28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిటాలీవుడ్ హీరోలు ఏకం కావడానికి కారణం ఎవరు ?

టాలీవుడ్ హీరోలు ఏకం కావడానికి కారణం ఎవరు ?

మాలో మేం తన్నుకునేటప్పుడు అటు వంద – ఇటు ఐదుగురు. అదే ఎదుటోడు మాపైకి యుద్ధానికి వచ్చినప్పుడు మేం మొత్తం 105 అనేది మహాభారతంలో పంచ్ డైలాగ్. కష్టం వచ్చినప్పుడు అలా కలిసిపోవాలన్న మాట. సరిగ్గా టాలీవుడ్ ఇప్పుడు చేస్తున్నది ఇదే. సినిమా ఇండస్ట్రీని వైరస్ లా వెంటాడుతున్నది ఎవరు ? దెబ్బ తీయాలని, గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నది ఎవరు ? చూసీచూడనట్టు పోవాల్సిన సంగతిని కూడా – దారిన పోయే కంప సీటుకు చుట్టుకుంటున్నట్టు నెత్తిన కట్టుకున్నదెవరు ? టాలీవుడ్ ఏం చేస్తోంది ? ఏం చేయాలి అనుకుంటోంది ? ఇన్ సైడ్ టాక్ ఏంటి ?

సినిమా ఇండస్ట్రీ అనేది నిజానికి జీలకర్ర. వేసినా వేయకపోయినా చాలాసార్లు జీలకర్ర తేడా తెలియకుండానే ఉంటుంది. అదే నలిపి వాసన చూస్తే మాత్రం గుప్పమని గుబాళిస్తది. తలనొప్పి తగ్గిస్తది. వాంతులు ఆపుతుంది. టాలీవుడ్ కూడా అంతే. వాళ్లో పక్కన ఉన్నారు పోనీయ్ – అనుకుంటే పెద్ద ఇబ్బంది లేదు. దండం పెడతారు. ఇంటికొచ్చి కలుస్తారు. మనసులో ఏం ఉన్నా, నువ్ దేవుడు సామీ అని డప్పు కొట్టేందుకు రెడీగా ఉంటారు. పైపెచ్చు మనకి కష్టం వచ్చిప్పుడు కావాల్సినంత తిట్టుకోవచ్చు – ఎంటటైన్మెంట్ ఉంటుంది ఆ రకంగా కూడా మనకి. వాళ్లు వచ్చారా సాయం ఇచ్చారా – వాళ్ల అంతు తేలుద్దాం – అనుకుంటే అదో తుత్తి. పాజిటివ్ గా ఆలోచిస్తే వాళ్ల కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఏ విషయంలో అయినా ! ఒక్క వినోదంలో మాత్రమే ఎక్కువ. పైగా జనం మైండ్ సెట్ ని ప్రభావితం చేయడంలో, మూడ్ మార్చడంలో మాత్రమే వాళ్లు ముందు ఉంటారు. పన్నులు, ఇతర పెట్టుబడులు, రాష్ట్రానికి సాయం లాంటి విషయాల్లో పాపం జీలకర్ర జీవితాలే వాళ్లవి. ఆల్రెడీ ఆ విషయం మనం చూస్తున్నాం ఏడేళ్లకిపైగా. ఇన్నాళ్లూ వాళ్లు మనల్ని అయ్యో పాపం అనుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అరెరె పాపం అని మనం అనుకోవాల్సిన పరిస్థితి వాళ్లకి వచ్చేసింది.

ఇప్పుడు వాళ్లనో సుత్తి కొట్టి కొట్టి నేలలోకి దించేస్తోంది. అసలే వసూళ్లు లేక ఛస్తుంటే – అడుక్కునే వాడింటికి గీక్కునేవాడు వచ్చినట్టు అయిపోయింది యవ్వారం. అందుకే ఆ మూల ఈ మూల అదో గ్రూపు ఇదో గ్రూపు అని పడి ఉన్నవాళ్లంతా ఇప్పుడు ఏకం అవుతున్నారు. మనం మనం కలిసి నిలబడకపోతే అసలు నిలబడటమే కష్టం అయిపోతుంది అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు ఆల్రెడీ చేతల్లోకి దిగారు కూడా. ఆ రిజల్ట్ ఇప్పుడు కెమెరాల ముందు కనిపిస్తోంది. ఇక ముందు ముందు రాష్ట్ర పరిస్థితులపై కూడా కనబడుతుంది. నో డౌట్. ఇన్నాళ్లూ ఇన్ని ఇగోలు పెట్టుకొని, ఎవడికి తోచిన చక్రం వాళ్లు తిప్పుకుంటున్న వాళ్లందరినీ ఏకం చేసింది ఒకే ఒక్క విలన్. ఆ విలన్ కి మూడే రోజు ఎంతో దూరంలో లేదు. మా జాగ్రత్తలో మేం ఉంటే – మమ్మల్ని ఇంత రొష్టుపెడతావా, మేమోదో చూసీ చూడనట్టు పోతుంటే ఇంతకు ముందు ఎప్పుడూ కనీవినీ ఎరుగనట్టుగా – కెలికి, నలిపి వాసన చూస్తావా ? – అని ఇక ఎవడికి తోచిన ప్రయత్నం వాడు చేస్తాడు ఫిలిం ఇండస్ట్రీలో. ఆల్రెడీ ఆ మూడ్ వచ్చేసింది. ఎప్పుడూ మనం కూడా సినిమా వాళ్లని అయ్యో పాతం అనుకోం. అలాంటిది వాళ్లని చూసి, వాళ్లున్న పరిస్థితి చూసి జాలిపడే రోజులు వచ్చేశాయ్. కారణం ఒకే ఒక్క విలన్.

ఎస్. ఆ విలన్ – కరోనా. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేయి చేయి తగలకుండా ఉండాలన్నది నిజమే. కానీ కరోనాను తట్టుకోవాలంటే మాత్రం చేయి చేయి కలపక తప్పదని బతక నేర్చిన ఫిలిం ఇండస్ట్రీ తెలుసుకుంది. బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ గెస్టుగా వచ్చాడు. బోయపాటి నెక్ట్స్ సినిమా బన్నీతో చేస్తున్నాడని మాత్రమే కాదు, అంతకు మించిన కథ చాలానే ఉంటుంది. ఎన్టీఆర్ షో చేస్తే మహేశ్ వెళ్లాడు. ఇది కూడా అంతే. ఏ సినిమా ఫంక్షన్ అని పిలిచినా చిరంజీవి వాలిపోతున్నాడు. ఆఖరికి తెలుగు సినిమా ఫంక్షన్ కి అమీర్ ఖాన్ లాంటి వాళ్లు కూడా వస్తున్నారు. తర్వాత కాంబినేషన్ ఏదో ఉంది కాబట్టి అలా వస్తున్నారు అనుకుంటే పొరపాటు. కలిసి కట్టుగా నిలవాలి. గెలవాలి అనే ఆలోచనే దీనికి కారణం. ఆఖరికి అతి చిన్న సినిమాలకు కూడా నాని, గోపీచంద్ లాంటి గుడ్ విల్ ఉన్న హీరోలు వెళ్లి భుజం కాస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో – అందరూ ఏకమై నిలవాలి మనం – అని సినిమా ఇండస్ట్రీ ఇలా కొత్త లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకుంది. బతకనేర్చిన వాళ్లు చెబుతున్న బతుకుపాఠం ఇది.

ఇంతటి బతుకు భయంలో ఉన్నప్పుడు ఎవడైనా వేలు పెట్టి కెలికితే ఇంకెంత మండుతుంది ? అసలే ఎప్పుడు ఏం అవుతామో, రెండేళ్ల దెబ్బకి – అదేనండీ, కరోనా ఎఫెక్టుకి ఎక్కడికి వెళ్లి పడతామో, ఏమైపోతామో అనేది వాళ్లకి దరీ అంతూ తెలియడం లేదు. ఇలాంటి సమయంలో వాళ్లతో పంచాయతీ పెట్టుకుంటే నా సామిరంగా చలి చీమలన్నీ ఏకమైనట్టు కలిసిపోతారు ఎవరి మీద అయినా ! ఈ విషయం తెలుసుకోవాలి ఎవరైనా ! తెలివైన వాళ్లెప్పుడూ సినిమా వాళ్లను వాడుకుంటారు. వాళ్లతో నాలుగు మాటలు మంచిగా చెప్పించుకుంటారు. పబ్లిసిటీ పొందుతారు. మా దగ్గరకు రండి షూటింగ్ చేసుకోండి, మినహాయింపులు తీసుకోండి అంటూ తాయిలాలు ఇస్తారు. కశ్మీర్ నుంచి కేరళ వరకూ ఎవరిదైనా ఇదే పాలసీ. ఎందుకంటే అదో ఫీల్ గుడ్ ఇండస్ట్రీ. అసలే కష్టాల్లో ఉన్నారు పాపం అని ఓ మాట అంటే చాలు, ఇక మనవైపు చూస్తూ ఉంటారు – ఎప్పుడైనా ఏమైనా సాయం చేస్తారేమో అని. అదేం చేయకపోగా కోసి కారం పెట్టాం అనుకోండి. ఆ మంటకి ఇప్పుడు కిక్కురుమనకుండా ఉండిపోవచ్చు. టైమ్ వచ్చినప్పుడు మనకే కన్నీళ్లు పెట్టిస్తారు. కన్ఫామ్. ఎందుకంటే వాళ్లకి భావాలు దాచుకోవడం కొత్తకాదు. నటనే వాళ్ల జీవితం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments