నేను చుడితే కొప్పు… నువ్ చేస్తే తప్పు – అనేది మీడియా విషయంలో ఏపీ పార్టీల పాలసీ. దశాబ్దాలుగా ఇదే ధోరణి ఉన్నా ఎప్పుడూ లేనంత పోలరైజేన్ ఇప్పుడు వచ్చేసింది. మీడియా, ఛానెళ్లు కూడా పార్టీల వారీగా విడిపోవడానికి ఏ మాత్రం జంకడం లేదు. నేరుగా అజెండాను మోసే ఛానెల్ గా ఒక్క సాక్షి మాత్రమే కనిపిస్తున్నా… పార్టీల జెండాలు ఎగరేసే ఛానెళ్లు ఎన్నో ఉన్నాయ్. అందుకే ఈ ప్రశ్నకి వెయిట్ చాలా ఉంది… అనుకుల మీడియాతో టీడీపీకి లాభమా ? నష్టమా ?
మన వాకిట్లో ముగ్గు మనం వేసుకొని… మన గొబ్బెమ్మలు మనం పెట్టుకొని… మనం సంతోషపడితే ఏం లాభం ? మనకి మాత్రమే సంబడం ! దారిలో కనపడితే తొక్కి పోయే వాళ్లు ఉంటారేమో కానీ అంతకంటే కలిసొచ్చేది ఏం ఉండదు. అనుకుల మీడియా ప్రచారం కూడా అలాంటిదే ఓ రకంగా చెప్పాలంటే ! నీ ఛానెల్ ఎవరు చూస్తారో తెలుసు. నువ్ చెప్పేది ఎవరికి రీచ్ అవుతుందో తెలుసు. నువ్ చెప్పినా చెప్పకపోయినా నిన్ను కాదని వాళ్లు ఎలాగూ దాటిపోరు. నువు కొత్తగా సాధించేది ఏం లేదు. నువ్ టచ్ చేసే న్యూ ఫ్రాంటియర్లు ఏమీ ఉండవు. పై పెచ్చు ముద్ర కొట్టేందుకు ప్రత్యర్థికి చేతినిండా అవకాశం దొరుకుతుంది. సరిగ్గా అలా పుట్టిందే… అను-కుల మీడియా అనే మాట !
అంటే మన గొప్ప మనం చెప్పుకొని, మన తొడ మనం కొట్టుకోవడం తప్పితే కొత్తగా ఒరిగేది జరిగేది ఏం ఉండటం లేదన్నది కొన్నేళ్లుగా రుజువు అవుతోంది. పైగా వ్యక్తిగత దూషణలు ముదిరి చెప్పుదెబ్బల వరకూ వెళ్లే సంస్కృతి విభజన రేఖను చెరిపేస్తోంది. ఎదుటి వాళ్లకూ నీకు తేడా లేదని తేల్చేస్తోంది. దీని వల్ల రెండు జరుగుతాయ్. ఒకటి… ఎదుటి వాళ్లని నిలదీసే, తప్పు పట్టే అవకాశం కోల్పోవడం. రెండోది… నువ్ చెప్పే మాటను నమ్మే వాళ్లు తగ్గిపోవడం. వాడికీ నీకూ తేడా ఏముందిలే అనే ముద్ర పడిపోవడం. అంటే అప్పటి వరకూ ఉన్న అడ్వాంటేజ్ పోతోంది. వీళ్లు అలాంటి వాళ్లు కాదు… చెప్పే దాంట్లో కాస్త లాజిక్ ఉంటుంది అనే సెన్స్ చచ్చిపోతే… పిచ్చి తిట్లు మిగులుతాయ్. మీడియా మౌత్ పీస్ గా మారుతుంది.
బూతులు తిట్టే వాడిని ఎదురు బూతులు తిట్టడం మొదలు పెడితే సంస్కారం సంక నాకుతుంది. ఆల్రెడీ తిట్టేశాక… నన్ను తిట్టారు అని మొరపెట్టుకొని, రాజకీయంగా లాభం పొందే ఛాన్సు లేకుండా పోతుంది. ఎదుటివాడు కబడ్డీ అంటూ నడ్డి మీద తంతున్నప్పుడు మనం మాత్రం చదరంగం ఆడతామా అంటారేమో… పాయింటే ! చేసేదే చెప్తా చెప్పేదే చేస్తా అని అవతల వాడు ఆల్రెడీ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చి చాలా ఏళ్లు అయ్యింది. అందుకని కొత్తగా పోయేదేం ఉండదు అటు పక్క ! కానీ ఇటు అలా కాదు కదా… శిరోమణి అని కదా మనం మనకి ఇచ్చుకుంటున్న సర్టిఫికెట్. దానికి విలువ లేకుండా పోతోంది ఈ రకం గేమ్ వల్ల ! అదీ అసలు పాయింట్. ఒక్క ఈనాడుకు తప్ప మిగతా వాళ్లెవరికీ అర్థం కాని విషయం ఇది.
మీడియా అయినా, సోషల్ మీడియా అయినా… జనం కోసం పని చేయాలి అని స్టేట్ మెంట్లు ఇవ్వడం లేదు కానీ చెప్పే దాంట్లో మాత్రం లాజిక్ ఉండి తీరాలి అనేది మాత్రం పాయింట్. ఆ లాజిక్ ఉంటేనే కన్విన్స్ చేయగలం. కొత్త వాళ్లని ఆకర్షించగలం. మెప్పించగలం. బలం పెంచుకోడానికి దారులు పడతాయ్ అప్పుడే! అంతే కానీ వాడు తిట్టాడు కదా అని మేమూ తిడతామని మీడియా సంస్థలు, పేస్ బుక్ గోడలు రెడీ అయిపోతే… బతుకు బాక్సింగ్ రింగ్ అయిపోతుంది అంతే. బుగ్గలు వాస్తాయ్ తప్ప బుద్ధులు మారవ్. అందుకే… తెలుగులో అగ్రస్థానంలో ఉన్న తొలి రెండు ఛానెళ్ల మొదలు… పదో పరకో వరకూ అనేక మీడియా సంస్థల్ని నడిపే పార్టీ న్యూట్రాలిటీ గురించి పాఠం చెప్పగల్గుతోంది. నిష్టూరాలు ఆడటం తప్ప… నిజాలు మాట్లాడలేని ఓ మూడు ఛానెళ్లు చూస్తూ ఉంటున్నాయ్ ఇప్పుడు. ఇలాంటి పరిస్థితితో ఎక్కువ నష్టం విపక్షానికే !