బీజేపీ కరెక్షన్ చేసుకునే పనిలో ఉంది. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో సరిచేసుకుంటూ, రాజకీయ అవకాశాలు వెతుక్కునే పనిలో ఉంది. సాగు చట్టాల రద్దు అలా సరిచేసుకున్న లెక్కే ! ఏపీలో వేస్తున్న అడుగులేమో అవకాశాల వెతుకులాటగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ మనకేం స్టేక్స్ లేవు అంటూ స్టేట్ ని చూసీ చూడనట్టు ఊరుకున్న బీజేపీ ఇప్పుడే ఎందుకు యాక్టివేట్ అవుతోంది ? కీలక నేతను రంగంలోకి దింపి, నువ్వే అంతా చూసుకో అన్నట్టు సంకేతాలు అమిత్ షా ఎందుకు ఇచ్చినట్టు ? ఇంతకీ షా ఏపీలో ఏం గ్రహించాడు ?
ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదు. వాళ్లంతా రైతులు కాదు, కొన్ని పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు అని కిసాన్ ఆందోళనల్ని కేంద్రం కొట్టిపారేస్తూ వచ్చింది. అంతర్జాతీయంగా ఎవరైనా మానవతా దృక్పథంతో రైతులకి సపోర్టుగా మాట్లాడినా ఎదురుదాడి చేసింది తప్ప వెనక్కి తగ్గింది లేదు. ఉన్నట్టుండి గురునానక్ జయంతి రోజున జ్ఞానదంతం మొలిచినంత స్పష్టంగా పొద్దుపొద్దున్నే మోడీ ప్రకటన చేయడం వెనక చాలానే ఎక్సరసైజ్ నడిచింది. బీజేపీ బలం క్రమంగా తగ్గుతోంది. తగ్గుతుంది కూడా ! ఎందుకంటే రెండు తడవలు అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకత సహజం. అందులోనూ మోడీ మార్క్ డీలింగ్ కాబట్టి ఆ ప్రమాదం మరింత ఎక్కువ. పైగా ఏం చేశారు ? ఏం సాధించారు ? కొత్తగా కట్టినవి, తెచ్చినవి, చేసిన డెవలప్ మెంట్ వర్క్సు ఏమున్నాయ్ ? అని ఆరా తీస్తే మోడీ స్కోర్ చాలా తక్కువే. అందుకే గేమ్ వేగంగా మార్చుకోవాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది బీజేపీ. పంజాబ్ లో జరిగే ఎన్నికలతోపాటు యూపీలో కూడా సాగు చట్టాలు కీలకం. రైతులు రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో వెనక్కి తగ్గడం వ్యూహాత్మకం. పంజాబ్ లో కొత్తగా అమరీందర్ సింగ్ పార్టీ పెట్టాడు. నిన్న మొన్నటి వరకూ ఆయన కాంగ్రెస్ సీఎం. ఇప్పుడు బీజేపీ మిత్రుడు. ఈ సాగు చట్టాల రద్దు తర్వాత అమరీందర్ తో కలిసి కాంగ్రెస్ ను ఓడించగలమన్నది బీజేపీ ధీమా. పశ్చిమ యూపీలోనూ ఈ రద్దు ప్రభావం ఉంటుంది. మామూలుగానే పవర్ ప్లే లో మోడీ షా తిరుగులేని నిపుణులు. దానికితోడు జనానికి కావాల్సిన నిర్ణయాలు కూడా తీసుకుంటే ఇక తిరుగే ఉండకపోవచ్చు అనేది వాళ్ల కేలిక్యులేషన్. మరి ఇదే పరామీటర్స్ లో చూస్తే ఏపీలోనూ బీజేపీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్ కి తెరలేపుతోందా ?
2024 నాటికి బీజేపీకి కొత్త బలం, బలగం కావాలి. కొత్తగా కొన్ని రాష్ట్రాలు కావాలి. బేస్ ఏర్పాటు చేసుకోవాలి. దాని కోసం అమిత్ షా వేగంగా పావులు కదుపుతున్నాడు. ఇప్పటి వరకూ ఏపీపై బీజేపీకి పెద్ద ఆశల్లేవు. ఇక్కడున్న ఏపీ ప్రభుత్వం అడిగింది చేయడం, అప్పులు ఇప్పించడం, ఆదుకోవడం ఒక్కటే కర్తవ్యం అన్నట్టుగా ఉంది వాళ్ల తీరు. ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత ఉంది. అమరావతి లాంటి సంక్షోభాలు ఉన్నాయ్ అని చెప్పినా, మనం ఏదైనా చేస్తే టీడీపీ కదా లాభపడేది, ప్రభుత్వ వ్యతిరేకతను మనం సొమ్ము చేసుకోలేం కదా, చంద్రబాబు లాభపడతాడు అని ఆగింది. ఇదే వాస్తవం. అలాంటిది అమిత్ షా నేరుగా రంగంలోకి దిగి ఏపీ ప్రభుత్వం మన మిత్రపక్షం కానేకాదు, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడండి అన్నాడంటే ఓ క్లారిటీకి వచ్చేసినట్టే అనుకోవాలి. అంటే ఇన్నాళ్లూ ఉన్న భయం సంగతి ఏంటి ? ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేం కదా అనే సంశయం తీరిపోయిందా ? ఎస్ ! చాలా స్పష్టత వచ్చిందనే అనుకోవాలి.
కొన్నాళ్లుగా తెర వెనక కసరత్తు జరుగుతోంది అని చెబుతున్నారు. ఏపీలో మనకి అవకాశాలు ఉన్నాయ్ అని నిరూపించండి మనం ఆలోచిద్దాం అన్నట్టుగా ఉంది బీజేపీ నాయకత్వం ధోరణి. ఈలోగా జీవీఎల్, దేవధర్, వీర్రాజు లాంటి వాళ్లు తమ పబ్బం గడుపుకొంటూ వచ్చారు. అది వేరే సంగతి. రాజధాని సంక్షోభం కూడా వాళ్లకి అవకాశంగా కనిపించలేదు. పైపెచ్చు, 13 జిల్లాలకీ 13 రాజధానులు కడతాం అని వీర్రాజు మాట్లాడ్డం చూశాక ఏపీ ఇక బీజేపీని ఛీదరించుకోవడం కూడా వేస్టు అనే నిర్ణయానికి వచ్చేసింది. కానీ ఇప్పుడు లెక్క మారడానికి కారణం ఒక్కటే. ఏపీకి ఏం కావాలో చేయండి, అవకాశం ఎందుకు ఉండదో చూద్దాం, రాజకీయంగా ఎలా బలపడతామో చూపిస్తాం అని సుజనా లాంటి నాయకుడు ప్రపోజల్ పెట్టి, పర్ఫెక్టు కేస్ ప్రజంటేషన్ చేసినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయ్. బహుశా యూపీ ఎన్నికల తర్వాత నిర్ణయం ఉండొచ్చు అనుకున్నారు. కానీ సాగుచట్టాల రద్దు కంటే ముందే ఏపీని సర్ ప్రైజ్ చేస్తూ అమిత్ షా అమరావతి ప్రకటన, బీజేపీ వ్యూహం రెండూ పట్టాలెక్కుతున్నట్టుగా ఉన్నాయ్.
రాజధాని పోరాటం కీలక ఘట్టంలో ఉంది. విచారణ సాగుతోంది. హైకోర్టు ఇక్కడ ఉంటే న్యాయ రాజధాని కర్నూలు అని ఎలా చెబుతారు అని ధర్మాసనం ప్రశ్నించింది. సరిగ్గా కాస్త అటూ ఇటుగా అదే సమయానికి అమిత్ షా ప్రకటన కూడా వచ్చింది. అమరావతి ఏపీ రాజధాని అని మద్దతిస్తాం అని తేల్చేశాడు. ఆయన హోంమంత్రి. అంటే రాజధాని విషయంలో కీలకమైనది ఆయన శాఖే ! ఆయన ఓ స్పష్టత ఇఛ్చిన తర్వాత ఏపీకి ఓ క్లారిటీ వచ్చినట్టే అనుకోవాలి. ఇది మొదలు. ఇక ముందు ముందు బీజేపీ ఇక్కడ ఎలాంటి అడుగులు వేయగలదు, ఏపీకి ఏం చేయగలదు, సుజనా లాంటి నాయకుడు రాజకీయంగా ఎలాంటి అప్రోచ్ తో వెళతారు అనేది కీలకం. ఎందుకంటే ఏపీ తాళాలు కేంద్రం చేతిలో ఉన్నాయ్. నిధులు, కేంద్ర సంస్థలు, రాజధానుల తలనొప్పికి జెండూబామ్, అన్నిటికీ మించి రాజ్యాంగ వ్యవస్థల రక్షణ ఇలాంటివన్నీ ఢిల్లీ చేసేవే !
ఏపీలో వన్ సైసెడ్ అరాచకాన్ని ఆపగలిగింది మేమే, ఆపుతున్నది మేమే, ఏపీని పట్టాలెక్కించేది మేమే – అని బీజేపీ నాయకత్వం దన్నుతో సుజనా లాంటి నాయకుడు స్పష్టంగా ముందుకు వచ్చి చెప్పగల్గిన నాడు ఏపీ ఆలోచన మారుతుంది. ఇప్పటి వరకూ ఏపీ దృష్టిలో బీజేపీ కుర్తా పైజామా పార్టీ. మనకి సంబంధం లేని భాష మాట్లాడి, మనం సఫర్ అవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్న పార్టీ అనేది జనం అభిప్రాయం. కానీ మన కోసం ఒకడు వాళ్లని ఒప్పించి, మెప్పించి మన దారికి తెచ్చి మన కోసం పని చేస్తానూ అంటే కాదనేందుకు కారణం ఏం ఉంది ? పైగా విభజన జరిగి ఏడెనిమిదేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకూ సాధించింది ఏంటి ? సరిగ్గా ఇదే పాయింట్ ఏపీలో కలిసొస్తుంది వాళ్లకి ! కార్యసాధకుడు లాంటి నాయకుడు ముందు ఉండి, ఇదిగో నేను ఇవి చేశాను, మీరు ఓటేస్తే ఇంకా చేస్తానూ అని చేతల్లో చూపిస్తే చేయి కలిపినడుస్తుంది ఏపీ ! ఎవరైతే మవకేంటి !