23.8 C
Vijayawada
Saturday, December 9, 2023
Homeరాజ నీతిక్రిష్ణారావు ఇప్పుడు లైన్ లోకి వచ్చారా ?

క్రిష్ణారావు ఇప్పుడు లైన్ లోకి వచ్చారా ?

సర్కారు బండిని నడిపించే చక్రాలే ఉద్యోగులు, రాష్ట్రాన్ని నడిపించాల్సింది ప్రభుత్వం అయితే ప్రభుత్వాన్ని నడపాల్సిన చక్రాలు ఉద్యోగులు. అలాంటి చక్రాలకు పంక్చర్లు పొడిస్తే ఇక రాష్ట్రం కదిలేది ఎలా ? అయినా హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఆర్థిక భారం ? అప్పుడు నోరు పట్టనంత హామీలు ఇచ్చి ఇప్పుడు ఉద్యోగుల్ని దెబ్బ తీయాలని చూడటం క్షమించరాని విషయం – జగన్ ప్రభుత్వ తీరుపై మాజీ సీఎస్ ఐవైఆర్ క్రిష్ణారావు సూటిగా గురిపెట్టిన తీరు ఇది. సీపీఎస్, ఆర్టీసీ విలీనం లాంటి విషయాల్లో హామీల అమలు సాధ్యంకాదంటూ నాటి సీఎస్ (ఎల్వీ) చెప్పినప్పుడు కొట్టినంత పని చేసి బయటకు పంపేశారు అనడం కూడా మరో హైలైట్. జగన్ కు పరోక్ష కవచంగా నిలుస్తూ వచ్చిన మేథోవర్గంలో మార్పు మొదలైందా ? బీజేపీ చేయలేని పని క్రిష్ణారావు చేస్తున్నారా ?

ఎన్టీఆర్ అంతటివాడే ఉద్యోగులతో పెట్టుకోలేక వెనక్కి తగ్గారు. అలాంటిది ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన తీరు ఓ లెక్క కాదు. ఎవరైనా సరే వాస్తవాలు తెలుసుకొని అవగాహనతో మాట్లాడాలి. పెన్షన్లు కాలక్రమేణా అలవికాని భారం అవుతున్నాయనే కదా సీపీఎస్ తెచ్చింది కేంద్రం. అప్పుడేమో రద్దు చేస్తానని చెప్పడం దేనికి, ఇప్పుడు నా వల్ల కాదు అనడం దేనికి – అంటున్న ఐవైఆర్ మాటలకు చాలా వాడి ఉంది. అవగాహన లేకుండా హామీ ఇచ్చారని చెప్పడంతోపాటు ఉద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వానికికైనా తిరోగమనం ఖాయం అని హెచ్చరిక చేయడమూ ఉంది. అన్నిటికీ మించి కేంద్రం తెచ్చిన విధానం తప్పుడు ఎత్తుగడ కాదు, దీర్ఘకాలిక ఆలోచన అని నేర్పుగా చెప్పి జనాన్ని ఒప్పిండమూ కనిపిస్తోంది. బీజేపీ ఏ కోశానా ఇలాంటివి చేయలేదు ఏపీలో ఇప్పటి వరకూ ! చీప్ లిక్కర్ రేటు తగ్గిస్తామన్న హామీ ఇచ్చి అభాసుపాలు కావడం కన్నా ఇలాంటి బర్నింగ్ వ్యవహారాలపై ఐవైఆర్ లాంటి మేథావుల్ని ముందుకు తెస్తే రాజకీయంగా బాటలు పడటంతోపాటు, ఆల్రెడీ బీటలు పడిన ఇప్పటి ప్రభుత్వానికి శుభం కార్డు వేయడమూ సులభం అవుతుంది.

ఇన్నాళ్లూ ఏమైపోయారు ? ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పటి దాకా కనిపించలేదా – అనొచ్చు కొందరు. క్రిష్ణారావు వాదన నచ్చినా, టీడీపీ భావజాలం ఉన్నవాళ్లు ఇప్పటికీ ఆయన ఐడియాలజీని నేరుగా అంగీకరించ లేకపోవచ్చు. పర్వాలేదు. కానీ ఇక్కడో పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. గత ఎన్నికల సమయంలో వైసీపీ భావజాలానికి, ఆ పార్టీ తెచ్చిన ప్రచారానికి క్రిష్ణారావు పరోక్షంగా సాయపడి ఉండొచ్చు. కానీ నేరుగా భజాన వేసుకున్న దాఖలా పెద్దగా కనిపించదు. పింక్ డైమండ్ లాంటి బీజేపీ అజెండాలో ఆయన భాగం అయ్యి ఉండొచ్చు. టీడీపీ ఎందుకు ఓడిపోతుందో తనదైన సిద్ధాంతాన్ని డిరైవ్ చేయడానికి ఆయన ప్రయత్నించి ఉండొచ్చు కానీ వైసీపీ అజెండా అద్భుతం అన్నట్టు కానీ, నేరుగా మద్దతిచ్చి నెత్తిన పెట్టుకున్నట్టుగా కానీ లేదు. ఈ రెండింటికీ తేడా ఉంది. అందుకే ఇప్పుడు వైసీపీ చేతులెత్తేసిన తీరును, ఉద్యోగుల విషయంలో, ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తున్న విషయంలో ప్రశ్నించే, తప్పుపట్టే హక్కు అక్షరాలా ఆయనకి ఉంటుంది.

క్రిష్ణా రావు వాదన ఒకవైపు కాదు రెండు వైపులా పదునున్న కత్తి. వైసీపీ ఇచ్చిన హామీల్లో డొల్లతనాన్ని చూపిస్తూనే జగన్ చెప్పిన మాటల్లో అవగాహన, సామర్థ్యం లేవని చెప్పడం మొదటి కోణం. ఉద్యోగులకు మద్దతు పలుకుతూనే సామాజిక కోణంలోనూ ప్రభావం చూపడం రెండోది. గత ఎన్నికల ఫలితాల్లో అధికార విపక్షాల మధ్య పది శాతం ఓట్ల తేడా ఉందీ అనుకుంటే అందులో అనూహ్యంగా స్వింగ్ అయిన అగ్రవర్ణ, ఇంటలెక్చువల్ ఓట్లు ఆరేడు శాతం వరకూ ఉంటాయని అంచనా. అంటే ఇవి ప్రో బీజేపీ మైండ్ ఉండి… బీజేపీకి ఏపీలో ప్రొమినెన్స్ లేదు కాబట్టి టీడీపీని ఓడించేందుకు వైసీపీకి పడిన ఓట్లు. క్రిష్ణారావు మాటలతో ఇప్పుడు ఇలాంటి సెక్షన్లలో రియలైజేషన్ మొదలైంది అనుకోవాలి. ఇన్నాళ్లూ వైసీపీని సపోర్టు చేయడమో లేదంటే మౌనంగా ఉండటమో చేస్తూ వచ్చిన ఈ వర్గాలు ఇప్పుడు మాట్లాడ్డం మొదలు పెట్టడం అంటే మైనస్ పడినట్టే. వైసీపీకి పడుతున్న ఈ మైనస్ ను బీజేపీ ప్లస్ చేసుకోగలదా అనేదే అసలు పాయింట్.

ఉత్తరాదిలో ఉరిమితే దక్షిణాదిలో గొడుగు పట్టుకునే పరిస్థితిలోనే ఉండిపోయింది బీజేపీ ఇప్పటికీ ! ఉత్తరంలో ఉన్నంత ఉద్ధృతి దక్షిణంలో ఉండదనీ, ఇక్కడ వాస్తవాలు, పరిస్థితులు వేరనే స్పృహ వాళ్లకి ఏ కోశానా కల్గడం లేదు. అందుకే ఇప్పటికీ జిన్నా టవర్ కూల్చేస్తామనో, కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఏదో జరిగిందనో పొగ రాజేసేందుకు ప్రయత్నం చేస్తారు. అది పొగే. నిప్పు కాలేదు. ఎందుకంటే కడుపు నిండిన చోటే మత అజెండా మొలకెత్తగలదు. కడుపు మండిన చోట కాదు. ఏపీ ఉన్న గందరగోళంలో… పట్టుకోవాలే కానీ బీజేపీకి చేతినిండా అవకాశాలు దొరుకుతాయ్. కానీ పట్టుకునే ఒడుపు, వాటం అంతకు మించి తెలివి ఆ పార్టీకి ఉన్నట్టుగా అనిపించడం లేదు ఈ నిమిషం వరకూ ! ఐవైఆర్ చెబుతున్న మాటలు ఆలోచనతో ఆలకిస్తే బీజేపీకి ఓ సువర్ణావకాశం కనిపించగలదు. ఆలోచన పరుల్లో, ఉద్యోగుల్లో, వైసీపీ అసంతృప్తి పెరుగుతున్న వర్గాల్లో ఠక్కున చొచ్చుకుపోయేందుకు దగ్గర దారి ఏంటో క్రిష్ణా రావు మాటల్లో కనిపిస్తోంది. ఇందులో భాధ ఉంది. బావజాలం ఉంది. సామాజిక కోణమూ ఉంది. ఇంతకు మించి ఏం కావాలి సమరంలోకి దిగడానికి !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments