38 C
Vijayawada
Thursday, April 25, 2024
Homeరాజ నీతికుప్పం లాంటి కథలకు కేంద్రం బ్రేక్ వేసిందా ?

కుప్పం లాంటి కథలకు కేంద్రం బ్రేక్ వేసిందా ?

ప్రతీ నియోజక వర్గంలో పది నుంచి పదిహేను వేల దొంగ ఓట్లు పుట్టించే ప్రయత్నం జరుగుతోంది. మీరే అలర్ట్ గా ఉండాలి. ఎప్పటికప్పుడు లిస్ట్ చెక్ చేసుకోవడం, మీ ఓట్లు రక్షించుకోవడం అవసరం – ఈ మధ్య పార్టీ అంతర్గత సమావేశంలో చంద్రబాబు కామెంట్స్ ఇవి ! ఎటువైపు నుంచి ముప్పు పొంచి ఉందో, ముంచుకు వస్తోందో తెలిసిన తర్వాత ఇలాంటి సూచనలు ఆటోమేటిగ్గా వస్తాయ్. ఇప్పుడు కేంద్రం తెస్తున్న చట్టం ఇలాంటి డేంజర్ ను కౌంటర్ చేసేందుకు ఉపయోగపడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయ్. ఇంతకీ ఏంటా చట్టం ? ఏంటి కథ ?

ఓటర్ ఐడీని ఆధార్ కి లింకు చేసే చట్టానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇక మీదట ఓటు వేయాలంటే ఓటర్ ఐడీ ఆధార్ కి లింకు అయ్యి ఉండాలన్నది ప్రాధమిక సూత్రం అని చెప్పబోతోంది కేంద్రం. దేశంలో అన్ని పథకాలకూ, ఐడెంటిటీకి నిర్ధారణ పత్రం ఆధారే కాబట్టి ఓటు కూడా లింకు చేయాల్సిందే అని కేంద్రం కొన్నాళ్లుగా చెబుతోంది. ఇప్పుడు అన్నంతపనీ చేసి చట్టం తెస్తోంది. లోక్ సభ ముద్ర పడింది. ఇక మిగతాదంతా టెక్నికల్ వర్కే ! అంటే వచ్చే ఎన్నికల నాటికి ఓటు – ఆధార్ కలిసి లింకు అయిపోవాలన్నమాటే. రాజకీయంగా, ఎన్నికల పరంగా చూస్తే ఈ నిర్ణయం చాలా మార్పులు తెచ్చే అవకాశాలు కనిపిస్తోంది. బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో చొరబాటు దారులు కూడా ఓట్లు వేస్తున్నారు. అలాంటివాటిని నిరోధించాల్సిన అవసరం ఉంది అంటూ ఆర్నెల్ల కిందట బీజేపీలో కొందరు హడావుడి చేశారు. ఆ ప్రభావమో, మరే ఇంపాక్టో కానీ ఇప్పుడు అయితే అడుగు పడింది. ఏపీ వరకూ దీని ప్రభావం గట్టిగానే ఉంటుందని అర్థం అవుతోంది.

ఏపీ ఈ మధ్య కాలంలో స్థానిక ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా చూసింది. బద్వేలులో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ చేయలేదు. అంతే ఏకపక్షంగా జరిగే ఎన్నిక. అయినా, పని గట్టుకొని, మెజారిటీ కోసం అక్కడ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పోలయ్యాయి అనే ఆరోపణలు గట్టిగా వినిపించాయ్. కుప్పంలో అయితే ఇలాంటివి కుప్పలు తెప్పలుగా జరిగాయ్ అని టీడీపీ చెబుతూ వస్తోంది. సాక్షాత్తు చంద్రబాబు కూడా ఇదే అన్నాడు. కొందరు టీడీపీ నేతలు ప్రత్యర్థులతో లాలూచీ పడటం ఓ కారణం. రెండో రీజన్ అయితే – బస్సుల్లో ముందు నుంచి ఇతర ప్రాంతాల వారిని భారీగా తరలించారు. అందుకే దొంగ ఓట్లు పడ్డాయ్ అనేది టీడీపీ లెక్క. అంటే ఎక్కడైనా ప్రత్యేకంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నికలప్పుడు ఇలా చేసేందుకు వీలు ఉంటుందేమో బహుశా ! మిగతా ప్రాంతాల నుంచి జనాన్ని తోలుకెళ్లి – అనుకున్నది చేయడం. ఇదో మోడల్. అదే రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతున్నప్పుడు అయితే ఏం చేస్తారు ? ఎస్. మొదటి వాక్యంలో చెప్పింది అదే పాయింట్. అలాంటి ఎత్తుగడలకు చెక్ పెట్టేందుకు ఈ ఆధార్ ఓటర్ ఐడీ లింకు ఉపయోగపడే అవకాశం ఉంది. అయినా ఈసీ యంత్రాంగం సమర్థంగా పని చేయాలి. పోలీసింగ్ సిస్టమ్ సక్రమంగా తమ పని తాము చేయాలి అనే కండిషన్ క్లాజులు ఎలాగూ ఉంటాయ్. ఎందుకంటే అలాంటి లూప్ హోల్స్ తోనే కదా ఎన్నికల సమయంలో హ్యాండిల్ చేసేది.

ఇక ఇందులో మరో కోణం కూడా ఉంది. ఆధార్ ను ఓటర్ ఐడీకి లింకు చేయడం వల్ల గోప్యతకు భంగం కలుగుతుంది అని కొన్ని హక్కుల సంఘాలు మొత్తుకోవడం మొదలైంది. ఓటు ఎవరికి వేశారో తెలిసిపోతే కొన్ని వర్గాల మీద వేధింపులు పెరుగుతాయని వీళ్లు అంటున్నారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేసే పరిస్థితి వస్తుందని కూడా అంటున్నారు. కొత్తగా ఏదైనా అడుగు పడినప్పుడు ఇలాంటి ఆందోళనలు సహజంగానే ఉంటాయ్. ఈవీఎంలు వచ్చినప్పుడు ఇలాంటి అభ్యంతరాలు వచ్చాయ్. ఇప్పటికీ కొన్ని అనుమానాలు అలాగే ఉన్నాయ్. ఏ బటన్ నొక్కినా అధికార పార్టీకే పోతోంది అని ప్రతీ చోటా ఆందోళనలు వినిపించడమూ చూస్తుంటాం. అలాంటి వాటికి వీవీ ప్యాట్ లు వచ్చిన తర్వాత కొంత వరకూ చెక్ పెట్టినట్టు అయింది. కచ్చితత్వం ఎంతో మాత్రం ఇంకా తెలియదు. అంతెందుకు, అసలు ఆధార్ తెస్తున్నప్పుడు కూడా ఇప్పటి అధికార పక్షం – అప్పటి ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. కానీ ఆధార్ వచ్చాక అలవాటు అయ్యింది. ఇప్పుడైతే టీకా నుంచి బ్యాంక్ అక్కౌంట్ల వరకూ అన్నిటికీ కంపల్సరీ అయ్యింది. సమాచారం లీక్ అవుతోందని అక్కడక్కడా వినిపిస్తున్నా వాటన్నిటికీ సమాధానాలు కూడా వస్తున్నాయ్.

అలాగే ఓటు – ఆధార్ అభ్యంతరాలకి కూడా సమాధానం దొరుకుతుందేమో చూడాలి. ఇప్పుడే మాట్లాడ్డం టూ అర్లీ. కాకపోతే ఒకటి మాత్రం నిజం. కండబలాన్నే నమ్ముకున్న బండ పార్టీలు – ఎన్నికల్లో అరాచకం చేసి బయట పడాలి అనుకుంటాయ్. ఎదుటి వాళ్లని భయపెట్టి – జనాన్ని బెదిరించి ఇష్టారీతిన గుద్దుకోవాలి అనుకుంటున్నాయ్. ఆల్రెడీ చేస్తున్నాయ్ అదే పని. అలాంటి వాళ్లకి చెక్ పెట్టేందుకు ఓటు ఆధార్ లింకింగ్ ఓ అస్త్రం అయ్యే అవకాశాలు అయితే పుష్కలం. ఇప్పుడు దొంగ పనులు చేయడానికి పాత ప్లాన్ సరిపోదు. కొత్త ఐడియా అవసరం పడింది అనమాట. ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్నాయ్ కాబట్టి – ఆ సమయానికి ఈ లింకింగ్ అమల్లోకి రావొచ్చు. ఏపీకి ఉన్న టెన్షన్లలో, అభ్యంతరాల్లో దొంగ ఓట్లు అనే సబ్జెక్టు కీలకం. ఆ సబ్జెక్టు సిలబస్ కి ఈ లింకింగ్ చాలా వరకూ సమాధానం చెప్పిందని అనుకోవచ్చునేమో !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments