26.5 C
Vijayawada
Thursday, April 25, 2024
Homeరాజ నీతిమహా భారతం రిపీట్ అవుతోందా ఏపీలో ?

మహా భారతం రిపీట్ అవుతోందా ఏపీలో ?

ప్రత్యర్థిని దెబ్బ కొట్టు. ప్రజలు పట్టించుకోరు. ప్రజల్ని దెబ్బ కొట్టకు. ప్రత్యర్థులు పట్టించుకుంటారు. బలపడతారు. నువ్ బలహీనం అయిపోతావ్ – అంటుంది మహాభారతం. ఇదే రాజనీతి కూడా ! రాజకీయంగా ఎవరు ఎవరితో అయినా కబడ్డీ ఆడేసుకోవచ్చు. కావాలంటే ఫుట్ బాల్, రగ్బీ కూడా ఆడొచ్చు. కానీ ప్రత్యర్థులే ఆటగాళ్లు అయ్యుండాలి అందులో ! అంతేకానీ ప్రజల్ని పావుల్ని చేయకూడదు. నోరు లేని వాళ్లే కదా, నోట్లో వేలు పెడితే కొరకలేరులే అనుకోకూడదు. ఎందుకంటే వాళ్లు వేళ్లు పెట్టే సమయం ఐదేళ్లకోసారి వస్తుంది. వాళ్లు వేలు పెట్టారంటే మన కీళ్లు విరుగుతాయ్. మహాభారతం చెప్పిన మాట వీలైతే పాలకులు పోస్టర్ వేసి గోడకి పెట్టుకోవాలి. విశ్వాసం సహకరించకపోతే – కనీసం బుర్రకి అయినా ఎక్కించుకోవాలి.

ఎదుటి పక్షంలో ఉన్న నాయకుణ్ని ఎంత కొట్టినా జనం పట్టించుకోడానికి సమయం చాలా పడుతుంది. ఎంత దేశ్ కీ నేత అనుకున్నా – జనంలో స్పందన రావాలీ అంటే ముందు ఆలోచన కలగాలి. భావజాల సంఘర్షణ జరగాలి. ఆ తర్వాత ఎప్పుడో నిర్ణయం ఎన్నికల నాటికి ఉంటుంది. ఈలోగా పెద్దగా స్పందన తెలియదు మనకి. ప్రజాస్వామ్యం. ఇది మొదటి రకం. ఇందులో సమయం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఇక రెండోది వైఫల్యాలు, గందరగోళాలు. ఇలాంటి సందర్భం ప్రత్యర్థుల్ని ఆటోమేటిగ్గా బలవంతుల్ని చేసేస్తుంది. చంద్రబాబు లాంటి నాయకుడు మరీ ముందుగానే రీడ్ చేసి రంగంలోకి దిగుతాడు. అప్పటి వరకూ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకీ, అటు తర్వాత వేర్పాటు డిమాండ్ కీ తలబొప్పి కట్టడం మొదలైంది. మళ్లీ పుంజుకోవడం కష్టమే – నంజుకునేవాళ్లు ఎక్కువైపోయారు అన్నారంతా ! కానీ ఎప్పుడైతే కేంద్రం తప్పటడుగులు వేయడం మొదలు పెట్టిందో స్మెల్ తగిలింది చంద్రబాబుకి. పాదయాత్రకి దిగింది అందుకే. యాత్ర పూర్తయ్యే సరికి తన పాత్ర ఎంటో తనకి తెలిసింది. అన్నిటికీ మించి జనానికి తెలిసొచ్చింది. తెలివొచ్చింది. అందుకే 2014లో గెలుపొచ్చింది.

ఇక మూడోది మరీ ప్రమాదకరమైనది ఇంకోటుంది. ఎదుటోణ్ని కొట్టినా పర్లేదు, వైఫల్యాలున్నా కొంత వరకూ ఓకే. కానీ జనం దగ్గర వసూళ్లు చేసి, సవారీ చేయాలనుకోవడం ఇప్పుడున్న రాజకీయాల్లో ఇన్స్టెంట్ ప్రమాదకారి ఎత్తుగడ. ఎందుకంటే ఊహించని రీతిలో పన్ను వసూళ్లు, ధరలు పెంచి, కొత్త మార్గాలు వెదికి వలుచుకునే విధానాలు 90ల నాటివి. లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలకి ఆదాయ మార్గాలు మారాయ్. రాబడి తెచ్చుకునే వెసులుబాటును పాలసీలు తెచ్చిపెట్టాయ్. పెట్టుబడులు, గ్లోబల్ ట్రెండ్స్, అందుబాటులో ఉన్న అవకాశాలను అమ్ముకోవడం, ప్రపంచాన్ని ఆహ్వానిచడం, టెక్నాలజీకి చోటు పెట్టడం, దాంతోనే సర్వీస్ సెక్టర్ ను పెంచి ఆదాయాన్ని జనంతో కలిసి పంచుకోవడం అనేది ఇప్పటి మోడల్. ఇప్పుడంటే ఇప్పుడు కాదు గత 15 ఏళ్లుగా నడుస్తున్న ట్రెండ్ ఇది. లిబరల్ కమ్ గ్లోబల్ మోడల్ ఇది. ఇందులో వాయింపు, బాదుడు లాంటి మాటలకి చోటు లేదు. నువ్ పెరుగుతావ్, నేను పెరుగుతా, రాష్ట్రం పెరుగుతుంది, దేశం పెరుగుతుంది అనేదే ధీమ్ ఇందులో !

కావాలంటే చూడండి – ఫలానా రాష్ట్రంలో ఇలాంటి ఆశ్చర్యపోయే స్కీమ్ ఉంది, జనం నుంచి వసూలు చేస్తారు, లేదంటే ఫలానా రేట్లు పెంచారు ఇక మోతే లాంటి – వార్త ఎక్కడైనా చూశారా ? ఒక్క పెట్రో, గ్యాస్ రేట్ల విషయం తప్ప. అది కూడా కేంద్రం ఆల్రెడీ కరెక్షన్ చేసుకోవడం మొదలైపోయింది. పెంచిన రేటు తగ్గిస్తోంది. తగ్గిస్తుంది క్రమంగా ! ఇదొక్కటే మినహాయింపు. ఇందులో కూడా నెలవారీ వాడకం రేటు పెరిగింది కానీ ఆల్రెడీ ఉన్న గ్యాస్ స్టవ్వుల మీద, అప్పటికే నడుపుతున్న బైక్ లు, కార్ల మీద పన్నులు వేసి – హక్కు పత్రం పొందండి అని చెప్పలేదు. ఈ తేడాను అర్థం చేసుకోవాలి సుమా ! ఇలాంటప్పుడు – పెంపు, కొత్తగా డబ్బులు కట్టడం, కట్టినా కొత్తగా మనకి ప్రయోజనం లేదు, స్టేటస్ కోలో ఉండటం కోసమే మనం వేలకి వేలు వదిలించుకోవాలట అనే ఆలోచనే జనాన్ని భయకంపితం చేస్తుంది. జనం సఫరింగ్ ఉంది ఇందులో ! మహా భారతం చెప్పిన సూత్రం తప్పింది ఇక్కడే. తప్పడం అలా ఇలా కాదు వంద శాతం తప్పుతోంది.

ఇలాంటప్పుడే ఆయుధం పట్టను, యుద్ధం చేయను కానీ … అంటూ కండిషనల్ గా ఉంటే కేరెక్టర్ ఎంటర్ అవుతుంది. క్రిష్ణుడే. నేను ఎలాగూ యుద్ధం చేయను కదా నా సైన్యాన్ని, ఆయుధాల్ని నీకు ఇస్తాను. సంతోష పడు అంటాడు. పిచ్చ మారాజు దుర్యోధనుడు ఎగిరి గంతేస్తాడు. ప్రజెస్స్ మాత్రం అవతల పక్కన ఉంటుందట క్రిష్ణుడిది. అంటే రథం తోలుతూ, మాట సాయం చేస్తూ, వీక్ నెస్ లు చెబుతూ ఉంటాడన్నమాట. ఇక్కడ కూడా అదే జరిగింది. నువ్ ఏం తాకట్టు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం అమ్ముతావో, ఎక్కడి నుంచి తెస్తావో తెచ్చుకో అంటూ ఇక్కడా ఓ కేరెక్టర్ సాయం చేసింది ఇంత వరకూ ! కెరెక్టర్ అంటే ఓ పార్టీనో, ఢిల్లీనో అనుకోండి. అంతే కదా ఆ కెరెక్టర్ కి ఇక్కడ పెద్ద ఆశలు లేవు. ఇక్కడ నేరుగా యుద్ధంలోకి దిగదు. ఇంత వరకూ బాగానే ఉంది. ఇక ప్రజన్స్ మాత్రం అవతల పక్కకు వెళితే, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో గైడ్ చేస్తూ రథం తోలడం మొదలైతే సౌమ్యంగా కనిపించే ప్రత్యర్థే… అర్జునుడు అంత పరాక్రముడు అయిపోయినా అయిపోవచ్చు. అందుకే మహాభారతం చెప్పింది మర్చిపోకూడదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments