41 C
Vijayawada
Wednesday, June 7, 2023
Homeరాజ నీతిఉచిత పథకాలకు పోయేకాలం వచ్చిందా ?

ఉచిత పథకాలకు పోయేకాలం వచ్చిందా ?

తేరగా అప్పులు తెచ్చుకొని తింటే… దొరికిన కాడికి పంచుకుంటూ పోతే దీనస్థితికి ఎలా దిగజారిపోతామో చేతల్లో చూపిస్తున్న జాతి ఇది. ఫ్రీ పథకాలు మొదలు పెట్టి గ్రైండర్లు, ల్యాప్ టాప్ లూ పంచిన రాష్ట్రాలు కూడా ఇది చూసి భయపడి రూటు మారుస్తున్నాయ్. నంజుకుతింటూ కూర్చుంటే ప్లేటులో చట్నీనే కాదు భవిష్యత్ కూడా కళ్ల ముందు ఎలా మాయం అయిపోతుందో… బతుకు రోడ్డున పడితే ఎలా ఉంటుందో లెక్క తీసి చూద్దాం. వాస్తవాలు తెలుసుకుంటే అయినా కాస్త కళ్లు తెరుచుకుంటాయేమో మనకి ! ఇంకో మాట. పంచినోడికేం పర్వాలేదు. రోడ్డున పడి పర్యవసానాలు అనుభవించాల్సింది మాత్రం జనమే అని – ఇటు చూస్తే తెలిసిపోద్ది.

కాలం కలిసొస్తే సుస్సూ కూడా పెట్రోల్ లా వెలుగుతుందట. అలాంటి వెలుగులు అక్కడ విచ్చలవిడిగా విరాజిల్లాయ్. 1970ల నాటికి తలసరి ఆదాయంలో వాళ్లు ప్రపంచంలోనే టాప్ ఫోర్త్ ప్లేస్. అంటే పట్టిందల్లా బంగారమే. పైగా వచ్చే పాతికేళ్లలో కుమ్మేసే జాతి ఏది అంటే సగం మంది వేళ్లు అటువైపే చూపించేవి. రోజులు అలాంటివి. మూడొంతుల ప్రపంచం వాళ్లతో స్నేహం చేయాలని, దగ్గరగా ఉండాలని, వీలైతే ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకోవాలనీ ఆశ పడింది. పరుగులు తీసింది వాళ్ల చుట్టూ ! ఇది ఫ్లాష్ బ్యాక్. మరి ప్రస్తుతం ఏంటో తెలుసా ! వాళ్ల వైపు చూస్తున్నది ఒకే జత కళ్లు. రాబందులు. పీక్కుతినేందుకు వాళ్ల మీద ఎప్పుడెప్పుడు వాలిపోదామా అని ఆకాశంలో పహారా కాస్తున్నాయ్. ప్రపంచంలో ఏ దేశం వాళ్లను కాపాడలేదు. ఆఖరికి ఐక్యరాజ్యసమితి టెంటులు వేసి, రొట్టెలు పంచుతున్నా బతకలేని దీనస్థితి. అన్నట్టు – అమెరికా నుంచి వెళ్లిన ఓ పెద్దాయన చెప్పాడు – కాఫీ తాగుదామని కరాకస్ లో అడిగితే 28 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారట. కరాకస్ అంటే వెనుజువెలా రాజధాని. అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ దేశం పేరు వెనిజులా.

ప్రపంచంలో పెట్రోలు గుమ్ముగా ఉన్న టాప్ 5 దేశాల్లో వెనిజులా కూడా ఒకటి. ఆ దేశ ఆదాయంలో మూడొంతులు పెట్రో ఉత్పత్తుల నుంచే వచ్చేది. దక్షిణమెరికా దేశాల్లో మామూలుగానే ఖనిజ సంపద, మినరల్స్ ఎక్కువ. చిలీ లాంటి చిన్న దేశాలు కూడా కళ్లు చెదిరే వనరులతో విలసిల్లుతాయ్. అందుకే ఓ యాభై ఏళ్ల కిందట వాళ్ల మీద అంచనాలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉండేవి. ఉత్తరాన అమెరికా – దక్షిణంలో వెనుజులా అన్నట్టు ఉండేది అమెరికా ఖండాల్లో సీన్. అలాంటిది వాళ్ల తలకి వాళ్లే కోరి కోరి కొరివి పెట్టుకోవడం మొదలు పెట్టారు. సోషలిజాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారో ఏమో – పరిపాలన అంటే పంచి పెట్టడమే అనుకున్నారో ఏమో గానీ మొత్తానికి అక్కడ పాలకులకు కొత్త జబ్బు మొదలైంది.

ప్రతీదీ తేరగా పంచి పెట్టడం మొదలు పెట్టారు. ప్రైవేటు సంస్థలు అన్నిటినీ ప్రభుత్వం లాక్కోవడం మొదలు పెట్టింది. పన్నులు విపరీతంగా పెంచేసి, మా జనం బతకొద్దా, ఏ దేశం నుంచి ఎవరు వచ్చినా ముందు మా వాళ్ల సంగతి చూడాలి – లోకల్ రిజర్వేషన్ ఫస్ట్ అంటూ బెదరకొట్టడం మొదలు పెట్టింది. సరిగ్గా ఎదగాల్సిన సమయంలో ఇన్ ఫ్రా, అంటే మౌలిక సదుపాయాల మీద ఖర్చు పెట్టడం మానేసింది. అదే, రోడ్లు వేయడం, ఫ్యాక్టరీలు పెట్టడం, భవిష్యత్ కి ఉపయోగ పడే పనులు చేయడం అన్నీ బంద్ అయిపోయాయ్. కేవలం పథకాలు, డబ్బు పంచి పెట్టడం పండగ చేసుకోమనడం. క్యూబాలో క్యాస్ట్రోని చూసి చెడిపోయిన పెద్దమనిషి చావెజ్ వచ్చాడు కుర్చీలోకి. చె-గువేరా, సైమన్ బొలీవర్ ని కూడా మర్చిపోయే రాబోయే తరాలు తననే తల్చుకోవాలి అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతీ పథకం ఉచితం అంటూ ఊదరగొట్టాడు. ఆఖరికి ఆదేశంలో టీవీ షోలు కూడా ఆయనే చేసేసేవాడు యాంకర్ గా. అలా చెలరేగిపోతున్న సమయంలో ఆర్థిక పరిస్థితి దిగజారి, పాతాళానికి పోయిందన్న సంగతి కూడా పట్టలేదు. ఓ పదిహేనేళ్ల తర్వాత హఠాత్తుగా ఆయన చనిపోయాడు. ఆ తర్వాత విపక్షాల పీక నొక్కేసి, ఎన్నికల్ని ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసి ఇంకొక ఆయన వచ్చాడు. శ్మశానం లాంటి దేశాన్ని ఏలుతున్నాడు. మదురో ఆయన పేరు. పెద్ద ముదురు.

ఇదంతా ఎక్కడో చూసినట్టు ఉంది కదూ. పాయింటుకి వచ్చేద్దాం. భవిష్యత్ కి అవసరమైన పనులు ఏమీ చేయకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటిది అయిపోయింది. ఆంక్షలు పెట్టి ప్రభుత్వమే దోచుకునే స్థితి రావడం వల్ల పెట్టుబడులు ఆగిపోయాయ్. ఉచిత పథకాల వల్ల జనం తేరగా తినడానికి అలవాటు పట్టాడు. పెట్రో బావుల్లో పని చేయడానికి కూడా ఇష్టపడలేదు. పెట్రోల్ ఉత్పత్తి తగ్గిపోయింది. ఎగుమతులు ఆగి – డబ్బులు రావడం మానేశాయ్. ప్రపంచంలో సంబంధాలు తెగిపోయి కరెన్సీ విలుప పడిపోయింది. కందిపప్పు రేటు కూడా జీడిపప్పులా వినిపించడం మొదలైంది. ఏకంగా లక్షలు పోస్తే తప్ప కప్పు కాఫీ దొరకని స్థితి వచ్చేసింది. ఎక్కడికో వెళ్తుంది అనుకున్న దేశం బిచ్చమెత్తుకుంటోంది. ఐక్యరాజ్య సమితి దయ తలిస్తే రొట్టెముక్క. లేదంటే లేదు.

వెనెజులానే కాదు తేరగా అప్పులు చేసి తినడం మొదలు పెడితే ఎవరికైనా ఇంతే పరిస్థితి. భవిష్యత్ కోసం పైసా కూడా ఖర్చు పెట్టే ఆలోచన లేకపోతే నష్టపోయింది చావెజ్ కాదు. చావలేక బతకలేక పోతున్నది ఆ దేశ జనమే. అప్పులు కొంప ముంచుతాయ్. ఉచితాలు ఉప్పు పాతరేస్తాయ్ భవిష్యత్ కి అని తెలుసుకోండి, కళ్లు తెరవండి అని ప్రపంచాన్ని ఛర్నాకోల్ తో కొట్టి చెబుతోంది వెనిజులా. బహుశా అది చూసే ఏమో – పక్క రాష్ట్రం తమిళనాడులో ట్రెండు మారుతోంది. మనకి అర్థం కాలేదు కానీ జరుగుతున్నది ఇదే. తమిళనాడులో రాజకీయాలు అంటే తేరగా పంచడం అన్నట్టే ఉండేవి. జయ – కరుణ పోటాపోటీగా పెంచి పెంచి – ల్యాప్ టాప్ లు కూడా పంచే స్థాయికి వెళ్లిపోయారు. ఇలాగైతే దిక్కూ దివాణం ఉండదనుకున్నాడో ఏమో స్టాలిన్ ఇప్పుడు పంథా మార్చి జనంతో నడవడం, జనంతో ఉండటం, మీకు ఏం కావాలో చెప్పండి చేస్తా అనడం మొదలు పెట్టాడు. ఉచితాలను క్రమంగా డిస్కరేజ్ చేస్తూ జనం కోసం పని చేస్తూ రాజకీయాన్ని కూడా రెండో మెట్టుమీదకి నెట్టేశాడు. నిజంగా నాలుగు కాలాలపాటు కుర్చీలో ఉండాలి అనుకునేవాడు ఎలా ఆలోచిస్తాడో స్టాలిన్ ను చూస్తే అర్థం అవుతుంది మనకి.

కూడు పెట్టడం ప్రభుత్వ బాధ్యత. అంటే, సరుకులన్నీ మూటగట్టి ఇంటికొచ్చి ఇవ్వమని కాదు అర్థం. ముద్ద నోట్లోకెళ్లే పరిస్థితి జనానికి కల్పించాలి అని ! చేసేందుకు పని, సంపాదించుకునేందుకు అవకాశం, ఎదిగేందుకు స్కోప్ ఉండేలా చూడ్డమే ప్రభుత్వ బాధ్యత. ఇది జనం కోణం నుంచి జరగాలి. ప్రాజెక్టులు, కర్మాగారాలు కట్టడం, పెట్టుబడులు తెచ్చి రేపటి తరం ఉద్యోగాలకి వలసపోయే పరిస్థితి లేకుండా చూడ్డం లాంటివి పరిపాలనలో కీలక భాగం. అంతేగానీ కంచాలూ మూతులు కడగడం, పిల్లల చెడ్డీలు ఉతికినందుకు తల్లిదండ్రులకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం కాదు చేయాల్సింది. వెనిజులా ప్రపంచానికి ఆల్రెడీ చెప్పింది. స్టాలిన్ లాంటి వాడు స్వయంకృషితో తెలుసుకున్నాడు. ఇక తెలుసుకోవాల్సింది, కళ్లు తెరవాల్సిందీ ఎవరనేది తేల్చుకోవాలి మనం !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments