28 C
Vijayawada
Wednesday, September 11, 2024
Homeజాతీయ నీతిఏపీలో బీజేపీ యుద్ధం ప్రకటిస్తే ఏ పార్టీకి నష్టం ?

ఏపీలో బీజేపీ యుద్ధం ప్రకటిస్తే ఏ పార్టీకి నష్టం ?

ఏపీలో కేవలం 0.8 మాత్రమే ఓటు శాతం ఉందనే ఈసడింపుల ఎదుర్కొనే బీజేపీ నిజానికి కేటలిస్ట్ లాంటి పార్టీ. ఉత్ర్పేరకం అనమాట. సైన్స్ చదివిన వాళ్లకి తెలిసిపోద్ది తేలిగ్గానే. అంటే నేరుగా చర్యలో పాల్గొనకుండానే చర్య వేగాన్ని డిసైడ్ చేసేదే కేటలిస్ట్ అనమాట. అలాంటి బీజేపీ ఇప్పుడు యుద్ధభేరీ మోగిస్తాం, 29న… సిద్ధంగా ఉండండి అంటూ ప్రకటించగానే పార్టీల్లో అంతర్గత లెక్కలు మారుతున్నాయ్. అధికార పార్టీకి సపోర్టు చేసే మీడియా అయితే అప్పుడే కత్తులు దూయడం మొదలు పెట్టేసింది. ఏంటి బీజేపీ ఏం చేస్తుంది ? సుజనా లాంటి వాళ్లని నమ్ముకుంటే బీజేపీ లేస్తుందా ? అంటూ రాయడం మొదలు పెట్టేసింది. ఇంతకీ బీజేపీ యుద్ధం ప్రకటిస్తే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?


పంచడం, దంచడం అనే రెండు మాటలు తప్ప ఏపీలో మూడో మాట వినపడి దాదాపు మూడేళ్లు అవుతోంది. పంచడం అంటే అప్పులు తెచ్చి పంచడం, దంచడం అంటే విపక్ష పార్టీ నేతల్ని కేసులు పెట్టి, లోపలేసి కుళ్ల పొడవడం, నామినేషన్లు కూడా వేయనీయకుండా డామినేషన్ చూపించుకోవడం. ఇంతే ! ఇదిగో ఈ ప్రాజెక్టు తెచ్చామనో, ఇదిగో ఈ పని పూర్తి చేశామనో, లేదంటే ఇది కట్టామనో, ఇది పెట్టామనో చెబితే విందామని మొహవాచిపోయి ఉంది ఏపీ. ఇలాంటి సమయంలో బీజేపీ రంగంలోకి దిగుతాం అంటోంది. వాళ్ల సంచిలో సరుకు కొంత వరకూ ఉంది. రాజధాని సంగతి అయినా, పోలవరం పరిస్థితి అయినా, రింగు రోడ్లు, విశాఖ స్టీలు ప్లాంటు విషయమే అయినా వాళ్లు చెప్పే ఛాన్స్ ఉంది. అలాంటివి చెప్పడం, చేయడం మొదలు పెడితే వినడానికో కొత్త సంగతి దొరికినట్టు అవుతుంది ఏపీకి. అప్పుడిక అంటరాని పార్టీ కాదు బీజేపీ, ఏపీ అంటకాగే పార్టీ అవుతుంది. అలా అంటూ జరిగితే రాజకీయం చాలా మారుతుంది.

బహుశా అందుకే ప్రో వైసీపీ మీడియా ముందే గాల్లోకి కాల్పులు జరుపుతోంది. ఏంటి సుజనా లాంటి నాయకుణ్ని పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుందా ? అమిత్ షా ఏం అనుకుంటున్నాడు ? శివప్రకాశ్ జీకి ఏం తెలుసు ? లాంటి రాతలు రాయడం మొదలు పెట్టింది. మంచిదే ఓ రకంగా ! కూడికలు, తీసివేతలు, ఎగవేతలూ మాత్రమే తెలిసిన ఆడిటర్ రాజకియాల్లో చక్రం తిప్పగలడు. కాళ్లావేళ్లా పడి రాజకీయ ముడులు వేయగలడు. శబ్బాష్. ఓ 15 ఏళ్లుగా రాజకీయాన్ని దగ్గర చూస్తూ, రాజకీయాల్లో ఉంటూ, విభజన లాంటి పరిణామాల్ని కూడా ఏపీకి అనుకూలంగా మలచడానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేసిన వాళ్లకి మాత్రం రాజకీయం ఏం తెలుసు – అని రాసేయొచ్చు సులభంగా ! ఎందుకంటే బీజేపీలో కదలిక అంటూ వస్తే రాజకీయం వన్ సైడెడ్ గా మారడం మరింత ఈజీ అయిపోతుంది.


బీజేపీ కనుక ఏపీ రాజకీయాల్లో పార్టిసిపెంట్ అయితే, ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకొనో, ఎంతో కొంత ప్రయోజనం పొందే పరిస్థితిలో ఆ పార్టీ కనుక ఉంటే బ్యాలెన్స్ కచ్చితంగా మారిపోతుంది. కరిగిపోయిన ఐస్ క్రీమ్ కావాలా ? సీల్డ్ ప్యాకెట్ లో ఉన్న బిస్కెట్ కావాలా ? అంటే ఎవరైనా ఏది కోరుకుంటారు ? బీజేపీ కూడా అలాంటి ఛాయిస్సే తీసుకునే పరిస్థితిలో నేరుగా ఉండగలదు. ఇదే జరిగితే టీడీపీతో కలవడం, గెలవడం సులభం అవుతాయ్. ఇలాంటి ఈక్వేషన్ అసలు చర్చకు రాకూడదు అనేదే వైసీపీ ప్రయత్నం ముందు నుంచి. అందుకే బీజేపీలో కొందరు నాయకులు విపక్షం మీద దాడి చేస్తారు. అమరావతి కోసం బీజేపీ నేతలు రంగంలోకి దిగగానే – ఇక్కడ అధికార పార్టీ ఎంపీ ప్రధానితో సమావేశం అవుతారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయ్ కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెప్పడం ఓకే. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు అడగారా ? పోలవరం పైలు కదిలించారా ? రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ ఫండ్సు ప్రస్తావన తెచ్చారా ? అవేం రాలేదు అంటే అర్థం రాజకీయం మాత్రమే వచ్చింది అనే కదా ! బీజేపీని రాష్ట్రంలో సింగిల్ గా ఉంచేందుకు శక్తివంచన లేకుండా చేసే ప్రయత్నాలే ఇవన్నీ.

బీజేపీ సింగిల్ గా ఉంటే ఏమవుతుంది ? బీజేపీ అంటే జనసేన కూడా. వైసీపీ, టీడీపీ తర్వాత ఏపీలో మూడో శక్తి బీజేపీ జనసేనే. వాటి ఓటు శాతం ఎంత అన్నది వేరే చర్చ. ఇలా మూడు పార్టీలున్నప్పుడు మూడు విడివిడిగా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలే అవకాశాలుంటాయ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే టీడీపీకి నష్టం. వైసీపీకి లాభం. పవన్ కల్యాణ్ ను కుల కోణంలో రెచ్చగొట్టడం, టీడీపీ నుంచి వెళ్లిన నాయకుడే బీజేపీని దారి మళ్లిస్తున్నాడు అని ప్రచారం చేయడం అన్నీ అందులో భాగమే. అంటే టీడీపీ వైపు ఈ రెండు పార్టీలూ జరగకుండా చూస్తే ఓ పని అయిపోయినట్టే అనేది అధికార పార్టీ అంచనా. ప్రజల్లో వ్యతిరేకత, ప్రధాన విపక్షం మీద అనుకూలత ఎంతైనా ఉండనివ్వండి. కానీ యంత్రాంగం సపోర్టు, పోలిసింగ్ మద్దతు లేకపోతే పావులు కదపడం కష్టం. ఆ సంగతి చంద్రబాబుకి అనుభవ పూర్వకంగా అర్థం అయ్యింది 2019 ఎన్నికల్లో. కేంద్రం కత్తి కట్టింది కాబట్టి చేతులు కట్టేసినట్టు అయిపోయాడు చంద్రబాబు. ఇఫ్పుడు అలా జరక్కూడదూ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు ఉంటే నిప్పుకి గాలి తోడైనట్టు కలిసొస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో మూడు రకాల ఎత్తుగడలు ఒకేసారి పని చేస్తున్నాయ్. కాస్తో కూస్తో పుంజుకునేందుకు, నిలబడేందుకు బీజేపీ చేస్తున్న ప్రో ఏపీ ప్రయత్నాలు మొదటివి. బీజేపీ కలిసి వస్తే పని సులభం అవుతుందన్న టీడీపీ అంచనాలు ఎత్తుగడలు రెండోవి. ఇక మొదటి రెంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ జరకూడదన్న వైసీపీ ఆకాంక్షలు మూడోవి. మరి ఈ ముక్కోణంలో ఎవరి కోణం ఎంత ప్రభావం చూపిస్తుందో… ఎవరి బాణం దూసుకుపోతుందో తొందర్లో తెలుస్తుంది. డిసెంబర్ 29న బీజేపీ పెడుతున్న బెజవాడ సభతో అఢుగులు పడతాయేమో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments