31 C
Vijayawada
Thursday, April 25, 2024
Homeరాజ నీతిహక్కుల కోసం తెలంగాణ... ముక్కల కోసం ఏపీ... రెండు రాష్ట్రాల్లో ఎంత తేడా !

హక్కుల కోసం తెలంగాణ… ముక్కల కోసం ఏపీ… రెండు రాష్ట్రాల్లో ఎంత తేడా !

చూసే కళ్లను బట్టీ కనిపించే కంటెంట్ ఉంటుందంటారు. అలాంటి కళ్లకే చిత్రమైన పరిస్థితి ఎదురైతే ! ఓ కంటికి ఉత్సాహం – మరో కంటికి ఉత్ఫాతం ఒకేసారి కనిపిస్తే ? ఎస్. సరిగ్గా అలాంటి సన్నివేశమే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించింది. రాజకీయం కంపించింది. హక్కుల కోసం అంటూ హంగామా చేసి కేంద్రం దిగి వచ్చి సంజాయిషీ ప్రకటన ఇచ్చేలా చేసింది తెలంగాణ ! వికేంద్రీకరణ పేరుతో ముక్కలు అవుదాం రండి – అంటూ మరో వివాదానికి తెర తీయడం చూస్తోంది ఆంధ్రప్రదేశ్. ఒకే రోజు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన రెండు చిత్రమైన పరిస్థితులు ఇవి.

ముందు ఏపీ సంగతి చూద్దాం. రాజ్యాంగబద్ధమైన చట్టం ప్రకారం తయారైన సీఆర్డీయే యాక్ట్ రద్దు చెల్లదూ అంటూ హైకోర్టు చెప్పింది. కొన్ని మీడియా సంస్థలు అతి ఉత్సాహం చూపించి సొంత పులిహోర కలిపేశాయ్. సొంత అభిప్రాయాలతో బ్రేకింగులు నడిపాయ్. సరిగ్గా అధికార పార్టీ అదే పాయింట్లు పట్టుకుంది. సభకు చట్టాలు చేసే హక్కు లేదు అని కోర్టు చెప్పింది అంటూ కొత్త వివాదాన్ని పుట్టించి రాజకీయం పండగ చేసుకోవడం మొదలైంది. చట్టసభ అంటేనే చట్టాలు చేసేది. కాదనడానికేం లేదు. కానీ కోర్టు చెప్పిన మేటర్ వేరు. రాజ్యాంగబద్ధమైన చట్టాన్ని అలా అడ్డంగా తుంగలో తొక్కలేం అని మాత్రమే అన్నది. అంటే అసలు మేటర్ వదిలేసి కొసరు వివాదాన్ని పుట్టించి, మూడు ముక్కల ఆట మళ్లీ మొదలు పెట్టింది ఏపీ రాజకీయం. మూడు రాజధానులు కాదంటే, అలాంటి వాళ్లు ప్రాంతీయ వ్యతిరేకులు అనే ముద్ర కొట్టి… వచ్చే ఎన్నికల్లో లాభపడాలన్నది అసలు ఎత్తుగడ. గంజికి దిక్కులేదురా మగడా అంటే పెసర పప్పు వండవే పెళ్లామా అన్నాడన్నది పాత సామెత. అసలు జీతాలకే దిక్కు లేదు, బ్రాందీ అమ్మితే తప్ప పథకాలకి డబ్బులు పంచలేం అని నేరుగా ప్రకటించే ఘరానా మొనగాళ్లు ఉన్న రాష్ట్రం మనది. అలాంటి చోటే మళ్లీ మూడు రాజధానులు కడతామని కూడా చెబుతారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు… బహుశా వీళ్లకి జనం ఓ మోస్తరుగా కూడా కనిపించడం లేదేమో మరి ! అంటే ముక్కల చెక్కల రాజకీయంతో ఏపీ మరికొన్ని మెట్లు కిందకి పడటానికి సిద్ధం అవుతోంది ఇప్పుడు.

అటు తెలంగాణలో సీన్ డిఫరెంట్. అక్కడ ఏ ఆట ఆడాలో ఒక్కడే డిసైడ్ చేస్తాడు. ఎవరెక్కడ ఫీల్డింగ్ చేయాలో ఆ ఒక్కటే చెబుతాడు. ఆఖరికి ఢిల్లీలో ఉన్న కేంద్రం కూడా చచ్చినట్టు వీళ్ల దారికి వచ్చి తీరాలి అన్నట్టు ఉంటుంది సీన్. కావాలంటే చూడండి… కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు, యుద్ధ సన్నాహాల మీద కేంద్రం ఇవాళ దిగొచ్చి సంజాయిషీ ఇచ్చుకుంది. కేసీఆర్ చెబుతున్నది అబద్ధం, మేం పూర్తిగా నిబద్ధం అంటూ కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ముప్పావుగంట మొత్తుకున్నాడు. అసలు ఎవరు అబద్ధం ? ఏది నిజం ? అనేది తర్వాత. నిజానికి పిడికెడు అంత రాష్ట్రం తెలంగాణ. అంతోటి మదగజం లాంటి కేంద్రం మోకాళ్ల మీద కూర్చొని సంజాయిషీ ఇవ్వడం అంటే సక్సెస్ కిందే లెక్క. అంటే కేసీఆర్ ఆడుతున్న రాజకీయ గేమ్ బాగానే ఫలిస్తోంది అనమాట.

తప్పో ఒప్పో తర్వాత. కేసీఆర్ ఆడుతున్నది కేంద్రంతో ! ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏవీ ఫణంగా పెట్టడం లేదు. పైగా కాస్తో కూస్తో లాభం. కేసీఆర్ హడావుడి ఫలించి నిజంగా బియ్యం కాదు వడ్లే కొనాలని అనుకుంటే అది లాభం కూడా ! అంటే అక్కడ రాజకీయంలో జనానికి కలిసొచ్చే పాయింటు ఉంది. అందులోనే కేసీఆర్ తన స్వార్థం వెదుక్కున్నాడు. కానీ ఏపీలో రాజకీయం అయితే అలా కాదు. రాష్ట్ర భవిష్యత్ తోనే ఏపీలో అధికారం ఫుట్ బాల్ ఆడుతోంది. రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం మూడు ముక్కల రాజకీయానికి ఆల్రెడీ విత్తనంర పడింది ఇవాళ. అంటే తెలంగాణ ఎదుటోడి మీద కత్తి దూసి… కాస్తో కూస్తో లాభపడతాం అంటోంది. అదే ఆంధ్రాలో యుద్ధం అయితే, సొంత కత్తితో స్వయానా కాళ్లూ చేతులూ నరుక్కుంటున్నట్టుగా ఉంది. అదే అసలు విషాదం.

అధికార పార్టీ వారసురాలు కవిత చన్నాళ్ల తర్వాత రోడ్డెక్కి గ్యాస్ రేట్లు పెరిగాయంటూ వంటావార్పూ చేస్తే, పదేళ్లనాటి పరిస్థితులు గుర్తొచ్చి నవ్వొచ్చింది. అప్పట్లో పొయ్యి వెలిగించింది టీఆర్ఎస్ రాజకీయ ఆరాటం. ఇప్పుడు స్టవ్ మండుతున్నది అదే టీఆర్ఎస్ రాజకీయ పోరాటం కోసం. రెండింటిలోనూ తెలంగాణకి నష్టం లేదు. లాభమే ! ఆంధ్రాలో మాత్రం ఇలాంటి పొయ్యిలు వెలగడం తర్వాత సంగతి. ఈ రాజకీయ ఎత్తుగడలు చూస్తే స్టేట్ కి పొయ్యే కాలం వచ్చిందేమో అనిపించి భయాందోళనలు పెరుగుతున్నాయ్. చెత్త మీద పన్ను, దుత్త మీద పన్ను, నెత్తి మీద పన్ను అంటూ చిత్రవిచిత్రంగా బాదేస్తున్న చోట… మూడు రాజధానులు కడతామంటూ ఐదు కోట్ల మందితో అడ్డంగా ఆడుకోవడం చూస్తుంటే బాధేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments