33 C
Vijayawada
Tuesday, February 27, 2024
Homeనీతి ప్రత్యేకంటీడీపీకి తిరుగులేని సిలబస్ ఇచ్చిన ఐఏఎస్ టాపర్

టీడీపీకి తిరుగులేని సిలబస్ ఇచ్చిన ఐఏఎస్ టాపర్

మనకి ఏం కావాలో తేల్చుకోడానికి ఒక్కోసారి జీవిత కాలం పట్టొచ్చు. కానీ మన దగ్గర లేనిది ఏమిటో… ఎదుటివాడి దగ్గర ఉన్నదేంటో తెలుసుకోడానికి ఎంతో టైం పట్టదు. రాజకీయాల్లో ఈ గ్రహింపు మరీ ముఖ్యం. ఈ యాంగిల్లో చూస్తే టీడీపీ అత్యంత వెనకబడుతున్న డైమెన్షన్ ఏంటి ? వైఎస్ కే కాదు జగన్ కి కూడా కలిసొచ్చిన కోణం ఏంటి ? పెద్దగా ఇబ్బంది లేకుండానే, పరిశోధన చేయాల్సిన పని లేకుండానే ఐఏఎస్ టాపర్ చెప్పేశాడు చూడండి.

హైదరాబాద్ లో ఓ సెలూన్. హెయిర్ కట్ చేస్తున్న బార్బర్ ది అనంతపురం. కస్టమర్ ది కోస్తా జిల్లా. ఏమి సార్ ఏం జరుతాండాది… ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం పోయినాది. వాళ్ల వాళ్లు తినే దానికే తప్ప జనానికి ఏం చేయడం లేదు అన్నాడా బార్బర్. కస్టమర్ తనకు తెలిసిన కొత్త కోణాలు జోడించి మాట్లాడుతున్నాడు. ఈలోగా పక్కన ఛైర్ లో ఉన్న ఓ కుర్రాడికి కస్సున కోపం వచ్చింది. ఏం తెలుసన్నా నీకు వైఎస్ గురించి అన్నాడు. వెంటనే కస్టమర్ చాలా సింపుల్ గా… నీకేం తెలుసో చెప్పు అన్నాడు. ఆ కుర్రాడు మొదలు పెట్టాడు. మా ఇంట్లో ముగ్గరం ఉంటాం అన్న. మా అయ్య, చెల్లి, నేను. ఇంటర్ లో బాగా మార్కులు వచ్చాయ్ కానీ చదువుకొనే స్తోమత లేదు. బొమ్మలు బాగా వేస్తా. అందుకే ఓ సారి వైఎస్ బొమ్మ గీసి క్యాంప్ ఆఫీసుకు పోయా. కలవడానికి కుదర్లేదు. నల్గొండ నుంచి వచ్చి పోతానే ఉన్నా రోజూ !  వీలు కాలేదు. ఇక లాభం లేదని ఓ రోజు కాన్వాయ్ కి అడ్డుపడినా గేటు దగ్గర. ఆయన దగ్గరకి పిలిచి రేపు పొద్దునే 5 గంటలకి రా అన్నాడు. వెళ్లా. మొత్తం విన్నాడు. నేను గీసిన బొమ్మ చేతికిస్తే… సంబరపడ్డాడు. నిన్ను కాలేజీలో చేర్పిస్తా అన్నాడు. మా అయ్యను పిలిచి… నల్గొండలో ఫలానా నాయకుణ్ని కులువు పో, ఖర్చులు ఉంటాయ్ కదా కూరుతు పెళ్లికి అని చెప్పాడు. నేను బీటెక్ చేసినా అన్నా. అంత మంచోడు వైఎస్. ఆయన ఉండి ఉంటే ఉద్యోగం వచ్చేదేమో అన్నాడు. కుర్చీ దిగి నడిచి వెళ్తున్నప్పుడు చూస్తే తెలిసింది… అతను వికలాంగుడని ! నాయకుడు వేసే ముద్ర అంత బలంగా పడుతుంది మనసుల్లో !

ప్రస్తుత ఐఏఎస్ అధికారి, సివిల్సులో ఆలిండియా టాపర్ ముత్యాల రాజు చెప్పిన ఉదాహరణ కూడా ఇంచు మించు ఇలాంటిదే ! కనీసం రోడ్డు కూడా లేని, ద్వీపం లాంటి ఊరు మాది. క్రిష్ణా జిల్లా చినగొల్లపాలెం. కాన్పు కోసం డాక్టర్ దగ్గరకి వెళ్లడం ఆలస్యం అయ్యి మా సిస్టర్ చనిపోయింది. మా ఊరికి వంతెన కావాలనుకున్నాను. కొన్నాళ్లకి సివిల్సులో టాప్ అయ్యాక అప్పటి సీఎం వైఎస్ ను కలిశాను. ఏం కావాలి నీకు, ఏం చేయగలను నేను అని అడిగారు నన్ను. మా ఊరికి వంతెన వేయించాలన్నది నా కల అని చెప్పగానే ఆయన నవ్వేశారు. 26 కోట్లు వెంటనే విడుదల చేసి మూడేళ్లలో వంతెన పూర్తి చేశారు. వైఎస్ అంటే నాకు ఇష్టం అని ఓపెన్ గా ప్రకటించుకుంటున్నప్పుడు ఆయనలో ఎలాంటి బెరుకూ లేదు. తప్పన్నా ఒప్పన్నా అది అభిమానం.

జనం అయినా యంత్రాంగం అయినా మన చుట్టూ ఉన్న మందీ మార్బలం అయినా మీరెంత సేపు పని చేస్తారు… మీ దగ్గర రియల్ టైమ్ గవర్నెన్సు ఉందా లేదా… మీరు వ్యవస్థల్ని సమర్థంగా నడిపిస్తున్నారా లేదా… ప్రపంచం వ్యాప్తంగా ప్రతీ 15 ఏళ్లకోసారి మారే ఆర్థిక ట్రెండును పసిగట్టే తెలివి ఉందా లేదా… స్టేటుకు మీరు బ్రాండ్ తేగలరా లేదా అనేవి ఆలోచించరు. వాళ్ల పరిధిలో వాళ్లు ఉంటారు. ఉదయం నుంచి వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సులూ చేసి.. ఏడు నుంచి 11 వరకు పనిచేసినా కొన్ని సార్లు లాభం ఉండదు. ఎందుకంటే మన పక్కనున్న వాడికి కావాల్సిన హ్యూమన్ టచ్ మన దగ్గర దొరకలేదు కాబట్టి ! వాడి ఊరుకు రోడ్డు వేసి, కమ్యూనిటీ హాలు కట్టించి… కుళాయి పెట్టించినా వాడు పెద్దగా ఉప్పొంగిపోడు. అది నీ బాధ్యత అంటాడు. కోపం వచ్చినా సరే.. ఇదే నిజం. అదే వాడితో నేరుగా మాట్లాడి… మన దగ్గర ఉన్న స్కీములో వాడి పేరు పని గట్టుకొని చేర్పించి, వీలైతే వాడితో కాఫీ తాగాం అనుకోండి. వాడు ఇక పది జన్మల వరకూ మర్చిపోడు. నీ కోసం యుద్ధం చేస్తాడు. వైఎస్ అలాగే యుద్ధం చేయిస్తాడు. చేయించాడు.

నాయకుడు అంటే ఎప్పుడూ ముందు నడిచే వాడు మాత్రమే కాదు. మా వెనక ఒకడు ఉన్నాడు అని ధైర్యం నింపి, ముందుకు నడిపించే వాడు కూడా ! అది కూడా ఏదో మెటీరియలిస్టిక్ గా… చేసుకుంటూ పోతే కుదరదు. జనంతో కలిసి, మెలిసి మనసులో ముద్ర పడేలా చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో, వచ్చే తరానికి కూడా ఎలా అక్కరకు వస్తుందో వైసీపీ గెలుపు స్టడీ చేస్తే అర్థం అవుతుంది. అంతగా గుడ్ విల్ లేని ఓ వర్గం మీడియాను మాత్రమే చేరదీసి, టెక్నాలజీని మాత్రమే నమ్ముకొని… నేను సంపద సృష్టిస్తున్నాను కదా, పరిపాలన బాగా చేస్తున్నాను కదా అనుకుంటే ఇలాంటి ఎమోషన్సు మిస్ అయిపోతాం ! అలాంటి చిన్న చిన్న భావోద్వేగాలే కొంప ముంచుతాయ్. అంత పెద్ద ఓడను తిమింగలం కూడా కొట్టలేకపోవచ్చు. కానీ చిన్న చిల్లు ముంచగలదు. అర్థం చేసుకోవాలంతే !
అంటే దీనర్షం ఒక్కటే. మనం వ్యవస్థల్ని నిర్మించి నడిపించే సమర్థులం కావొచ్చు. వ్యక్తిగత స్థాయిలో కనెక్టు సాధించలేకపోతే కష్టాలు ఖాయం. పెద్దగా లాభం ఉండదు. ఐదేళ్లకో ఎదురు దెబ్బ చొప్పున తగులుతూనే ఉంటుంది. అదే మనం కనక వ్యక్తిగత కనెక్టు సాధించే సానుకూలత ఉన్నవాళ్లం అయితే మాత్రం… వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసినా ఆ ప్రభావం కొంతే బయటపడుతుంది. అలాంటి వాళ్ల పార్టీ లాభపడుతూనే ఉంటుంది. నిజం. మైండ్ తో కాదు మనసుతో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments