34 C
Vijayawada
Friday, April 26, 2024
Homeరాజ నీతిఏపీ చేయలేనిది తెలంగాణ చేస్తోందా ?

ఏపీ చేయలేనిది తెలంగాణ చేస్తోందా ?

పొరుగింట్లో పెళ్లి మేళాలకి ఇరుగింట్లో చెవులు చిల్లులు పడటం అంటే ఇదే ! తెలంగాణ మన పక్క రాష్ట్రం అనో, ప్రత్యర్థి అనో ఆలోచన పక్కన పెట్టి వాస్తవంగా ఆలోచిస్తే చాలా విషయాలు ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయ్. మీ వల్ల అయితే చూడండి.

సమతామూర్తిని ప్రతిష్టీంచి ప్రపంచానికి తెలంగాణ ఎంత చెప్పిందో తెలియదు కానీ ఏపీకి మాత్రం పెద్ద సందేశమే ఇచ్చింది. ఓ జాతి నిర్మాణం ఎలాగో… ఓ ప్రత్యేకత, ఓ ఐడెంటిటీ, ఓ భావజాలం ఎలా పుట్టి నిలువెత్తుగా ఎదిగి వెలుగుతాయో తెలంగాణ చూపిస్తోంది. ప్రాజెక్టులు, ఆలయాలు, నగర నిర్మాణాలు, సమతామూర్తులతో తెలంగాణ నిర్మించే రాష్ట్రంగా నిలబడితే – ఏపీ మాత్రం నోరెళ్లబెట్టి చూస్తుండిపోయే స్థితికి దిగజారి పోవడం నేటి వాస్తవం. హైదరాబాద్ నిర్మాణంలో మా ఇటుకలు, ఇరుసులు ఎన్నో ఉన్నాయ్. పెట్టుబడులు పెట్టింది మేమే, సైబర్ సిటీ కట్టింది మేమే అని చెప్పుకునే ఏపీ పుర ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా నిశ్చేష్టులైపోయిన సందర్భం ఇది. తెలంగాణ ఎక్కడ, ఎలా ముందుకెళ్లింది ? ఏపీ ఎందుకు వెనకబడింది ? కారణం ఎవరు ?

కేసీఆర్ నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. రాజకీయంగా విభేదించనూ వచ్చు. రాష్ట్రాన్ని విడదీసి ఏపీని దెబ్బ తీశాడు అని కూడా మరికొందరు అనుకోవచ్చు. రాజకీయంగా టీడీపీని చప్పరించి బలపడిన పార్టీ అధినేతగా కేసీఆర్ ను గుర్తించనూ వచ్చు. ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉంది. కానీ వాటన్నిటినీ మించిన నిజం ఇంకోటి ఉంది. వ్యతిరేకులు కూడా కళ్లు విప్పార్చి చూసి తెలుసుకోవాల్సిన వాస్తవం ఇది. కేసీఆర్ లో ఓ దార్శనికుడు ఉన్నాడు. ఓ అడుగుజాడ కావాలి, ఓ దారి వేసి భవిష్యత్ ను నడిపించాలి అనే సాంస్కృతిక పిపాసి ఉన్నాడు. అందుకే నీళ్ల కోసం కాళేశ్వరం అంటూ ఎంత వేగంగా కట్టాడో, అంతే వేగంగా యాదాద్రినీ తీర్చి దిద్దుతున్నాడు. ఇంకో పక్కన హైదరాబాద్ కి కొత్త హంగులద్ది, టీ హబ్ ను నిలబెట్టి తనదైన సంతకం పెట్టాడు. అంటే అభివృద్ధి, ఆధ్యాత్మికం, సాంస్కృతికం, ఇప్పుడు సమతామూర్తి ఇలా అన్ని కోణాల్లోనూ తెలంగాణపై తనదైన ముద్ర వేస్తున్నాడు కేసీఆర్. సంస్కృతికంగా ఇంతటి విప్లవం గత 30 ఏళ్లలో దేశం ఏ ఒక్క ప్రాంతంలోనూ చూడలేదన్నది వాస్తవం. మరో పక్క నుంచి రెండు పెద్ద టీవీ ఛానెళ్లను తన అనుంగు అనుచరులతో కొనిపించి, మరో పెద్ద ఛానెల్లో వాటాలు పెట్టి మన ప్రాంతం – మన మీడియా అనే ముద్ర వేసుకున్నాడు. ఆంధ్రా రాజకీయాల్నీ, ఇక్కడ ప్రజల ఆలోచనల్నీ అక్కడి మీడియాతో శాసిస్తున్నాడు. దటీజ్ కేసీఆర్. వెళ్లగొట్టడమే కాదు… విడిపోయిన తర్వాత కూడా తన రాడార్ ను దాటి పోలేని పరిస్థితిని ఏపీకి సృష్టించిన రాజకీయ మేథో వ్యూహకర్త కేసీఆర్. తెలంగాణ దృష్టి కోణం నుంచే కాదు, న్యూట్రల్ గా తెలివిగా ఆలోచిస్తే ఇదే వాస్తవం.

తెలంగాణ అంటే నిజానికి కడుపు నిండిన రాష్ట్రం. హైదరాబాద్ అనే అక్షయపాత్ర ఉంది వాళ్లకి. లక్ష కోట్లకిపైగా ఆదాయం అక్కడి నుంచే ఊడిపడుతోంది. అందుకే ఐడియాలజీ, సంస్కృతి, భావజాలం, ఐడెంటిటీ, అభిరుచి లాంటి కళాపోషణ సాధ్యం అవుతోంది. నిజానికి ఏ జాతికి అయినా ఇవన్నీ అవసరం. 250 కోట్లతో విగ్రహం అవసరమా ? ఆ డబ్బుతో ఎన్ని స్కూళ్లు కట్టి ఉండొచ్చు ? అనే ఆలోచన కొందరు చేయొచ్చు. అలా అనుకుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఐఫిల్ టవర్ లు పుట్టేవి కాదు. అవి అక్కడి ఇన్ క్లూజివ్ భావజాలనికీ, పారిశ్రామిక దార్శినికతలకూ ప్రతీకలు. ప్రపంచం ఉన్నంత కాలం నిలిచి ఉంటాయ్. అందుకే ఇలాంటి వాటిని ఖర్చు కోణంలో కాదు ఐడెంటిటీ అనుకోవాలి. నీ ఆలోచన ఏంటి ? నువ్ నడిచే దారి ఏంటి ? నువ్ బతకాలనుకుంటున్న విధానం ఏంటి ? అనేవి ఇలాంటి భారీ కట్టడాలు, బృహత్తర నిర్మాణాలు, మహత్తర ఆలయాలే చెబుతాయ్. ఇంతటి గాఢమైన ఆలోచన ఉంది కాబట్టే కేసీఆర్ ఇలాంటి అడుగు వేయగలిగాడు అనిపిస్తోంది. ఓ నాయకుడికి ఉండాల్సిన దీర్ఘకాలిక దృక్పథం ఇలాంటి వాటిలో కనిపిస్తుంది. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో, విపక్షాల విషయంలో ఎంత కర్కశంగా ఉన్నా తెలంగాణ ఐడెంటిటీ, ప్రయోజనాల విషయంలో నిక్కచ్చిగా ఉంటాడు, దెబ్బతిననివ్వడు అని మరోసారి రుజువు అవుతుంది ఇలాంటివి తెలిసినప్పుడే !

కానీ ఏపీలో పరిస్థితి వేరు. ఏపీ కడుపు నిండిన రాష్ట్రం కాదు. మండిన రాష్ట్రం. నిలువ నీడ లేదు. పెద్ద నగరం లేదు. చెప్పుకోను రాజధాని లేదు. అందుకే ఓ భారీ రాజదానిని నిర్మించి సోలార్ సిస్టమ్ తరహాలో మిగతా పరిస్థితులు, పరిణామాలు దాని చుట్టూ తిరిగేలా అభివృద్ధి చెందేలా ప్రపంచాన్ని ఆకర్షించేలా ఓ వ్యూహం ఉండాలని ఏపీ తొలి నాళ్లలో భావించింది. కట్టుకోవాలి అని సంకల్పించింది. అందుకే ప్రాజెక్టుల కన్నా ముందు, ఆలయాల కన్నా ముందు సమతా మూర్తులకన్నా ముందు ఏపీకి ఇదే కదా ఆధారం, అవసరం. కానీ ఇలాంటి విషయంలో కూడా మన రాజకీయానికీ, మనం నెత్తిన పెట్టుకున్న నేతలకీ దూరదృష్టి, భవిష్యత్ మీద ఆలోచన లేకపోయింది. రాజకీయం రెండుగా చీలి, జనాన్ని నిలువునా చీల్చి, చీకట్లోకి నెట్టి రాజధానిని బీడు చేసుకుంది ఏపీ. మన తెలివి తక్కువ తనానికీ, ఆలోచన లేని బుద్ధిమాలిన బతుకులకీ ఇదే నమూనా. రాజధాని అంటే కులం ముద్ర వేశారు. పోనీ అనుకుందాం కాసేపు. మరి పోలవరానికి ఏమైంది ? నీలో చేవ, సమర్థత ఉంటే కట్టి చూపించొచ్చు కదా ఇప్పుడైనా ! అంటే, ఇక్కడ కులం కేవలం సాకు. మనం రాజకీయం కోసం భవిష్యత్తును తాకట్టుపెట్టుకునే జాతి అని నిరూపించే ఘటనలు ఇవి. అందుకే తెలంగాణ నిర్మించే రాష్ట్రం అయితే… ఏపీ నోరెళ్లబెట్టి అటు వైపు చూసే రాష్ట్రంగా మిగిలిపోతోంది.

ఇలా విగ్రహం పెట్టడం ఎంత వరకూ సమంజసం ? కులాలు, వర్గాలూ, వర్ణాల చర్చ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పైగా కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న సామాజిక వర్గం నుంచి వచ్చిన కేసీఆర్ లాంటి ఓ నాయకుడు అప్రతిహతంగా తెలంగాణను ఏలుతున్నాడూ అంటే అతనిలో ఏదో విషయం ఉండే ఉండాలి. అది మిగతా వాళ్లకి అర్థం కాకపోయి ఉండాలి. లేదంటే అండర్ ప్లే చేస్తుండాలి. సమతామూర్తి సంగతే చూడండి. విగ్రహం పెట్టింది కేసీఆర్ కుడిభుజం. ఆవిష్కరించింది ప్రధాని మోడీ. అంటే భావజాలం పరంగా కేసీఆర్, మోడీ ఒకేవైపు ఉన్నారన్న సందేశం, క్లారిటీ ఇందులో ఉన్నాయ్. భావజాలమే రాజకీయానికి వెన్నెముక. రేపటి రోజున తెలంగాణ ఎవరికి ఓటు వేయాలో, రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చే మూడో ఎన్నికలో నిర్ణయం మార్చుకోవాలో వద్దో తేల్చుకునేందుకు, మిగతా భావజాలాలన్నీ ఏకం అయ్యేందుకు కావాల్సిన ఇగ్నిషన్ సమతామూర్తి ఇచ్చి ఉండొచ్చు. మరి ఆ ప్రభావం ఎంత వరకూ పని చేస్తుందో, ఇలాంటి లోతైన విషయాల్ని ప్రజలు ఎంత వరకూ అర్థం చేసుకుంటారో రేపటి ఎన్నికల తీర్పుతో తెలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments