40 C
Vijayawada
Wednesday, April 24, 2024
Homeరాజ నీతిబీజేపీ హయాంలో సీబీఐ సీన్ ఇంతేనా ?  బెంగాల్ నుంచి మొదలైన ఉతుకుడు

బీజేపీ హయాంలో సీబీఐ సీన్ ఇంతేనా ?  బెంగాల్ నుంచి మొదలైన ఉతుకుడు

మెచ్చినోడికి నచ్చినోడు దొరికితే ఇక చచ్చినా ఆ బంధం అంత తేలిగ్గా తెగదు. కొన్ని రిలేషన్లు అలాగే ఉంటాయ్. ఢిల్లీ లెవెల్లో సీబీఐ వాడకం కూడా అలాగే ఉందని ఇప్పుడు కొత్త ఉతుకుడు మొదలైంది. సీబీఐ ఏం చేస్తోంది… ఎందుకు చేస్తోంది… కీలకమైన కేసుల్లో చేతులు ఎందుకు ఎత్తేస్తోంది… తేలిపోయిన కేసుల్లో మాత్రం కొత్త కోరలు తొడుక్కొని మరీ ఎందుకు విరుచుకుపడుతోంది అంటూ వాస్తవాలు తవ్వి తీయడం స్టార్ట్ అయ్యింది. హాట్ పొలిటీషియన్లు, బిగ్ షాట్లు ఇంకా చాలా మంది జాతకాలు మార్చే ఈ తవ్వకాల సంగతి ఏంటో చూస్తే… తత్వం బోధపడుతుంది.

ఆ ఏముంది… సీబీఐని ఎప్పుడూ అలాగే వాడతారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఆ సంస్థ పని చేస్తుంది అని పూచిక పుల్ల వాదనలు చేసే వాళ్లకి మొదటే కళ్లు తెరిపిస్తే మేలు. అందుకే పదేళ్ల నాటి పరిస్థితులు ఓసారి చూద్దాం ! చాలా మందికి శిక్షలు పడింది ఆ కాలంలోనే ! చాలా మందిపై వేలు, లక్షల కోట్ల దోపిడీలకి సంబంధించి విచారణ మొదలైంది కూడా అప్పుడే ! అప్పుడు ఏం జరిగిందో చూస్తే ఆ కేసుల్లో వాస్తవం ఎంతో తేలిపోతుంది. యూపీయే హయాంలో సీబీఐ కేసుల్లో కన్విక్షన్ వచ్చి సందర్భాల్లో భూకంపాలే పుట్టేవి. కాంగ్రెస్ నాయకులతో పాటు కాంగ్రెస్ మిత్ర పక్షాల నేతలకు కూడా నిక్కచ్చిగా శిక్షలు పడటమే దానికి కారణం. బొగ్గు కుంభకోణంలో శిబుసోరేన్ తో పాటు తెలుగు ప్రముఖులు కూడా దొరికిపోవడం అప్పటి వాస్తవమే ! నేరుగా సోనియాతో పరిచయాలు ఉండి లాబీయింగ్ చేయగల్గిన వాళ్లు కూడా కటకటాల్లోకి పోయారంటే కారణం నిక్కచ్చితనమే ! చట్టం తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ నమ్మడమే దానికి కారణం. ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇది. ఇదే నిజం కాకపోయి ఉంటే కాంగ్రెస్ కీలక మిత్రపక్ష డీఎంకే అంత గడ్డు పరిస్థితి ఎదుర్కొనేది కాదు. టుజీ కేసులో రాజాతో పాటు కరుణానిధి కూతురు కనిమొళి కూడా జైల్లో పడటం అప్పటి సంచలనం. కదల్లేని స్థితిలో, వీల్ ఛైర్లో కరుణానిధి సోనియాను కలిసినా పరిస్థితి మారలేదంటే సీన్ అర్థం అవుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తిరగబడింది అనే చర్చ బెంగాల్ నుంచి జరుగుతోంది.

నారద కుంభకోణంలో కొత్తగా అరెస్టులు జరగడమే దానికి కారణం. తృణమూల్ నేతలు గంపగుత్తగా దోచేశారు అనేది అభియోగం. ఆరేళ్లుగా నడుస్తోంది కేసు. అప్పట్లో 12 మందికిపైగా కీలక నేతలపై కేసులు ఉన్నాయ్. అయితే వాళ్లలో ఇప్పుడు కొంత మంది బీజేపీలో చేరారు. వాళ్లపై మాత్రం సీబీఐ విచారణ జరగడం లేదు. కొత్తగా అరెస్టులు లేవు. సువేందు అధికారి, ముకుల్ రాయ్ లాంటి వాళ్లు అలాగే బయటపడ్డారు. బీజేపీలో చేరని వాళ్లపై మాత్రం సీబీఐ కక్ష కట్టినట్టు గురిపెట్టి మరీ లోపల వేస్తుండే సరికి ఇక సెగ రేదింది. అసలు ఆరేళ్లుగా ఏం జరుగుతోంది… అవినీతి అక్రమాలు దోపిడీ కేసులు ఉన్న పొలిటీషన్ల విషయంలో సీబీఐ ఒకలా ఉంటోంది. కేంద్రంలో పెద్దల కాళ్ల మీద పడేవాళ్లని వదిలేస్తున్నారు. అలా కాకుండా ప్రత్యర్థులుగా ఉన్న వాళ్లనీ, కంటగింపు అవుతారు అనుకున్నవాళ్లనీ మాత్రం వెంటాడుతున్నారు – అంటూ చిట్టా చెబుతోంది తృణమూల్.

చిదంబరంపై కేసులు కట్టి… బలప్రయోగం చేసి వెంటాడి జైల్లో నెట్టడం, లాలూకి శిక్ష వేయడం, కర్ణాటకలో కాంగ్రెస్ పెద్ద దిక్కు డీకే శివకుమార్ ను ఇప్పటికీ వెంటాడటం, శశికళను జైల్లో పెట్టడం, తృణమూల్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టడం, రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ ప్రత్యర్థుల్ని తరుముకు రావడం , మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి మరీ కేసులు కట్టడం, మహారాష్ట్రంలో ఎన్సీపీ నేతల్ని టార్గెట్ చేయడం… ఇలా చాలా పెద్ద చిట్టానే చెబుతోంది బెంగాల్ మీడియా. ఈ కేసుల్లో కొన్నింటిలో ఆధారాలు ఉన్నాయి కదా అంటారేమో, అంత కంటే పెద్ద అధారాలు ఉండి, అటాచ్ మెంట్లు జరిగి, దేశం మొత్తం ఆశ్చర్యపోయిన దోపిడీ కేసుల్లో మాత్రం కదలిక లేదు. పిటిషన్లు పడుతున్నా చలనం లేదు. మరి రాజకీయ ప్రత్యర్థులపై ఉన్న కేసుల్లో మాత్రమే విచారణలు ఎందుకు జరుగుతున్నాయన్నది తృణమూల్ ప్రశ్న.

బెంగాల్ రాజకీయం సంగతి ఏదైనా కావొచ్చు, సీబీఐ ఎంత పక్షపాతంతో అయినా ఉండొచ్చు గాక ! ఒక్కటి మాత్రం నిజం. సీబీఐ కేసు కట్టిందంటే కాలర్ పట్టి కొక్కేనికి వేళ్లాడదీసినట్టే ! వేళ్లాడుతూనే ఉండాలి.
ఇవాళ కాకపోతే రేపు అయినా విచారణ జరగాల్సిందే ! శిక్ష పడాల్సిందే ! అందులోనూ మరీ ముఖ్యంగా దోపిడీ కేసుల్లో శిక్షలు పడిన దాఖరాలు 90 శాతానికిపైగా ఉన్నాయ్. కావాలంటే లాలూను, శశికళను అడగండి. కేసు విచారణను ఆలస్యం చేయగలరు, చప్పిడి వాదనలతో కొన్నాళ్లు, కొన్నేళ్లు నీరు గార్చగలరేమో కానీ తప్పించుకోవడం మాత్రం కుదరదు. ఇప్పుడు బెంగాల్ మాట్లాడుతున్నది పక్షపాతం గురించి మాత్రమే ! వాస్తవాలు ఏంటో… ఎవరి జాతకాలు ఎలా ఉంటాయో… బహుశా భవిష్యత్ లో తెలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments