28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిఆ కులం వారిపై మనకి ఇంత కసి ఎందుకు ?

ఆ కులం వారిపై మనకి ఇంత కసి ఎందుకు ?

బాబులు గాడికి పదెకరాలు పొలం ఉండేది. ట్రాక్టర్, హడావుడి అంతా కనిపించేది. ఓ సారి హఠాత్తుగా ట్రాక్టర్ అమ్మేశాడు. ఆ తర్వాత పొలం బేరం పెట్టేశాడు. అంతా బాబులు గాడు అయిపోయాడు. ఆరిపోయాడు అన్నారు. తీరా నాలుగైదేళ్లకి తెలిసింది. రాయచూర్ దగ్గర సెటిల్ అయ్యాడని. ఇక్కడ పొలం అమ్మేసి అక్కడ 30 ఎకరాలు కొన్నాడని. మాటల్లో బైటపడింది, సింధనూరు ప్రాంతంలో పెద్ద కమతాల్లో బాబులు గాడిది కూడా ఒకటని. అంటే బాబులు గాడు ఓడిపోలేదు. పారిపోలేదు. అవకాశాన్ని వెతుక్కుంటూరు రెక్కలు కట్టుకొని ఎగిరిపోయాడు. ఎత్తులో ఎగిరి, దూరపు చూపు అలవాటు చేసుకోగలిగాడు. కానీ బాబులు గాడిని తిట్టినోళ్లు మాత్రం అరుగు దిగలేదు కాబట్టి వీధి చివరి వరకూ కూడా చూడలేక అక్కడే ఆగిపోయారు. బాబులు గాడు అవకాశాల్ని వెదుకుంటూ ముందుకు వెళ్లాడు అని అర్థం చేసుకోవడం ప్రోగ్రెస్సివ్ మైండ్. బాబులుగాడి కులం పేరుచెప్పి వాడు అడ్డంగా బాగు పడ్డాడు అని ఆడిపోసుకోవడం అజ్ఞానం. ఇలాంటి అజ్ఞానానికి ఖజానా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మైండ్ సెట్. అసలు ఏపీలో ఓ కులం గురించి మాత్రమే ఎందుకు మాట్లాడతున్నారు ? మాట్లాడుతున్న వాళ్ల అసలు లక్ష్యం ఏంటి ? చూసే ముందు చరిత్ర ఓసారి బ్రీఫ్ గా తిరగేద్దాం !

అవకాశాలను వెదుక్కుంటూ వాళ్లు ఎక్కడికైనా ఎగరగలగడం వెనక చారిత్రక నేపథ్యం ఉంది. విజయాలు ఉన్నాయ్. అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం ఆ ఉద్ధృతికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ సామ్రాజ్యానికి కావలి కాసిన సైన్యాధిపతులు, వ్యూహ నిపుణులు ఓ వర్గం వారే అనేది చరిత్ర పరిశోధకులు చెప్పిన మాట. కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత కాపయ నాయకుడు లాంటి వాళ్లే రాజ్యాన్ని రక్షించారు. ఉత్తరాదిలో ఇస్లామిక్ పాలన విస్తరిస్తున్న రోజుల్లో దక్షిణాదివైపు ఆ నీడ పడకుండా ఆపిన అతి కొద్ది మంది రక్షకుల్లో వీరిది ప్రముఖ స్థానం. ఆ తర్వాత విజయ నగర సామ్రాజ్యానికి వసల వెళ్లి అక్కడ స్థిరపడ్డారని, ఇప్పటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాల్లో కుల మూలాల వెనక సంగతి ఇదేనని చెబుతారు. అంటే రక్షణగా ఉండటం, ప్రతికూల పరిస్థితుల్ని ముందుండి ఎదిరించడం వాళ్ల లక్షణం. ఇదే చరిత్ర చూపించే మూలం.

బ్రిటీషు పరిపాలనా సమయంలో నీటి పారుదల సదుపాయాలు ఏర్పడుతున్న కాలంలో ముందుకు నడిచి సాగులో సత్తా చూపించింది కూడా వాళ్లే. తుంగభద్ర తీరాల్లో, కేసీ కాలువ గట్ల చుట్టూ, నిజాంసాగర్ నడిగడ్డ మీద క్రిష్ణా డెల్టాలో ఆయువు పట్టుగా ఉన్నది చాలా వరకూ వాళ్లే. అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అటు తర్వాత విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ముందుకొచ్చారు. విదేశాలకి వసల వెళ్లిన వాళ్లలో వీళ్లదే ముందు వరస. భవిష్యత్ లో సినిమా రంగం కీలకంగా ఎదుగుతుందనుకున్నప్పుడు మద్రాస్ లో జెండా పాతిందీ, సేవల రంగం వైపు దృష్టి పెట్టిందీ వీళ్లే. ఈ కాలంలో ఎప్పుడూ వీళ్లకి రాజకీయ అండ లేదు. కొందరనుకున్నట్టు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానేలేదు అప్పటికి. ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే పత్రికా, సామాజిక రంగాల్లోనూ ముద్ర పడింది ఆ కాలంలో. మరి ఫ్రిక్షన్ ఎక్కడ మొదలైంది ? ఎస్. అదే పాయింటు.

స్వాతంత్రానికి కొద్ది కాలం ముందు క్రిష్ణా గుంటూరు ప్రాంతంలో ఓ సామాజిక ప్రముఖుడు వితంతు వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి సనాతన వాదులు అడ్డుచెప్పారు. అయినా అతడు లక్ష్యపెట్టకుండా వేద విధులు కూడా నేేనే నిర్వర్తిస్తా అంటూ అధ్యయనం చేశాడు. అక్కడ పడింది బీజం. కమ్మ బ్రాహ్మణికమా అంటూ ఆక్షేపణ పుట్టింది. అంటే వితంతు వివాహం లాంటి అభ్యుదయ భావం పక్కకి పోయింది. కుల ఘర్షణ మాత్రమే కనిపించింది. ఇదే పోకడ విభిన్న రంగాలకి వివిధ కాలాలకూ విస్తరిస్తూ పోయింది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. అంధ్రులు సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నవాళ్లు. మధ్యలో రాజధాని ఉంటే అన్ని విధాలా అనుకూలం అంటూ 1950ల మొదట్లోనే ప్రతిపాదిస్తే – అది కమ్మ ప్రాంతం అంటూ బూచి పుట్టింది. అప్పటి రాజధాని కాష్టం ఇప్పటికీ మండుతూనే ఉంది. కర్నూలు, హైదరాబాద్ పోయినా ఆ మైండ్ సెట్ మాత్రం పోలేదు. రాజధాని కాదు కులం మన దృష్టిని ఆకర్షించింది ఇక్కడ. 1990ల చివర్లో సైబరాబాద్ పుడుతున్నప్పుడు ఓ సాంకేతిక విప్లవం, ప్రపంచానికి నిచ్చెన, ఆకాశమంత అవకాశం లాంటివి ఎంత మందికి అర్థం అయ్యోయో తెలియదు. కానీ అది ఓ కులం కోసం పుట్టిన కల్పతరువు అని ఆ తర్వాత కాలంలో జయభేరి మోగించారు కొందరు. ఇప్పుడు అక్కడున్న డెలాయిట్లు, ఐకియాలూ, భోజాలు ఏ కులపు వారివో – కాలమే ఎదురు నిలిచి సమాధానం చెబుతోంది. కాకపోతే ఒకటి మాత్రం నిజం. మనలో చాలా మందికి సైబరాబాద్ విప్లవం కన్నా కులం కోణమే ఆకర్షిణీయంగా కనిపించింది.

ఎందుకంటే, గిన్నెడు పాయసం ఎదురుగా పెట్టి ఆరగించమంటే – గిన్నెకున్న సొట్ట గురించి మాట్లాడే లొట్ట బుద్ధులు మనవి. ఆ సొట్టను కడుపు నిండిన వాడెవడో గుర్తిస్తాడు. ఆకలితో అలమటించే మంద కూడా ఆ సొట్ట చుట్టూ తిరుగుతూ కడుపు కాల్చుకుంటుంది. కులం కాష్టంలో దూకుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ఆధునిక చరిత్ర మొత్తం ఇంతే. వితంతు వివాహం నాటి రభస ఆధిపత్య భావజాలం అయితే, ఇప్పుడు తిరుగుతున్న కుల చక్రానికి ఇంథనం మాత్రం పూర్తిగా రాజకీయమే. ప్రతీ తరంలోనూ ఇదే రభస. ఆ మధ్య కొన్నాళ్లు ఆగినట్టు అనిపించినా ఓ 15 ఏళ్లుగా కుల ప్రోపకాండా పెరిగి విరిగి మీద పడుతోంది. ఎందుకంటే రాజకీయ అవకాశ వాదం చల్లిన విషవిత్తు ఇది. విపత్తుగా విస్తరించిపోతోంది. ఫలానా కులం నాయకుడు ఫలానా వాళ్లకే కొమ్ము కాస్తాడూ అంటే అవునంటూ పాయసం వదిలేసి సొట్ట గురించి చర్చిస్తాం మనం. అదే మన ప్రారబ్ధం.

ప్రతీ కాలంలోనూ కొందరు ముందుకొస్తారు. బాట పరుస్తారు. దారిగా మలుస్తారు. జనరేషన్లను మారుస్తారు. సినిమా అయినా, పత్రికారంగం అయినా, సర్వీస్ – సాఫ్టువేర్ సెక్టర్లు అయినా, రాజకీయం అయినా ! ఎంత మందికి అవకాశం, ఎంత ప్రభావం అనేదే చర్చ. మొదట ఉన్నవాడి కులం ఏంటనేది కాదు. ఒకడు తాడు పట్టి పైకెక్కి అదే తాడుతో మరో 30, 40 మందిని పైకి లాగుతాడు. ఇదో లైఫ్ సైకిల్. సరిగ్గా ఇక్కడే వచ్చి ఆ తాడును గొడ్డలితో నరికి కుల కోణం బయటకు తీస్తాడు ఇంకొకడు. వాడు ఫలానా కులం కాబట్టి వాడు తాడు తెగింది అని పండగ చేసుకుంటున్న వాళ్లంతా నష్ట పోయే మొదటి తరం. వర్తమానం ఈ వాస్తవాన్ని గుర్తించదు. భవిష్యత్ చెబుతుంది వెనకబాటు అంటే ఇదే అని. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇదే వెనకబాటు అనే కుంగుబాటుకు గురై కృశించిపోతోంది.

మన దగ్గర, ఇలా కులం పేరుతో దూషించి, దాడి చేసి నోరు మూయించాలి అనుకునేవాళ్లకి నిర్దిష్టమైన టార్గెట్ ఉంటుంది. సపోజ్ గత ఎన్నికల సమయంలో ఇదే కులదాడికి చంద్రబాబు కకావికలం అయిపోయాడు. తిప్పికొట్ట లేక అండర్ ప్లే చేయాలనుకున్నాడు. కానీ వల్లకాలేదు. ఓడిపోయాడు. సుజనా చౌదరి లాంటి వాళ్లు ఆ ముద్ర తమకు చుట్టుకుంటుందేమో అని బహు జాగ్రత్త పడటం కళ్లారా కనిపిస్తుంటుంది చాలాసార్లు. కులం అనేది నువ్ కోరుకొని పుట్టింది కాదు. నువ్ తల్చుకుంటే మార్చుకునేదీ కాదు. అలాంటప్పుడు ఆ పాయింటు చుట్టూ ఇంత రాజకీయం దేనికి ? ఎదుటివాడి అజెండాను జనానికి అర్థం అయ్యేలా చెప్పగలిగితే, అందులో వాస్తవాల్ని సగం అయినా నేటి తరం తెసుకుంటే అంతకు మించిన విరుగుడు మరోటి లేదు ఈ కుల కుట్రలకి. అయినా, సాక్షాత్తూ ప్రధాని స్థాయి నాయకులే నేను ఫలానా కులం వాడిని అని చెప్పుకొని ప్రత్యేక ముద్ర వేసుకునే దేశం మనది. ఆఫ్టర్ ఆల్ ఎవరో ఏదో ప్రచారం చేశారనో చేస్తారనో తత్తరపాటు ఎందుకు ?

ఒక్క ఈ కులాన్ని అనే కాదు. ఏ కులాన్ని అయినా కులం పేరుతో టార్గెట్ చేయాలనుకోవడం, లక్ష్యం చేసుకోవడం కానీ అలక్ష్యం చేయడం ఉపేక్షించరాని విషయం. ఆర్యవైశ్య దిగ్గజ నాయకుడికి సరైన నివాళి లభించనప్పుడు, కనీసం వెళ్లి నివాళులు అర్పించే తీరిక ముఖ్య నాయకులకి లేనప్పుడు కూడా తప్పు పట్టాల్సిందే. ఓ శిఖరం లాంటి గీత రచయిత అస్తమించినప్పుడు కులం పేరుతో ఓ భావజాలం రుద్ది బురద జల్లాలి అనుకున్నప్పుడు కూడా ఖండించాల్సిందే. ఇందులో మిగతా కోణాలు మరోసారి చర్చిద్దాం. అలాగే రోడ్డు మీదకి లాగి ఓ డాక్టర్ ను బజారుపాలు చేస్తున్నప్పుడు అయినా, దళిత బిడ్డల్ని కొందరు విదేశాల్లో స్థిరపడిన బలుపుగాళ్లు అనరాని మాటలు అంటున్నా గర్హించాల్సిందే. చేతన, స్పందన ఉన్న సమాజం ఏదైనా ఇలా ఆలోచించి తీరాల్సిందే. ఆలోచించలేని సమాజం మనుగడ సాధించలేదు అని అప్పుడెప్పుడోనే అరిస్టాటిల్ చెప్పిన విషయాన్ని మనిషి జన్మఎత్తిన మనం మర్చిపోకూడదు. అన్నట్టు, ఇక్కడ మాట్లాడుతున్నది కులం, దాని ప్రాధాన్యం గురించి కాదు. మానవత్వం గురించి. కుల రహిత సమాజం, విశాల దృక్పథం లాంటి చర్చ ఇక్కడ చొరబడదు. ఎందుకంటే ఇక్కడ చర్చిస్తున్నది కులం పేరుతో జరుగుతున్న అరాచకీయం గురించి మాత్రమే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments