27 C
Vijayawada
Sunday, July 14, 2024
Homeరాజ నీతితెలుగు రాజకీయాల్లో ఒకేఒక్క నివిత్తమాత్రుడు రోశయ్య !

తెలుగు రాజకీయాల్లో ఒకేఒక్క నివిత్తమాత్రుడు రోశయ్య !

తెలుగు రాజకీయాల్లో ఒకేఒక్క నివిత్తమాత్రుడు రోశయ్య !

ఓ ఉన్నత విలువలున్న రాజకీయ నాయకుడు శాశ్వత నిద్రలోకి నిష్క్రమించాడు. అప్పుల తిప్పలుదాటి ప్రభుత్వాల్ని నడపడం ఎలాగో, దిగజారి వ్యక్తిగతాలకు పోకుండా విమర్శలు చేయడం ఎలాగో, సభా సంప్రదాయాన్ని సాధ్యమైనంత వరకూ ఎంతలా పాటించవచ్చో చేతల్లో చూపిన రోశయ్య ఇక లేరు. నీ పని నువ్ చేసుకుంటూ పోతే పదవులు వాటంతట అవే వస్తాయి అని నా జీవితం నాకు చెప్పింది అని వినమ్రంగా ప్రకటించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి సీఎంకి ఇది వీడ్కోలు సమయం. ఆచార్య ఎన్ జీ రంగా శిష్యుడిగా రంగ ప్రవేశం చేసి రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన రోశయ్య మన కాలపు చిత్రగుప్తుడు. ఎలాంటి రాగద్వేషాలు లేకుండా లెక్కలు వేసిన ఆర్థిక మంత్రిగా, ఎలాంటి పక్షపాతం, లాలస లేకుండా పదవిని స్వతంత్రంగా త్యజించిన ముఖ్యమంత్రిగా రోశయ్యది చిరస్థాయి.

నిమిత్త మాత్రుడు అంటే ఎంత వరకూ ఉండాలో అంత వరకే ఉండేవాడూ అని అర్థం. రోశయ్య తన జీవిత కాలంలో ఎక్కువ భాగం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నకాలంలో ఆర్థిక మంత్రిగానే పనిచేశారు కాబట్టి నిమిత్త బదులు ని-విత్త అనుకోవాలి. అందులోనూ పరిధి దాటని తూకానికి, లెక్క తప్పని ఆర్థికానికి, అధికారం మొత్తం తన చేతుల్లోనే, చేతల్లోనే ఉన్నా మరక అంటని వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. అందుకే నివిత్త మాత్రుడు అంటున్నది. ఖజానా కెపాసిటీ ఎంతో తెలిసి, భవిష్యత్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో లెక్కగట్టి, ఖర్చు పెట్టే ప్రతీ రూపాయికీ నికర విలువ ఉండి తీరాలి అని నమ్మిన నాయకుడు రోశయ్య. సీఎంగా వైఎస్ ఉన్నా జనార్దన్ రెడ్డి ఉన్నా ఇంకెవరు ఉన్నా ఆయన లెక్క మాత్రం పక్కాగా ఉండేది. అంతటి పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టే ఇప్పటికీ ఎప్పటికీ ఏపీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే స్థానం రోశయ్యది.

ఆర్థిక వేత్తగానే కాదు రాజకీయ వేత్తగా కూడా రోశయ్య మార్కు విభిన్నం. ప్రత్యర్థులపై తీవ్రమైన, తీక్షణమైన విమర్శలు చేస్తూనే ఎప్పుడూ పరిధి దాటకపోవడం ఆయన ప్రత్యేకత. విలువలున్న రాజకీయానికి చివరి ప్రతినిధి అనదగ్గ నేతల్లో రోశయ్యది ముందు వరస. అతగాడు – అంటూ ప్రత్యేకమైన సంబోధనతో చంద్రబాబుపై రోశయ్య చేసే ప్రత్యేక విమర్శలు సూటిగా ఘాటుగా అంతకు మించి ధాటిగా ఉండేవి. అలాంటి సందర్భంలో కూడా చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ ఆ విమర్శల్ని వినేవారూ అంటే రోశయ్య శైలి ఎంత ప్రత్యేకమో, ఎంత ఆసక్తిగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సభలో, రాజకీయాల్లో ఎంత గురి తప్పని విమర్శలతో ప్రత్యర్థిని వెంటాడేవారో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడంలో కూడా అంతే నిక్కచ్చిగా, స్వతంత్రంగా ఉండటం ఆయన స్పెషాలిటీ. చంద్రబాబు కష్టపడే మనిషి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఒకే రకమైన శక్తి యుక్తులతో సుదీర్ఘకాలం అలాగే పని చేయడం ఆయన గొప్పదనం. బహుశా ఇది ఇంకెవరిలోనూ నేను చూడని లక్షణం, అతని విశిష్టతను మనం ఒప్పుకోవాల్సిందే, నేను కాంగ్రెస్ లో ఉన్నంతమాత్రాన ఆయన్ని తప్పుపడుతూ కూర్చునే ఉద్యోగంలో ఉన్నాను అని నేను అనుకోను అని చెప్పిన రోశయ్య నిబద్ధత గల రాజనీతి వేత్తగా కనిపిస్తాడు కొన్ని సందర్భాల్లో.

ఉమ్మడి రాష్ట్రానికి లాస్ట్ బట్ వన్ ముఖ్యమంత్రిగా రోశయ్యది చరిత్రలో కీలక భూమిక. నేను కోరుకోని పదవి. నా సేవలకి మెచ్చో, సందర్భం వచ్చో నాకు ఈ పదవి వచ్చింది. ఎంత కాలం ఉంటానో నాకు తెలియదు అని ముందు రోజు చెప్పిన మాటకు తగ్గట్టుగానే ఆయన ఒడిదుడుకుల ప్రయాణాన్ని సాగించారు. నువ్ నా బిడ్డ లాంటి వాడివి కాబట్టి, నీ భవిష్యత్ కోసం చెబుతున్నా అంటూ ఆయన చెప్పిన సుభాషితాల్ని కొందరు చెవికి ఎక్కించుకోనే లేదు. నాల్గు పక్కలా ఆయన్ని లాగి, నిరంతరం నిస్పృహకు గురిచేసే ప్రయత్నాలు సాగించారు. అయినా ఆయన తొణికిన దాఖలా లేదు. అమ్మా మీరు ఇచ్చిన అవకాశానికి నేను కృతజ్ఞుణ్ని, ఇక నాకు శెలవు ఇప్పించండి అంటూ సోనియా చెంత రాజీనామా పత్రం ఇచ్చేసిన తామరాకుపై నీటిబొట్టు రోశయ్య. అధికారం చుట్టూ ఉన్నా, అధికారం మనసుకి అంటని నిగర్వి. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంతకైనా దిగజారి రాజకీయాలు నడిపిన కాంగ్రెస్, అనుబంధ కాంగ్రెస్ పార్టీల చరిత్రలో రోశయ్య రాజీనామా ఓ శిలాక్షరం. మైలురాయి.

రాజకీయం కోసం ఎలాంటి హామీలు అయినా ఇవ్వొచ్చు. మన పబ్బం గడుపుకోవడం కోసం జనం ముక్కు పిండి, రక్తం పిండి ఎలాంటి వన్ టైమ్ వసూళ్లు అయినా చేసేయొచ్చు అనే రాజకీయాలు చూస్తున్న కాలంలో ఆర్థిక వేత్తగా, దూర దృష్టి కల్గిన రాజకీయ వేత్తగా రోశయ్య ముద్ర మరీ ప్రత్యేకం. పరిపాలనా, ఆర్థిక పరమైన విషయాల్లోనే కాదు, సభా మర్యాదల్లోనూ ఆయన ఎన్నదగిన నేత. ఎప్పుడూ వ్యక్తిగతాల జోలికి పోవడం కానీ, ఎదుటివాళ్లని బిలో ద బెల్ట్ దెబ్బ దీసే ప్రయత్నం కానీ చేయకుండానే… విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ సునిశిత విమర్శ రాజకీయాల్లో ఎలా ఉండాలో స్టడీ చేయడానికి రోశయ్య రాజకీయం ఓ యూనివర్సిటీ. దాదాపు నాలుగు దశాబ్దాల ప్రత్యక్ష రాజకీయ చరిత్రలో రోశయ్య పాకులాండి, పోరాడింది, నిలబడింది ఒక్క నిబద్ధత కోసం మాత్రమే. ముఖ్యమంత్రులు ఎవరు మారినా, ఆయన మాత్రం వంగి వంగే ఉంటాడు అని ఓ పత్రిక రోశయ్యపై కార్టూన్ గీసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం రాజకీయాల్లో విలువల తక్కెడకు కేరాఫ్ లా కనిపించింది. నేను పార్టీకి బద్ధుణ్ని. ఆ పార్టీ ఎవరిని కుర్చీలో కూర్చో బెట్టినా నిబద్ధుణ్నే. సర్వసమానత్వం నేను నమ్మిన సిద్ధాంతం. వయసు నా పక్షాన లేకపోవడం వల్ల నేను వంగినట్టు మీకు కనిపిస్తే అది మీ జడ్జిమెంటల్ దృష్టి. మీరూ బతకాలి కాబట్టి కొన్ని గీతలు గీస్తారు. కనీవండి – అంటూ ఆయన చెప్పిన మాట రాజకీయాల్లో ఉండాల్సిన లోతైన దృక్పథానికి, ఓరిమికి నమూనా. నాలుగు కాలాలపాటు గుర్తుండే నేతగా రోశయ్య ఎప్పటికీ తెలుగువాళ్ల గుండెల్లో నిలిచేది అందుకే !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments