టులీప్ గార్డెన్ చూడటానికి అంత దూరం వెళ్లాడా చంద్రబాబు ? ఒక్క రాష్ట్రపతిని మాత్రమే కలిసి తిరిగి వచ్చేశాడా ? ఏం సాధించాడు ? అసలు ఉన్నట్టుండి ఢిల్లీ టూర్ పెట్టుకోవడం కరెక్టా ? కాదా ? చంద్రబాబు టూర్ ప్రభావం ఎంతో తెలియాలంటే అసలు ఢిల్లీ వెళ్లాలని ఎందుకు అనుకున్నాడో అర్థం చేసుకోవాలి. అదీ అసలు పాయింట్.
అవసరానికి మించి 40 మందికిపైగా ఎంపీలున్న పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు… ఫట్టుమని ముగ్గురు ఎంపీలున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం సాధించగలడు ? అసలే ఓడిపోయి, డీలాపడి ఉన్న బాబును ఇప్పుడు పట్టించుకునేది ఎవరు ? ఇవన్నీ తెలియకనా చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది. కాదు. అసలు లెక్క వేరు. రెండున్నరేళ్లుగా యాక్టివిటీ ఏం లేదు. ఢిల్లీ మొహం చూడలేదు. ఢిల్లీ ఇటు… టీడీపీ మొహం చూడాలని కూడా అనుకోవడం లేదు. కానీ ఇప్పటి వరకూ ఓ లెక్క. ఇక ముందు నుంచి చూడాల్సింది మరో లెక్క. పలకరింపులు, పరామర్శలూ లేవు. ప్రాంతీయ పార్టీలు మిలాఖత్ రాజకీయం నడిపే సందర్భమూ ఢిల్లీలో లేదు. ఇక ముందు ఉంటుందేమో తెలియదు. అన్నిటికీ మించి ఏపీలో ఏం జరుగుతోందో గ్రౌండ్ లెవెల్లో విషయం ఢిల్లీకి తెలిసే అవకాశాలు అతి తక్కువ. ఇంటిలిజెన్సు బ్యూరో రిపోర్టు కూడా ప్రస్తుతం పార్టీలకున్న బలాబలాల్ని బట్టే ఉంటుంది తప్పితే… భవిష్యత్ ను ఊహించే అవకాశాలు తక్కువ చాలాసార్లు. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు ఢిల్లీకి వెళ్లడానికి రెండు కారణాలు. ఒకటి పార్టీ ఆఫీసులపై దాడి చేశారని చెప్పడంతోపాటు తనకి ఉన్న ఫిర్యాదులన్నీ ఢిల్లీ ముందు పెట్టడం. రెండోది మరీ ముఖ్యం. ఢిల్లీని ఓసారి పలకరించాలి. నేను వచ్చాను. ఉన్నాను. ఉంటాను. లెటజ్ గెటిన్ టచ్ … అని సందేశం ఇవ్వాలి. ఇదీ అసలు పాయింట్. ఇన్నాళ్లూ అవకాశం లేదు కాబట్టి, సందర్భం రాలేదు కాబట్టి వెళ్లలేదు ఢిల్లీ. ఇప్పుడు దాడితో అలాంటి ఛాన్సు ఒకటి వచ్చింది. అందుకే టూర్.
వెళితే ఏమవుతుంది ? కుండలో నీరు నిండుగా ఉన్నప్పుడు తొణకదు. ఒకవేళ తొణికినా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అలా కాదు. కుండ సగం ఖాళీఅయ్యింది. ఐదేళ్లలో రెండున్నరేళ్లు అయిపోయాయ్. లోపల ఏం జరుగుతోందో తెలియదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు మరో ఐదు నెలలు ఉన్నాయ్. వాటి ఫలితాలతో క్లారిటీ రావొచ్చు. ఈలోగా పంజాబ్ లాంటి చోట్ల కొత్త పార్టీలు పుడుతున్నాయ్. యూపీలో యోగిని ఆపేందుకు ప్రత్యర్థి రాజకీయం కత్తులు దూస్తోంది. ఆపితే ఓ లెక్క. లేదూ… మళ్లీ గెలిచాడు – ఇక ఛలో ఢిల్లీ అంటాడేమో తెలియదు. అది మరో లెక్క. ఉద్యోగాలు పడిపోతూ… పెట్రోల్ రేట్లు పెరిగిపోతూ, మధ్య తరగతి దిగువకి దిగజారుతున్న సమయంలో మరో ఏడాదిన్నర తర్వాత ఎవరి మూడ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ! పైపెచ్చు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వస్తే మళ్లీ ఆ కథే వేరు. అందుకే ఢిల్లీ పలకరింపు మరీ ముఖ్యం ఇప్పుడు.
కశ్మీర్ టూర్ హాఫ్ డే పొడిగింపు వల్ల కుదర్లేదో మరేదైనా కారణమో కానీ అమిత్ షాను నేరుగా కలవలేదు చంద్రబాబు. కానీ కాల్ మాట్లాడాడు. మిమ్మల్ని కలవడం కుదర్లేదు, మళ్లీ కలుద్దాం… ఏమిటి విషయం అంటూ షా మాట్లాడ్డమే అసలు సంగతి. టీడీపీ ఆఫీసుల మీద దాడి తర్వాత ఇది రెండో కాల్. మొదటి ఫిర్యాదు ఆల్రెడీ అయిపోయింది. ఏపీలో రాజకీయం మారుతోంది, వాస్తవాలు తెలుసుకోండి, మీరు మరీ వెనకేసుకొని రావడం ఆపితే బెటర్, వచ్చే ఎన్నికల తర్వాత ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటాయో వాళ్లే కదా మీకు ఉపయోగం అనే ఈక్వేషన్ … షాకు తెలియజెప్పాలన్నది చంద్రబాబు ప్రయత్నం. ఆ పని ఢిల్లీలో కాకపోయినా ఫోన్లో జరిగిపోయినట్టే. ఇక బాబు మోడీ షాలను చాలా మాటలన్నాడు. సభలు పెట్టి తిట్టాడు అనేది సెకండరీ. బాబు చెప్పినట్టు… అవసరం అంటూ రావాలే కానీ, సభ పెట్టి తిట్టాడని సాయం తీసుకోకుండా ఉంటారా ? సింపుల్. రాజకీయం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.
అంటే ఇవన్నీ కలగలిపి… ఎగా దిగా చూస్తే అర్థం అయ్యేది ఒక్కటే. నేను యాక్టివేట్ అవుతున్నాను, మనం మాట్లాడుకుందాం అని చెప్పాల్సిన వాళ్లందరికీ చెప్పడానికి ఢిల్లీ టూర్ ను వాడుకున్నాడు చంద్రబాబు. పంజాబ్ లో ఆప్ అవసరం పడితేనో, లాలూ లాంటి వాళ్లు మళ్లీ మాట్లాడాలి అనుకుంటేనో, జేడీఎస్ లాంటి పార్టీలు సైడు మారకుండా ఉండేందుకో ఈ టూర్ బాటలు పరుస్తుంది కాలక్రమేణా ! ఆ విషయం తెలియడానికి మరో ఆర్నెల్లు పడుతుంది. ఈలోగా ఓసారి వార్మప్ అయితే చేసేశాడు చంద్రబాబు. ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి పాలన రావాలనో, వచ్చేస్తుందనో ఆయన ప్రయత్నం కాదు. కేవలం అదో వాదన. అంతే !