30.3 C
Vijayawada
Wednesday, May 8, 2024
Homeరాజ నీతికేంద్రంపై కేసీఆర్ ఎదురుదాడి ఏపీకి ఏం చెప్పింది ?

కేంద్రంపై కేసీఆర్ ఎదురుదాడి ఏపీకి ఏం చెప్పింది ?

ప్యాంటు చిరిగింది అనే చర్చ జరగకుండా ఉండాలంటే చొక్కా చింపుకొంటే సరిపోతుంది అనేది ఎత్తుగడ. చిరిగిన చొక్కా ప్యాంటు కంటే ముందు కనిపిస్తుంది కాబట్టి ఇక నామోషీ అక్కర్లేదు. రాజకీయాల్లో కొన్ని ఎత్తుగడలు ఇలాగే ఉంటాయ్. ఈటల రాజేందర్ గెలిచాడు, టీఆర్ఎస్ ఓడింది అనే చర్చ కన్నా పెద్ద టాపిక్ కావాలి. సరిగ్గా సమయానికి కేంద్రం పెట్రో ధరలు కాస్త తగ్గించింది. ఇదే అదునుగా కనిపించింది కేసీఆర్ కి. రంగంలోకి దిగేశారు. ఇంతకీ ఈ యుద్ధం ఏ తీరానికి చేరుతుంది ? అసలు కేసీఆర్ చేస్తున్న, చేస్తానంటున్న యుద్ధం ఏపీకి ఏం చెబుతోంది ?

ఫెడరల్ ఫ్రంట్ పెడతాం, అంతు తేలుస్తాం, దేశంలో వేల కొద్దీ టీఎంసీల నీరు వృధాగా పోతోంది, వాడుకోవడం ఎలాగో చూపిస్తామనేది కేసీఆర్ దాదాపు రెండేళ్ల నాడు చేసిన ప్రకటన. ఇంతకీ ఆ ఫ్రంటు ప్రోగ్రెస్ ఎంత వరకూ వచ్చిందో ఓ సారి కనుక్కోవాలి. అది తెలిస్తే ఇక విషయాలన్నీ అర్థం అయిపోతాయ్. ఉండుండి ఓ సారి కేంద్రం మీద యుద్ధం ప్రకటించడం ఎందుకో కూడా క్లారిటీ వచ్చేస్తది. పాయింట్ ఏంటంటే – తెలంగాణలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయ్. కాంగ్రెస్ లో కదలిక వచ్చింది. బీజేపీ పెద్దగా ఉరుకు పెట్టకపోయినా రాజేందర్ ఈక్వేషన్ వేరు. సానుభూతి ఉంది. కాంగ్రెస్ సహకారం అందింది. గెలిచేశాడు అమాంతం. నిజానికి బీజేపీలో కేసీఆర్ అనుకూల వర్గం కూడా రాజేందర్ గెలుస్తాడు అని పదో రౌండ్ కౌంటింగ్ వరకూ ఒప్పుకోలేదు. వాళ్ల స్వామి భక్తి అలాంటిది. పైపెచ్చు టీఆర్ఎస్ మైక్రో మేనేజ్మెంట్ చేసిందనే కితాబులు కూడా ఇచ్చారు. కానీ రాజేందరే మతాబులు వెలిగించి దీపావళి చేసుకున్నాడు. ఎందుకంటే జనం మైండ్ సెట్ లో మార్పు వచ్చినప్పుడు మేనేజ్మెంట్ పనిచేయదు. మైక్రో అయినా మాక్రో అయినా లాభం లేదు. ఆ విషయం అందరికంటే బాగా కేసీఆర్ కే తెలుసు. ఉపఎన్నికల ప్రచారానికి కూడా పోకుండా ఉండిపోయిన కేసీఆర్ ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగడానికి కారణం ఇదే.

పెట్రో ధరల మీద జనంలో ఆగ్రహం ఉంది కాబట్టి ఆ టాపిక్ అందుకోవడం మహత్తరమైన టెక్నిక్. దానికి తోడు ధాన్యం కొనుగోళ్ల పంచాయతీ ఉండనే ఉంది. రెండూ కలిపి కొడితే పోరాటం జనం కోసమే అనిపిస్తుంది. మనుగడ కోసం కాదు. ఇక కేసులు పెడతామనే వార్నింగులు, దేశద్రోహం ముద్ర వేస్తోంది బీజేపీ అనడం అనేది కూడా ఏడేళ్ల నుంచి ఉన్నదే. కేసీఆర్ ఇప్పుడు ఇంకోసారి ప్రస్తావిస్తున్నారు అంతే ! పై పెచ్చు… బిడ్డా నన్ను జైల్లో పెడతావా చూస్కుందాం రా అనడం కూడా మసాలా భాగం. ఆయన అభిమానులకి కిక్కు ఇచ్చే ప్రయత్నం. అయినా వేల కోట్ల ఛార్జిషీట్లు ఉండి, కోర్టుల్లో కేసులు నలుగుతున్న వాళ్లనే ఫ్రీగా వదిలేసిన మోడీ అండ్ కో… కేసీఆర్ ను జైల్లో పెట్టడం అంటే మాటలు కాదు. అక్షరాలా హంబక్కే. ఇక కేంద్రం మీద కేసీఆర్ ప్రకటించిన యుద్ధం సంగతేంటో, ఆ యుద్ధం ఏపీకి ఏం చెబుతోందో చూద్దాం.

కేసీఆర్ కి ఏపీ నాయకుడితో మంచి దోస్తీ ఉంది. తిరుగులేదు. మొన్న ఎన్నికల్లో చంద్రబాబుకి నష్టం చేసి తప్పు చేశా అని కేసీఆర్ బాధపడుతున్నాడు అని ఈ మధ్య కొందరు కమ్మటి కథలు అల్లారు కానీ అవి నిజం కాకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ వేసే అడుగుల్లో స్పష్టత ఉంటుంది. పశ్చాత్తాపం ఉండదు. అయినా కామన్ సెన్సు పాయింటు ఒకటుంది. ఎవరైనా, మన మాట వినేవాళ్లని ఇష్టపడినంతగా… మనకి మాట చెప్పే వాళ్లని ఇష్టపడతామా ? ఇదే లాజిక్కు. మధ్య మధ్యలో ఆంధ్రాకి అండగా ఉంటాం, సీమకి నీళ్లు రావాలని చెప్పా, గోదావరిని వాడుకుందామని చెప్పా అనేది ఇటు పక్క అల్పసంతోషుల కోసం కేసీఆర్ కొట్టిన డైలాగులు. గోదావరి నీళ్ళు ఏపీ వాడుకోవడం తర్వాత, నువ్ ముందు అడ్డగోలుగా శ్రీశైలం నీరు వాడుకోవడం ఆపు – అని చెప్పే నాధుడు ఏడీ ? ఇలాంటి నాధుడు లేడు కాబట్టే కేసీఆర్ మాటల ప్రభావం, యుద్ధ ప్రకటన ఇంపాక్టు ఏపీ రాజకీయాలపై కూడా ఉంటుంది. ప్రత్యేక హోదా సంగతి అడుగుదాం అని పత్రికల్లో వార్తలు వచ్చాయ్ చూశారూ దానికీ దీనికీ లింకు ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేంద్రంపై యుద్ధం పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ వాయిస్ వినిపించకుండా చేయడం ఎత్తుడగ. అప్పులు తిప్పలు, పగులుతున్న తలలు కనిపించకూడదన్నది ఏపీలో కొందరి ఆరాటం. అందుకో హోదాలు గోదాలు, కేంద్రంతో తేల్చుకుంటామని ప్రకటనలు ఇక వస్తూనే ఉంటాయ్.

అలాగని కేంద్రంపై ప్రత్యేకించి చేసేదేం లేదు. పైగా కేంద్రం కూడా వాళ్లూ వీళ్లూ అనేంలేదు, 2024లో సీట్లు ఎన్ని తగ్గుతాయో తెలియదు కాబట్టి అందరితోనూ అలా అలా నెట్టుకొచ్చేసే ధోరణితోనే ఉంది. అంటే రెండు పక్కలా క్లారిటీ పక్కాగా ఉంది. ఏపీలోనూ ఓ అజెండా కావాలి, పోరాటం చేస్తున్నట్టు ప్రకటనలు చేసి యోధులుగా ముద్రలు వేసుకోవాలన్నది వ్యూహం. అందుకే రేట్లు తగ్గించం… మీరు పెంచిన రేటు మేం ఎందుకు తగ్గించాలి లాంటి కవ్వింపు ప్రకటనలు వస్తున్నాయి. రేట్లు తగ్గించాల్సింది, అర్మానీ సూటు వేసుకొని 60 వేల కోట్ల విమానంలో అమెరికా వెళ్లొచ్చిన మోడీ కోసం కాదండయ్యా… జనం కోసం. జనానికి ఆ మాత్రం బుర్ర లేదు కాబట్టి… రెచ్చకొట్టే ప్రకటనలు చేసేస్తే అబ్బా ఢిల్లీ మీద యుద్ధం చేస్తా అన్నాడ్రా మొనగాడ్రా అని జనం అందరూ కాకపోయినా కనీసం కొందరు అయినా అనుకుంటారని రొట్ట ఎత్తుగడ. ఇలాంటివి పెద్దగా పని చేయవు అని చంద్రబాబు ధర్మ పోరాటాలతోనే తేలిపోయింది. బాయిలర్ కోళ్ల బతికించడం కోసం బ్లూ క్రాస్ పోరాటం చేయడం ఎంత దండగో, రాజకీయాల కోసం యుద్ధ ప్రకటనలు చేసే లీడర్లను కూడా పట్టించుకోవడం అంతే వృధా అని జనానికి తెలుసు. రెండు రాష్ట్రాల్లో అసలు అజెండా వేరే ఉండగా యుద్ధ మేఘాలతో పెద్దగా పని జరగదు అనేదే వాస్తవం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments