35 C
Vijayawada
Friday, April 26, 2024
Homeరాజ నీతిఒక్కడు కదిలాడు... పార్టీని కదిలించాడు

ఒక్కడు కదిలాడు… పార్టీని కదిలించాడు

ప్రయాణం ఎప్పుడూ ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అని కదా అంటారు… ఇక్కడేంటి ఇంత పెద్ద కాన్వాయ్ తో మొదలైంది అనిపించింది రాజధాని రైతులకి సుజనా చౌదరి అండ్ కో ప్రకటించిన మద్దతు చూశాక ! నిజమే. భూమి లోపల ఎక్కడో పొరల్లో కాస్త కదలిక వస్తుంది. పైకొచ్చినకొద్దీ అదే ప్రకంపనగా మారి కుదిపేస్తది. కొన్నిసార్లు రాజకీయాలు కూడా అలాగే ఉంటాయ్. ఒక్కడి ఆలోచన మార్పు తెస్తుంది. ఒక్కడి కదలిక బాటనే మార్చేస్తుంది. ఒక్కడి అడుగు భవిష్యత్ కి దారి పరుస్తుంది. అమరావతి విషయంలో సుజనా చూపించిన చొరవ కూడా అలాంటిదేనేమో ! ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో, అమిత్ షాతో మొదలు క్షేత్ర స్థాయిలో సగటు బీజేపీ కార్యకర్త వరకూ అందరూ ఆలోచనలో పడేలా, అమరావతి మనది అనేలా చేసింది ఒక్కడే ! విజయవాడ నుంచి నెల్లూరు వరకూ దారి కట్టిన కాన్వాయ్ చూస్తే అనిపించింది… ఒక్కడు కదిలాడు, పార్టీని కదిలించాడు అని.

ఈ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అమరావతిని అంగుళం కూడా కదపలేదు – అని సుజనా ప్రకటించాక రైతు యాత్రికుల్లో భరోసా కనిపించింది. నేను మాట్లాడాను అంటే అన్నీ ఆలోచించి మాట్లాడతా – సాంకేతిక, న్యాయ పరమైన కోణంలో చూశాకే నేను గతంలో చెప్పా… ఇప్పుడు కూడా చెబుతున్నా… అమరావతి రాజధానిగా ఉండి తీరుతుంది అని సుజన అంటున్నపుడు నిశ్శబ్దంగా ఆలకించింది ఒక్క రైతులే కాదు రాష్ట్రం కూడా! కేంద్రంలో పలుకుబడి ఉన్న నాయకుడు ఇలా బృందంగా వచ్చి మాట ఇచ్చారు అంటే అంత కన్నా కావాల్సినది ఏం ఉంది అంటూ రైతులు మాట్లాడడం వినపడుతోంది ఇపుడు. రాజధాని పోరాటంలోనే కాదు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఇదో మలుపు కావచ్చు కూడా! ఎందుకంటే ప్రధాన విపక్షం ఇలాంటి ప్రకటనలు చేయడం మామూలే కానీ ఇక్కడ చెప్పింది కేంద్రంలో ప్రబలంగా ఉన్న బీజేపీలో చక్రం తిప్పే నాయకుడు. ఈ ప్రభుత్వం ఢిల్లీలో మేనేజ్ చేసి, దెబ్బ కొడుతుందేమో అనే భయం పటాపంచలు అయ్యింది ఈ పూటతో ! అందుకే మలుపు, మైలురాయి అంటున్నది.

ఈ పని ఇంతకు ముందే చేసి ఉండొచ్చుగా అనిపించొచ్చునేమో ! నిజమే. ఇంతకు ముందు కూడా చూశాం కొన్నిసార్లు. అమరావతి రైతులకి అండగా నిలబడి, పోరాటం మొదలైన తొలినాళ్లలో అమరావతి ఊళ్లలో తిరిగిన రోజులున్నాయ్. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వం దీర్ఘాలోచన చేయలేకపోవడం, కొంత మంది ఇప్పటి ప్రభుత్వానికి మౌత్ పీసులుగా మారిపోవడం లాంటి పరిణామాలతో పయనం ఆలస్యమైంది. ఇప్పటికైనా కదిలిక రావడానికి, అమిత్ షా నేరుగా జోక్యం చేసుకొని అందరికీ క్లాస్ పీకి, రంగంలోకి దిగండి… మనం ఉన్నది అమరావతి వెంటే అనడానికి కారణం సుజనానే ! అమరావతి వెంటే ఉన్నాం అని అమిత్ షా చెప్పడంలోనే అన్నీ ఉన్నాయ్. ఏపీతో కనెక్ట్ ఉండటానికి స్టార్టింగ్ పాయింటు ఇలాంటివే అవుతాయ్. మన కోసం ఆలోచించేవాడి గురించి మనం కూడా ఆలోచించడం మనిషి నైజం. ఏపీ కూడా అంతే. ఏపీ గురించి బీజేపీ ఆలోచిస్తే – బీజేపీ గురించి కూడా ఏపీ ఆలోచిస్తుంది. ఒక్క టూర్ తో వచ్చిన చలనం చూస్తే ఆ సంగతి అర్థం అవుతుంది.

ఇప్పుడు బీజేపీ కావాల్సింది ఏంటి ? స్థాయి గల నాయకత్వం. ఆలోచన కలిగిన లీడర్. వ్యవస్థల్ని నిర్మించగల సమర్థుడు. అమరావతితో మొదలు పెట్టి ఆర్థిక రంగం వరకూ ప్రతీ పిల్లర్ నూ పటిష్టంగా నిర్మించగల నిపుణుడు. కేంద్ర నాయకత్వాన్నీ కేంద్రాన్నీ ఒప్పించి, మెప్పించి నిధులు తెచ్చి ఏపీ గాయాలకి కట్టుకట్టే కార్మికుడు కావాలి ఇప్పుడు. ఇటు ఇక్కడి ప్రజల యాక్సెప్టెన్స్ తెచ్చుగలగాలి. ఇతడిని నమ్మి అటు కేంద్రం కూడా నీ వెంట నిలబడతాం, ఏపీ కోసం నీతో నడుస్తాం అని చెప్పాలి. చెప్పగలగాలి. అలా చెప్పేందుకు ఇప్పటికైతే కనిపిస్తున్న ఏకైక దిక్కు సుజనానే ! కేంద్రం దన్ను లేకుండా ఏపీ నడవలేని పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలే రేపటి వ్యూహాలు అవుతాయ్. కావాల్సింది కూడా అదే ! ఇవాల్టి సందడి చూశాక సుజనా ఏమనుకుంటున్నాడో పూర్తిగా తెలియదు కానీ తలుచుకోవాల్సింది ఆయన ఒక్కడే కాదు బీజేపీ నాయకత్వం కూడా ! ఆలోచించాల్సింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో… కమ్మిట్మెంట్ తో ట్రీట్ మెంట్ చేయగలిగిన పొలిటికల్ డాక్టర్ అవసరం. ఎందుకంటే డైగ్నోస్ చేయడంతోపాటు మెడిసిన్ ఏది కావాలో కూడా నిర్ణయించి, అధి తనే తెచ్చి వేయాల్సిఉంది. అందుకే ఈ మూడూ కలగలిసిన నాయకత్వం కమలానికి ఉంటే అది ఏపీకి అతి పెద్ద రిలీఫ్.

ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ. ఇప్పుడొస్తే నమ్ముతామా అంటూ రాగాలు తీస్తున్నారు కొందరు. సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇలాంటి ఒంటి కాయ సొంఠి కొమ్ము వేషాలు ప్రతీ చోటా ఉంటాయ్. అయినా ఇప్పుడు ఏపీకి కావాల్సింది రాజకీయ జెండాలు అజెండాలూ కాదు. పని చేసేవాడు. పని అయ్యేలా చూసేవాడు. అమరావతి ఆగిపోయింది అని ఏడుస్తున్న మనమే ఫలానా వాడు రావాలి, ఫలానా వాళ్లు వద్దు అని హద్దులు పెట్టుకోవడం తెలివి తక్కువతనం. ఏపీకి డెవలప్ మెంట్ కావాలి. ఇదిగో నీ డెవలప్ మెంట్ అని శాంటాక్లాజ్ వచ్చి తలకిందపెట్టి పోడు కదా ! ఎవరో ఒకరు పూనుకోవాలి. కదిలి రావాలి. కొత్త నాయకత్వం ఇవ్వాలి. అలా ఇచ్చినోడు జనం మెచ్చినోడు అవుతాడేమో చూద్దాం. తొలి అడుగు పడింది చాన్నాళ్ల తర్వాత. ఇప్పుడు ఉండాల్సింది ఉత్సాహం. తర్వాత ఏం జరగబోతోంది అనే ఉత్సుకత. కావాల్సింది కంటిన్యుటీ. చూద్దాం… సుజనా అడుగులు ఎటు పడతాయో !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments