బుద్ధి వికసించకపోతే వచ్చేది ఆటిజం. మతానికి సంబంధించింది బాప్టిజం. మంచి చేస్తున్నా మనకి అర్థం కానిది చంద్రబాబిజం. అంటే ఏంటి ? రాజకీయమా ? కాదు. రాజకీయ రంగులతో సంబంధం లేకుండా, పార్టీల ప్రమేయం రాకుండా పని – ఫలితం అనే రెండు ఆర్థిక సూత్రాల మీద బేస్ అయ్యి పని చేసే ఓ మెకానిజం. వర్క్ కల్చర్ బాబిజం. చంద్రబాబిజం. ఇప్పుడు అదొకటి ఉందని, ఇప్పటికీ అదే ఉంటే బావుండేదని అనుకునే రోజులొచ్చినట్టు ఉన్నాయ్. అందుకే ఇప్పుడు మాట్లాడ్డం.
జీతంలో కోతపెడితే జన సంక్షేమం కోసం పెట్టినట్టు. కడుపు రగిలి లక్ష మంది బెజవాడ చేరి నగరం ఎరుపెక్కితే ఉదారంగా ఉండి, భావప్రకటనా స్వేచ్ఛ ఇచ్చినట్టు – ఇలా ఫెయిల్యూర్ లోనూ ప్రచార కోణం చూపిస్తూ అవతల ఉన్న ఉద్యోగి అనేవాడేదో బ్రహ్మరాక్షసి అన్నట్టు ముద్ర వేస్తున్న ప్రస్తుత కాలంలో బాబిజం ఆటోమేటిగ్గా గుర్తొస్తది. సహజం. వత్తుగా జుట్టున్న ఉద్యోగిని చూపించి ఇది బాబు పీఆర్సీ అని – బోడి గుండు ఉన్నాయనను చూపించి ఇది ఇప్పటి పీఆర్సీ అని సృజనాత్మకంగా తలబాదుకోవడం చూస్తోంది ఏపీ. అంటే గతమెంత ఘనమో అని వగచిన క్షణమిది – అనే మాట గుర్తొస్తోంది. బహుశా బాబిజంలో పేజీలన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయ్. చెప్పినప్పుడు భయంగానూ నడుస్తున్నప్పుడు భారంగానూ, గడిచిపోయిన తర్వాత బావున్నట్టుగానూ అర్థం అవుతుంది బాబిజం.
చంద్రబాబు కాలం కన్నా ముందుకెళ్లి ఆలోచిస్తాడు. ప్లాన్ చేస్తాడు. అది అమలయ్యేలా చూస్తాడు. ఇప్పుడు నువ్ పెడుతున్న ఎఫర్ట్ ని ఇంకాస్త పెంచితే రెట్టింపు ఫలితం ఎలా వస్తుందో చెబుతాడు. ఇక్కడే వస్తుంది గొడవంతా ! సీటు లోంచి సీటు కదపడం ఇష్టం ఉండదు మనకి. అలా ఆ కాస్త అడుగూ వేయడానికి మనసొప్పదు. అయినా బాబు వెనక్కి తగ్గలేడు. అలాగని తన వెనకున్న వాళ్లని ముందుకు లాగనూ లేడు. తను వెనక్కి రాలేక – తన వెనకున్న వాళ్లను ముందుకు తేలేక మథనపడి డీలాపడి ఓడతాడు. బాబిజంలో ఇదో ప్రోసెస్. మిగతా వాళ్ల స్కూల్ అలా ఉండదు. జనం ముందుకెళ్లాలి. రాష్ట్రం ముందుకెళ్లాలి అనే థాట్ అక్కర్లేదు. ఎక్కడి జనం అక్కడే. ఎక్కడి రాష్ట్రం అక్కడే, అలాగే ఉండాలి. వీలైతే వెనక్కి పోయినా పర్వాలేదు. అందరూ వెనక్కి పోతే వాళ్లు ముందున్నట్టు కనిపిస్తారు. అలా ఆలోచిస్తారు కాబట్టే వాళ్లు నచ్చి మెచ్చుతాం. ఇదిగో ఇలా గుచ్చుకున్నప్పుడు నొచ్చుకుంటాం. నిజానికి చంద్రబాబిజంలో డిమాండ్లు తక్కువ. డిస్కౌంట్లు ఎక్కువ. ఫెసిలిటీలు పెరుగుతూనే ఉంటాయ్. చేయాల్సింది తక్కువ. పొందేది ఎక్కువ. ఐదు రోజులే పని అంటాడు. ఊహించనంత స్థాయిలో 42 శాతం ఫిట్మెంట్ ఇస్తాడు. కొత్తగా ఫిటింగులు పెట్టడు. పిలిస్తే పలుకుతాడు. బెదిరిస్తే బెదురుతాడు. అడిగిందల్లా చేస్తాడు. కాకపోతే సమయానికి రావాలి. సరిగ్గా ఉండాలంటాడు. అదొక్కటే. అది కూడా నచ్చదు మనకి. ఆకాశం ఊడిపడుతుందని ఆత్రపడి అవతలోడిని మనోడు అనుకుంటే ఇదిగో ఇలాగే బొమ్మ పడి దిమ్మ దిరుగుతుంది – అని భోరుమంటున్నాడు ఉద్యోగి.
చంద్రబాబుది ముందు నుంచి అదే స్కూలు. పని చెయ్యి. ఫలితం ఆశించు అంటాడు. సెకండాఫ్ తో పెద్ద పంచాయతీ లేదు. ఫస్ట్ పార్టుతోనే చిక్కంతా. చంద్రబాబు ఎప్పుడూ అది చేయమంటాడు. ఇది చేయమంటాడు అని ఇప్పటి వరకూ ఉద్యోగుల కంప్లైంట్. ఏమీ చేయకుండా పని జరిగిపోతుందేమో అని, ఊరంతా ఊడబొడిచి తమకి పెడతాడేమో అని ఆశ పడ్డారు. ఆయన ఎదిగినట్టే మనల్నీ ఎదగనిస్తాడు అని కలగన్నారు. ఒక చేత్తో కాదు రెండు చేతులతో అంటూ పంచ్ డైలాగులు పడింది అందుకే. ఇప్పుడు అదే రెండు చేతులూ జోడించి మొక్కినా ఫలితం లేకపోయింది. తత్వం బోథపడింది. పైగా వాళ్లంతా చంద్రబాబు పార్టీ కార్యకర్తలనే ముద్ర ఉద్యోగుల మీద పడింది. నిజంగానే ఇందులో పావు వంతు నిజం ఉన్నా- ఉద్యోగుల్లో నాలుగో వంతు చంద్రబాబు రావాలని కోరుకున్నా, చంద్రబాబు భవాజాలానికి సహకరించినా – పార్టీకి పని చేయక్కర్లేదు. భావజాలానికి పని చేసినా ఇటు రాష్ట్ర భవిష్యత్తు, అటు వాళ్ల పరిస్థితి మరోలా ఉండేదేమో. థింక్ ఇట్ వన్స్.
అయ్య మీద అభిమానాన్ని సొమ్ము చేసుకొని, సెంటిమెంటు రెచ్చగొట్టి బాగుపడిన బాపతు కాదు ఉద్యోగులు అంటే! కష్టపడి, శ్రమ చేసి ఐదేళ్లో పదేళ్లో ఆశే శ్వాసగా పోరాడిన సైనికులు. అంతటి కొలిమి మంటను దాటితేనే సర్కారీ కొలువు. దానికో విలువ, రాజ్యాంగబద్ధమైన రక్షణ, జీతం పెంచమని అడిగే హక్కు, పెన్షన్ భరోసా ఇవన్నీ ఉంటాయ్. నీకు ఇవాళ చేతగావడం లేదు అని జీతాలు కోస్తామంటే నిబంధనలు ఒప్పుకోవ్. రాజకీయాల్లో ఆశపెట్టి, రెచ్చ గొట్టి, దారి మళ్లించే ప్రచారాలు చేసి పదవిలోకి వస్తే ఐదేళ్లు ఉంటారేమో ! కానీ ఉద్యోగులు కనీసం 35 ఏళ్లు ఉంటారు. అంటే కనీసం ఏడు ప్రభుత్వాలు చూస్తారు. ఓసారి చూశాక, తెలిశాక – కళ్లు తెరుచుకున్నాక నిర్ణయం తీసుకోవడం నిశ్చయం.
బహుశా చంద్రబాబే గనక కుర్చీలో ఉండి ఉంటే అప్పుచేసి తప్పు కూడు అనే స్కీము ఉండేది కాదు. పని చేయండి, పట్టుకెళ్లండి లాంటి స్కీము ఏదో ఉండేది. ప్రతీ రంగంలోనూ పని జరుగుతూ ఉండి ఉండొచ్చు. రాజధానితో సహా అన్నిట్లోనూ పరుగులు చూసి ఉండేవాళ్లమేమో ! అంటే డబ్బు ఫ్లో ఉండేది. ప్రభుత్వం ఖర్చు పెట్టేది. దానికి తగ్గట్టే రాబడి ఉండేది. బండిలో మనం పెట్రోల్ కొట్టిస్తే బండి నడుస్తుంది చూశారూ, ఇదీ అలాగే. ప్రభుత్వం ఖర్చులు పెట్టి పనులు చేస్తుంది. నిర్మిస్తుంది. నడిపిస్తుంది. పెట్టుబడులు పెడుతుంది. తెస్తుంది. ఆటోమేటిగ్గా డబ్బు చూస్తుంది రాష్ట్రం. అలాంటి పరిస్థితే ఉండి ఉంటే రాష్ట్రం రాత మరోలా ఉండేది. ఆ మరో చరిత్రలో ఉద్యోగుల ప్రాధాన్యం ఇంకెంత పెరిగి ఉండేదో. అందుకే అన్నారు చెరపకురా చెడేవు అని. అంటే రాష్ట్రాన్ని చెరిపేరు. మీకు చెడింది అని.