34 C
Vijayawada
Friday, April 26, 2024
Homeరాజ నీతిఏపీకి జవాన్ ... ఈ అమరావతి కిసాన్ !

ఏపీకి జవాన్ … ఈ అమరావతి కిసాన్ !

గడియారంలో 12ను దాటి పోతున్నప్పుడు చిన్న ముల్లు అనుకుందట. నిన్ను దాటి పోతున్నా ఇక నీవైపు రానూ అని. కాలం గంటలై నడుస్తున్న కొద్దీ పరిణామాలు మారుతాయ్. పరిభ్రమణాలు జరుగుతాయ్. తిరిగి తిరిగి చిన్న ముల్లు తిన్నగా మళ్లీ ఆ 12ను తడితేనే రోజు మారేది. అమరావతి కూడా అలాంటి పన్నెండే. నిన్ను వదిలి పోతున్నా అని ముల్లు లాంటోళ్లు గుచ్చాలని చూసినా తిరిగి మళ్లీ అక్కడికి రావాల్సిందే. ఈలోగా జరిగిన భ్రమణ పరిభ్రమణాలతో అమరావతి ఉద్యమం కాస్తా ఉప్పెన అయ్యింది. ఆకాంక్ష అని సున్నితంగా చెప్పుకునే రోజులు పోయి ఆయుధంగా అవతరించింది. అవును. ఏపీ చేయబోయే యుద్ధంలో నిర్ణాయక ఆయుధం కచ్చితంగా అమరావతే. రాజధాని కోసం నిలబడి పోరాడుతున్న ఈ ప్రతీ కిసాన్… ఏపీ భవిష్యత్ కి పహారా కాస్తున్న జవాన్ తో సమానం. అంతకు మించి కూడా !

చంద్రబాబు కేవలం ఓనమాలు మాత్రమే దిద్దించాడు. అన్ని కోణాల్లోనూ ఆలోచించి, ఈ ప్రాంతం అయితే రాజధానిగా రాష్ట్రానికి కలిసొస్తుంది అని పునాది రాయి మాత్రమే వేశాడు. అందరినీ మానసికంగా అమరావతితో ముడి వేయడం మరిచిపోయాడు. నిర్మాణం, సాంకేతికత, ఆధునికత, ప్రపంచస్థాయి అంటూ తను తపించే ప్రమాణాల కోసం పాకులాట మొదలు పెట్టేశాడు. అందుకే అమరావతితో మిగతా ప్రాంతాలకీ జిల్లాలకీ భావోద్వేగ బంధం ముడిపడలేదు. ఇదే ఎన్నికల ముందు కొందరికి ఆయుధంగా పనికొచ్చింది. ఆంధ్రులకీ అమరావతికి మధ్య ఉన్న వీకెస్ట్ లింక్ ఇదే. దీనిపైన దెబ్బకొట్టేందుకే రాజధానిని తరలించాలనే ప్రయత్నం. వ్యూహం. రైతుల ఉద్యమం సరిగ్గా ఇదే కోణంలో గురి పెట్టింది. విజయం సాధించింది. అన్ని ప్రాంతాల్నీ ఏకం చేసి అమరావతి గీతం ఆలపించేలా చేసింది.

రాలి ఒళ్లో పడిన పండుకన్నా చెట్టెక్కి సాధించుకున్న పండుకు ఫలమెక్కువ. బలమెక్కువ. అమరావతి కూడా అంతే. ఎదురుదెబ్బలకి ఎదురు నిలిచి పోరాడుతున్న తర్వాత రాటుదేలిన అనుభవం ఇదే చెబుతోంది. రాజధానిగా అమరావతే కావాలని ఆంధ్రప్రదేశ్ మొత్తం ముక్తకంఠంతో అనడం, అది ప్రపంచం వినడం రైతు పోరాటం సాధించిన అతి పెద్ద విజయాల్లో మొదటిది. రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు మిగతా అన్ని ప్రాంతాలూ సముఖత చెప్పి ఉండొచ్చు గాక. అది పరోక్షం. కానీ రాష్ట్రం సంక్షోభం గుప్పిట్లోకి జారిపోయాక, పరిణామాలు మారిపోయాక జనం ప్రత్యక్షంగా రంగంలోకి దిగి జై కొట్టి, ప్రాంతాలకు అతీతంగా రైతులతో కలిసి నడవడాన్ని మించిన రాజముద్ర మరేం ఉంటుంది ? రాజధానికి ఇంతకన్నా కావాల్సింది ఏముంది ? అమరావతి జనామోదాన్ని అధికారికంగా సాధించుకుంది రైతు పోరాటంతో, రైతు పాదయాత్రతో. ఈ జనామోదంతో భావోద్వేగ బంధం రీకనెక్ట్ అయ్యింది. మా రాజధాని.. మన రాజధాని… అమరావతే రాజధాని అని నిర్మొహమాటంగా ప్రాంతాలన్నీ నినదించే రోజు వచ్చింది. అమరావతి కోసం సీమ గొంతు ఎత్తడానికి కారణం ఇదే. ఇదే రైతు పోరాటం సాధించిన చిరస్థాయి చారిత్రక విజయం.

అన్నీ ఉన్నప్పుడు అంత తేలిగ్గా అర్థం కాదు. అమరావతి విషయంలో కూడా అంతే. రాజధాని లేని రాష్ట్రం – తల చెదిరిన జీవితంతో సమానం. దిక్కుతోచదు. పైగా విధ్వంసంలో తొలి అడుగు అమరావతి నెత్తినే పడింది. ఆ తర్వాత భస్మాసుర పాదం ఒక్కొక్కరి నెత్తినా పడుతూ వస్తోంది. ఇలా పడుతున్న కొద్దీ బాధిత సమూహం నష్టాన్ని గ్రహిస్తోంది. నాకు జరిగినట్టే నా రాష్ట్రానికి జరక్కూడదు, రేపటి తరానికి ఇదే పరిస్థితి ఎదురు కాకూడదు అనే స్పృహ అనుభవంతో కలుగుతోంది. అందుకే అమరావతికి ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే, భవిష్యత్ కోసం పోరాడాల్సిన సమయం వచ్చేసిందని ఆంధ్రులకి అర్థమైంది. ఇప్పుడు కళ్లు తెరవక పోతే అప్పుల ఊబిలో,అవమానాల సునామీలో కొట్టుకుపోయి పరాజితులుగా మిగిలిపోతాం అని కళ్ల ముందే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో పోరాటం ఎలా చేయాలో, ప్రతి కూల పరిస్థితుల్ని ఎలా తట్టుకోవాలో చేతల్లో చూపిస్తోంది అమరావతి రైతు పోరాటం. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురైనా పోరాటం ఎలాగో అమరావతి చూపిస్తోంది.

పైగా అమరావతి రైతు పోరాడుతున్నది భూముల కోసం. తన బాగు కోసం మాత్రమే కాదు. రాష్ట్రం కోసం. భవిష్యత్ కోసం. రేపటి తరాల కోసం. అన్నిటికీ మించి ఆంధ్రుల ఆత్మగౌరవంగా నిలబడాల్సిన నిలువెత్తు రాజధాని కోసం. సరిహద్దుల్లో సైనికుడు దేశం కోసం పోరాడతాడు. మన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టేందుకు కట్టుబడతాడు. దేశ ఆత్మగౌరవం కోసం తనను తాను ఫణంగా పెడతాడు. అమరావతి రైతులు కూడా అంతే. ఎవరో పిడికెడు మంది ఆరోపించినట్టు, అమరావతి రైతులే కనుక వాళ్ల భూముల కోసం, వాటి ధరల కోసమే ఆలోచిస్తే నిజానికి రోడ్డెక్కాల్సిన పని లేదు. ఉద్యమం అవసరమే లేదు. రాజధాని పూర్తిగా కడితే వాళ్లకి ఎంత లాభమో తెలియదు కానీ, ఇప్పటికిప్పుడు ఆపినా – వారికి పరిహారంగా 40 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఒప్పందం. చట్టం. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మొత్తం అంటే తరతరాల్ని తాకట్టు పెట్టినా సరిపోదేమో. వాళ్లు కోరుకుంటున్నది ఈ లెక్కలు కాదు. వాళ్లు అడుగుతున్నది వేల కోట్ల పరిహారం కాదు. రాష్ట్రం పరిహాసాల పాలుకాకుండా, నవ్వులపాలు అవ్వకుండా నిలబెట్టమని మాత్రమే అడుగుతున్నారు. రాజధానిని కట్టి ఆంధ్రప్రదేశ్ కి ఓ చిరునామా ఇవ్వాలని మాత్రమే కోరుతున్నారు. వాళ్ల కోసం కాదు ఆరు కోట్ల మంది జనం కోసం. రాబోయే వందల ఏళ్ల భవిష్యత్తు కోసం. ఆంధ్రుల ప్రయోజనాలకి ఇంతటి పరాహా కాస్తున్నారు కాబట్టే అమరావతి కిసాన్… ఏపీ పాలిట జవాన్ అంటున్నది. ఇంత సాధించిన తర్వాత కూడా, దేవస్థానం పాదయాత్ర బహుశా మజిలీనే. గమ్యం కాదు. ప్రయాణించాల్సిన దూరం, అడుగులు పడాల్సిన ప్రాంతం ఇంకా ఉంది. ముందు ముందు ఉత్తరాంధ్ర దిశగా కూడా అడుగు పడి అన్ని జిల్లాలనూ ఏకధాటిగా ఏకతాటిపైకి తెచ్చే ప్రణాళిక సిద్ధమవుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments