28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeరాజ నీతిబీజేపీ ఎదిగితే ఏపీకే లాభమా ?

బీజేపీ ఎదిగితే ఏపీకే లాభమా ?

రెండు భిన్న ధ్రువాలు ఉన్న చోట ఘర్షణ మాత్రమే ఉంటుంది. పని జరిగే దారి వెదకాలి అనుకున్నప్పుడు మధ్యే మార్గం పుడుతుంది. మూడో కోణం కనిపిస్తుంది. ట్రయాంగిల్. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఆస్కారం ఉందా ? ఇటు వైసీపీ అటు టీడీపీగా విడిపోయిన రాజకీయంలో బీజేపీ కాలు మోపగలదా ? ఒకవేళ అలా జరిగితే ఏపీకే లాభమేమో అనిపిస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ! రోడ్ల మీద గతుకులు పూడ్చడం కూడా గగనం అయిపోయిన రాష్ట్రంలో – ప్రోగ్రెస్సివ్, డెవలప్ మెంట్, ఇన్వెస్ట్ మెంట్, ప్రాజెక్ట్ కంప్లీషన్ లాంటి మాటలు విని ఏన్నో ఏళ్లు అయిపోయింది. ఇలాంటి సమయంలో బీజేపీ గనక రంగంలోకి దిగితే ముక్కోణం పెద్ద కష్టం కాదు.

కుల ప్రబావం ఎక్కువగా ఉన్న ఏపీ రాజకీయాల్లో రెండు పార్టీలు ఉండటం దీర్ఘకాలంలో నష్టం. వీళ్లు కట్టింది వాళ్లు పడగొట్టడం, వాళ్లు పెట్టింది వీళ్లు చెడగొట్టడమే ఇక్కడ రాజకీయం. జెండాలు పక్కన పెట్టి ఆలోచిస్తే ఇదే నిజం. ఈ కులం ఉందని వాళ్లు, ఆ కులం ఉందని వీళ్లూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ కూర్చుంటే మూలన పడేది రాష్ట్రమే. ఆ రెండు పార్టీలకీ ఒకరి తర్వాత మరొకరికి అధికారం రావొచ్చు. సరే, కానీ ఈ కొట్లాటలో వృధా అయిన కాలం మాటేమిటి ? విభజన జరిగి ఏనిమిదేళ్లు అవుతున్నా రాజధాని లేదు, రవ్వంత అభివృద్ధి జరుగుతున్నట్టు కనిపించడం లేదు అంటే కారణం ఏంటి ? కులం. దాని చుట్టూ ఉన్న రాజకీయం. కాదంటారా ? ఇలాంటి రాజకీయాన్ని బ్రేక్ చేయాలీ అంటే – ఒక్క నేషనల్ పార్టీకే సాధ్యం. దేశమంతా ఉన్న పార్టీకి కులం అంటగట్టలేం. నేషనల్ పార్టీల విధానాలు కూడా మరీ వక్రంగా, అడ్డగోలుగా ఉండేందుకు ఆస్కారం ఉండదు. ఫలానా పార్టీ లీడర్ గోడ కూల్చండి, ఫలనా వాడు కట్టాడు కాబట్టి ఆ భవంతిని నేలమట్టం చేయండి లాంటి విధానాలు ఆ పార్టీలు చేయవ్. ఫలానా కుల సీఎం మొదలు పెట్టాడు కాబట్టి రాజధాని ఆపండి అని నేషనల్ పార్టీ అజెండాగా తీసుకోలేదు. ఎందుకంటే అది నేషనల్ పార్టీ. దేశమంతా ఉండే విధానాలు మాత్రమే ఉంటాయ్. దాని వల్ల స్థిరత్వం, పరిణతి, ఆలోచన వస్తుంది ఏపీ రాజకీయాల్లో ! బీజేపీ లాంటి పార్టీ అయితే ఎలాగూ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది కాబట్టి ఆ చేత్తో ఇటు కాకుల్ని తోలినా మెతుకులు రాలి పడతాయ్. అంటే నిధులు ఇవ్వడం, ఆగిన ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం లాంటివి సులభం అని ఉద్దేశం. అంతేగానీ ఎంగిలి మెతుకులకి ఆశ పడతామా అని రోషం అక్కర్లేదు.

నేషనల్ పార్టీల ప్రభావం కులాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. జాతీయ పార్టీలో ఫలానా నాయకుడు ఉన్నాడు అని చెప్పొచ్చు కానీ ఫలనా కులం వాడూ అంటే పళ్లు రాలతాయ్. ఎందుకంటే అదో రైలు లాంటి పార్టీ. అందులో రకరకాల పాసింజర్లు ఉన్నట్టే – ఇక్కడ అన్ని రాష్ట్రాలూ అన్ని కులాలూ ఉంటాయ్. అదే ప్రాంతీయ పార్టీ అయితే సొంత కారు లాంటిది. అందులో ఆ కుటుంబమో, లేదంటే వాళ్లు నచ్చి ఎక్కించుకున్నవాళ్లో మాత్రమే ఉంటారు. అందుకే ఆరోపణలకి ఆస్కారం దొరకుతుంది. పైగా ఏపీ జనం కులం పేరు చెప్పి రొచ్చగొడితే రెచ్చిపోయే టైపు అని ప్రశాంత్ కిషోర్ ఫలితాలతో నిరూపించాక ఇప్పుడు నేషనల్ పార్టీ వస్తే కనుక ఏపీ రోగం సగం కదురుతుంది. అలాంటి పార్టీ వచ్చి ఇక్కడ అభివృద్ది చూసి చూపిస్తే – మనకి నచ్చితే, నమ్మకం కుదిరితే ఓటు వేయొచ్చు. చోటు పెట్టొచ్చు. కొట్టుకు చచ్చే పార్టీల మధ్య నలిగిపోయే కంటే, కాస్తో కూస్తో పని చేసే వాళ్లని పెంచిపోషించడం తెలివైన నిర్ణయమే కదా ! కర్ణాటక లాంటి రాష్ట్రాలకి కలిసి వస్తున్నది ఇదే. జాతీయ పార్టీలుంటాయ్. ప్రాంతీయ పార్టీ ఉంటుంది. అడ్డగోల్ కి సెల్ఫ్ గోల్ కి ఆస్కారం ఉండదు. బెంగళూరు – మైసూర్ కారిడార్ లాగా అభివృద్ధి సాగుతూనే ఉంటుంది అక్కడ ఎవరున్నా ! అదే రెండు పార్టీలున్న తమిళనాడులో కొట్లాటే చచ్చింది నిన్నమొన్నటి వరకూ. బ్రిటీష్ కాలం నుంచే ఇండస్ట్రియల్ నేపథ్యం ఉన్న రాష్ట్రం కాబట్టి నిలబడింది కానీ లేదంటే రాజకీయం దెబ్బకి తుడిచిపెట్టుకుపోయేదే ఆ రాష్ట్రం. ఇప్పుడు స్టాలిన్ వచ్చి ట్రెండ్ మారుస్తా, అభివృద్ధి చేస్తా అంటున్నది ఆ దెబ్బతోనే ! మనకి అంత ఇండస్ట్రియల్ బ్యాకప్, డెవలప్ మెంట్ లేవు ముందు నుంచి. విభజన దెబ్బ లగాయించి తగిలింది. అందుకే ఈ మూడేళ్ల కొట్టుడుకే చుక్కలు కనిపిస్తున్నాయ్. ఎన్ని దశాబ్దాలు వెనక్కి పోయామో తెలియడం లేదు. అందుకే నేషనల్ పార్టీలొచ్చి ఇక్కడ రిపేర్ మొదలు పెడితే ఏపీకే లాభం.

మనలో చాలా మందికి రాష్ట్రం అంటే, రాజధాని అంటే ఎంత అభిమానమో తెలియదు కానీ కుల, రాజకీయ దురభిమానాలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయ్. మన బతుకులు, మన పిల్లల భవిష్యత్ ఏమైపోయినా పర్వాలేదు మనకి మాత్రం కులం, రాజకీయమే ముఖ్యం అనుకునేవాళ్లు అయితే ఆలోచించక్కర్లేదు. అలా కాదు. మన రాష్ట్రం బాగుపడాలి, కనీసం వచ్చే జనరేషన్ అయినా ఉద్యోగం కోసం వలసపోయే పరిస్థితి మారాలి, మన నీళ్లు మనం వాడుకోవాలి, మన దగ్గర కంపెనీలు, ఫ్యాక్టరీలూ రావాలి, పక్కనున్న తెలంగాణ, అటు పక్కన కర్ణాటక, కేరళ లాగా మనం కూడా సెల్ప్ సస్టైన్ కావాలీ అనుకుంటే కచ్చితంగా నేషనల్ పార్టీ ఉండి తీరాలి మనకి ! కావాలంటే చూడండి ఆ మూడు రాష్ట్రాల్లోనూ నేషనల్ ఆల్టర్ నేటివ్ ఉంది. అందుకే స్థిరత్వం, దూరదృష్టి సాధ్యమవుతోంది రాజకీయాల్లో. ఫైట్ చేసేది నేషనల్ పార్టీతో అయినప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుంటాయ్. కులం లాంటి కుళ్లు బయటపెట్టవ్. డెవలప్ మెంట్ అజెండాతోనే వస్తాయ్ ముందుకు. అది కదా రాష్ట్రానికి లాభం. ప్రాంతీయ పార్టీ అనేది పడవ. కాస్త పెద్ద అల తగిలితే బోల్తా పడుతుంది. అదే నేషనల్ పార్టీ అయితే ఓడ. పెను తుఫాన్ వచ్చినా లంగరేసి నిలబడుతుంటే తప్ప తిరగబడదు. అదే అడ్వాంటేజ్. ఆలోచిద్దాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments