31 C
Vijayawada
Friday, April 26, 2024
Homeరాజ నీతిచంద్రబాబు వయసు అయిపోయిందా ? ఏపీ రాజకీయాల్లో ఏజ్ అంత ముఖ్యమా ?

చంద్రబాబు వయసు అయిపోయిందా ? ఏపీ రాజకీయాల్లో ఏజ్ అంత ముఖ్యమా ?

మాయాబజార్ ఆల్ టైమ్ గ్రేట్ అద్భుతం. కానీ ఇప్పటికిప్పుడు టీవీలో వేస్తే ఎంత మంది కదలకుండా చూస్తారు ? కొత్త జనరేషన్ కనెక్ట్ అవుతుందా ? అదే అసలు పాయింట్ ! రిలవెన్స్ అంటారు దాన్ని ! ఓ ప్రోడక్ట్ అమ్ముడు పోవాలన్నా, ఎందులో అయినా గెలుపు రావాలన్నా, ఫలితాన్ని శాసించాలన్నా, విజయాన్ని శ్వాసించాలన్నా ఈ రిలవెన్సే కీలకం. ఏపీ రాజకీయాల్లో ఏజ్ కి కూడా ఇలాంటి ప్రాధాన్యమే ఉందా ? చంద్రబాబు ఏజ్ ఫలితాల్ని తేల్చగలదా ? మార్చగలదా ?

ఒక్క ఛాన్సు ఇవ్వడానికో తీసుకోడానికో అనుభవం అక్కర్లేదు. కానీ రిపేర్లు చేయడానికి, రాత మార్చడానికి మాత్రం ట్రాక్ రికార్డ్ కావాలి. 2019, 2014 ఫలితాల్లో ఆల్రెడీ చూసేసిన రిజల్ట్ ఇది. మరి 24 సంగతి ఏంటి ? చంద్రబాబు వయసు అయిపోయింది అంటారు ప్రత్యర్థులు. సొంత పక్షంలో ఉన్న నిస్సంతోషుల్లోనూ ఎన్నో సందేహాలు. ఏదో లేదని వెలితి. అలాగని, ఏం కావాలో తెలియని అయోమయం. ఇంతకీ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబరా ? అంతకు మించిన విషయం ఏదైనా ఉందా ? చంద్రబాబుకు ఏజ్ బారు అయ్యింది కాబట్టి యువత టీడీపీ వైపు చూడటం లేదా ? నిజమేనా ? 70 దాటినా ఇప్పటికీ తాను క్రీజులో ఉన్నాను అని నిరూపించుకోడానికి చంద్రబాబు రోజుకి 15 గంటలు పని చేయాల్సిన అవసరం ఉందా ? చంద్రబాబు పని అయిపోయింది అని ప్రత్యర్థులు చేేసే విమర్శలకి వేల్యూ ఇచ్చి ఇప్పటికీ సమాధానం చెప్పుకుంటూ భుజాలు తడుముకుంటూ ఉండాలా ?

గత పదేళ్లలో బాలీవుడ్ ను ఊపేసిన మోస్ట్ రొమాంటిక్ మూవీస్ లో వెరీ వెరీ స్పెషల్… జబ్ తక్ హై జాన్. ఆ పొయిటిక్ ఎక్స్ ప్రెషన్, ఆ పాటలు, స్టోరీ టెల్లింగ్ మనసు మీద ముద్ర వేసినట్టు ఉంటుంది. ఆ సినిమా తీసినప్పుడు యశ్ చోప్రా వయసు 82. ప్రపంచం నోరెళ్లబెట్టి చూసే సినిమాలు తీసే జేమ్స్ కేమెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి వాళ్లు అద్భుతాలు చేసిందీ, చేస్తున్నదీ 70లలోనే ! రాజకీయాల్లో… దేశ భవిష్యత్ ను శాసించే రీతిలో పరిపాలన చేసిన పీవీ పగ్గాలందుకున్నది, పరిపాలించింది 71 – 76 ఏళ్ల మధ్యే ! కరుణానిధి మలి విడత సీఎం అయ్యింది 82 ఏళ్ల వయసులో ! 43 ఏళ్లకిపైగా రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు మరి ఇప్పుడు చేయాల్సింది ఏంటి ? తాను ఎందుకు రావాలో ప్రజలకు వివరించడానికి ప్రయాస పడటం ఆపి, తాను ఎందుకు అవసరమో అర్థం చేసుకునే సమయం వాళ్లకి ఇవ్వాలి. దానికి కొంత నిబ్బరం కావాలి.

ఏపీ రాజకీయం ఇప్పటికే తమిళనాడులా మారిపోయింది. కళ్లు మూసుకుపోయి మనకే అర్థం కావడం లేదు కానీ ఆ ముద్ర పడి చాలా ఏళ్లు అయ్యింది. జాతీయ పార్టీలు తుడిచి పెట్టుకుపోవడం, ఓ పార్టీ మూలన పడి… మరో పార్టీకి ఎదురులేని మెజారిటీ రావడం, కక్ష సాధింపులకి కేరాఫ్ కావడం, చీమ చిటుక్కుమంటే ఉలిక్కి పడే  చంద్రబాబు కూడా ఎన్నికలు బాయ్ కాట్ చేసే వరకూ వెళ్లడం … ఇవన్నీ ఆ నమూనాలే ! అలాగే ఏజ్ రిలవెన్స్ కూడా ! రూల్డ్ అవుట్ అయిపోయాడు అనుకున్న ప్రతీసారీ కరుణానిధి పంచె ఎగ్గట్టి నిలబడ్డ సందర్భాలే కనిపిస్తాయ్ తమిళనాట ! ఎంజీఆర్ దెబ్బకి వరసగా ఓడిన తర్వాత కూడా తట్టుకొని నిలబడటంలో కానీ, పొత్తులు కట్టి… ఎత్తుగడలు వేసి నిలబడటం లో కానీ, పార్టీని సొంత వారసత్వంగా మార్చేశాడు అని విమర్శలు ఎదుర్కోవడంలో కానీ కరుణకీ చంద్రబాబుకీ చాలా పోలికలు ఉంటాయ్. లేనిదల్లా కవితాత్మక దృక్పథం, కరుకు స్వభావం. ఆ రెండూ కరుణకి ఉండేవి.

కొత్త వరద వచ్చి ముంచినప్పుడు శివుడి ఆలయం కూడా జల సమాధి అవుతుంది. నేను భగవంతుణ్ని అని కైలాసం నుంచి దిగొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెబుతాడా ? లేదే ! కాలం సమాధానం చెబుతుంది. సెప్టెంబర్ తర్వాత డిసెంబర్ వస్తుంది. దర్శనం ఇస్తుంది. కాల ప్రభావం. ఇదీ అంతే ! పైగా బైపోలార్ పొలిటిక్స్, రెండు ప్రాంతీయ పార్టీల వ్యవస్థ నడుస్తున్న రాష్ట్రంలో  భయపడటానికి, బాధ పడటానికి ఏం లేదు. భావజాలాలు చెకుముకి రాళ్లలా సంఘర్షిస్తాయ్. నిప్పు రాజేస్తాయ్. ఎవరి మంట ఎక్కువ మండితే వాళ్లదే గెలుపు. వికసించిన పూవు వాడే రోజు దగ్గరలో ఉన్నప్పుడు… ఉలికిపాటు కూడా ఉండనక్కర్లేదు. కానీ చేయాల్సిందల్లా ఒక్కటే !

భావజాలం విగ్రహంలా నిలబడాలి. పేరు పథకాల్లో వినబడాలి. మన కోసం జైకొట్టే జనాన్ని తయారు చేసుకొని తరాల మీదకు వదలాలి అని చెబుతుంది విజయ్ మెర్సిల్ సినిమాలో వరలక్ష్మి. మరి అలాంటప్పుడు మూడు జనరేషన్లు చూసిన నువ్వెంత నీటుగాడివై ఉండాలి ? తట్టుకొని నిలబడ్డానికి ఏం చేయాలి ? పాత సైనికుడు కొత్త యుద్ధం చేయడానికి ఏం చేయాలో తెలుసుకోవాలి ! ఆత్మరక్షణ ధోరణి నుంచి బయటపడి … ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలి. ప్రత్యర్థి బలహీనతలు, కాలం కలిసొచ్చే సందర్భాల కోసం ఎదురు చూడటంతోపాటు మూలాల నుంచి రిపేర్లు చేసుకోడం ఎలాగో, బలపడటం ఎలాగో తెలుసుకోవాలి. ఆల్రెడీ అందరూ నడిచేది బాట. ఎలా నడవాలో, ఎటు నడవాలో చూపించేది ట్రెండ్ ! అనేక బాటలు చూసిన తర్వాత ఇప్పుడు సృష్టించాల్సింది ఈ ట్రెండునే !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments