29 C
Vijayawada
Monday, October 2, 2023
Homeరాజ నీతిఎన్టీఆర్ ఫార్ములా జగన్ కి కలిసొస్తుందా ? తిరుపతిలో ఫలితాన్ని తేల్చే పాయింట్ ఇదే !

ఎన్టీఆర్ ఫార్ములా జగన్ కి కలిసొస్తుందా ? తిరుపతిలో ఫలితాన్ని తేల్చే పాయింట్ ఇదే !

ఎన్టీఆర్ తో జగన్ ను పోలిస్తే చాలా మందికి రుచించకపోవచ్చు. ఆ చరిష్మా, అంతటి స్టార్ డమ్ ఉన్న ఎన్టీఆర్ తో పోలికా… అనవచ్చు ! రాజకీయంలో పవర్ కావాలంటే పదును ఉండాలి. అదును తెలియాలి. కుంభస్థలాన్ని కొట్టే నేర్పు ముఖ్యం. ఇవన్నీ జగన్ లెక్కలో కనిపిస్తున్నాయ్. అధికారంలో ఉన్నాడు, అంతా జరిగిపోతోందనో… బలాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారనో అనకుంటే వాస్తవాన్ని అర్థం చేసుకోనట్టే ! ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న రెండేళ్ల తర్వాత కూడా టీడీపీ పట్టుకోలేకపోతున్న అసలు పాయింట్ ఇదే !

ఊడలు పాతుకున్నవాళ్లని ఉన్నట్టుండి ఊడ్చేయడానికి కొత్త ఆలోచన కావాలి. వేవ్ రావాలి. పోయిన ఎన్నికల్లో ఆ రెండూ జరిగాయ్. అందుకే అదే ఈక్వేషన్ తో జగన్ పదే పదే యుద్ధానికి సిద్ధం అవుతున్నాడు. పార్టీ బలం బలగం అధికారం ఎలాగూ ఉంటాయ్. వీటన్నిటికీ తోడు… ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడానికి జగన్ వాడుతున్న మరో అస్త్రం సోషల్ ఇంజనీరింగ్ ! కులాల లెక్కలు బలంగా పనిచేసే చోట… తన చరిష్మా ఠక్కున వర్కవుట్ అవుతుంది అనిపించే చోట జగన్ వేస్తున్న ఎత్తుగడలు ఆశ్చర్య పరుస్తాయ్. గత ఎన్నికల్లో రాయల సీమలో అరడజను కొత్త ముఖాలు రావడానికి కారణం అదే ! అనంత లాంటి చోట అద్భుతంగా పనిచేసిన ఫార్ములా ఇది. నేను నిలబెడితే గెలుస్తారు అని చెప్పడమో… తాను ఎంత బలమైన నాయకుడో నిరూపించడం ఒక్కటే కాదు… కుల, సామాజిక పరంగా కూడా తాను ట్రెండ్ మారుస్తున్నాను అని చెప్పుకోడానికి జగన్ కి ఎదురులేని ప్రయోగ శాల అయ్యింది సీమ. అక్కడ ప్రత్యర్థి బలం అంతంత మాత్రం. పైగా రెడ్డి ముద్రను వాటంగా బైపాస్ చేసి… బీసీ కలర్ తగిలించుకునేందుకు జగన్ ప్రయోగించిన పాచిక ఎంపీ అభ్యర్థులకు కలిసొచ్చింది. అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో  సాహసాలు లేవు. ఎంపీ కేండిడేట్లు మాత్రం అంచనాలకు అందని రీతిలో అండర్ డాగ్ లే! అందుకే ఆ స్థాయిలో సత్తా చాటారు. మొన్న స్థానిక ఎన్నికల్లోనూ కనిపించింది ఇదే హవా !

విజయవాడ లాంటి ప్రాంతంలో శ్రీకాకుళం మహిళ మేయర్. ఇప్పటి వరకూ ఈ ప్రాంతం వాళ్లు ఉత్తరాంధ్ర వెళ్లి పెత్తనం చేయడం రివాజు. అలాంటిది అటు వైపు వాళ్లు… ఇటు వచ్చి జెండా ఎగరేయగలరు అనే సందేశం అందులో ఉంది.  చేసిన క్రెడిట్ జగన్ ది. కొత్త రాజకీయానికి ఆయువు పట్టు విశాఖలో మేయర్ అభ్యర్థి అమాంతం మారడం మరో లెక్క. పార్టీలో ఒకానొక మూలపురుషుడుగా ఉన్న ఓ ప్రముఖుడు ప్రకటించిన పేరును పక్కన పెట్టి… మహిళకు పగ్గాలివ్వడం ఆషామాషీగా జరిగింది కాదు. నేను తల్చుకుంటే రాజకీయం ఎలా మారుతుందో తెలుసా … అని అంచనాలు పెంచుతూనే, సామాన్యుల్లో ఎవరికైనా ఛాన్సు రావొచ్చు ఇక్కడ అనే ఆశలు పెంచడం. రాజకీయాలను రగిలించే ఇంధనం ఆశ !

తిరుపతి లాంటి చోట కూడా ఇంతే ! ప్రధాన ప్రతిపక్షం ప్రకటించిన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థే ! కానీ ఇప్పటి వరకూ ముక్కూ ముఖం తెలియదు. కొత్త నెత్తురు ఎక్కించామనే సంకేతం. పైగా అన్ని సెగ్మెంట్లలోనూ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి… మంత్రులు, మంత్రాంగానికి కొదవ లేదు. అంతా చూసుకుంటారు. తానొచ్చి ప్రచారం చేయకపోయినా తక్కువ కాదు. లేఖ రాస్తే అదే పది వేలు. ఫలితం ఏమాత్రం భారీగా వచ్చినా ఆ ప్రభావం రాజకీయాన్ని కొన్నాళ్లు కుదిపేయడం ఖాయం. అంటే ప్రత్యర్థిని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే బలం, కొత్త బేస్ ను పెంచుకుంటూ పోయే ప్రయత్నం. ప్రతీ జిల్లాలోనూ కొత్తగా పుట్టుకొస్తున్న నాయకత్వం నవ తరానికి దగ్గర చేసేలా, కేడర్ లో ఆశలు పెంచేలా ఉన్నప్పుడు… ఎదుర్కొనేందుకు ప్రతి పక్షానికి కొత్త ఆలోచన కావాలి.

ప్రత్యర్థి బౌన్సర్ వేస్తున్నప్పుడు ఆన్సర్ వెతకాలి. అంతేకానీ వాడు అంతెత్తున బంతి విసిరేశాడు కాబట్టి నేను బ్యాట్ విసిరేస్తా అనడం వ్యూహం కాదు. ప్రత్యర్థి కొత్త సోషల్ ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు… మారక తప్పని వాతావరణం క్రియేట్ అయినప్పుడు కొత్త ఎత్తుగడ ఎంత వరకూ సిద్ధం చేశామన్నదే అసలు పాయింట్. కరెక్టే ! టీడీపీ ఉండే లిమిటేషన్స్ టీడీపీకి ఉన్నాయ్. గెలిచిన పార్టీకి ఉండే సౌలభ్యం ఓడినవాళ్లకి దొరకదు. పైగా ఉపఎన్నికల్లో కొత్త ప్రయోగాలు అస్సలు చేయలేరు. అప్పట్లో నంద్యాలలో వైసీపీ చేసింది కూడా ఇదే ! కొద్దో గొప్పో తెలిసిన ఫేస్ లు ఉండాలి. ఆర్థికంగా బలమైన వాళ్లు కావాలి. కొత్త ప్రయోగాలు చేస్తే పాతవాళ్లు ఎదురు తిరిగితే ఏమైపోతామో అనే భయం ఉండనే ఉంటుంది. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూనే కొత్తగా ఓ ఫార్ములాను కనిపెట్టడానికి ప్రయత్నం చేయడం తప్పనిసరి. ఇక్కడ మాట్లాడుతున్నది ఒక బైపోల్ గురించి కాదు. భవిష్యత్ గురించి. పోయిన స్థానిక ఎన్నికల్లో అదే చేశారు తెలుసా… అభ్యర్థుల్ని ఎంపిక చేసే బాధ్యత అంతా జిల్లా స్థాయి నాయకులకే అప్పగించేశారు. అంతకంటే ఏం చేస్తారమ్మా… అంటూ దీర్ఘాలు తీయక్కర్లేదు. అసలు నీ లోకల్ నాయకుల చేవ, కమిట్మెంట్ ఏ స్థాయిదో… బెజవాడ ఆడియో లీకులు ఆల్రెడీ బయట పెట్టాయ్ కదా ! ఇప్పుడు ఆ తవ్వకాలు ఎందుకు ? కొత్త ఫార్ములా కనిపెట్టలేనప్పుడు… పాత ఫార్ములా ఫెయిల్ అవుతున్నప్పుడు అన్వేషణ అవసరం. ఆలోచన తప్పనిసరి. అది చేయడం మాని సవాళ్లకు దిగితే పెద్ద ప్రయోజనం లేదు.

అయినా ఇంత చెప్పుకున్నాక కూడా టీడీపీ చేయాల్సింది ఒకటుంది. పోరాడాలి. కానీ డెస్పరేషన్ క్రియేట్ చేయకూడదు. కచ్చితంగా గెలుస్తాము అనో…గెలవకపోతే దటీజ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనో ఇప్రెంషన్ ఇవ్వకూడదు. మా ధర్మం కొద్దీ మేం పోరాటం చేశాం. ఫలితం మీ చేతుల్లో ఉంది అని జనానికి వదిలి పెట్టాలి నిర్ణయాన్ని ! అలాగైతే ఎటుపోయి ఎటొచ్చినా పెద్దగా ఇబ్బంది కానీ నష్టం కానీ ఉండదు. పైగా ఎన్నికలు జరిగి ఇప్పటికి గట్టిగా రెండేళ్లే ! అంటే మరో మూడేళ్ల సమయం ఉంది. ఈ లోగా అద్భుతాలు ఆశించడం కరెక్ట్ కాదు. నంద్యాల చతికిలపడిన తర్వాత కూడా వైసీపీ చక్రం తిప్పింది ఇలాంటి వ్యూహంతోనే ! తెలుసుకోవాల్సింది అదే ! సైన్యాన్ని సన్నద్ధం చేసుకొని… మూడేళ్లలో రాబోయే యుద్ధానికి సిద్ధపడాలి తప్పితే ఇప్పుడే సవాళ్లు విసురుతూ సమయం వృధా చేసుకుంటే ఒరిగేదేం లేదేమో !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments