28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిచిరంజీవికి రాజకీయ స్కోప్ ఉందా ?

చిరంజీవికి రాజకీయ స్కోప్ ఉందా ?

చిరంజీవి అద్భుతమైన నటుడు. ఈ వయసులో కూడా చిరు మెయింటైన్ చేసే తీరు, సినిమాల మీద ఆ ప్యాషన్, కంపాషన్ నెక్ట్స్ లెవెల్. అనుమానం లేదు. ఎవరినీ పరుషంగా మాట్లాడని స్వభావం కూడా ఆకట్టుకుంటుంది. అద్భుతం అనిపిస్తుంది చాలా సార్లు. ఇదంతా సినిమా. మరి రాజకీయం ? ఆయనిప్పుడు రాజకీయాల్లో లేరు కదా అనొచ్చు. రాజకీయాలకి దూరంగా ఉంటూనే రాజకీయాల చుట్టూ తిరిగే ఉపగ్రహంలా ఉండే ఉద్దేశాలు ఉండటం చాలా మందికి సహజం. అందుకే సినిమా టిక్కెట్ల కోసమేమో అని గొర్రె దాటు మీడియా ఊహాగానాలు చేస్తుంటే, రాజకీయం అర్థమైన వాళ్ల ఆలోచనల్లో మాత్రం వేడి పెరుగుతోంది. ఇంతకీ మేటర్ ఏంటి ? మీటింగ్ వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు ? రాజనీతి ఏం చెబుతోంది ?

చిరంజీవితో సమావేశం తర్వాత టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించవచ్చు. ఆ క్రెడిట్ చిరంజీవికి ఆపాదించవచ్చు. బహుమతిగా చిరంజీవి సందర్భాన్ని బట్టీ – సామాజిక, రాజకీయ కోణాల్లో వచ్చే రెండేళ్లూ కొన్ని ప్రకటనలు, వ్యాఖ్యలూ కూడా చేయొచ్చు. ఇదంతా మనం చూడొచ్చు.

2009లో నేను అధికారంలోకి వచ్చి ఉండాల్సింది. చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల ఓట్లు చీలి, కాంగ్రెస్ బయటపడింది అని చంద్రబాబు గుర్తు చేసుకొని సరిగ్గా మూడు రోజులు. కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోంది అంటూ ఆ వర్గ ఐకాన్స్ అనుకునేవాళ్లంతా ఏకం అయ్యి పార్టీ పెడతారన్న ప్రచారం ఏపీలో మొదలయ్యి నెల రోజులు దాటింది. చిరు సినిమాలకి చంద్రబాబు అన్యాయం చేశాడు, బాలక్రిష్ణ సినిమాలకు రాయితీలు ఇచ్చి చిరంజీవి సినిమాలకు ఇవ్వలేదు అని మంత్రి పేర్ని నాని ఆరోపించి కూడా మూడు వారాలు దాటింది. నిజానికి చంద్రబాబు హయాంలో చిరు చారిత్రక సినిమా తీయలేదు అది వేరే సంగతి. వాళ్ల లెక్క ప్రకారం వాస్తవాలు కాదు వాదన కావాలి. చిరంజీవికి ఉన్న పరిణతి, ఆలోచన పవన్ కల్యాణ్ కి లేవు. అన్న పేరు చెప్పుకొని సినిమాల్లో బతుకుతున్నాడు అని మంత్రులు హేళన చేయడం మొదలు పెట్టి కొన్ని నెలలు. ఎవరైనా ఎవరో ఒకరి పేరు చెప్పుకోవాల్సిందే మన దగ్గర, ఏం జగన్ మాత్రం వైఎస్ పేరు చెప్పుకోలేదా – అని రామ్ గోపాల్ వర్మ అడిగిన విషయం ఇక్కడ అక్కర్లేదు. ఇక్కడ చెప్పిన నాలుగు విషయాలూ వేర్వేరు. కానీ వీటన్నిటినీ చిరంజీవి కోణంలో కలిపి చూస్తే కొత్త సినిమా కనిపించే అవకాశం ఉందేమో చూద్దాం !

సినిమా ఇండస్ట్రీకి నేను పెద్ద అనే హోదాలో ఉండాలి అని నేను అనుకోవడం లేదు అని చిరంజీవి క్లియర్ గా చెప్పడం విన్నాం. మా ఎన్నికల్లో తాము నిలబెట్టిన ప్రకాశ్ రాజ్ ఓడిపోయే సరికి ఇలా అన్నారని కొందరు, కాదు కాదు అందరూ తన దగ్గరకి వచ్చి రిక్వెస్ట్ చేయాలని ఉద్దేశం ఉండొచ్చు అని ఇంకొందరు మేథోమథనం చేశారు. బహుశా వాస్తవం వేరు. సినిమా టిక్కెట్ల గోల నా దగ్గర ఎత్తకండి. అది ఏపీ గవర్నమెంటుతో మాట్లాడాలి. మాట్లాడితే వాళ్లతో చెడగొట్టుకున్నట్టు అవుతుంది. అది నా వల్ల కాదు – అని ఆయన అంతరాత్మ ఉద్దేశం అయ్యుండొచ్చు. పవన్ కల్యాణ్ లాంటి ముక్కుసూటిగా మాట్లాడేవాళ్లు, నాని లాంటి కుర్రదూకుడు ఉన్నవాళ్లు, బాలయ్య లాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లే మాట్లాడుతున్నారు. మిగతా వాళ్లు బాగానే ఉన్నారు కదా అనే ఫీలర్ ఇవ్వడం అక్కడ ముఖ్యం. అందుకే సినిమా ఇండస్ట్రీకి లాభమో నష్టమో అనేదాని కన్నా తన రిలేషన్స్ మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపించింది. ఆయన కోణంలో అది కరెక్టే కావొచ్చు కూడా ! చిరంజీవి ఇలా పరోక్షంగా సమర్థించేలా మాట్లాడ్డం ఇదేం మొదటి సారి కాదు. కొత్త అంతకన్నా కాదు. 2009 ఎన్నికల ముందు, మీడియా అఢిగింది – ఒక వేళ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అని. ఇప్పుడు ప్రభుత్వం (వైఎస్) అమలు చేస్తున్న పథకాలనే మరింత సమర్థంగా అమలు చేస్తా, లోపాలు లేకండా చూస్తా అన్నారు చిరంజీవి. అది అవగాహన లేక అన్నమాట అనుకున్నారు చాలా మంది. కానీ, వేస్తే నాకు ఓటు వేయండి, లేదంటే వైఎస్ కే వేయండి అని చెప్పాలనుకున్నది అలా చెప్పారూ అని ఫలితాలు వచ్చాక తెలిసింది అందరికీ ! ఇప్పటికీ చంద్రబాబు మొత్తుకోడానికి కారణం అదే. ఆ మాట మొహమాటం వల్ల నేరుగా చెప్పలేడు చంద్రబాబు. అందుకే పీఆర్పీ వల్ల ఓడిపోయా అంటాడు. చిరంజీవి నాతో బాగా ఉంటారు, మా ఇద్దరికీ స్నేహం ఉంది అంటారు. అదెట్టా ? కొట్టుకోడానికి ముందు కూడా మేం కలిసి కాఫీ తాగాం. కాబట్టి మేం ఫ్రెండ్స్ అన్నట్టు ఉంటుంది ఆ లాజిక్.

2024 ఎన్నికలు ఏపీకి కీలకం. పవన్ రాజకీయ భవిష్యత్ కి మరీ ముఖ్యం. ఆయన తొలి గెలుపు కోసం ఎదురు చూస్తున్న సమయం ఇది. ఇలాంటి టైమ్ లో కొత్తగా ఓ సామాజిక వర్గం పేరుతో పార్టీ పెట్టి, దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతుగా చిరంజీవి లాంటి ఇమేజ్ ఉన్న వాళ్ల ప్రకటన చేస్తే పవన్ అవకాశాలు దెబ్బతినొచ్చు. పవన్ కనుక విపక్ష కూటమిలో ఉంటే కూటమికే దెబ్బ పడొచ్చు కూడా ! అలాంటి అంశాలు ఏమైనా ప్రస్తావనకు వస్తాయా అనేది వాళ్లకే తెలియాలి. ఎందుకంటే ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. ఈ సమయంలో అలాంటి ప్రస్తావన జరిగే అవకాశం ఉందనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కచ్చితంగా జరుగుతోంది. ఇక ఆ తర్వాత అసలు ట్విస్ట్ ఉండొచ్చు. చిరంజీవితో సమావేశం తర్వాత టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించవచ్చు. ఆ క్రెడిట్ చిరంజీవికి ఆపాదించవచ్చు. బహుమతిగా చిరంజీవి సందర్భాన్ని బట్టీ – సామాజిక, రాజకీయ కోణాల్లో వచ్చే రెండేళ్లూ కొన్ని ప్రకటనలు, వ్యాఖ్యలూ కూడా చేయొచ్చు. ఇదంతా మనం చూడొచ్చు.

కుల కుంపట్లు వెలిగించాలి అనుకున్నప్పుడు నిప్పుల కోసం వెదుకుతారు. సహజం. కానీ ఆ నిప్పులతో ఇంకోసారి చేతులు కాల్చుకోవాలా లేదంటే జొన్నపొత్తులే కాల్చుకోవాలా అనేది సమర్థకులు తేల్చుకోవాలి. ఇది వాళ్ల సమర్థతకు సంబంధించిన విషయం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments