28.8 C
Vijayawada
Friday, April 19, 2024
Homeరాజ నీతివీర్రాజు కామెంట్స్ జగన్ కి ఇంత మేలు చేశాయా ?

వీర్రాజు కామెంట్స్ జగన్ కి ఇంత మేలు చేశాయా ?

చిత్రాన్నం కాడ కాపలా కాసే టైపు – అని కడపలో ఓ సామెత ఉంటుంది. అంటే అసలు విషయం వదిలేసి పులిహోర పంచాయతీ చేసే బాపతు అని అర్థం. మర్డర్లు చేసుకునే వాళ్లకి ఏయిర్ పోర్టులు అవసరమా – అంటూ రచ్చ రేపిన వీర్రాజు కామెంట్లు చూశాక ఇదే గుర్తొస్తోంది. సీమ సెంటిమెంటు భగ్గుమని, అందరూ అభ్యంతరం చెబుతూ వీర్రాజు మీద పడే సరికి అసలు అక్కడ జరుగుతున్న గొడవ కాస్తా పక్కకి పోయింది. వైసీపీ ఎప్పుడైనా అడకత్తెరలో ఇరుక్కుపోయింది అనిపించిన ప్రతీ సారీ ఇలా వీర్రాజు మాంఛి టైము చూసి పులిహోర కలపడం చూశాక – మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏంటో ఈ జనరేషన్ కి, రాజకీయం తెలిసిన జనాలకీ అర్థం అవుతోంది గట్టిగా !

సరిగ్గా స్కోర్ పెరిగే సమయం వచ్చినప్పుడో, ఆట ప్రత్యర్థి చేయి దాటిపోతున్నప్పుడో చేజేతులా వికెట్ పారేసుకొని ఎదుటివాడికి మేలు చేయడాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు క్రికెట్ లో ! ఓ ఇరవై ఏళ్ల కిందట క్రికెట్ ను కుదిపేసిన తుఫాన్ ఇది. ఇప్పుడు ఇలాంటివి చూడాలంటే ఏపీ పొలిటిక్స్ లో, అందులోనూ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజు వ్యవహార శైలి చూస్తే అర్థం అవుతుంది. ఇదే మాట ఇంకోసారి గట్టిగా వినిపిస్తోంది. మొన్నా మధ్య ఉద్యోగుల ఆందోళన తలనొప్పి ఓ పక్కన, ఇంకో వైపున బెయిల్ మీద ఉన్న వాళ్లు జైల్ కి పోతారు అని కేంద్రమంత్రి స్వయంగా కామెంట్ చేసిన హీట్ అంతా పక్కకి పోయేట్టు చీప్ గా చీప్ లిక్కర్ కామెంట్ చేశారు వీర్రాజు. అంతే సారాయి వీర్రాజు అంటూ అందరూ అటు వైపు తిరిగేశారు. జగన్ మీద బీజేపీ యుద్ధం ప్రకటించిందేమో అనే ఫీలింగ్ కాస్తా గాలికి పోయింది. చీప్ లిక్కర్ నేషనల్ లెవెల్లో హైలైట్ అయ్యింది. ఇప్పుడు కూడా అంతే ! సీఎం సొంత జిల్లాలో వైసీపీకి లెక్కకు మిక్కిలిగా తలనొప్పులు ఉన్న సమయంలో సరిగ్గా రంగంలోకి దిగారు వీర్రాజు. మర్డర్లు చేసుకునే వాళ్లకి ఎయిర్ పోర్టులు ఏంటి ? – అంటూ నోరూ వాయీ లేకుండా మాట్లాడిన తీరు చూశాక, అసలు మతి ఉన్నదా పోయిందా అనే అనుమానంతో పాటు ఇలాంటి వాడిని నమ్ముకునా అంత లావు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది బీజేపీ – అని ముక్కున వేలేసుకునే పరిస్థితి.

ఇంతకీ కడపలో పరిస్థితి ఏంటి ? చాలా ఉంది స్టోరీ. ఒకటి కాదు మూడు నియోజక వర్గాల్లో రాజకీయ మంటలు అంటుకున్నాయ్. ముగ్గురు ఎమ్మెల్యేలకి సెగ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ఇలాంటి పొగ రాజేశారు అని రాజకీయం గుప్పుమంటోంది. దానికి తోడు జిల్లాల విభజన విషయంలో జనంలోనూ ఆగ్రహం ఉన్న మాట వాస్తవం. ప్రాంతాల మధ్య విభేదాలు రేగాయ్. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ కొట్టిన కాంట్రాక్టర్ కమ్ ఎమ్మెల్యేకి ఇక టిక్కెట్ దొరకడం కష్టం అంటున్నారు ఆ పార్టీ వాళ్లు. అందుకే జిల్లా కేంద్రం రగడ మొదలైందనే టాక్ నడుస్తోంది. నడిబొడ్డున ఉండి, కనెక్టివిటీ మస్తుగా ఉన్న ప్రాంతాన్ని కాదని, ఎక్కడో కొండ వెనక ఉన్నట్టుండే చోటికి జిల్లా కేంద్రం ఇస్తామని నోటిఫికేషన్ ఇవ్వడం అందుకే అంటున్నారు. పైగా ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అక్కడ ముందు నుంచి ఉన్న వైసీపీ నేతలు ఎదురు దాడి చేయడం కూడా అందుకే అంటున్నారు. ఇక మరో నియోజక వర్గం సంగతి. గతంలో ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ గెలిచిన ఓ నియోజక వర్గంలో వైసీపీ రెండు దఫాలుగా గెలుస్తోంది. అక్కడ పార్టీలో ఇన్ పైటింగ్ జరుగుతోంది అని చెబుతున్నారు. అభ్యర్థి మార్పుపై చర్చ జరుగుతున్న సందర్భంలోనే అక్కడ ఎమ్మెల్యే మొన్నా మధ్య భువనేశన్వరి వివాదం విషయంలో టీడీపీ మెప్పు పొందే విధంగా మాట్లాడాడు అనే చర్చ ఉన్నది. ఇలాంటి రచ్చలు గుమ్ముగా జరుగుతున్నాయ్ కడప రాజకీయాల్లో ! ఇలాంటి సమయంలో జిల్లా కేంద్రం రగడ నిప్పు రాజేసింది. ఇవన్నీ పక్కకి పోయేలా ఇప్పుడు ఎయిర్ పోర్టులు, మర్డర్ల గొడవ పుట్టించిన పుణ్యం వీర్రాజుదే.

అయినా ఓ బాత్రూమ్ లో మర్డర్ జరిగితే జిల్లాదా తప్పు ? ఓ కుటుంబం హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించినంత మాత్రాన ఓ ప్రాంతం అంతా ఆ ముద్ర వేస్తారా ? విచక్షణ, తెలివి, ఆలోచన ఉన్న వాళ్లు మాట్లాడే మాటలేనా ఇవి ! వీర్రాజు ధోరణి చూశాక కలిగే సందేహాలు ఇవి. పైగా ఇవేమీ అనాలోచితంగా మాట్లాడాడు, ఆయన స్థాయి ఇంతే అని సరిపెట్టుకోడానికి లేదు. ఆయన స్థాయి అంతే కావొచ్చు గాక, కానీ మాట్లాడుతున్న టైమింగ్ ఇక్కడ అనుమానాలు తావిస్తోంది. వైసీపీకి తలనొప్పులు ఉన్నాయ్ అనుకున్నప్పుడు సరిగ్గా ఆయన ఎంట్రీ ఉంటుంది. మొత్తం తన వైపు చూసేట్టుగా, అందరూ చీదరించేట్టుగా, ఆ అప్రదిష్ట బీజేపీకి కూడా చుట్టబెట్టేట్టుగా ఉంటాయ్ ఆయన కామెంట్లు. చీప్ లిక్కర్ అయినా, ఇప్పుడు మర్డర్ల గొడవ అయినా అంతే ! కావాలంటే చూడిండి. పైగా టీడీపీకి అనుకూలంగా రాజకీయం నడుపుతున్నాడు వీర్రాజు అని వైసీపీ మంత్రులు మూడు నాలుగు రోజులు తిట్టి పోసిన తర్వాత వీర్రాజు రంగంలోకి దిగి – ఇలా వైసీపీ నెత్తిన పాలు పోయడం ఇక్కడ మరో పాయింట్. నేను టీడీపీకి మేలు చేయడం లేదు, మీకే మేలు చేస్తున్నా అని బహుశా నిరూపించుకోడానికేమో అన్నట్టుగా ఉంటాయ్ ఆయన కామెంట్లు.

నిజానికి బీజేపీ లాంటి పార్టీకి ఏపీలో సదవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. వరస వివాదాలు, అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితులు, అన్నిటికీ మించి కేంద్రం ఆదేశాలు, విధానాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా చేసిన జిల్లాల ప్రకటన లాంటివి రాజకీయంగా బీజేపీకి ఆయుధాలు. అసలు జీతాలిచ్చే పరిస్థితులు లేనప్పుడు, కనీసం రోడ్లు కూడా వేయలేనప్పుడు నువ్ జిల్లా కేంద్రాలు ఎలా నిర్మిస్తావ్ ? అసలు ఖర్చులు పెంచే జిల్లాల ఏర్పాటు అవసరమా ? కేంద్ర జనగణన శాఖ ఏం చెప్పింది ? – ఇలాంటి టాపిక్ లు ఆ పార్టీ అధ్యక్షుడు అందుకోవాలి. అవేం సోదిలో కూడా ఉండవ్. ముందుగా జిల్లాల ఏర్పాటును వీర్రాజు స్వాగతించారు. మర్నాడు వైసీపీని జిల్లా కేంద్రాల గొడవ రాజకీయంగా కుదిపేస్తోంది. సరిగ్గా ఆ పార్టీని సేవ్ చేయడానికా అన్నట్టు ఇప్పుడు మనోభావాల రగడకు ఆయన ప్రాణం పోశారు. మర్డర్లు, ఏర్ పోర్టుల్ని కలిపి మాట్లాడారు. ఏది ఏమైనా వీర్రాజు బొత్తిగా రాజకీయం పట్టని మనిషి. నిజం. ఆయనకి వైసీపీ సంక్షేమం తప్ప – బీజేపీ రాజకీయం అక్కర్లేదు. నిస్వార్థ జీవి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments