40 C
Vijayawada
Wednesday, April 24, 2024
Homeరాజ నీతిరాజధాని బిల్లు గొడవలోకి కేంద్రం ఎంటరైతే !

రాజధాని బిల్లు గొడవలోకి కేంద్రం ఎంటరైతే !

ఊరవతల చెరువులో నీకు 48 గజాల ఇళ్ల స్థలం ఇచ్చాం… పండగ చేస్కో లేకపోతే ముడ్డి మీద తంతాం అనేది మన సంక్షేమం. ఇంతోటి శకంలో అమరావతి మళ్లీ మొదలైంది అని స్వీట్లు పంచుకోవడం ఏంటో, లేదు లేదు అంటూ అంతలోనే నిర్వేదం ఏంటో అర్థం కాదు. అందుకే ఆంధ్రులు అల్పసంతోషులు అనేది. ఇప్పుడు ఇంకో కొత్త పుకారు లేచింది కేంద్రం చెప్పింది, అందుకే మూడు రాజధానుల బిల్లు స్క్రాప్ అయిపోయింది అని ! నిజమేనా ? అసలు రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా ? రాజధాని బిల్లు గొడవలోకి కేంద్రం ఎంటరైతే !

 

ఆగస్టు వరకూ ఇంతే. అప్డేట్ రావాలంటే ఆగస్టు దాటాలి. సుప్రీం చీఫ్ జస్టిస్ మారిన తర్వాతే, చూస్తారుగా అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయ్ నిన్నటి నుంచి. హండ్రెడ్ పర్సెంట్ అదే నిజం కాకపోయినా చాలా వరకూ వాస్తవం ఏమో అనిపిస్తోంది లాజికల్ గా ఆలోచిస్తే ! రాజధాని రైతులు వేసిన కేసు హైకోర్టులో ఓ కొలిక్కి వస్తోంది. అమరావతి రైతులు చేస్తున్న పోరాటం స్వాతంత్ర్య ఉద్యమం లాంటిది అంటూ బెంచ్ కామెంట్ చేసిన తర్వాత క్లైమాక్స్ ఎలా ఉంటుందో దాదాపుగా తెలిసిపోయింది. అందుకే మూడు రాజధానుల బిల్లులో చిల్లులు పూడ్చి మరీ కొత్తగా తెచ్చేందుకు సిద్ధం అవుతాం – అంటూ ప్రకటన వచ్చింది. మరి ఇంతలోనే ఆగస్టు అంటున్నారు అంటే, ఏం జరగబోతున్నట్టు ? ఏప్రిల్ నాటికి విశాఖకు మకాం మార్చి, ఆ తర్వాత కొన్ని విభాగాలు కర్నూలుకు ఇంకొన్ని విశాఖకు విసిరేస్తే ఆపేదెవరు ! టెక్నికల్ గా చూస్తే కాదనడానికి కారణం కనిపించదు. అప్పటికి మూడున్నరేళ్లు అవుతాయ్ కాబట్టి గట్టిగా చేతిలో ఉండేది మరో ఆర్నెల్లో, తొమ్మిదినెలలో ! ఆ తర్వాత ఎన్నికల హడావుడి తోసుకొచ్చేస్తుంది. ఏం చేయకుండానే టర్మ్ ముగింపుకొస్తుంది. చేద్దామంటే ఆపేశారు, కోర్టులకెళ్లి ఇబ్బంది పెట్టారు అని చెప్పుకోడానికి ఉంటుంది అనేది వ్యూహం. నమ్ముదామా లేదా అనేది జనం తెలివిని బట్టీ ఉంటుంది. ఇంతకీ కేంద్రం సంగతి ఏంటి ?

 

అదేదో సినిమాలో హీరోయిన్ చెప్పినట్టు… దూరం నుంచి ఇష్టమే దగ్గరగానే భయం అన్నట్టుంది కేంద్రం తీరు. అమిత్ షా ప్రకటన చేశాడు. వెళ్లి అమరావతి యాత్రను సపోర్టు చేయండి అన్నాడు. అమరావతే మా విధానం అన్నాడు. ఒకే రాజధాని అని నాన్చకుండా తేల్చే చెప్పాడు కానీ ఇవేమీ అధికారికం కాదు. రాజకీయంగా ఆయన పార్టీ విధానం చెప్పాడు. మరి పార్టీ విధానం అది అయినప్పుడు… అధికారం చేతిలోనే ఉందిగా అదే అఫీషియల్ గా చెప్పొచ్చుకదా అంటే చెప్పడం లేదు. అదే మెలిక. ఏపీలో బీజేపీకి స్టేక్స్ లేవు. ఆశల్లేవు. అందుకే ప్రత్యేకించి వ్యూహాల్లేవు. ఇప్పటి వరకూ ఉన్న అంచనా ప్రకారం అయితే… మార్చిలో యూపీ ఎన్నికల తర్వాత ఏపీ లాంటి రాష్ట్రాలపై ఎలా వెళ్లాలో ఓ కొలిక్కి వస్తాయ్ ఆలోచనలు అంటున్నారు. మేం పార్టీకి పని కొచ్చేలా రాజకీయం నడిపించగలం అని రాష్ట్ర నాయకులు నమ్మకం కలిగిస్తే ఏమైనా చేస్తారేమో చూడాలి. అలా చేయగల్గిన వాళ్లు ఒక్కటీ అరా మాత్రమే ఉన్నారు. నిజానికి అది సులభం కూడా ! వ్యక్తిగత విచారణలు పెండింగ్ లో ఉన్న సమయంలో ఇక్కడ ఎంత పెద్ద చేప అయినా కేంద్రం చెప్పినట్టు చేయాల్సిందే కాబట్టి ఢిల్లీ తల్చుకుంటే అవ్వొచ్చు. కానీ ఆల్రెడీ కేంద్రం తల్చుకుంది అనేది మాత్రం నిజం కాదు.

 

చెప్పొచ్చేదేంటంటే, అమరావతి విషయంలో ఇప్పటికిప్పుడు సమీకరణలు ఏం మారిపోలేదు. రైతుల యాత్ర అలాగే కొనసాగుతోంది. అటు తిరుమల చేరాక ఇటు సింహాచలం వరకూ వెళ్లి ఉత్తరాంధ్రను కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం వచ్చినా రావొచ్చు. ఈలోగా కోర్టు విచారణ కొలిక్కిరావొచ్చు. కానీకి పరిమితులు ఉంటాయ్. ఏం చేయకూడదో కోర్టు చెప్పగలదు. రైతులతో ఒప్పందాలు, చట్టబద్ధత లాంటివి అనమాట. అంతేగానీ ఏం చేయాలో ఆ కుర్చీలో ఉన్నవాళ్లని ఆదేశించలేదేమో ! అదే పాయింట్ పట్టుకొని ఇప్పుడు కొత్త బిల్లు ఎక్సరసైజు మొదలైంది. ఇలాంటి సమయంలో పోరాటం చేయడం, మళ్లీ అమరావతి నెత్తిన ఎప్పుడు పొద్దు పొడుస్తుందా… అని ఎదురు చూడటం మినహా మరో గత్యంతరం లేదు.

 

రాష్ట్ర భవిష్యత్తు గందరగోళంలో పడేలా, తరాల కొద్దీ జీవితాలు వెనక్కి పోయేలా… మూడు నాలుగు ముక్కలంటూ ఓ నిర్ణయం మీద రుద్దాలనుకోవడం శిక్ష. నిర్బంధాలు, అడ్డుకట్టలు, వ్యతిరేకత మీద ఎలా పోరాడాలో, ఆ శిక్షను ఎలా ఎదిరించాలో అమరావతి పోరాటం చూపిస్తోంది. ఇప్పటికీ కొంత మందికి అది ఓ 30 వేల మంది రైతుల పోరాటంలా కనిపిస్తోంది కానీ వాస్తవం వేరు. రాజధాని లేకుండా గందరగోళంలో పడి కొట్టుకుపోండి అని ఓ జాతి నెత్తిన వేసిన శిక్షను తప్పించుకోవడం ఎలాగో చూపిస్తున్న శిక్షణ అమరావతి పోరాటం. శిక్ష తప్పాలంటే శిక్షణ తప్పనిసరి. అందుకే ప్రకాశం లాంటి జిల్లాలు జైకొడుతున్నాయ్. నెల్లూరు పార్టీ జెండాలు పక్కనేసి మరీ కలిసి నడుస్తోంది. ఇలాంటి అడుగులతోనే గమ్యం మారేది. కోర్టులు ఒడ్డునపడేస్తాయి అనో, రాజకీయ నిర్ణయాలు దయ తలుస్తాయనో ఎదురు చూడటం వల్లో లాభం శూన్యం. రాజధాని రాత మారాల్సింది రాజకీయ నిర్ణయంతోనే ! అయితే అది కుర్చీలో కూర్చున్నవాళ్ల నిర్ణయం కాదు. ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనే నిర్ణయమే రాజధాని రాతను మారుస్తుంది.

 

ఇల్లు కట్టుకుంటే కుటుంబం బాగు పడుతుంది. కమ్యూనిటీ హాలో, కల్యాణమండపమో కట్టుకుంటే ఊరికి మేలు. ఓ ఊరే కట్టగల్గితే ఓ తరమే ఒడ్డున పడినట్టు. అలాంటిది ప్రపంచ స్థాయిలో మహా నగరం నిర్మిస్తే… అది రాష్ట్రం ఉనికిని ఎంతలా మారుస్తుంది ? నిర్మాణాలతో ఎందరి జీవితాలు మారిపోతాయ్ ? పల్లెటూరు లాంటి రాష్ట్రానికి ప్రపంచం రావడం మొదలైతే జీవితాలు,బతుకు రాతలు ఎంత మారతాయ్ ? ఈ అంచనాలు అన్నిటికీ ఒకే ఒక్క కేంద్ర బిందువు అమరావతి. అమరావతి ఆశ. ఆశ ఆశయం అయిననాడు ఆంధ్ర జాతిని ఎవ్వడూ ఆపలేడు. ఇప్పుడు కావాల్సింది అలాంటి ఆశయమే !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments