28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeజాతీయ నీతిఆపరేషన్ కి ఆయన దగ్గర డబ్బుల్లేవ్ !  ఓ అగ్రనాయకుడి యదార్థ కథ !

ఆపరేషన్ కి ఆయన దగ్గర డబ్బుల్లేవ్ !  ఓ అగ్రనాయకుడి యదార్థ కథ !

కిడ్నీ దెబ్బతింది. ఆపరేషన్ చేయించుకోవాలి అని డాక్టర్లు చెప్పినప్పుడు చేతిలో డబ్బులు లేవు. పైగా ఇక్కడకంటే అమెరికాలో అయితే చవకగా అవుతుంది. సదుపాయాలు మెరుగ్గా ఉంటాయని చెబితే, నవ్వి ఊరుకున్నాడు. ఆరోగ్యం మీద దిగుల్లేదు. బాగుపడి పోవాలన్న ఆతృతా కనిపించలేదు ఆ నవ్వులో ! కొద్ది రోజులకే అనుకోని ప్రతిపాదన ఒకటి వచ్చింది. మేం అమెరికా వెళ్తున్నాం. మీరు కూడా మాతో వస్తే బావుంటుంది. మేం అధికారిక కార్యక్రమాల్లో ఉంటాం. మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు. మిగతా వ్యవహారాలన్నీ మన వాళ్లు చూస్తారు అంటూ భరోగా చెప్పింది అక్షరాలా ప్రత్యర్థి ! నిత్యం తన నుంచి విమర్శలు ఎదుర్కొనే రాజీవ్. రాజకీయ పరిణతి అంటే అదేనేమో ! ఆపరేషన్ అవసరం పడింది వాజపేయికి ! అయినా ఆయన ఎవరినీ నోరు తెరిచి అడగలేదు. సెల్ఫ్ లెస్ మేన్.  అప్పుడు వాజ్ పేయి ఉన్నది అరవైల మధ్యలో !

కేలండర్లు మారాయ్. దశ తిరిగింది. దశకం గడిచాక ఆయనే ప్రధాని. కప్పలతక్కెడ లాంటి  సంకీర్ణానికి ఇంటి పెద్ద. కూలిపోవడం ఖాయం అయిన క్షణాల్లో పార్టీ కీలక సమావేశం. రాజీనామా ఎందుకు… ఏం మనం నిలబెట్టుకోలేమా ? ఏం చేయాలో మనకి తెలియదా… అన్నాడు ఆవేశంగా ప్రమోద్ మహాజన్. అప్పటి ట్రబుల్ షూటర్. ఎలా నిలబెట్టాలో నీకు తెలిస్తే… మళ్లీ ఎప్పుడు పడగొట్టాలో వాళ్లకి తెలుసు. నీ ప్రయత్నాల వల్ల మనకి గడువు దక్కుతుందేమో, కానీ అవకాశం వాళ్లకి ఇచ్చినట్టు. వద్దు అనేశాడు. రాక రాక వచ్చిన అవకాశాన్ని ఆయన వదులుకున్న తీరు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎగైన్ హి ఈజ్ ఎ సెల్ఫ్ లెస్ మేన్. ఎక్కడ ఉన్నా ఆయన తీరు అంతే ! అందుకే పడినంత తేలిగ్గా గెలిచాడు.

పొఖ్రాన్ లాంటి అణు పరీక్షలు విజయవంతంగా చేసి, అగ్ర దేశాల్ని నివ్వెర పరిచినప్పుడు కూడా ఆయన చెప్పుకున్నది తక్కువే ! అది మా హక్కు అన్నాడు అంతే ! అది మన ఘనత అని మరింత గట్టిగా చెప్పండి అని సొంత వాళ్లు డిమాండు చేస్తే, మొదలు పెట్టింది పీవీ హయాంలో కదా, అయినా ఇది దేశం కోసం… మన కోసం కాదు అని చెప్పేంత పరిణతి ఆయనది. నెహ్రూ కాలంలో స్వేచ్ఛావాయువులు పీల్చి, ఆయనతోనే ఎంగ్ డైనమిక్ అండ్ ఫ్యూచర్ పొలిటీషన్ అని కితాబు అందుకున్న అనుభవమో, ఇందిర హయాంలో ఇనుప సంకెళ్లు మోసిన జ్ఞాపకమో, మొరార్జీ హయాంను దాటుకొచ్చిన పరిపక్వతో, రాజీవ్ లో చూసిన పరిణతి వల్లనో కానీ అతి వాదుల్లో లౌకికుడుగా ఎదిగాడు. అలౌకికమైన మెచ్యూరిటీ ఆయనకే చెల్లింది. అదో శిఖరం. ఆ శిఖరాన్ని చూశాక… ఇప్పుుడు కొత్త పాతాళం కనిపిస్తోంది.

ఏడేళ్లలో ఏం సాధించావంటే… దేశాన్ని తలెత్తుకునేలా చేశా అనే ప్రకటన చూశాక ఇక చెప్పక తప్పడం లేదు. ఉదార విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థల్ని, దేశంలో వ్యవస్థల్ని నిర్మించిన నెహ్రూ ఆ మాట ఎప్పుడూ చెప్పలేదేమో ఇంత ధీమాగా ! పటిష్టమైన విధానాలతో జాతీయకరణలు తెచ్చి, పాకిస్థాన్ ను ముక్కలు చేసి, కొత్త దేశాల్ని ఎర్పాటు చేసిన ఇందిక కూడా అని ఉండదు ఇంత ఎబ్బెట్టుగా ! పైగా, ఇందిర ఎప్పుడూ పాక్ ను ముక్కలు చేసిన మొనగత్తెను నేను… అని ఓట్లు అడిగిన జ్ఞాపకం లేదు. రూపాయి పతనమై దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు… లిబరైజేషన్ తెచ్చి, గ్లోబల్ దారులు పరచి, మా దేశం మీకో అవకాశం ఇస్తోంది అంటూ అపూర్వంగా ఆకర్షించిన పీవీ కూడా ఎప్పుడూ ఘతనను అమ్ముకోలేదు. ఇక వాజపేయి సంగతి సరేసరి. సంక్లిష్ట పరిస్థితుల్ని, అణు ఒప్పందాల్నీ చిరునవ్వుతో సాధించినా, గడ్డు మాంద్యాన్ని ఒంటి చేత్తో ఎదిరించినా మన్మోహన్ కూడా మౌనంగా ఉండటానికే ఇష్టపడ్డాడు తప్ప… గొప్పలకి పోలేదు. ఆ మౌనాన్ని చేతగాని తనంగా చిత్రీకరించాలనుకున్న వాళ్ల పనితనం ఇప్పుడు బయటపడటం లేటెస్ట్ !

రెండు డజన్లకుపైగా పార్టీలను మెప్పిస్తూ వాజపేయి సాధించిన ఘనతల ముందు నువ్వెక్కడ ? గంపగుత్తగా అధికారం ఇచ్చినందుకు నువ్ ఒరగబెట్టినదేంటో ఒక్క ముక్కలో చెప్పు చూద్దాం ! దేశం అడుగుల్ని, జాతి రాతనూ మార్చిన ఒక్క నిర్ణయం అయినా తీసుకున్న చరిత్ర ఉందా ? రద్దులు చేసి పేద బతుకులతో ఆడుకోవడం, ప్రభుత్వ సంస్థల్ని అమ్ముకోవడం, ఊపిరి ఆడక దేశం బిక్కచచ్చిపోయే స్థితికి దిగజార్చడం, ప్రపంచం జాలి పడే పరిస్థితి సృష్టించడం, ఆఖరికి భూటాన్ లాంటి దేశం కూడా సాయం చేయడం, కెన్యా ఆహారం అందించడం, బంగ్లాదేశ్ గ్రోత్ రేటులో మనల్ని మించి నిలబడటం, బుర్ర లేని వెర్రి విదేశీ విధానంతో ట్రంపును సమర్థించినందుకు ఆమెరికా సహాయ నిరాకరణ చేయడం లాంటివన్నీ చూశాక… తలెత్తుకునేలా చేయడం అంటే ఏంటో  అనుభవపూర్వకంగా అర్థం అవుతోంది. ఏడేళ్ల తర్వాత ఏడుపే మిగిలిందని !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments