28 C
Vijayawada
Wednesday, September 11, 2024
Homeరాజ నీతిఇమ్రాన్ ఫార్ములా బాబు పవన్ కి పనికొస్తుందా ?

ఇమ్రాన్ ఫార్ములా బాబు పవన్ కి పనికొస్తుందా ?

నాకివ్వండి… నాకివ్వండి అని ఊరూరు తిరిగి వెంటపడి అడిగాడు. ఇచ్చారు. నాకిచ్చాడు. నేల ! ఎప్పుడు ఏ పని చేయకూడదో అదే చేశాడు. నమ్మకం పెట్టుకున్నవాళ్లని కుమ్మికుమ్మి వదిలాడు. సమర్ధుడేమో అని ఆశ పడితే దద్దమ్మకి పెద్దమ్మలా చేతులెత్తేశాడు. అక్కడితో ఆగినా అదో దారి. ఆగలేదు సరికదా, కోర్టులతో గేమ్స్ ఆడాడు. నా అంతటి మొనగాడు లేడు అంటూ విర్రవీగి వెర్రి వేషాలేశాడు. ఎవరితో అయితే కలవకూడదో, చేతులు కలపకూడదో వాళ్లతో కలిశాడు. కలిపాడు. అన్నీ ఏకమై… తిరగబెట్టి మురగబెట్టి, అమాంతం పడదోశాయ్. మధ్యలోనే రాజీనామా చేసినోళ్లని చూసినా, కుర్చీలో ఉండగానే అర్థాంతరంగా చనిపోయినవాళ్లని చూసినా ఆశ్చర్యం లేదు ఇప్పటి వరకూ ! కానీ కోర్టు దెబ్బకి గూబ గుయ్యిమని కుర్చీ కూల్చుకున్నోడిగా మిగిలాడు. చరిత్ర హీనుడయ్యాడు.

ఇదంతా చూడబోతే నడుస్తున్న చరిత్రలా ఉందా ? అక్కడే ఆగండి… ఆ పతనమైనోడి పేరు వేరు. ఇమ్రాన్ ఖాన్. ఇది పాకిస్థాన్ స్టోరీ. మనకి సంబంధం లేదు. టైటిల్ నిజానికి ఇమ్రాన్ ఫార్ములా అన్నాం కానీ, వాస్తవానికి ఇమ్రాన్ మీద పని చేసిన ఫార్ములా అనాలి. అక్షరాలు కలిసొస్తాయని షార్ట్ కట్ కొట్టేసరికి అలా అయ్యిందన్నమాట. ఇంతకీ ఇమ్రాన్ మీద ఏం పని చేసింది ? ఇక్కడ ఎందుకు అది వర్తిస్తుంది ? ఇదో ఇంట్రెస్టింగ్ పాయింటు.

270కిపైగా ఎంపీలున్న పార్లమెంటులో అతనికి వచ్చింది బంపర్ మెజారిటీ నిజానికి. ఏకంగా 155 సీట్లు. చూడబోతే ఈ నంబర్ కూడా కాస్త అటు ఇటుగా మనకి బాగా దగ్గరగా ఉన్న సంఖ్య అని బిగ్గరగా చెప్పాలనిపిస్తోంది కదూ ! కాస్త కంట్రోల్ చేసుకోండి. పార్లమెంటులో ఫుల్ బెంచ్ 342 అయినా మిగతా వాళ్లంతా నామినేటెడ్ సభ్యులే. అందుకే ఇక అతనికి ఎదురు లేదు అనుకున్నారు. అసలే మనిషేమో పిచ్చ దూకుడు. ఎగిరెగిరి దూకే టైపు. అందుకే ఏదో చేస్తాడు అనుకున్నారు. తీరా చూడబోతే చేతిలో ముంత పోయింది. ముడ్డి కింద బొంత కూడా పోయింది అన్నట్టు అయ్యింది యవ్వారం. పాపం. నెత్తినిండా అప్పులు, ఊరునిండా గొప్పలు, బతుకునిండా తిప్పలూ అయిపోయాయ్. నా అంత తెలివి ఇంకెవ్వడికీ లేదన్నట్టు, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతా అని పార్లమెంటును రద్దు చేసుకోబోతే కోర్టు రంగంలోకి దిగి కబడ్డీ అడేసింది. ఇంతకు ముందు 22 మంది ప్రధానుల పరువు, పదవి ఒకే సారి పోగొట్టుకున్న చరిత్ర ఉంది అక్కడ. కాకపోతే ఈసారి ఇంకా డిఫరెంట్. కోర్టు తీర్పుతో తాట ఊడినోడిగా ఇమ్రాన్ మిగిలాడు. ఇదో వెరైటీ. ఇలా కుర్చీ పోగొట్టుకోవడం అక్కడే ఇదే మొదటిసారి. కోర్టుతో గేమ్స్ ఎప్పటికైనా డేంజరే సుమీ !

ఇంతకీ అక్కడికీ మనకి పోలిక ఏంటంటారా…? ఇమ్రాన్ కి వన్ సైడెడ్ మెజారిటీ వచ్చింది. అప్పొజిషన్ ఇప్పట్లో కోలుకోదు తేరుకోదు అనుకున్నారు అందరూ ! వాళ్ల వల్ల కూడా అయ్యేది కాదేమో నిజానికి. కానీ అప్పొజిషన్ ను జాకీలేకి లేపే పని కూడా ఇమ్రానే పెట్టుకున్నాడు. కూలబడిన ప్రతిపక్షాల్ని కొట్టి కొట్టి, వెంటాడి వేధించాడు. మరో దారి లేక, కూలబడినోడు ఇక తప్పని పరిస్థితుల్లో నిలబడి ఎదురు తన్నడం మొదలు పెట్టాడు. పైగా ప్రతిపక్షాల మీద పనికి మాలిన విమర్శలు చేశాడు. అందరూ ఏకమైనా నావేం పీకలేరు అన్నాడు. పోలిక కోసం చెప్పడం లేదు. నిజంగానే అన్నాడు ఈ మాట. కావాలంటే ట్రాన్స్ లేటర్ పెట్టుకొని ఫైల్ ఫుటేజ్ వినండి. తెలిసిపోద్ది. వాళ్లు ఈ మాటలతో చిర్రెత్తి నిజంగానే ఏకం అయ్యారు. ఇంకో పక్కన ఒకే ఊత కొట్టుడు కొడుతుండేసరికి విపక్షం మీద జనానికి కూడా జాలి కలిగింది. ఈ బుర్రతక్కువోడి కంటే వాళ్లెంత బెటరో అర్థం కావడం మొదలైంది. పైపెచ్చు… అప్పటి వరకూ తలో దిక్కుగా ఉన్న పీఎంఎల్ ఎన్ అంటే షరీఫ్ పార్టీ, పీపీపీ అంటే భుట్టో పార్టీ అన్నీ కలిశాయ్. ఇంకో రెండు బుడ్డ పార్టీలను పెట్టుకొని ఏకంగా అధికారంలోకి వచ్చేశాయ్. కుర్చీలో ఉన్నోడు అంథకారం మిగిల్చినప్పుడు… ఎదుటోడికి ఆటోమేటిగ్గా అధికారం అంది తీరుతుంది అనేది మనకి అర్థమవుతున్న వాస్తవం.

ఏంటో సీట్ల నంబరు, తెలివితక్కువ పనులు, అప్పులు, గొప్పలు, ఆఖరికి పీకలేరు డైలాగులు అన్నీ మనకి ఎందుకో కనెక్ట్ అయిపోతున్నాయ్. అందుకే విపక్షాల విషయంలో ఫార్ములా కూడా సరిపోతుందా అనేది పాయింటు. కాకపోతే అక్కడికీ ఇక్కడికీ చాలా ముఖ్యమైన, కొన్ని తేడాలుంటాయ్. అక్కడ విపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన రెండు హేమాహేమీ పార్టీలు కాస్త అటు ఇటుగా సమాన బలం ఉన్నవి. ఇక్కడ అలా కాదు. ఒకరు పెద్దన్న టైపు అయితే, ఇంకొకడు చిన్న తమ్ముడు బాపతు. కబుర్లు గొప్పవేకానీ వాటా ముప్ఫైయ్యే అన్నట్టుంది ఉజ్జాయింపుగా ఇక్కడి లెక్క. ఇక్కడ కూడా, ఎదుటోడి తిట్టుడు కొట్టుడు దెబ్బకి అప్పొజిషన్ కలిసి నడిచే రోజు రానే వస్తున్నట్టుంది. అందుకే అక్కడ అరాచకుడు కలిపాడు విపక్షాల్ని – అనే మాట ఇక్కడ కూడా సూటవుతుంది చాలా వరకూ !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments