33 C
Vijayawada
Tuesday, February 27, 2024
Homeరాజ నీతిఎందుకమ్మ అంత భయం ?

ఎందుకమ్మ అంత భయం ?

బలవంతుణ్ని భయపెట్టేందుకు బలహీనుణ్ని బయటకు లాగి కొట్టి చూపెట్టాలన్నది ఫ్యాక్షన్ ఫార్ములా. ఒక కులం మీద కక్షతో రాష్ట్రానికి శిక్ష వేయాలన్నది ఇప్పటి రాజకీయంలా కనిపిస్తోంది చూడబోతే ! మూడు జిల్లాల్లో ఓ వర్గం ప్రాబల్యాన్ని కట్టడి చేయాలనే ఎత్తుగడతో 26 ముక్కలు చేయడంలోనూ పక్షపాతం చూపించాక అసలు ఎందుకమ్మ అంత భయం అని అడగాలనిపిస్తోంది చాలా మందికి ! 60 మందికి పైగా నీ కులస్తుల్ని ఎమ్మెల్యేలుగా చేసుకుంటే అడగలా, నామినేటెడ్ పదువుల్లో 496 కుర్చీలు నీ కులానికే వేసినా నోరు మెదపలా, నువ్వు నడి మధ్యలో ఉంటూ ఎగువ దిగువ ప్రాంతాలకి సామంతులుగా నీ కులస్తులిద్దరిని పెట్టుకున్నా పట్టించుకోలా ఈ జనం. కానీ ఓ కులం పేరు పెచ్చి పదే పదే కుళ్లుపొడుస్తుంటే మాత్రం కసితీరా అడగాలనిపిస్తోంది – ఎందుకమ్మ అంత భయం ?

నీకు 150 మందికిపైగా ఉన్నా రాని దైర్యం… మండపేటను పట్టుకెళ్లి కోనసీమలో కలిపితే వస్తుందా ? అమరావతిని అడ్డంగా ఆపినా తీరని కసి గన్నవరాన్ని తీసుకెళ్లి క్రిష్ణలోకి విసిరితే తీరుతుందా ? మైనింగ్ ఆపి, అష్టదిగ్బంధం చేసినా చెదరని దైర్యం… అద్దంకిని తుంచి బాపట్లలో ముంచితే పోతుందా ? ఏమో నువ్వేంటో నీ లెక్కలేంటో ఒక్క పట్టాన అర్థం కావు. నీది బెంగ అయితే బుజ్జగించొచ్చు. అమాయకత్వం అయితే ఊరడించొచ్చు. పెంకితనం అయితే సముదాయించొచ్చు. కానీ నీది భయం. నీ అంతట నువ్వు గుండె దిటవు చేసుకొని సమాధాన పడాల్సిందే తప్ప మందులేని మాయరోగం అది. కమ్మ బరిస్తే చౌదరి అవుతుందో లేదో తెలవదు కానీ భయం ముదిరితే మాత్రం బలహీనత కచ్చితంగా అవుతుంది. బతుకును ముంచుతుంది. అదొక్కటి చాలు మిగతా బలాలన్నిటినీ మింగడానికి !

ఒక్క కుల ముద్రతో రాజధానని ఆపె. ఓ పార్టీ మీద కుల ముద్ర గుద్ది, ఆ పార్టీ జెండాలున్న వీధి గుండా వెళ్లాడని కక్ష కట్టి ఓ దళిత డాక్టర్ని దారుణంగా రోడ్డున పడగొట్టి మట్టుపెట్టె. సొంత బలహీనతలు బయటపెడితే ఎదుటిపార్టీ గెలిచేనన్న శంకతో ఒంగోలు గుప్తాను వాయిగొట్టె. ఓ కుల ఆధిప్యం ఉందన్న అనుమానంతో స్కూళ్లు మూతపెట్టె. ఇంత జరుగుతుంటే గాజులు తొడుక్కున్నామా మేం ఏమైనా అంటూ ధిక్కరించిన రాజులనూ వదలకపాయె. ఇంకా ఏ కులం మిగిలిందని ? అంటే, ఓ కులం మీద కక్షతో అన్ని కులాల్నీ కుమ్మేసినట్టేగా ! అన్నట్టు మనకేమీ గాజులంటే చిన్న చూపు లేదు. రాదు. క్షమించండి. ఎందుకంటే ఆ గాజులు తొడిగిన చేతులే బిగించిన పిడికిలై నిన్ను ఈ పూటకీ గడప దాటకుండా ఆపుతున్నై. ఇంతటి దారుణానికి, రణానికి కారణం ఓ కులం మీద కక్ష. అందుకే అడుగుతున్నది, అంత అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఎందుకమ్మ నీకంత భయం ?

అహంకారి సత్య భామ అన్నీ నగలూ వేసినా తూగని తక్కెడ… రుక్మిణమ్మ వచ్చి తులసీదళం వేస్తే మొక్కిందట. అది పురాణం. అరాచకుడు పాతికకు పైగా ముక్కలు చేసినా చేస్తే రేగిన మంటలు ఇటు నుంచి ఒక్క మాట విసిరితే చల్లారినంత పని అయ్యింది ఇప్పుడు రాష్ట్రంలో. ఇది నమ్మకం. భరించలేనంత బాదుడే బతుకు అయిపోయిన చోట ఆయింట్ మెంట్ రాస్తాను అనే మాట కూడా మందులా పని చేస్తది. ఆశ అలాంటిది. భవిష్యత్తులో వచ్చే అవకాశం అంతటి ఊపునిస్తది మరి. అంతేగా ! ఇప్పుడు జిల్లాల పేరుతో కోసి పారేస్తే… మరో నాలుగేళ్లకి పునర్విభజన పేరుతో కలిసి కుట్టేసే వెసులుబాటు అప్పుడు కుర్చీలో ఉన్నవాడికి వస్తది. నేనొచ్చాక జిల్లాల విభజన హేతుబద్ధం చేస్తా అంటూ చెప్పక చెప్పక చంద్రబాబు ఓ మాట చెప్పగానే మే నెలలో జల్లుపడినంత చల్లగా అనిపించింది చాలా మందికి. ఇదొక్కటి చాలదూ, ఒక్క కులం పేరు చెప్పి, ఒక్కడి మీద కక్ష కట్టి నువ్ రాష్ట్రం మెడకు బిగించాలనుకున్న ఉరి దండలో దారమై అందరినీ కలుపుతోంది. అయినా ఎందుకమ్మ నీకంత భయం ?

అయినా అవకాశం ఉండాలే కానీ ఆంధ్రప్రదేశ్ అయినా అమెరికా అయినా ఒకటే అనుకునే సమూహాన్ని నువ్ కొట్టేది ఏముంది ? ఒక ఊళ్లో ఆపితే పక్క ఊరికి పోవడం, అక్కడా అడ్డుపడితే పక్క జిల్లాకో రాష్ట్రానికో పోవడం అక్కడ జెండా ఎగరేయడం వాళ్ల అలవాటు ముందు నుంచి. అలాంటోళ్లని వెంటాడి వేటాడాలనుకోవడం వృధా ప్రయాస. బాగున్న వాళ్ల పక్కన నిలబడి మనం అంతా బాగున్నామనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నోడిని మోడీ అని ఈ దేశం నెత్తిన పెట్టుకుంది. అంటే నువ్వేం చేయక్కర్లా ! ఆల్రెడీ చేస్తున్నవాడితో ఉంటే నువ్ ఎక్కడికెళ్లాలో అక్కడికి వెళ్తావ్ అనే సందేశం అనమాట. అలాంటి ఆలోచన వదిలిపెట్టి, ఉన్నదంతా ఊడగొట్టి, రాష్ట్రాన్ని పాడుపెట్టి, రాజధాని పడగొట్టి నువ్ సాధించేది ఏముంది చెప్పు ? అయినా ఎందుకమ్మ అంత భయం?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments