ప్రపంచం అంతా ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు గోరు ఎగిరిపోయే ఎదురుదెబ్బ లాంటి వాడొకడు ప్రతీ కాలంలోనూ ఎదురొస్తాడు. సమాంతరంగా తిరుగుతూనే ఆకర్షణలకు లొంగని ఆకాశంలా మనకంటే ఎత్తులో కనిపిస్తూ ఎటు నడవాలో చూపిస్తాడు. సరిగ్గా అలాగే సినిమా సాహిత్యంలో పాటకు కొత్త బాట చూపించి, గీతానికి గాఢత అద్ది, సాహిత్యానికి కొత్త ఒరవడి దిద్దిన అగ్రగణ్యుడు చెంబోలు శీతారామశాస్త్రి. ఇలా చెబితే ఠక్కున తట్టదు, సిరివెన్నెల అని తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు కదా మరీ ! శాస్త్రి గారు పోతూ పోతూ తనతోపాటు దిక్సూచిని కూడా తీసుకుపోయారు. రాబోయే తరాలకి దారి చూపడం ఎలాగో ఇప్పుడు సినిమా పాట కొత్త రూటు వెదుక్కోవాలి. నిజమే, ఆయన లేని లోటు పాటల్లోని విలువకి చేటు.
అందరూ ఆదిభిక్షువు వాడినేది కోరేదీ అనో, సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది అనో తల్చుకుంటున్నారు. ఈ గ్రాంధిక భావావేశాన్ని మించిన ముద్ర సిరివెన్నెల తరతరాల మీదా వేశారన్నది కాస్త ఆగి ఆలోచిస్తే అర్థమవుతుంది. విరించిగా ఆయన విరచించిన గీతాల లోతులు… మన బతుకుల్లోని గతుకుల్ని చూపిస్తాయ్. నిగ్గదీసి అడిగినా, అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని నిలదీసినా అన్నీ ఆ వరసలోవే ! అదంతా ఓ ఎత్తు. మనలోని స్వార్థానికి తలంటే తాత్వికత, నువ్వెంత నల్లపూసంత అంటూ ఈసడించి ఇంతలోనే అంత హితబోధ చేసే రచన మరో ఎత్తు. సాధారణంగా చెప్పే విషయాన్ని కూడా గుండె లోతుల్లో గడ్డ పలుగు గాత వేసినట్టు నాటే పదాల పట్టు… సిరివెన్నెల సంతకం. ఓ ప్రేమ పిపాసి పోరాటాన్ని దిరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా అని పోల్చినప్పుడు ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్వేగం ఆ పదాల్లో కనిపిస్తుంది. అందుకే అన్నది ఆకాశం అల్లంత ఎత్తులోనే మనకంటే పైనే ఉంటుందని. ఆ ఆకాశం నుంచే కురిసిన ఇలాంటి వెన్నెలెన్నో.
సిరివెన్నెలంటే ఓ నాలుగు వేల పాటలా ? నువ్వంటే ఇదీ అంటూ తట్టిలేపే మూర్తిమత్వపు మాటలా ? ఇవేమీ కాదు. త్రివిక్రమ్ చెప్పినట్టు, ఆయన ఓ సినిమా కవి అయిపోయాడు కాబట్టి ఓ పరిధి వరకే మనకు కనిపించాడు. పిన మామగారిని పొగడాలని ఆయన ఆ మాట చెప్పి ఉండదు. సాహిత్యం తెలిసి, నలుగురూ తెలుసుకుంటే మరింత బావుంటుందనే స్వార్థంతోనే అనుంటాడు అనిపిస్తుంది. అలా అనిపించాలి అంటే ముందు మనకి కొన్ని తెలిసి ఉండాలి. జగమంత కుటుంబం నాది అనే పాటను అప్పటికే ఓ పాతికేళ్ల ముందు రాసుకొని, ఎవరూ తీసుకోక పుస్తకాల కట్టల్లో మిగిలిపోయింది. ఎందుకంటే సిరివెన్నెల విలువలకి సినిమా ఇచ్చిన విలువ అలాంటిది మరి. ఆ పాట ఓ కుతూహలం ఉన్న దర్శకుడి కంటపడి, వెంటపడి మరీ చర్చిస్తే చక్రం లాంటి తాత్విక దృక్పథం ఉన్న సినిమా అయ్యింది. ఎందుకురా ఇంత పిచ్చి… ఇది ఆడని సినిమా అని ఆయన ముందే చెప్పినా, నాకు నచ్చింది నేను తీస్తా అని మొదలు పెట్టా అనేది కృష్ణవంశీ కన్ఫెషన్.
సందర్భం చెప్పి, వీలైతే ఎలాంటి పదాలు పడాలో కూడా ముందే డిక్టేట్ చేసే సినిమా ఇండస్ట్రీలో… ఆయన పాట రాయాలీ అంటే సినిమా ముందుగా ఆయన కళ్లకు కట్టాలి. ఆనక, ఆయనకి సాహిత్యం తట్టాలి. ప్రత్యేకత ఏదో స్ఫ్ఫురణకు రావాలి. ఆ తర్వాతే ఆయన రాస్తాడు. ఆయనకి కథ చెప్పి ఒప్పించాక కథనం మార్చుచుకున్న దర్శకులు ఎందరో ! అందుకే ఆయన రాయడం ఈ మధ్య తగ్గింది. లేదు లేదు. తగ్గించుకున్నాడు ఆయనే. మీకు కావాల్సింది మార్కెట్లో విరివిగా దొరుకుతున్నప్పుడు ఇన్ని మెట్లు ఎక్కి ఇంత దూరం రావడం దేనికి – అని ఆయన చమత్కరించేవాడు దర్శకనిర్మాతల్ని ! అందులోనే ఉంది చూడండి… ఎక్కడైనా దొరికేది మీకు కావాలి, నాలాంటి ప్రత్యేకం ఎందుకు అంటూనే, నేను ఎత్తులో ఉన్నాను, అధిరోహించి, ప్రయాణించి చేరుకోవాలి నన్ను అనడంలో రవ్వంత అతిశయం తొణికిసలాడుతుంది.అంతకు మించిన ఆవేదన, ఆ వెనకే పడిపోతున్న స్టాండర్డు మీద రవ్వంత కన్సర్న్ కూడా ఉన్నాయ్. సింప్లీ దటీజ్ సిరివెన్నెల.
శేషేంద్ర లాంటి వాళ్ల కవితాధార చూసి, క్రిష్ణ శాస్త్రి లాంటి వాళ్లని కూడా మెప్పించి ఆత్రేయను మరపించి ఫీల్డులో జెండా పాతిన వేటూరి ఓ దశలో పూర్తిగా రూటు మార్చేశారు. నిర్మాతల డిమాండు మరి అంటూ ఆయన విరివిగా పెన్ను పారేసుకునే రోజులు దాపురించేశాయ్. నేను చేయాల్సింది నా కళాపోషణ కాదు, నా దగ్గరకొచ్చే దర్శకులకి కావాల్సిన కళా సేవ. ఏం చేయను – అని ఆయన నిరాశపడిన రోజుల్లో సిరివెన్నెల రాక సినిమా సాహిత్యంలో కొత్త వెన్నెల ఒలికించింది. భావాన్ని రంగరించి చెప్పడానికి పరిమితుల్లేవు, సందర్భాన్ని నువ్ సృష్టించుకోవచ్చు అన్నట్టుగా స్వర్ణ కమలాల్ని ఆయన విరబూయిస్తున్న తరుణంలో… వేణువై వచ్చి భువనాన తనని తాను మరోసారి ఆవిష్కరించుకున్నారు వేటూరి. చాలా మందికి ఈ ప్రభావం అంత తేలిగ్గా అర్థం కాదు. కె విశ్వనాథ్ లాంటి శిఖరం సిరివెన్నెలను ఆలింగనం చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ లాంటి క్రైమ్ పాపాసి కూడా ఆ కలం బలాన్ని మరో కోణంలో వాడుకున్న జాడ, పూల రెక్కల్లో తేనె చుక్కల్లో కనిపిస్తుంది. సిరివెన్నెల ప్రాభవం ఇలాంటి మైలురాళ్లు ఇంకెన్నో !
ఇంకని చెంపల పారేశోకం తూకం వేసేదెవరని ప్రశ్నించింది ఈ మధ్యనే ఆయన కలం. అరవింద సమేత సినిమాలో. ఇప్పటి జనరేషన్ కి ఈ తీవ్రత ఇప్పుడు తెలియకపోయినా మరో పది పదిహేనేళ్లకి అయినా అర్థం అవుతుంది. అప్పుడు నిన్నటి చల్లదనంలా ఈ సిరివెన్నెల వారిని కూడా తాకుతుంది. పాట పాతది అయినా పదం పదును తగ్గక పోవడమే సిరివెన్నెల ప్రత్యేకత. ఆ విషయం రాబోయే తరాలు కూడా చూస్తాయ్. అయినా మీరు ఎందుకు రాయరు… ఈ తరం ఊగిపోతుంది మీరు రాస్తే అని దర్శకుడు కంపెల్ చేస్తే, కమ్ టు ద పార్టీ అంటూ రాశాడన్నది లిరిసిస్ట్ లేబుల్ చూస్తే కానీ చాలా మందికి తెలియదు. ఎందుకంటే, అది అమ్ స్టర్ డామ్ లో వెల్లివిరిసిన పువ్వుల నది ఆ నవ్వు. అదే కోవలో … ఆయనే రాసినట్టు – ఐయామ్ ద బెస్ట్ ఛాయిస్, లైక్ ద రోల్స్ రాయిస్ అనేదీ అక్షరాలా నిజం. పాటల రచయితలే రథాలైతే సిరివెన్నెల నిజంగా రోల్స్ రాయిసే. హి ఈజ్ ద బెస్ట్ చాయిసే !