కడుపు చించుకుంటే కాళ్ల మీద పడింది అనేది పాత సామెత. కడప చించుకుంటే చంద్రబాబుకి తెగువ దైర్యం రెండూ వచ్చాయ్ అన్నది కొత్త సంగతి. ఏంటి చంద్రబాబుకి ఇంతకు ముందు ధైర్యం లేదా ? అలా ఎందుకు అంటారు అనే ముందు ఇంత సాహసోపేతమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నాడో చూద్దాం ! రాజకీయం ఎంతలా మారిందో, సవాళ్లు చేసి తొడకొట్టి చెప్పే స్థాయికి చంద్రబాబు ఎలా చేరుకున్నాడో అర్థం అవుతుంది. భవిష్యత్ చిత్రం కనిపిస్తుంది.
రాజంపేట. పార్లమెంటు అయినా, అసెంబ్లీ అయినా టీడీపీకి ముందు నుంచి పెద్దగా స్టామినా లేని ఏరియా. గత ఎన్నికల్లో గెలిచినా ఆ నాయకుడు ఇప్పుడు ఎదుటి పార్టీలో ఉన్నాడు. అంటే పట్టుమని అక్కడ అభ్యర్థి కూడా కొత్తే. పైగా సగంపైగా జనాభా వరదల్లో కొట్టుమిట్టాడుతూ పుట్టెడు దుఖంలో ఉన్నారక్కడ. జనాన్ని పిలుచుకొచ్చేందుకు, తోలుకొచ్చేందుకు టీడీపీకి దిక్కూదివాణం తక్కువే. అలాంటి చోటే జనం కిక్కిరిసిపోయారు. సెంటర్ లో ఆగితే హోరెత్తిపోయింది. మమ్మల్ని చుడ్డానికి వచ్చావా… మాతో మాట్లాడ్డానికి ఇంత ప్రయాసపడ్డావా అన్నట్టు ఈలలు, హోరు, హుషారు. పరామర్శ యాత్రలో అరుదుగా కనిపించే దృశ్యం ఇది. పైగా సీమలో అంటే ఏ అనంతలోనో, చిత్తూరులోనో అనుకుంటే పర్వాలేదు. ఇది కడప. రాజంపేట. అయినా చంద్రబాబు దేవుడిలా కనిపించాడు. వాళ్ల ఆప్యాయత బాబును కదిలించింది. అందుకే అధికారంలో ఉన్నోడు వెయ్యి రూపాయలు మాత్రమే విదిలిస్తే ఎన్టీఆర్ ట్రస్టు తరపున ఐదువేలు ప్రకటించాడు. ఆప్తుల్ని కోల్పోయిన కుటుంబాలకు తక్షణం లక్ష అందిస్తానన్నాడు. నాయకులందు చంద్రబాబు వేరయా అనిపించాడు. అదే ఊపులో ఇంకో ప్రకటన కూడా చేశాడు. ఇది అక్షరాలా కడప ఇఛ్చిన దైర్యం. రాజంపేట ఏరియా మీదుగా చిత్తూరు నెల్లూరు చేరిన తెగువ.
గెలిచే పార్టీ అని అప్పటికప్పుడు టీడీపీలో చేరదాం అనుకుంటున్నారేమో, ఈసారి అలాంటి అవకాశం ఇవ్వను. ఇంతకు ముందు ఇలాంటి తప్పులు చేశాను కొన్ని. ఇప్పుడు ఇక ఛాన్సు లేదు అన్నాడు చంద్రబాబు. మామూలుగా అయితే చంద్రబాబు ఇన్ స్వింగర్ కాదు… పుల్ టాస్ ను కూడా డిఫెండ్ చేసుకోవాలి అనుకునేంత డిఫెన్సివ్ గా ఆడతాడు. అలాంటిది క్రీజు ముందుకొచ్చి షాట్ ఆడుతున్నట్టు కనిపిస్తున్నాడు ఈ మధ్య. గెలిచాకే మళ్లీ ఈ సభలోకి వస్తా అని అసెంబ్లీలో సవాల్ చేయడం చూస్తే ఇదీ తడాఖా అనిపించింది. ఆ పాజిటివ్ హ్యాంగోవర్ దిగక ముందే ఇప్పుడు పక్క పార్టీల్లోంచి వచ్చేవాళ్లకి టిక్కెట్లు, ప్రాధాన్యం ఉండవ్ అని ప్రకటించడంలో కాన్ఫిడెన్స్ తోపాటు మరో సందేశం కూడా కనిపిస్తోంది. సందేశంలో రెండు కోణాలున్నాయ్. నాయకుల్లో, కేడర్లో కాన్ఫిడెన్స్ నింపడం ఓ కారణం అయితే.. రెండోది ఎదుటి పార్టీ వాళ్లకి వార్నింగ్ ఇవ్వడం. మీ పార్టీ మునిగిపోయే నావ. ఇప్పుడు అక్కడుండి మా వాళ్ల మీద రాళ్లు వేద్దాం అనుకుంటున్నారేమో మిమ్మల్ని వెంటాడి వడ్డీతో సహా కట్టిస్తామని చెప్పడం అక్కడ ఉద్దేశం కావొచ్చు.
ఇంత తెగువ, ఫ్రంటు ఫూట్ కి వచ్చి ఆడే ధైర్యం చంద్రబాబుకి ఎక్కడి నుంచి వచ్చాయ్ ? ఇంకెక్కడ నుంచి.. జనం నుంచే ! జనంలో కనిపిస్తున్న ప్రతి స్పందన చూశాక ఇక వెనక్కి తగ్గేదేలే అనుకున్నాడు. ఒకట్రెండు సీట్లు గెలిస్తే కనాకష్టం అనుకునే జిల్లా కడప. అయితే రాజంపేట, లేదంటే ప్రొద్దుటూరు. ఇంతే ఈ మధ్యన టీడీపీ గెలిచింది. అలాంటి జిల్లాలో కూడా ప్రభంజనం అంత జనాన్ని చూశాక… ఆహా, ఇక నా రాకను వీళ్లు బలంగా కోరుకుంటున్నారు అనే నిర్ధారణకి వచ్చేశాడు. అందుకే ఇక మైండ్ లో ఎలాంటి శషభిషలూ పెట్టుకోలేదు. కేలిక్యులేషన్లు, మేనిప్యులేషన్లు లేవు నేరుగా చెప్పేయడమే అనుకున్నాడు. ఇది వరకటిలా ఉండదు, ఇక ముందు ఆడే గేమే వేరు అని చెప్పదల్చుకున్నట్టుగా కనిపిస్తున్నాడు చంద్రబాబు. ఎందుకంటే కేడర్ అంతా సఫకేషన్ లో ఉంది. లీడర్లు వచ్చినా రాకపోయినా పల్లెల్లో జిల్లాల్లో కేడరే ముందుండి కదులుతోంది. తేల్చుకుందాం అని సవాల్ చేస్తున్నది కేడరే తప్ప లీడర్లు కాదు. అలాంటి వాళ్లలో ఏదో మూల అనుమానం లేకపోలేదు. ఇంతా చేసి మనం పోరాడితే రేపు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వాళ్లని తెచ్చి మన నెత్తిన పెడతాడేమో 2014లో పెట్టినట్టు అనుకుంటున్నారు చాలా మంది. అలాంటి వాళ్లకి క్లారిటీ ఇచ్చినట్టుగా చెప్పాడు బాబు.
కాన్ఫిడెంట్ గా క్లియర్ గా చెప్పే చంద్రబాబు ఫామ్ లో ఉన్న బ్యాట్సుమన్ లాంటోడు. ఎదుటివాడు ఎలాంటి బౌన్సర్ వేసినా వాడి దగ్గర ఆన్సర్ ఉంటుంది. అలాగే చంద్రబాబు కూడా ! నువ్వెన్ని సవాళ్లు విసిరినా నేను తేల్చుకుంటా అన్నట్టు ఉంటున్నాడు. అప్పుడెప్పుడో 1996కి ముందు చంద్రబాబులో దూకుడు ఉండేదని, తేల్చుకుందాం రా అంటూ ఎదురు దూకేవాడనీ చెబుతారు దగ్గర నుంచి చూసినవాళ్లు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక – అమ్మా డెమక్రసీ అంటూ డిఫెన్సివ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు మళ్లీ దూకుడు చూపిస్తున్నాడు అంటే మళ్లీ 40లలో ఉన్న బాబు కనిపిస్తున్నాడనే అనుకోవాలేమో ! ఈ దూకుడు ఇలాగే కొనసాగితే పొలిటికల్ గేట్లు పగలగొట్టే స్థాయిలో, ఇది నా గడప అంటూ బోరవిచుకుంటున్నవాళ్ల గూబ పగిలే స్థాయిలో… రిజల్ట్ చూపించగలదు టీడీపీ. అదేం పెద్ద లెక్క కాదు