31 C
Vijayawada
Friday, April 26, 2024
Homeరాజ నీతిసాయిరెడ్డికి పోటీ ఇచ్చేదెవరు ?

సాయిరెడ్డికి పోటీ ఇచ్చేదెవరు ?

రాజ్యం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కట్టప్ప ముందుకు దూకినట్టు, వైసీపీకి అవసరం అయినప్పుడల్లా రంగంలోకి దిగే ఒకే ఒక్కడు సాయిరెడ్డి. నాకేంటి అనే ఆలోచన, నేను ఇది చేస్తే నాకు ఏ పదవి ఇస్తారు అనే గుంజులాట, నాకు అందరికంటే పెద్ద కుర్చీ వేసి తీరాల్సిందే అనే పిడత పట్టుదల లాంటి వాటన్నిటికీ అతీతంగా వైసీపీ కోసం, ఇంకా చెప్పాలంటే నేరుగా జగన్ కోసం నిలబడే ఒకే ఒక్కడు సాయిరెడ్డి. వైసీపీ ఇప్పటి వరకూ గెలిచిన, నిలిచిన యుద్దాలన్నిటిలోనూ ఆయువుపట్టు అతడే ! అలాంటి సాయిరెడ్డి ఎత్తుగడలను డీ కోడ్ చేయలేకపోవడం, అసలు సాయిరెడ్డి లాంటోళ్లు ఒక్కడంటే ఒక్కడు కూడా లేకపోవడం వల్లే రాష్ట్ర రాజకీయాల్లో బేలన్స్ తప్పి బేలగా కనిపిస్తోంది అప్పొజిషన్.

సాధారణ విషయాన్ని కూడా అతిగా చెపితే, అతిలో అ తీసుకొచ్చి అతికితే అసాధారణం అయిపోతుంది. వైసీపీ ముందు నుంచి ఫాలో అయిన ఫార్ములా ఇదే. బహుశా ప్రశాంత్ కిషోర్ చెప్పి ఉంటాడు – జో భి కరో – బడా కరో అని. అలా చేసింది, ప్రచారం చేసిందీ పార్టీ యంత్రాంగమే అయినా దాని వెనక ఇరుసులా నిలిచి ముందు వెనక చక్రాల్ని పరిగెట్టించి, అన్నిటికీ మించి ఢిల్లీ ఇంజిన్లో హీటు పుట్టించింది మాత్రం సాయిరెడ్డే. టీడీపీ బీజేపీ గాలి ఆడనంత గట్టిగా అతుక్కుపోయిన సమయంలో రంగంలోకి దిగి – చంద్రబాబును నల్లచొక్కాలేసి, గోలెత్తిపోయే స్థాయికి దిగజార్చిన చట్రంలో కీలక తురుపుముక్క కూడా సాయిరెడ్డే. మీరు వైసీపీ ట్రాప్ లో పడుతున్నారు అని మోడీ పార్లమెంటులో చేసిన ప్రకటన వెనక కూడా ఆ ఒక్కడి ప్రభావం సుస్పష్టం. వెనక డోర్ నుంచి వెళ్లాడనో ముందు డోర్ నుంచి వెళ్లాడనో ప్రో టీడీపీ మీడియా-టీడీపీ పీతల వేట సాగిస్తున్న సమయంలో ఎటు నుంచి వెళ్లాం అన్నది కాదు ఏం చేశామన్నది పాయింటు అని ప్రూవ్ చేసింది ఆ చాతుర్యం. ఇది మొదలు ఇప్పుడు అప్పులు పుట్టక అల్లాడుతుంటే – ఇంకో పక్కన అమిత్ షా రంగంలోకి దిగుతున్న సంకేతాలు ఇస్తుంటే మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పేందుకు తిప్పలు పడుతున్నది కూడా ఆ ఒక్కడే !

సాయిరెడ్డి తల్చుకుంటే ఆకాశాన్ని తెచ్చి నేలకి ముడి పెట్టగలడు. పరిమళ్ నత్వానికి పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇప్పించినట్టు. ఎక్కడ రిలయెన్స్ ? ఎక్కడ జగన్ ? ఛాపర్ క్రాష్ తర్వాత దుకాణాలే పగలగొట్టారా, దుమ్మెత్తే పోశారా అదో ఘట్టం. అలాంటివన్నీ చెరిపేసి కొత్తగా రాయాలీ అంటే రెండు వైపులా పదునున్న పెన్సిల్ ఉండాలి. ఉంది. కాబట్టే రాశాడు. యూసీలు ఎక్కడ ? పీడీ అక్కౌంట్లతో కొట్టేస్తున్నారు, పింక్ డైమండ్.. అంటూ పిట్టకథలు పుట్టించింది ఎవరైనా – సమర్థంగా అమలు చేసింది, గుక్క తిప్పుకోనివ్వకుండా చేసి గిలగిల్లాడించింది కూడా ఈ సాయిరెడ్డే ! పార్టీకి పనికి వస్తుంది అనుకుంటే, జగన్ కి కలిసి వస్తుందీ అనుకుంటే చాలు రంగంలోకి దిగిపోవడం, అవసరమైతే ఢిల్లీలోనే మకాంపెట్టి, పని పూర్తి చేయడం సాయిరెడ్డి కమిట్మెంట్. ఇంతలా నిలబడే వాడు, ఇంత కాకపోయినా కొంతైనా ఇలాంటి ప్రయత్నం చేసేవాడు విపక్షంలో – ఎంటైర్ ప్రతిపక్షంలో ఎవరు ? అందుకే బేలన్స్ కుదరడం లేదు ఏపీ రాజకీయంలో !

ఎన్నికల ముందు ఓ ఆడియో బయటకు వచ్చింది. అప్పటి అధికార పక్షం, ఆ పార్టీకి అండగా ఉండే మీడియా అదంతా లీక్ అనుకున్నాయ్. దొరికేసింది, సాయిరెడ్డి జాతకం మన చేతిలో ఉంది అనుకున్నాయ్. చంద్రబాబును కొట్టడం అంత ఈజీ కాదు. వంద దెబ్బలు కొట్టాలనుకున్నప్పుడు వందా కొట్టి తీరాల్సిందే. చివరిలో మనం రిలాక్స్ అయితే చంద్రబాబు తిప్పికొడతాడు. అతడు బలవంతుడు – అని ఉంటుంది ఆ ఆడియోలో. బాబు బలవంతుడు అనే మాట వినపడగానే చెవులకు సొంపుగా అనిపించింది. బాబు మీద ఇన్ని కుట్రలా అంటూ వదిలారు బైటకి. ఫ్రీగా పబ్లిసిటీ ఇఛ్చారు. ఛానెళ్లలో అదే, వాట్సప్పుల్లో అదే, ఎఫ్ బీ పేజీల్లోనూ అదే. కూలుతున్న బాబుకు కలిసి వస్తుంది అని వీళ్లు అనుకుంటే – లాస్ట్ బాల్ వరకూ పట్టు సడలించవద్దు అని సాయిరెడ్డి సందేశం ఇచ్చాడు. ఆ సందేశమే క్లిక్ అయ్యింది అనే సంగతి రెండు నెలల తర్వాత తెలిసింది. అది లీక్ కాదు. సాయిరెడ్డి విసిరిన బొక్క. ట్రాఫ్ అంటే అలా ఉంటది. ఇదో రకం. అదే మీడియా ఓ సారి నేరుగా వార్నింగ్ లాంటి బెదిరింపు చేసింది. విశాఖలో నువ్ చేస్తున్నదేంటో వచ్చేవారం పలుకుతా అని ప్రకటించింది. ఇప్పటికో 30 వారాలు అయ్యుంటాయ్. ఇప్పటి వరకూ పలకలేదు మరి. అంటే సాయిరెడ్డి మేజిక్ ఇక్కడా పనిచేసింది అనుకోవాలేమో ! అంటే బాల్ తమ గోల్ పోస్ట్ వైపు ఉంటే ఎదుటివాడిపైకి మళ్లించడం ఎలాగో తెలుసు, ఎదుటివాడు మన మీదకి వస్తుంటే డిఫెండ్ చేసుకోవడమూ వచ్చు. అందుకే సాయిరెడ్డి ఎత్తుగడలు క్రాక్ కావడం లేదు. ఆ కమిట్మెంట్ మ్యాచ్ లెస్ గా ఉంటోంది ఇప్పటి వరకూ !

 

కొడుకు మీద కక్ష – బాబుకి పడాలి శిక్ష అనేది గత ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి టీడీపీలో చాలా మంది రాసుకున్న అనధికారిక స్లోగన్. నమ్మి ఢిల్లీ పంపినోళ్లదీ ఇదే వరస. ఇక్కడ కుర్చీవేసి నెత్తిన కూర్చోబెట్టుకున్నవాళ్లదీ ఇదే రంది. వాళ్లు బిగిసిపోయారు. వాళ్లని దాటి బాబు వెళ్లలేదు. వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన ఆ సమయంలో హ్యాపీనెస్ ఇండెక్సులు కొలవడంలో యమ బిజీ. అటు సాయిరెడ్డిలో మాత్రం ఇలాంటి ఇగో ఇసుమంత కూడా కనిపించదు. కారు దింపేశాడు జగన్ – విశాఖలో సాయిరెడ్డికి అవమానం అని వ్యతిరేక మీడియా లూప్ వేసి మరీ చూపిస్తది. అయినా మాట్లాడడు. మంత్రులు ఓ ఎంపీకి స్వాగతం పలకడం ఏంటి ప్రోటోకాల్ చచ్చిందా అంటూ అదే మీడియా ఆవేశపడుతుంది. చలించడు. ప్రోటోకాల్ అనేది పదవులకు, వాటిలో ఉన్న వాళ్ల మర్యాదలకూ భంగం కలగకూడదని చేసిన అధికారిక ఏర్పాటు. ఆ పదవిలో ఉన్నవాళ్లకే అభ్యంతరం లేనప్పుడు, మాకన్నా ఎంపీనే పవర్ ఫుల్ అని ఒప్పేసుకున్నప్పుడు ఇక చెప్పేదేముంది ! ఈ అధికారిక సూక్ష్మాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకోగలడు. అందుకే సక్సెస్. ఈ విషయం తట్టదు కాబట్టే సోకాల్డ్ వ్యతిరేక మీడియా గగ్గోలు దగ్గరే ఉండిపోతోంది. అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఇదే.

నాకు రాజారెడ్డి పరిచయం. రాజశేఖర రెడ్డి కోసం పని చేశాను. జగన్ కోసం పని చేస్తున్నాను. కాలం అనుమతిస్తే – వారి బిడ్డల కోసం కూడా నేను ఇలాగే పని చేస్తా. ఇంతకు మించి నేనేమీ ఆశించను – అని సాయిరెడ్డి ప్రకటిస్తున్నప్పుడు ఆ కళ్లల్లో విధేయత కనపడింది. ఆ చేతల్లో కొట్టొచ్చినట్టు అగుపడేది కూడా అదే. అందుకే కేసులు పెట్టినా జంకడు. జైల్లో పెడితే ప్రాణాయామం చేసుకుంటాడు. బయటకు వదిలితే పని చేసుకుంటాడు. పడిన చోటే జగన్ ను నిలబెట్టి అదే విధేయతతో మౌనంగా చూస్తుంటాడు. ఆ ఒక్కణ్ని చూసి మొత్తం ఆ పార్టీ యంత్రాంగమే అటెంటివ్ గా ఉండి, అదే ఫార్ములా ఫాలో అయ్యే ప్రయత్నం తమ తమ స్థాయిలో చేస్తుంది. అందుకే ఎవ్వరూ నోరు మెదపరు. మరి ఇటు ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పైసలు పోగు చేసి ఇచ్చామని కొందరు, పొత్తులు కుదిర్చింది మేమే అని ఇంకొందరు, అధికారంలోకి వచ్చావ్ పే బ్యాక్ చేస్తావా లేదా అని పీక మీద కత్తి పెట్టే మరికొందరు, ఇచ్చిన పవర్ ను అనుభవిస్తూ ఎదురుతిట్టే వాళ్లే అందరూ అని – సాయిరెడ్డి వ్యతిరేక పక్షం సొంత తలనొప్పులతో నిరంతరం మొత్తుకుంటూ ఉంటుంది. సాయిరెడ్డికీ ఏపీ రాజకీయాల్లో మిగతా వారందరికీ ఇదే తేడా ! నాకో పని ఇవ్వడమే పరమార్థం – ఆయన కోసం పని చేయడమే మహద్భాగ్యం అని జగన్ వైపు చూస్తూ, పని చేసుకుంటూ వెళ్లిపోయే సాయిరెడ్డి లేఖ చివర ఎప్పడూ … ఇట్లు మీ విధేయుడు – అనే రాసి ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments