35 C
Vijayawada
Friday, April 26, 2024
Homeరాజ నీతిఇండియన్ క్రికెట్ లో కెప్టెన్ కోహ్లీ స్థానం ఎక్కడ ?

ఇండియన్ క్రికెట్ లో కెప్టెన్ కోహ్లీ స్థానం ఎక్కడ ?

జోహెన్నెస్ బర్గ్ లో ఓ నైట్ క్లబ్. అప్పటి వరకూ బీర్లు తాగి డాన్సు చేసి అలిసిపోయి కుర్చీలో వెనక్కి వాలిపోయాడు అతను. నాక్కూడా వెజ్ సలాడ్ ఆర్డర్ చెయ్ అంటూ ఓ ఫెమీలియర్ గొంతు వినిపడేసరికి కళ్లు తెరిచి లేచి చూశాడు. ఎదురుగా నైట్ డ్రెస్ లో కెప్టెన్. ఏం చేయాలో తెలీలేదు అతనికి. ఇక్కడ వెజ్ దొరకదు భయ్యా అంటే, మరో రెస్టారెంట్ కి తీసుకెళ్లి డిన్నర్ చేయించి, హోటల్ రూమ్ లో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. ఇంకేం మాట్లాడలేదు. మరో ఏడాది తర్వాత సీన్ కట్ చేస్తే అదే కుర్రాడు ఇంగ్లండ్ లో ఇంగ్లండ్ ను ఓడించే హిస్టారిక్ ఛేజ్ లో స్టార్ అయ్యాడు. యువరాజ్ అతను. ఆ కెప్టెన్ పేరు గంగూలీ. తరాలపాటు నిలబడే నాయకత్వం ఎలా ఉంటుందో చూపించిన అతి కొద్ది మందిలో ఒకడు. మరి ఇలాంటి బెంచ్ మార్కును పెట్టి కొలిస్తే కోహ్లీకి ఎన్ని మార్కులు ?

నాయకుడుగా గెలిపించడం వేరు. గెలిచే టీమ్ కి కెప్టెన్ గా ఉండటం వేరు. రెండోది ఈజీనే ! అందుకే మూడు ఫార్మాట్లలో అత్యధిక విజయాలు అందించిన సారధి కోహ్లీ అనేది చెప్పుకోడానికి బావుంటుంది. ఒప్పుకోడానికి కాదు. ఎన్ని గెలిచాము అనే దాని కన్నా ఎలాంటప్పుడు గెలిచాం, ఎలా గెలిచామన్నదే ముఖ్యం. గత ఆరేడేళ్లలో నిలకడైన ఇంటర్నేషనల్ జట్టు పేర్లు చెప్పండి. ఇంగ్లండ్ ను మినహాయిస్తే ఇక ఏ టీమ్ గట్టిగా ఉన్నది ? సమాధానం జీరో. కోహ్లీ శకం నడుస్తున్న రోజుల్లో… ఆస్ట్రేలియాకు గడ్డుకాలం, జనరేషన్లు మారడం, టాంపరింగ్ గొడవ. శ్రీలంక పునాదులే కదిలిపోయాయ్. మహేళ, సంగక్కర తప్పుకున్నాక తట్టుకోలేకపోతున్నారు వాళ్లు. గ్రేమ్ స్మిత్ వదిలేశాక దక్షిణాఫ్రికా బోల్తా పడింది. వెస్టిండీస్ నిలకడగా విఫలం అవుతోంది ఎప్పటిలాగే ! మూడేళ్లకోసారి కానీ కివీస్ కనిపించదు మనకి. ఇలాంటి జమానాలో దున్నేసిన రికార్డు కెప్టెన్ కోహ్లీది. వన్డేల్లో 89 మ్యాచుల్లో 62, టెస్టుల్లో 55 మ్యాచుల్లో 33, టీ ట్వంటీల్లో 49 మ్యాచుల్లో 29 గెలిచింది టీమిండియా. వీటిల్లో 85 శాతం విజయాలు బైలాటరల్ సిరీసుల్లో వచ్చినవే. ట్రయాంగిల్ సిరీసులు పెద్దగా లేవిప్పుడు. ఐసీసీ ఈవెంట్సులో గెలిచిన దాఖలాలు అతి తక్కువ. పైగా ఈ జనరేషన్ కి ఐపీఎల్ అలవాటు అయ్యాక ఆసీస్, ఇంగ్లండ్, కివీస్ పేసర్లను ఫేస్ చేయడం అలవాటు అయ్యింది. అందుకే విదేశాల్లో విజయాలు పెరిగాయ్. ఆస్ట్రేలియాలో కోహ్లీ లేకపోయినా పంత్ లాంటివాడు గెలిపించడానికి కారణం ఇదే ! అసలు కోహ్లీ కెప్టెన్సీ మీద ఇంత సర్జికల్ గా, క్రిటికల్ గా ఆలోచించడం ఎందుకో చూద్దాం.

సంక్షోభంలో నిలబడి, జట్టును నిలబెట్టిన వాడికి సమర్థుడిగా పేరొస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత గంగూలీ నిలబడినట్టు. దాదా పునాదులు వేస్తే… ధోనీ నిర్మించాడు. కోహ్లీ ఏలాడు. అంతేతప్ప, కోహ్లీ కొనసాగించింది, రాబోయే జనరేషన్ కి అందించింది ఏముంది ? గంగూలీ జమానాలో సెహ్వాగ్, గంభీర్, ధోనీ, యువరాజ్, హర్భజన్, జహీర్ లాంటి స్టార్లను ఏరిపట్టాడు. వాళ్లు ఆడేందుకు ధైర్యమిచ్చాడు. గెలిచాడు. మోడ్రన్ ఇండియన్ క్రికెట్ లో 2003 వరల్డ్ కప్ ఓ మైల్ స్టోన్. గెలిచి ఉండకపోవచ్చు… ప్రభంజనం అంటే ఎలా ఉంటుందో చూపించిన జట్టు అది. నిఖార్సయిన పేసర్ లేడు. స్పెషలిస్టు కీపర్ లేడు. అయినా వాళ్లకి ఎదురే లేదు. ధోనీ టైమ్ లో ఆ దూకుడు లోతైన నిలకడ అయ్యింది. దానికి తోడు మిడిల్ క్లాస్ నుంచి వచ్చి… కూల్ గా దుమ్మురేపే ధోనీ స్టైల్ ట్రేడ్ మార్క్ అయిపోయింది. అంత డెప్త్ ఉన్నోడు కాబట్టే వన్డే, టీ ట్వంటీ, టెస్టులు… మూడు ఫార్మాట్లలోనూ వరల్డ్ ఛాంప్ ని చేశాడు జట్టును. మరి అంత రైజ్ లో వచ్చిన కోహ్లీ టైమ్ ఎలాంటిది ? గత ఏడేళ్లలో కోహ్లీ తీసుకొచ్చిన ట్రెండ్ ఏముంది ? కోహ్లీ కెప్టెన్సీలో తయారైన తురుపు ముక్కలు ఎన్ని ఉన్నాయ్ ? అద్భుతమైన బౌలింగ్ ఛేంజెస్ కానీ, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ గుర్తున్నాయా ఎవరికైనా ? స్వింగ్ లో ఉన్న బుమ్రా, షమీల బౌలింగ్ కోటా పూర్తి కాక ముందే ఓడిన మ్యాచులు ఎన్నో లెక్క తీస్తే అర్థమవుతుంది టైమొచ్చి కెప్టెన్ అయ్యాడు…టైమింగ్ ఉండి కాదూ అని.

రంగుల రాట్నం ఎక్కి ఎత్తులో ఉన్నప్పుడు భూమి కూడా కాళ్ల కిందే ఉన్నట్టు ఉంటుంది. నీది కాదు గొప్ప, టైమ్ ది. కోహ్లీ జనామా కూడా అంతే ! బాగా బ్యాటింగ్ చేసేవాడు కెప్టెన్ అయిపోవాలి అనే ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ ఫార్ములా ప్రకారం కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. అంతకు ముందు సచిన్ పేలైనా మనకి పట్టింపు లేదు. స్టార్ డమ్ ముఖ్యం మనకి. అంతటి స్టార్ కాబట్టే… కోహ్లీకి అన్నీ లైట్. కుంబ్లే లాంటి కమిట్మెంట్ ఉన్నోడు కోచ్ గా అక్కర్లేదు అన్నా నడిచింది. బెంగళూరు ఫ్రాంఛైజీకి ఆడే బౌలర్లే మొనగాళ్లు అని చెలాయించినా సాగింది. నా గ్యాంగ్ అయితే చాలు ఫిట్నెస్ లేకపోయినా తీసుకుంటా అంటూ హార్ధిక్ లాంటోళ్లను ఆడించినా, ఫామ్, తెలివి ఉన్న అశ్విన్ లాంటోణ్ని మీరు ఇచ్చినా నేను పక్కన పెడతా అన్నా చల్ గయా. పెర్ఫామెన్స్ , రిజల్ట్ లెక్క తీసే టైమ్ వచ్చినప్పుడు ఇప్పుడు దొరికినట్టే దొరికిపోతారు ఎవరైనా ! కోహ్లీ అందుకు మినహాయింపు కాదు.

ఛేజింగ్ లో మాస్టర్ కోహ్లీ. 26 సెంచరీలు ఛేజింగ్ లోనే చేశాడు. అలాంటివాడు గెలిపించలేదు అంటారా అని తడుముకోనక్కర్లేదు. ఇక్కడ మాట్లాడుతున్నది బ్యాటింగ్ గురించి కాదు కెప్టెన్సీ గురించి. జట్టును అద్భుతంగా నడిపించేవాడికి వచ్చినంత పేరు – అద్భుతంగా నడిచే జట్టుకు కెప్టెన్ గా ఉన్నోడికి రాదు. కావాలంటే చూడండి… అలెన్ బోర్డర్, స్టీవ్ వా అప్రతిహత విజయాలు సాధించారు. వాళ్ల రికార్డు చెప్పేలోపే ఏ షేన్ వార్న్ లాంటోడో వచ్చి అది మా గొప్ప, వాడి టాలెంట్ ఏముంది అందులో అనేస్తాడు. అదే మాట… అర్జున రణతుంగను అనమనండి చూద్దాం. సౌతాఫ్రికాను లీడ్ చేసిన గ్రేమ్ స్మిత్ ను అనగలరా అలా ? లేనే లేదు. ఎందుకంటే వాళ్లంతా ట్రెండ్ సెట్టర్లు. ఇండియా విషయానికొస్తే, అండర్ డాగ్ ఉన్న టీమ్ ను అనూహ్యంగా నడిపించి గెలిపించిన కపిల్ ది ఓ చరిత్ర. అంతకు ముందు పటౌడీది మరో మార్క్. ఆ తర్వాత కెప్టెన్సీకి అంత టచ్ ఇచ్చింది గంగూలీనే. ఏళ్లు గడిచి నాకు బట్టతల వచ్చింది కానీ దాదాకు పట్టుదల తగ్గలేదు అంటాడు సెహ్వాగ్ అందుకే. అటు తర్వాత ధోనీ. తిరుగులేని టఫ్ నెస్, కూల్ మైండ్ సెట్, ఎట్టిపరిస్థుల్లోనూ తొణకని మెచ్యూరిటీ ఉంటాయ్. స్టార్ డమ్ తెచ్చిన కోహ్లీ కెప్టెన్సీలో ఇలాంటివి ఏం కనిపించాయో చెప్దామన్నా పెద్దగా దొరకవ్. అందుకే, ఎక్కువ మ్యాచులు గెలిచిన జట్టుకు కెప్టెన్ గా కోహ్లీ ఉంటాడేమో కానీ మలుపులు తిప్పి మెరుపులు మెరిపించిన కెప్టెన్ గా మాత్రం కోహ్లీ కనపడటం కుదరదేమో ! రాబోయే కెప్టెన్ లకి పని ఈజీ అవుతుంది ఇలాంటప్పుడు. కాకపోతే వాళ్లకి ఒక్కటే టాస్క్. కీలకమైన సమయాల్లో బడా మ్యాచుల్లో తడబడి చేతులెత్తేసే వారసత్వాన్ని వదిలాడు కోహ్లీ. మొన్న పాకిస్థాన్ మీద ఓడినట్టు, టెస్టు ఛాంపియన్ షిప్ మ్యాచులో కివీస్ మీద ఓడినట్టు. అదొక్కటి అధిగమిస్తే చాలు ఎవరికైనా కెప్టెన్ గా మినిమం మార్కులు పడిపోతాయ్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments