28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిరఘురాజు చేరితే ఇక యుద్ధమేనా ?

రఘురాజు చేరితే ఇక యుద్ధమేనా ?

అధికారంలో ఉన్నవాళ్ల మాటకి పవర్ ఎక్కువ. అందులోనూ ఆ పవర్ ను ఎలా వాడాలో తెలిసిన మోడీ, అమిత్ షా లాంటి వాళ్ల ఎత్తుగడలకి ఇంకా పదును ఎక్కువ. రఘురామ క్రిష్ణం రాజు అమిత్ షాతో సమావేశం అయిన ఫోటోను పోస్ట్ చేయగానే రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ రేగుతోంది. ఇంతకీ రాజు వెడలె… అనుకోవచ్చా ? ఇంతకు ముందు కూడా ఆయన ప్రధానితో కూడా సమావేశం అయ్యాడు కదా… అప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు చర్చ అంటారా ? అనండి, చాలా విషయాలు అర్థం అవుతాయ్ అప్పుడు. అసలు ఏపీలో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటో చూద్దాం.

ఏపీలో బీజేపీ అనవసర లగ్గేజ్ అంతా దించుకుంటోంది. పనికి మాలిన ప్రకటనలు చేసే దేవధర్ లాంటి పరాయి భాషా ప్రముఖులకి కత్తిరింపులు మొదలు పెట్టింది. అన్నట్టు అనవసర లగేజ్ అంటే గుర్తొచ్చింది… రాష్ట్ర స్థాయిలో అత్యున్నత నిర్ణయాక మండలిలో విష్ణువర్ధన్ రెడ్డి పేరు కనిపించలేదు. ప్రింటింగ్ మిస్టేక్ కాదు అది అఫీషియలే అని పార్టీ నేతలే చెబుతున్నారు. అదే విష్ణు నోరు జారితే ఇంకొకాయన చేయి జారాడు. ఆ ఘట్టానికి వేదిక అయిన ఛానెల్ ను బాయ్ కాట్ చేస్తున్నట్టు ఇదే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించినట్టు గుర్తు. ఇంతలోనే అదే అధ్యక్షుడు.. ఇదే విష్ణును డ్రాప్ చేయాల్సి రావడం అంటే చక్రం తిరుగుతోంది అనుకోవచ్చు. అయినా ఇంత మైన్యూట్ డిటైల్స్ మనకెందుకు ? 0.8 శాతం ఓట్లు ఉన్న పార్టీ గురించి ఇంత చర్చ ఎందుకు ? అంటారా, కొన్నిసార్లు చర్చ చేయాల్సిందే ! తప్పదు. ఊరంత ఓడను కూడా రవ్వంత చిల్లు ముంచుతుంది. ఇది కూడా అంతే ! ఎదురులేదు మాకు, మేం 150+ అంటున్నవాళ్లకి ఇలాంటి చిల్లులే సమాధానం చెబుతాయ్ కొన్నిసార్లు.

అసలు రఘురామ రాజును చేర్చుకోవాలని బీజేపీ ఎందుకు అనుకుంటుంది ? ఈ లాజిక్ ఏంటో తెలిస్తే ఇక చిక్కు ముడి వీడిపోయి క్లారిటీ వచ్చేసినట్టే. ఏపీలో మనం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి, వైసీపీ మనకి మిత్ర పక్షం కాదు అని తిరుపతిలో తేల్చి తెగేశాడు అమిత్ షా. ఆయన అలా అన్నాడో లేదో, కేంద్రంలో బీజేపీతో మేం టచ్ లో ఉన్నాం అని ప్రత్యక్షంగా, పరోక్షంగా చెప్పుకునేందుకు ఇక్కడ అధికార పార్టీ తాపత్రయ పడింది. పనిలో పనిగా బీజేపీలో ఉండి వైసీపీకి అనధికారిక ప్రతినిధులుగా పనిచేసే జీవీఎల్ లాంటి వాళ్లను రంగంలోకి దింపి చంద్రబాబును మరో రౌండ్ తిట్టించింది. ఇలాంటి గేమ్ కు చెక్ పెట్టేందుకు ఢిల్లీ నుంచి బీజేపీ నాయకత్వం నిరంతరం కాపలా కాయలేదు. ఒక్కటి మాత్రం చేయగలదు. వైసీపీలో పేరు మోసిన నాయకుల్ని నేరుగా చేర్చుకుంటే… ఎస్, ఆ పార్టీతో మాకు తెర వెనక టై అప్ లేదు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. మేం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం అని గుంపుగా మొన్న నెల్లూరులో బీజేపీ నాయకులు చేసిన ప్రకటనలకి సమ్ హౌ, కాస్తలో కాస్త జస్టిఫికేషన్ వచ్చినట్టు అవుతుంది. ఏపీలో బీజేపీకి కదలిక రావడానికి ఇదే తొలి కారణం అయినా కావొచ్చు. ఇలాంటి చేరికల తర్వాత ప్రో ఏపీ మేము అని నిరూపించుకునేందుకు, రాష్ట్రానికి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడమో, నిధులు విదిల్చడమో చేస్తే… కాస్తో కూస్తో ప్రభావం ఉండొచ్చు.

నిజానికి ఆ దిశగానే అమిత్ షా ఆలోచిస్తున్నారు అనే ప్రచారం బీజేపీ వర్గాల్లో అయితే సన్నగా వినపడుతోంది. తిరుపతిలో ఓ నేతతో, అదేలెండి సుజనా చౌదరితో ప్రైవేటుగా అమిత్ షా గంటన్నరపాటు సమావేశం అయ్యారు. అందులోనే ఇలాంటి అంశాల ప్రస్తావన వచ్చినట్టు పార్టీ వర్గాలు మాట్లాడుతున్నాయ్. ఆ ఎంపీతో పాటు కొందరు నేతలు సై అంటున్నారు మనం తీసుకుంటే లాభం ఉంటుందా అని ఆయన అడిగినట్టు, ఎస్ – బట్ కండిషన్స్ అప్లై అని ఈయన చెప్పినట్టు టాక్ నడుస్తోంది. జాతీయ స్థాయిలో రాష్ట్రం నుంచి పదవిలో ఉన్న పురందేశ్వరి కూడా ఇదే విషయం ఒకట్రెండు చోట్ల మాట్లాడిన దాఖలాలు ఉన్నాయ్. అంటే ఆటకు టైమ్ అవుతున్నట్టే అనుకోవాలేమో ! మరో మాట. రఘురాజును డిస్ క్వాలిపై చేయాలి అని ఢిల్లీలో బాగానే గ్రిప్ ఉన్న వైసీపీ నేతలు ఎంతగా ట్రై చేసినా పని జరగడం లేదు. కారణం బీజేపీతో ఢిల్లీలో రాజుగారికి ఉన్న ర్యాపో – అంటారు దగ్గరవాళ్లు. మొన్నామధ్య పుట్టిన రోజు నాడు ఆయన్ని అమాంతం అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టిన సందర్భంలో కూడా ఢిల్లీ జోక్యంతోనే ఊరట దొరికిందనే వాదన ఓపెన్ సీక్రెట్. ఇలాంటి కూడికలు కూడా కలుపుకొని చూస్తే చేరికల లెక్కపై క్లారిటీ పెరుగుతుంది.

ఇలాంటి మార్పులు, చేరికల ఎత్తుగడలు రాష్ట్రం దృష్టి కోణంలో చూస్తే మంచివే ! ఎందుకంటే, ఏదైనా ఇవ్వండి ఏపీకి, చేయండి సాయం ఏపీకి అని ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్లు కాకపోయినా ఇంకెవరైనా అడిగితే అటు వైపు నుంచి వస్తున్నది ఒక్కటే సమాధానం. అక్కడ ఏముంది మాకు – సాయం చేసి ఓటు వేయమని అడగడానికి నాధులేరీ – అనే ప్రశ్నే అటు వైపు సమాధానం అవుతోంది. అదే కొంతమంది నేతలు చేరితే వాళ్లకి అధికారం అండ దొరికినట్టు అవుతుంది. అలాగే ఆ పార్టీకి కూడా కాస్త ఊపిరి వచ్చినట్టు ఉంటుంది. ఏపీకి సాయపడాలన్న సంకల్పం కల్గించినట్టు ఉంటుంది. విపక్షంలో ఉన్న టీడీపీని దెబ్బతీసి బలపడదాం అని రెండేళ్ల కిందట వేసిన ఎత్తుగడ ఫ్లాప్ అయ్యింది. పైగా ఇప్పుడు చంద్రబాబు సవాళ్లు చేసి జనంలో తిరుగుతున్న టైమ్ లో టీడీపీ నుంచి ఎవరూ కదిలే సీన్ కనిపించడం లేదు. ఆశలు వచ్చేశాయ అనుకుంట వాళ్లకి ! ఇలాంటప్పుడు, ఐస్ క్రీమ్ లా కరిగిపోతున్న పార్టీలో వాళ్లని ఆహ్వానిస్తే అయినా బలపడతామేమో అని బీజేపీ అనుకోవచ్చునేమో !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments