా దారికొస్తున్నారా..? మంత్రి పదవి నుండి కొండా సురేఖను కఠినంగా బర్తరఫ్ చేసిన తర్వాత.. గాంధీ భవన్ సీనియర్లలో వణుకు మొదలైందా..? అవుననే అంటున్నాయి తాజా విజువల్స్. నార్కట్‌పల్లిలో సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా దగ్గరుండి చేసిన మర్యాదలు చూస్తుంటే.. రేవంత్ పలుకుబడి ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అసలు రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్ఠానం, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎందుకు ఇంతగా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు..? గతంలో కాంగ్రెస్ చేసిన తప్పుల నుండి రాహుల్ నేర్చుకున్న పాఠం ఏంటి..? ఓ లుక్ వేద్దాం.

ఢిల్లీ అధిష్ఠానానికి ఒక విషయం చాలా క్లియర్‌గా తెలుసు. తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి మాస్ లీడర్ లేకపోతే.. ఇటు కేసీఆర్-బీఆర్ఎస్ ఆర్మీని, అటు దూసుకుపోతున్న బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదు. రేవంత్ గనుక యాక్టివ్‌గా లేకపోతే, ఈ ముసలి నేతల గ్రూపు రాజకీయాల వల్ల తెలంగాణ కాంగ్రెస్ ‘కుక్కలు చింపిన విస్తరి’ లాగా మారిపోతుంది. గతంలో రోజుకో లీడర్ ఢిల్లీకి వెళ్లి సీఎంపై పంచాయితీలు పెట్టేవారు. కానీ, రాహుల్ గాంధీ వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. రేవంత్ రెడ్డి సత్తా ఏంటో, ఆయనకున్న ప్రజాదరణ ఏంటో తెలుసు కాబట్టే.. అసమ్మతిని కంట్రోల్ చేసే పూర్తి పవర్స్ రేవంత్‌కే ఇచ్చేశారు.

క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా లేపేయొచ్చని సురేఖ బర్తరఫ్ ద్వారా రేవంత్ నిరూపించడంతో.. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వారు కూడా లైన్ లోకి వచ్చి మర్యాదలు చేయక తప్పడం లేదు. అసలు రాహుల్ గాంధీ రేవంత్‌కు ఇంతలా అండగా నిలబడటం వెనుక కాంగ్రెస్ గతంలో అనుభవించిన ఘోరమైన నష్టాలు ఉన్నాయి. గతంలో సోనియా గాంధీ హయాంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడూ ముసలి నేతలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. యువ నేతలను తొక్కుతూ వచ్చారు. మధ్యప్రదేశ్‌లో.. యువనేత జ్యోతిరాదిత్య సింధియాను తొక్కేసి వృద్ధ నేత కమల్ నాథ్‌కు సోనియా గాంధీ సపోర్ట్ ఇచ్చారు.

ఫలితంగా సింధియా బీజేపీలోకి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది, అక్కడ ఎంపీ సీట్లు కూడా పోయాయి. రాజస్థాన్‌లో.. అద్భుతమైన ప్రజాదరణ ఉన్న యువనేత సచిన్ పైలట్‌ను కాదని అశోక్ గెహ్లాట్ కోసం తొక్కేశారు. ఫలితంగా రాజస్థాన్‌ను కాంగ్రెస్ చేజేతులా పోగొట్టుకుంది. మహారాష్ట్రలో.. క్రేజ్ ఉన్న యువనేత మిలింద్ దేవ్ రాను పక్కన పెట్టడంతో ఆయన శివసేన.. షిండే వర్గంలో చేరిపోయారు. అక్కడా కాంగ్రెస్ దెబ్బతింది. నాడు యువనేతలను రాష్ట్రాల్లో అండగా ఉంచి ఉంటే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎప్పుడో బలోపేతం అయ్యేది. కానీ వృద్ధ నేతలను నమ్మి కాంగ్రెస్ సర్వనాశనమైంది.

అయితే, గతంలో జరిగిన ఈ తప్పులను రాహుల్ గాంధీ ఇప్పుడు పూర్తిగా గ్రహించారు. ముసలి నేతల భజన కంటే.. గ్రౌండ్ లెవెల్‌లో ప్రజామద్దతు ఉన్న యువ, డైనమిక్ నాయకత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కేవలం తెలంగాణలోనే కాదు.. కేరళలో కూడా పాత తరాన్ని పక్కన పెట్టి, తిరుగులేని ప్రజామద్దతు ఉన్న వీడీ సతీషన్ కు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చి అక్కడ పార్టీని స్ట్రాంగ్ చేశారు. అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డికి వర్తింపజేస్తున్నారు. అసమ్మతి నేతలు ఢిల్లీకి వెళ్లి ఎన్ని కూతలు కూసినా రాహుల్ గాంధీ అస్సలు పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డికి ఫుల్ హ్యాండ్ ఇవ్వడం వల్లే.. అటు కేబినెట్ లోనూ, ఇటు పార్టీ లోనూ రేవంత్ మార్క్ అథారిటీ స్పష్టంగా కనిపిస్తోంది. సోనియా గాంధీ కాలం నాటి ‘ముసలి రాజకీయం’ కాంగ్రెస్‌ను ఎలా ముంచిందో తెలుసుకున్న రాహుల్ గాంధీ.. ఇప్పుడు రేవంత్ లాంటి పవర్‌ఫుల్ లీడర్లకు అండగా నిలబడి తెలంగాణలో కాంగ్రెస్‌ను కాపాడుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments