28 C
Vijayawada
Wednesday, September 11, 2024
Homeరాజ నీతిబీజేపీ ఈ తప్పులు దిద్దుకోగలదా ?

బీజేపీ ఈ తప్పులు దిద్దుకోగలదా ?

బలం మీద ఉన్నపుడు బలహీనతలు పెద్దగా బయటపడవ్. అదే బలం క్రమంగా తగ్గిపోతూ ఉన్నప్పుడు బలహీనతలు బలపడతాయ్. తట్టుకోవాలంటే కొన్ని దిద్దుకోవాలి. ఇంకొన్నిసార్లు వెనకడుగు వేయాలి. మరికొన్ని కడుక్కోవాలి. ఆలోచనలతోపాటు అనేకం మార్చుకోవాల్సి ఉంటుంది. ఏడెనిమిదేళ్లుగా కనీవినీ ఎరుగని బలంతో విర్రవీగిన బీజేపీ ఇప్పుడు ఇదే దశలో ఉంది. ఆల్రెడీ ఐదారు వ్యూహాత్మక కరెక్షన్స్ చేసేసుకుంది. ఇక ముందు ఏమేమి చూడబోతున్నాం ? ఏపీలో కూడా ఇలాంటి మార్పులు చేసుకునే సమయం వచ్చేసిందా ? ఇలాంటి అంటే ఎలాంటివి ?

మోడీ ప్రధాని అయిన కొత్తలో సిలబస్ లో ప్రధాన చాప్టర్ వారసత్వ రాజకీయాలు. మేం వారసత్వానికి వ్యతిరేకం. జవసత్వాలకి ప్రతినిధులం అంటూ అడిగినా అడగకపోయినా – విదేశం అయినా స్వదేశం అయినా ఇదే మాట చెబుతూ ఉండేవారు. కాంగ్రెస్ వారసత్వం చేసిందని, మేం అలా చేయడం లేదని చెప్పి ఆకట్టుకోవాలని, అసలే పడిపోయిన ప్రత్యర్థి పార్టీని ఇంకా ఇంకా దెబ్బకొట్టాలనే ఆరాటం అది. కానీ రెండు మూడేళ్లుగా వారసత్వం అనే మాట మోడీ నోట రావడం లేదు. ఎందుకంటే రాజకీయంలో వారసత్వం ఎందుకు అవసరమో బీజేపీకి అర్థం అయ్యింది. కొన్నిసార్లు ఎవ్వడూ తప్పించుకోలేని ఉచ్చు వారసత్వం అని తెలిసొచ్చింది. మధ్యప్రదేశ్ లో వారసుడు సింధియా కాంగ్రెస్ ను చీల్చి మరీ కమలానికి అధికారం అందించాడు మరి. యూపీలో జతిన్ ప్రసాద బ్రహ్మణ వర్గంలో ఏదో సానుకూలత తెస్తాడని ఆశ పెట్టుకొని పిలిచి మరీ పీట వేసింది. అంతెందుకు మన పక్కనున్న కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై ఎక్కడి నుంచి వచ్చాడు ! చిన్నప్పుడు పదే పదే రేడియో వార్తల్లో వినిపించిన ఎస్ఆర్ బొమ్మై కొడుకే కదా ఈయన. ఇలా లిస్టు తీస్తే చాలానే ఉంది చిట్టా. వారసత్వం తర్వాత హిందుత్వ విషయంలోనూ సంఘ్ సర్దుబాటు మొదలు పెట్టేసింది. ఆ మధ్య ముఖ్య నాయకుడి ప్రసంగం వింటే అర్థం అయిపోయింది. సావర్కర్ లాంటి వీర అతివాది ప్రస్తావన వినిపించడం లేదు ఇప్పుడు. హెడ్గేవార్, గోల్వాల్కర్ లాంటి మితవాదులు హైలైట్ అవుతున్నారు. ఈ దేశంలో, ఈ గడ్డ మీదున్నవారి జీవన విధానానికి పర్యాయపదమే హిందుత్వ అంటోంది సంఘ్. 2014 నాటి బీజేపీ హిందుత్వ నారేటివ్ తో పోలిస్తే ఇది చాలా చాలా భిన్నం. మారక తప్పలేదు వ్యూహం.

ప్రాంతీయ పార్టీలకి మీరు దండం పెడతారేమో మేం మాత్రం పిండం పెడతాం అంటూ తిరిగారు మోడీ, అమిత్ షా. ఏడేళ్లు తిరిగే సరికి అర్థం అయిపోయింది. ఇంత పెద్ద దేశంలో, ఇన్ని భాషలు, సంస్కృతులు ఉన్న దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా కష్టమే సుమీ – అని ! ఏపీ వాళ్లం కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం. అందుకే మిత్రుల వేట సాగుతోంది. ఇక రైతుల చట్టాల విషయంలో వెనక్కి తగ్గడం కూడా ఇలాంటి పాయింటే. కశ్మీర్ కి మళ్లీ రాష్ట్ర హోదా ఇచ్చే ఆలోచన ఉంది. ఎన్నికల తర్వాత పునరుద్ధరిస్తాం – అని అమిత్ షా చెప్పడం మరో దిద్దుబాటు. ఇక 75 ఏళ్ల వాళ్లు కీలక పదవుల్లో ఉండకూడదన్న నిబంధనకి కూడా నీళ్లు వదిలే పరిస్థితి ముందు ముందు రావొచ్చునేమో ఇప్పటికైతే అనుమానమే. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి మోడీ 75కి దరిదాపుల్లో ఉంటారు. ఎస్. ఎత్తుగడలు నాయకుడిని బట్టీ, పార్టీని బట్టీ కాదు కాలాన్ని బట్టీ అవసరాన్ని బట్టీ మారతాయ్. మరో మాటలో దీన్నే రాజకీయం అంటారు అని లేటెస్ట్ గా మోడీ బీజేపీ రుజువు చేస్తోంది. సింపుల్.

వీటిని తప్పులూ అంటే అన్నిసార్లూ కొందరు ఒప్పుకోరు. పోనీ, వ్యూహాత్మక దిద్దుబాట్లు అనేసుకుందాం. కంఫర్ట్ గా ఉంటుంది. జాతీయ స్థాయిలో ఆల్రెడీ అలాంటివి చేస్తున్నారు. చేసేస్తున్నారు. ఇంకా చేసేందుకు సిద్ధపడుతున్నారన్న సంకేతాలు ఆల్రెడీ ఆరెస్సెస్ మొన్న దీపావళి ముందే ఇచ్చేసింది కూడా ! మరి రాష్ట్రం సంగతేంటి ? ఏపీ మాటేమిటి ? ఒక్క రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ ఎంత దూరం వెళ్లేందుకు అయినా సిద్ధపడుతుంది అని పంజాబ్ లో ఎత్తుగడలు చూస్తే అర్థం అవుతోంది. ఏడాదిన్నర కాలంగా రైతులు రోడ్డెక్కి, ప్రపంచం కోడై కూసినా ఎదురు దాడి చేసింది కేంద్రం. ఆలాంటిది అసెంబ్లీ ఎన్నికల ముందు అమరీందర్ నుంచి ప్రపోజల్ రాగానే సినిమా మొత్తం రాత్రికి రాత్రి మారిపోయింది. ప్రధాని సారీ చెప్పేశారు. రెండు కళ్ల నుంచి కాదు, ఒక కంటి నుంంచి రెండు అంటే రెండు కన్నీటి చుక్కలు కూడా రాల్చారు. అలా ఉంటుంది రాజకీయ కాన్సన్ ట్రేషన్. మరి ఏపీ విషయమేంటి ?

ఏపీలో కూడా పొరపాట్లు కొన్ని జరిగాయ్. రాజకీయంగా బెనిఫిట్ అవ్వడం కోసమే అనుకున్నా, టీడీపీ విడిపోవాలి అని నిర్ణయించుకున్నాక బీజేపీ ఏపీ మీద శీతకన్నేసింది. పట్టించుకున్న దాఖలా లేదు. పైగా ఓ పార్టీకి కొమ్ము కాసి రాష్ట్రాన్ని దెబ్బకొట్టడంలో కీలక పాత్ర పోషించింది అనే మకిలి కూడా పూసుకుంది. దానికి కారణం – ఢిల్లీ నుంచి వచ్చే దేవధర్ లాంటి వాళ్లు ఇష్టారీతిన మాట్లాడటం, జీవీఎల్ లాంటి వాళ్లు ఇక్కడ అధికార పార్టీ స్పోక్స్ పర్సన్ అనిపించేలా వ్యవహరించడం, ఇంత జరుగుతున్నా కేంద్రం ఇసుమంత కూడా ఇటు చూడకపోవడం, పట్టించుకోకపోవడం. కానీ ఇప్పుడు అమిత్ షా ఎంట్రీ తర్వాత ఎత్తగడలు మారుతున్న సంకేతాలు వస్తున్నాయ్. ఏపీలో మాకూ ఆశలు ఉన్నాయ్ అంటోంది ఆరెస్సెస్. ఎనిమిది నుంచి పది లోక్ సభ సీట్లు ఆశించవచ్చు అని సుజనా లాంటి నాయకుడి భరోసా, రోడ్ మ్యాప్ రెండూ అందాయ్ అంటున్నారు. మరి ఏపీలో కూడా కరెక్షన్ మొదలవుతుందేమో చూడాలి. అదేంటి చంద్రబాబు ధర్మపోరాట దీక్షలంటూ నల్లచొక్కాలేసి నానాయాగీ చేశాడు అంటారా ! పాయింటే. ఇంచు మించు ఇంతే చేసి – లాలూతో కలిసిన నితీశ్ కుమార్ ను వెనక్కి తెచ్చి, మళ్లీ వాటేసుకొని వసరపెట్టి మూడోసారి కూడా సీఎంను చేయలేదూ. ఇదీ అంతే ! కమలంపై కాలుదువ్వితే నువ్వెంత. కలిసొస్తే కౌగిలింత అనేదే కదా పాలసీ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments